ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నివ్వెరపోయే విషయాలను సిట్ వెలికితీసింది. కర్ణాటకలోని అలంద్‌లో ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడానికి, ప్రతి పేరుకు 80 రూపాయలు చెల్లించినట్టుగా కనుగొంది. ఓటరు జాబితా రిగ్గింగ్, “ఓట్ల దొంగతనం” మీద కాంగ్రెస్ పార్టీ– రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సిట్ వెల్లడించిన ఈ విషయం మరింత బలం చేకూరుస్తోంది.
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటకలోని అలంద్‌లో ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి ప్రతి పేరుకు రూ 80 చెల్లించినట్టు కనుగొంది.
ఓటర్ల జాబితాల్లో రిగ్గింగ్, “ఓట్ల దొంగతనం” జరిగిందని కాంగ్రెస్ పార్టీ- ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చాలా సార్లు ఆరోపించారు. వారి వాదనలను సిట్ తెలియజేసిన విషయాలు మరింత బలాన్నిస్తున్నాయి.
అక్టోబర్ 22- 23 తేదీలలో వివిధ మీడియా సంస్థలు ఓటుచోరి, రిగ్గింగ్‌కు సంబంధించిన పలు కథనాలను ప్రచురించాయి. ఈ వార్తా సంస్థల నివేదికలలో డబ్బు చెల్లించి అలంద్‌లో ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల పేర్లను తొలగించడం గురించి తెలియజేశారు. వాటి ప్రకారం ఇది ఒక వ్యవస్థీకృత ప్రణాళిక; అంతేకాకుండా ఇది ఒక్కసారి జరిగిన పొరపాటు లేదా పరిపాలనా లోపం కాదని తెలుస్తోంది.
ఈ కేసులో ఆందోళనకరమైన విషయమేంటంటే, ఓటర్ల తొలిగింపు ఒక చెల్లింపు ఆర్థికవ్యవస్థ నేరంగా మారింది. పౌరుల ఓటు హక్కును ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నిర్వహించబడుతోంది.
6,018 మంది ఓటర్ల పేర్లను తొలగించడానికి రూ 4.8 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద సిట్ ఇంకా దర్యాప్తు చేస్తోంది. అయితే ఆ డబ్బు ఎవరి నుంచి వచ్చిందో తాము కనుగొన్నామని; అంతేకాకుండా కలబురగి స్థానిక నివాసితులు మహమ్మద్ అష్ఫాక్, మహమ్మద్ అక్రమ్ ఈ మొత్తం గొలుసులో భాగంగా ఉన్నారని సిట్ చెబుతోంది.
ఇప్పటి వరకు సిట్ కనుగొన్న విషయాలు..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, సిట్ దర్యాప్తులో మహ్మద్ అష్ఫాక్- మహ్మద్ అక్రమ్ అనే ఇద్దరూ ప్రైవేట్ ఆపరేటర్లు, ఉద్యోగులు డేటా ఆపరేటర్లుగా పనిచేసే డేటా సెంటర్‌ను నడుపుతున్నారని తేలింది. అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించాలని ఓటర్ల తరఫున వీరే అభ్యర్థనలు పంపించారు.
సిట్ క్షేత్ర స్థాయి దర్యాప్తులో తొలగించబడిన 6,018 మంది ఓటర్లలో, ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో నివసించని 24 మంది పేర్లను మాత్రమే సిట్ గుర్తించింది.
మరో మాటలో చెప్పాలంటే, ఓటర్ల జాబితా నుంచి 99% కంటే ఎక్కువ తొలగింపులు మోసపూరితంగా జరిగాయి. ఒకవేళ ఈ పేర్లు ఎన్నికల సంఘం తయారుచేసిన ఓటర్ల జాబితాలో ఉంటే, ఓటర్లు తమ ఓటును ఉపయోగించుకునేవారు.
