
వాస్తవాల వెలుగులో హిందువులెవ్వరూ ఉగ్రవాదులు కాలేరన్న ప్రభుత్వ వాదనలోని డొల్లతనం వెల్లడవుతోంది.
2006లో జరిగిన ప్రెజర్ కుక్కర్ పేలుడు కేసులో 12 మంది ముద్దాయిలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ జూలై 31వ తేదీన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన రెండోరోజునే మహారాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై అప్పీలు చేసింది. ఈ తీర్పు మహారాష్ట్ర సమీకృత నేరాల చట్టం కింద విచారణ జరుగుతున్న అనేక కేసులపై ప్రతికూల ప్రభావం చూపేదిగా ఉందని, అందువల్లనే తీర్పుపై అప్పీలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది.
పదిరోజుల తర్వాత మాలెగాంలో కల్నల్ పురోహిత్, సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్లు ప్రధాన ముద్దాయిలుగా ఉన్న బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ముద్దాయిలందరూ నిర్దోషులని ప్రకటించింది. ఈ బాంబు పేలుళ్లల్లో సుమారు వందమంది గాయపడ్డారు. ఆరుగురు చనిపోయారు.
ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి బాంబే హైకోర్టు తీర్పును కొనియాడారు. కాషాయ ఉగ్రవాదమనే వాదన ముందుకు తెచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.
ప్రెజర్ కుక్కర్ కేసులో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, మాలెగాం బాంబు పేలుళ్ల కేసులో మాత్రం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును శాశ్వత తీర్పు అన్నట్లు వ్యవహరిస్తోంది.
ఇది న్యాయపరమైన ప్రమాణాల ప్రకారం తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకంటే ఏ న్యాయప్రమాణమూ ఓ తీర్పును తాత్కాలికమైనదిగానూ, మరో తీర్పును శాశ్వతమైనదిగానూ చెప్పదు. అటువంటి వర్గీకరణ పాలక పార్టీల ప్రయోజనాలు ప్రమాణాల ప్రకారమే తప్ప చట్టపరమైన వర్గీకరణ కాదు. హిందువులు ఎవ్వరూ ఉగ్రవాదులు కాలేరు, ముస్లిం మతంలోనే అటువంటి ధోరణులు ఉంటాయన్న సైద్ధాంతిక కోణం నుంచి వస్తున్న ప్రకటనల్లో అర్థం లేదు.
ఈ ప్రమాణాన్ని బట్టి చూస్తే నాథూరాం గాడ్సేను హిందువు కాదని ప్రకటించాలి. శ్రీలంకలో ఆత్మాహుతి దళాలను తయారు చేసిన ఎల్టీటీఈ శ్రేణులు హిందువులు కాదని ప్రకటించాలి. మావోయిస్టులు ఉగ్రవాదులేనని ఘంటాపథంగా చెప్తున్న హిందూత్వ శక్తులు, ఇప్పుడు వీరందరినీ హిందువులు కాదని ప్రకటించాలి. సిక్కులను కూడా హిందువులుగానే పరిగణిస్తున్న కాషాయ దళాలు ఖలిస్తాన్ ఉగ్రవాదానికి పాల్పడ్డవారినందరినీ హిందువులు కాదని తీర్మానం చేయాలి.
వలసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు పాల్పడిన ప్రముఖ హిందువులను, బ్రిటిష్ ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించి ఉరిశిక్షలు వేసిన విషయాన్ని మినహాయిస్తే, పైన ప్రస్తావించిన ఉదాహరణలన్నీ తాజా అనుభవాలే.
ప్రభుత్వ ప్రాసిక్యూటర్ దిగ్భ్రాంతి..
మాలెగాం బాంబు బ్లాస్టు కేసుల్లో ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా రోహిణి సాలియన్ వ్యవహరించారు. ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సాలియన్ చెప్పిన విషయాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారి తనను కలవల్సిందిగా కబురు పంపిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. పై నుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారం, మాలెగాం కేసులో దూకుడుగా వ్యవహరించరాదని సలహా ఇచ్చారని సాలియన్ చెప్పారు.
164 స్టేట్మెంట్ల ద్వారా సేకరించిన సాక్ష్యాలన్నింటినీ పక్కకు పెట్టి ఎన్ఐఎ అధికారులు కొత్తగా సాక్ష్యాలు సేకరించి కోర్టు ముందుంచారని ఆమె గుర్తు చేశారు.
కల్నల్ పురోహిత్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తాను ఊహించినదేనని సాలియన్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించి మాలెగాం తీర్పుపై కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్నది చూడాలి.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాసరచయిత బదరిరైనా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్‌గా పని చేశారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.