
ఎంత బరువున్నా నిన్ను
మా జీవితాంతం మోస్తూనే ఉంటాం!
ఇంట్లో నుంచి నువ్వు బయటకు రాగానే,
మళ్ళీ ఇంటికి చేరే దాకా నిన్ను జాగ్రత్తగా ఊరంతా తిప్పుతాం!
నీకు గులక రాయి, పొట్రాయి మొదలు
ముళ్ళు, రాళ్ళు, గాజు పెంకులు గుచ్చుకోకుండా
నీ అందమైన పాదాలకు ఫుట్ గార్డుగా
రోజంతా కాపాడుతాం!
నీవు ఇంట్లోకి రాగానే
మా స్థానం మాత్రం ఇంటి బయటే!
మళ్ళీ బయటకు వెళ్ళే ముందే మేం గుర్తొస్తాం!
పూజ, సన్మానాలు ముగిసాక పూవుల గతి మాది!!
మా పగ్గాలు కొంచెం తెగిపోయినా,
మా ఆధార స్థలం అరిగిపోయినా..
ఇన్ని రోజుల మా సేవలు మరిచిపోయి,
రిటైర్ అయిన సహోద్యోగి మీద చూపించినట్టు
విసుగు, చిరాకు ఎంత చూపిస్తావో!
నీ కాలి సైజు మా కన్నా కొంచెం ఎక్కువైనా,
మా సైజు నీ కాలికన్నా కొంచెం తక్కువైనా..
కరుస్తానని మమ్మల్నే నిందిస్తావు!
ఏ నాడైనా చూసుకున్నావా?
మాకు ఏ మాత్రం
చిన్నా, పెద్దా తేడా లేదు.
ఆడా, మడా భేదం లేదు.
కులం, మతం పట్టింపే లేదు.
రంగు, ప్రాంతం అసలే లేవు.
ఉన్నోడివా, లేనోడివా అన్న ధ్యాసే లేదు.
అలాంటి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా
నా సహోదర చెత్తకుండీలో విసిరి వేస్తావు!
నాకున్న పాటి అటాచ్మెంట్ కూడా నీకు లేదు కదా!?ఎప్పుడైనా గమనించావా?
నీ కాలిలో గుచ్చుకోబోయిన ముల్లుని మేమే మా గుండెలకు హత్తుకొని,
నీ కళ్ళలో కారాల్సిన కన్నీళ్లను
దోసిటితో పట్టుకొని
మా ఆనంద భాష్పాలుగా ద్రవీభవిస్తాం!
మా మొదలెక్కడో,
మా ముస్తాబెక్కడో ఎప్పుడైనా ఆలోచించావా?
మమ్మల్ని తయారు చేసి,
మాకు ప్రాణం పోసిన
మా తండ్రి లాంటి బ్రహ్మను,
ఆ కుటుంబాలను, వాళ్ళ వాడలను
నీ మనసులకు కూడా అంటరానివిగా చూస్తావు కదా!
నీకో సంగతి తెలుసా
మమ్మల్ని తయారు చేసేప్పుడు (మా)వాళ్లు మమ్మల్ని
దేవుని విగ్రహంలా చూసుకుంటారు.
నీ చేతిలోకొచ్చాకే కదా
మేం నీ పాదాక్రాంతమైంది
మా స్థానం ఎక్కడున్నా,
మాకు నిన్ను చూస్తే గర్వకారణం.
ఎందుకంటే
ఎక్కడన్నా మమ్మల్ని
బయట వదిలి, ఇంట్లోకి వెళ్లాక,
మళ్ళీ బయటకు రాగానే
మా కోసం మా తోటి వారందరి మధ్య
మమ్మల్ని వెతుకుతుంటే
మేం దొరికిన తర్వాత
మా మీద ఊరేగే నిన్ను చూస్తే
ఆ ఆనందమే వేరు!!
మేం ఎన్ని రూపాలు మార్చుకున్నా,
ఎన్ని హంగులు అద్దుకున్నా,
ఎంతటి సౌందర్యాన్ని సముపార్జించినా,
మాకు మాత్రం నీ దేవుళ్ళ లోగిళ్లలోనికి ప్రవేశం లేదు
ఎందుకో తెలుసా?
ఆ దేవుళ్ళకు కూడా ఒక భయం!
ఎక్కడ నీవు మమ్మల్ని
తమ కంటే గొప్పవాళ్ళనుకుంటావోనని
అది నిక్కచ్చిగా నిజమే కదా!!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.