అవును..
బిరియాని, కోటర్ ఎవడిస్తే ఆడికే జై కొడుతం.
మాకు ఎన్నికలప్పుడే కదా.. అవి దొరికేది!
మిగతా రోజులల్ల కడుపేడ నిండేది!!
ఎన్నడు మీరు మమ్ముల్ని పట్టించుకున్నది?
సోషల్ మీడియాలోని సైబర్ పులుల కళ్లకు మేమే దోషులం..!
ఇంకా మాట్లాడితే ఉచిత దోపిడీదారులం!!
ఇగ పేపర్, టీవీలల్ల చెప్పినట్టు ఎప్పుడూ మేం సోమరిపోతులం!!!
కాలే మా కడుపుల ఇంత సల్ల నిండేందుకు ఇచ్చిన రేషన్ మీద; మా చిల్లుల జేబులల్ల సగం సగం ఏసే చిల్లర పైసల మీద అందరికీ ఏడుపులే!
మాకిచ్చేది దోపిడీలంటరు;
పెద్దోళ్ళకిస్తే అది రాయితీలంటరు!
దేశం బాగా వెలిగిపోతాంది కదా.. అందరి కళ్లకు చీకట్లస్తున్నయ్. అందుకేనేమో!?
మేమందరం కట్టే లక్షల కోట్ల జీఎస్టీల మేమసలే కనిపించం..!!
మీ పేపర్లల్ల, ఛానల్లల్ల నేతల తిట్లాటలు, కాంట్రాక్టులు, ఆట పాటల వెలుగు జిలుగులు.. లేకుంటే పెద్దోళ్ల ఇండ్లల్ల పెండ్లిల్లు.. ఇంకా మిగిలితే రంకు, బొంకు వార్తలే గదా!
కోట్ల రూపాయల యాడ్స్కున్న పాటి విలువలో ఒక్క పాలైనా మాకు జాగ లేకపాయే..!!
మీ టీవీలల్ల రాజకీయుల వార్తలే గని.. మా బతుకులు మార్చే రాజకీయాల జాడేడ?
మాకు దొరుకని ఉద్యోగాల గురించి, నిండని కడుపుల గురించి, కళ్లల్ల ఇంకిపోయిన ఏడుపుల గురించి..
మీరెవ్వరు అడుగరు..
అస్సలు ఆలోచించరు..!
యాడాదికి ఒక్క సారి ఏప్రిల్ ఫూల్ నాటికి ముందుగనే పేదరికం తగ్గించినమని బడ్జెట్ లెక్కలు;
పెద్ద పెద్ద మాస్ట్ హెడ్లు, గ్రాఫికల్ స్టోరీబోర్డులు!
మీ వోళ్ళ కోసం మా పేరిట పెద్ద పెద్ద పథకాలు తయారు జెయ్యుండ్రి!!.
ఐదో ర్యాంకుకెల్లి మూడో ర్యాంకులకు ఎగబాకండి..
నడిమిట్ల మేం కంటికి, పంటికి అడ్డు తగిల్తే..
మీ బుల్డోజర్ల కింద తొక్కేయుండి..!!
ఏమన్నా కొస ప్రాణముండి, ప్రశ్నలడిగితే..
వీసా లేకుంటనే పక్క దేశం ఎల్లిపొమ్మనండి..!
ఇంకా మమ్ముల్ని తిడ్తనే ఉండుండ్రి.
అందరితో తిట్టిస్తనే.. ఉండుండ్రి..
మేం గిట్ల చస్తనే బతుకుతం..
బతుక్కుంటనే సస్తం..
ఎందుకంటే…
మేం..
లారీల కింద కుక్కలం,
ప్రమాదాలల్ల శవాల లెక్కలం, సినిమా టాకీస్లు, స్టేడియంలల్ల విసిరేసే పేపరు ముక్కలం,
తొక్కిసలాటలల్ల భక్తులం,
భారీ బహిరంగ సభల్లో వాటర్ ప్యాకెట్లం,
దేశానికి పెట్టిన దిష్టి చుక్కలం!!
సమాజానికి పట్టిన చీడలం!!!
గిరిధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