ప్రతి ఓటరుకు రూ 80 చెల్లించిన తర్వాత, తొలగింపులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా నిర్ధారించగలిగింది. కాబట్టి, ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నంలో భాగంగానే ఈ తొలగింపులు జరిగినట్లు కనిపిస్తోంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, అష్ఫాక్ గతంలో ఓటర్ల ట్యాంపరింగ్‌లో పాల్గొన్నట్లు అనుమానించబడ్డారు. 2023లో కర్ణాటక పోలీసులు అతన్ని ప్రశ్నించారు. దర్యాప్తు సమయంలో, అష్ఫాక్ తన ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులతో పంచుకున్నారు, ఆ తర్వాత పోలీసులు తనని విడుదల చేశారు.
తను భారతదేశం వదిలి దుబాయ్ వెళ్లిపోయారని పోలీసులు ఇప్పుడు చెబుతున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అయితే, తన కమ్యూనికేషన్ దర్యాప్తులో తను “అక్రమ్, మరో ముగ్గురితో” సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడైంది.
అష్ఫాక్, మహ్మద్ అక్రమ్ ఒక డేటా సెంటర్‌ను నడుపుతుండే వారు. ఎన్నికల కమిషన్ రికార్డుల నుంచి ఓటర్ల పేర్లను తొలగించడానికి దరఖాస్తును పంపించే పని వారికి అప్పజెప్పపడింది. నకిలీ పత్రాలను ఉపయోగించి ఓటర్ల పేర్లను తొలగించేవారు. తమ గుర్తింపులు దుర్వినియోగం అవుతున్నాయని ఓటర్లకు తెలియకుండానే ఇదంతా జరిగేది.
వార్తాపత్రిక ప్రకారం, ఈ కేసులో సిట్ ‘కోళ్ల పెంపకదారుల నుంచి పోలీసుల బంధువుల వరకు వివిధ వ్యక్తుల 75 మొబైల్ నంబర్లను దర్యాప్తు చేసింది. వీటిని అలంద్ ఓటర్ల జాబితాలలో మార్పులను అభ్యర్థించడానికి ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో నమోదు చేయడానికి ఉపయోగించారు.’
నివేదిక ప్రకారం, ఎన్నికల కమిషన్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి నకిలీ ఐడీలను ఉపయోగించి ఓటర్ల జాబితా నుంచి తొలగింపులను అభ్యర్థించడంపై సిట్ ఇంకా దర్యాప్తు చేస్తోంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి ఐడీలను ఉపయోగించిన వ్యక్తులకు, ఎవరి తరపున దరఖాస్తులు చేసుకున్నారో ఓటర్లకు ఈ విషయం తెలియదు.
గుబ్బిలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అక్టోబర్‌లో విచారించింది. ఇందులో భాగంగా సుభాష్ గుత్తేదార్, అతని సహచరులు కొంతమందికి ఈ సంఘటనలో ప్రమేయం ఉందని అనుమానిస్తూ వారి నివాసాలపై దాడి చేసింది. ఈ క్రమంలోనే గుత్తేదార్ ఇంటి వెలుపల కాలిపోయిన పత్రాలు లభించాయని నివేదికలు వచ్చాయి.
ఓటరు జాబితా అవకతవకలలో తన ప్రమేయాన్ని బీజేపీ నాయకుడు ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ప్రత్యర్థి పాటిల్ రాజకీయ ఆశయాలే కారణమని ఆరోపించారు.
కాలిపోయిన పత్రాలు దీపావళి నాడు సాంప్రదాయకంగా ఇళ్లను శుభ్రపరిచే ప్రక్రియకు సంబంధించినవని, ‘సాక్ష్యాలను’ దాచడానికి లేదా నాశనం చేయడానికి చేసిన ప్రయత్నం కాదని ఆయన స్పష్టం చేశారు.
‘చిన్న’ సంఖ్యలు ఎందుకు ముఖ్యమైనవి?
భారత ఎన్నికల సంఘం ప్రకారం, 63 కోట్లకు పైగా ఓటర్లు(లోక్‌సభ ఎన్నికలు, 2024)– 5.3 కోట్లకు పైగా ఓటర్లు(కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023) ఉన్న దేశంలో 6,018 అనేది ఒక చిన్న సంఖ్య కాబట్టి, ఈ ఆరోపించిన వ్యత్యాస పరిమాణం డేటా ఆధారంగా వెంటనే స్పష్టంగా కనిపించదు.
