భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య స్నేహమే కాదు. తీసుకునే నిర్ణయాల విషయంలోనూ సారూప్యత కనిపిస్తోంది.
ఆ మాటకొస్తే మితవాద ఛాందస రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించే శక్తులన్నీ ఏ దేశంలో ఉన్నా, ఏ నీళ్లు తాగినా మౌలిక ఆలోచనలన్నీ ఒకే విధంగా ఉంటాయా అనిపిస్తోంది.
భారతదేశంలో దేశమంతా కోవిడ్ దిగ్బంధనంలో కూరుకుపోయి ఉంటే మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించింది.
అదే విధంగా అమెరికా ప్రజలందరూ ఇరాన్‌పై సాగుతున్న యుద్ధంలో కూలిపోతున్న యుద్ధ విమానాలు, పేలిపోతున్న బ్రిడ్జిలు, కాలిపోతున్న చమురు బావుల గురించి చర్చించుకుంటుంటే ట్రంప్ మాత్రం చాప కింద నీరులాగా అమెరికాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు తెరతీశారు.
అమెరికన్ ఓటర్ల భద్రత చట్టం(సేఫ్‌గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ చట్టం) పేరుతో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ సవరణలు యావత్ అమెరికా రాజకీయ సమీకరణలను మార్చనున్నాయి.
ఆధిపత్యమే లక్ష్యంగా
2026 నవంబరులో అమెరికా పార్లమెంట్‌కు జరగనున్న మధ్యంతర ఎన్నికలు ఆ దేశ సమీప రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైనవని పరిశీలకులు భావిస్తున్నారు.
ఆ లోగానే అమెరికా ఎన్నికల ప్రక్రియను సమూలంగా మార్చేయాలని ట్రంప్ తలపెట్టారు.
ప్రజా ప్రతినిధుల సభలో ఆమోదం పొంది సెనెట్‌లో ప్రతిష్టంభనలో ఉన్న చట్టమే పరిశీలకులకు ఈ అభిప్రాయం కలగటానికి ప్రధాన కారణం.
ఈ తాజా చట్టం ప్రకారం అమెరికాలోని పౌరులందరూ తమ ఓటు హక్కును ఖరారు చేసుకోవడానికి కావల్సిన పత్రాలు, ఆధారాలు, సాక్ష్యాలతో పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
అమలు విషయంలో తేడా ఉన్నప్పటికీ భారతదేశంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను పోలిన ప్రక్రియ.
భారతదేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ద్వారా పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ అనుకున్నట్లుగానే ట్రంప్ కూడా ఓటర్ల ప్రక్రియలో సమూలమైన మార్పులు చేయటం ద్వారా అమెరికా పార్లమెంట్లో రిపబ్లికన్ల ఆధిపత్యాన్ని దీర్ఘకాలం కొనసాగించాలన్న లక్ష్యంతో ఉన్నారు.
చట్టం ఆమోదంపై పట్టుదల
ఇటువంటి సవరణ ద్వారా నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల గెలుపుకు మార్గం సుగమం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అంత తేలిగ్గా గట్టెక్కే అవకాశాలు కనిపించటం లేదు. ఇదే విషయాన్ని మార్చి 9 జరిగిన రిపబ్లికన్ ఎంపీల సమావేశంలో ట్రంప్ బహిరంగంగానే ప్రస్తావించారు.
“ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించే వరకూ మరే చట్టం మీదా సంతకాలు చేయదల్చుకోలేదని” ట్రంప్ స్పష్టం చేశారు. ఎగువసభలో డెమొక్రాట్ల అభ్యంతరాలతో ఆగిపోయిన ఈ చట్టాన్ని ఆమోదించుకోవడానికి అడ్డదారులు తొక్కే విషయంలో రిపబ్లికన్ ఎంపీల మధ్య భేదాభిప్రాయాలున్నాయి.
ప్రజా వ్యతిరేకత – సభలో బలాబలాలు
అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి రెండేళ్లకొకసారి నవంబరులో దిగువ సభ సభ్యులందరితో పాటు ఎగువ సభలోని మూడో వంతు మంది ఎంపీలు ఎన్నిక కావాలి. ఈ మధ్యకాలంలో జరిగిన వివిధ సర్వేల్లో ట్రంప్ పాలన పట్ల ప్రజలు తిరస్కార భావనతో ఉన్నారని వెల్లడవుతోంది.