అయితే, ఈ గణాంకాలను ఆంధ్రప్రదేశ్– కర్ణాటక రెండింటిలోనూ ఇటీవలి ఓటింగ్ సరళి సందర్భంలో చూడాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 10,348 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు.
బీజేపీ అభ్యర్థి గుత్తేదార్‌కు 78,701 ఓట్లు రాగా, భోజరాజ్(బీఆర్ పాటిల్)కు 88,981 ఓట్లు వచ్చాయి. 2023లో అలంద్‌లో ఓటర్ల సంఖ్య సాపేక్షంగా ఎక్కువగా ఉంది– 72% కంటే ఎక్కువ, గణనీయమైన తేడా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు ఇది గట్టి పోటీగా మారింది.
అయితే, కర్ణాటకలో అదే 2023 ఎన్నికల్లో, కనీసం ఎనిమిది నియోజకవర్గాలలో 1,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు విజయం/ఓటమిని చవిచూశారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, మరో నాలుగు నియోజకవర్గాల్లో, గెలుపు తేడా 2,000 ఓట్ల కంటే తక్కువగా ఉంది. మరో 34 నియోజకవర్గాల్లో, గెలుపు తేడా 5,994 ఓట్ల కంటే తక్కువగా ఉంది. ఇదంతా అక్రమాల కారణంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓట్ల సంఖ్య.
కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, అంటే 20% నియోజకవర్గాలలో విజయం తేడా రిగ్గింగ్ కారణంగా తొలగించబడిన ఓట్ల కంటే తక్కువగా ఉంది.
అంతేకాకుండా, రాష్ట్ర ఎన్నికలలో ద్విపార్శ్వ పోటీలు సర్వసాధారణం అవుతున్నాయి. రానురాను విజయ మార్జిన్ తగ్గుతోంది.
‘ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్’ వ్యవస్థలో సంఖ్యల దుర్బలత్వానికి ఉదాహరణ 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 40.8% ఓట్ల వాటాతో కొంచెం తక్కువ ఓట్లను గెలుచుకోగా, బీజేపీ 49.02% ఓట్లను గెలుచుకుంది. ఇది దాదాపు 37,000 ఓట్ల తేడా. అయితే, బీజేపీ 109 సీట్లతో పోలిస్తే 114 ఎక్కువ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో రాష్ట్రంలో స్వల్పకాలం పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
ఓటర్లలో ఈ అనిశ్చితి ప్రతి ఎన్నికను ఎక్కువ పణంగా పెట్టే ఎన్నికగా మారుస్తుంది. అందుకే ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, కాగితంపై తక్కువ సంఖ్యలో ఓటర్ల గురించి గగ్గోలు పెడుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఓటర్లు..
అయితే పార్టీలు, పౌరుల దృక్కోణాల నుంచి ప్రధాన సమస్య ఏమిటంటే, చట్టబద్ధమైన ఓటర్లకు ఓటు హక్కు నిరాకరించబడటం. ఇది కాంగ్రెస్ పార్టీ– రాహుల్ గాంధీ నిరంతరం లేవనెత్తిన సమస్య, కర్ణాటకలో ఓటర్ల తొలగింపు గణాంకాలను హైలైట్ చేయడానికి వివరణాత్మక విలేకరుల సమావేశాలు కూడా నిర్వహించారు.
ఆలంద్లోని ఒక కాంగ్రెస్ కార్యకర్త తన గ్రామంలోని ఓటర్ల జాబితా నుంచి 47 మంది ఓటర్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైందని అనుమానాస్పద నోటీసులు అందుకున్నప్పుడు, అతని కుటుంబం– ఇతరులు ఈ తొలిగింపులలో జరిగిన అవకతవకల గురించి తెలుసుకున్నారని ది హిందూ సెప్టెంబర్ ప్రారంభంలో నివేదించింది. దీని తరువాత, ఓటరు జాబితాపై వచ్చిన ఆరోపణలపై సిట్ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది.
గమనించాల్సిన విషయమేంటంటే తొలగించబడిన 5,994 మంది ఓటర్లు నకిలీవారు కాదు. కర్ణాటక సిట్ ప్రకారం, వారు వాస్తవానికి ఉనికిలో ఉన్న చెల్లుబాటు అయ్యే ఓటర్లు– వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వబడలేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