ఇరాన్‌పై అమెరికా ప్రారంభించిన యుద్ధాన్ని దేశంలో 53 శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మార్చి 7-8 తేదీల్లో క్విన్నిపియాక్ యూనివర్సిటీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది.
రిపబ్లికన్ పార్టీ అనుయాయుల్లో 85 శాతం మంది యుద్ధాన్ని సమర్థిస్తున్నప్పటికీ సాధారణ ప్రజలు యుద్ధానికి మద్దతు తెలపటం లేదు.
దిగువ సభలో రిపబ్లికన్లకు 219 స్థానాలు, డెమొక్రాట్లకు 213 స్థానాలు ఉంటే ఎగువ సభలో రిపబ్లికన్లు 55 మందితో ఆధిపత్యంలో ఉన్నారు.
కేంద్రీకృత వ్యవస్థ దిశగా ఆలోచన
ఎగువ సభలో ఏ చట్టం మీదనైనా ఓటింగ్ జరగాలంటే 60 ఓట్లు ఉండాలి. కానీ ఇప్పుడు ట్రంప్‌కు ఎగువ సభలో ఆ సంఖ్యాబలం లేదు. ఈ చట్టంపై చర్చ ఎక్కువకాలం కొనసాగితే రిపబ్లికన్లకు నష్టం అని ఆ పార్టీ భావిస్తోంది. కానీ ఎంపీల అభిప్రాయానికి భిన్నంగా ఈ చట్టంపై చర్చ జరిగేంత వరకూ చర్చ కొనసాగించాలని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఎన్నికలు ప్రధానంగా రాష్ట్రాలపై ఆధారపడిన వ్యవస్థగా ఉన్నది. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధారిత వ్యవస్థగా మార్చాలన్నది రిపబ్లికన్ల మనోగతం.
అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఓటు వేయటానికి పౌరసత్వం ఉంటే సరిపోతుంది తప్ప మిగిలిన పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు.
పౌరసత్వ నిర్ధారణకు కఠిన ప్రమాణాలు
ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అమెరికాలో మోటార్ వెహికల్స్ బ్యూరో ద్వారా సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగానే ఓటర్ల నమోదు జరుగుతుంది. భారతదేశంలో పుట్టిన వాళ్లంతా భారతీయ పౌరసత్వం పొందుతారన్న అభిప్రాయం ఉన్నట్లుగానే అమెరికాలో పుట్టిన వాళ్లంతా అమెరికన్ పౌరులే అన్న అభిప్రాయం ఉంది. కానీ రిపబ్లికన్లు ఆధిపత్యంలో ఉన్న రాష్ట్రాల్లో పౌరసత్వాన్ని నిర్ధారించటానికి వేర్వేరు ప్రమాణాలు పాటించారు. తదనుగుణంగా చట్టాలు రూపొందించారు.
తాజాగా ప్రతిపాదిస్తున్న చట్టం ప్రకారం పౌరుడు ఓటు హక్కుకోసం దాఖలు చేసుకున్నప్పుడు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలు కూడా సమర్పించాలి.
అదేవిధంగా ఓటింగ్ సమయంలో ఫోటో గుర్తింపు కార్డు సమర్పించాలి.
తప్పనిసరి కానున్న ధ్రువీకరణ పత్రాలు
ఇప్పుడున్న డ్రైవర్ లైసెన్సులోనే పౌరసత్వానికి సంబంధించిన అంశాన్ని కూడా చొప్పించి కొత్త పద్ధతిలో కొత్త డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. వీటితో పాటు పాస్‌పోర్టు కాపీ కానీ, ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఏదైనా ఫోటోతో ఉన్న గుర్తింపు కార్డులు కానీ, అమెరికాలోనే పుట్టారని చెప్పటానికి కావల్సిన సర్టిఫికెట్లు కానీ చూపించినప్పుడే ఓటర్‌గా నమోదు అవుతారు. లేనిపక్షంలో వారి పేరు ఓటర్ల జాబితాలో చేరదు. చివరకు జనన ధ్రువీకరణ పత్రం లేకపోతే అమెరికా సైన్యంలో చేసినవారికి అయినా ఓటు హక్కు దక్కదు.
హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేతికి జాబితా..
అన్ని రాష్ట్రాలు తమ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేసే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి అందచేయాలని తాజా చట్టం ప్రతిపాదిస్తోంది.
ఆ విధంగా దేశంలో శాంతి భద్రతలు చూసే ఈ విభాగం ఓటర్ల జాబితాలో ఉన్న నేరస్తులు, వగైరా వివరాల కోసం తనిఖీ చేస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
