
ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తారుమారు చేయటానికి స్వయం చాలిత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించవచ్చంటూ కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి అన్నారు. ఈ ప్రకటనతో ప్రజాస్వామ్య పునాదులనే కూకటి వేళ్లతో పెకళించే ప్రమాదం ఉందన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: గతంలో విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం మీద ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. దీనికంటే, మరింత తీవ్రమైన ఆరోపణలను ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ముందుకు తెచ్చారు.
గతంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్ణాటక ఎన్నికల్లోనూ, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఓటర్ల జాబితాలో ఇష్టం వచ్చిన మార్పులు చేర్పులు చేసిన విషయంపై రాహుల్ గాంధీ వేలెత్తి చూపారు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో సమాచారాన్ని దొంగిలించటానికి, తారుమారు చేయటానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ద్వారా తాజాగా కేంద్రీకృత పద్ధతిలో వ్యవస్థాగతంగా ఈ మొత్తం తతంగం సాగుతోందని ఆయన ఆరోపించారు.
ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా ప్రజాప్రాతినిధ్యం చట్టం నిబంధనల ప్రకారం ఫారం 7 ద్వారా మాత్రమే జరగాలి. కానీ ఇటువంటి తప్పుడు సాఫ్ట్వేర్ ద్వారా అటువంటి చట్టబద్ధ ప్రక్రియతో పని లేకుండా మూకుమ్మడిగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నది రాహుల్ గాంధీ ఆరోపణ.
ఈ ఆరోపణలు ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులనే పెకలించేంతటి తీవ్రమైన ఆరోపణలు. సాఫ్ట్వేర్ ద్వారా ఓటర్ల జాబితాను తారుమారు చేయవచ్చన్న ఆరోపణలు నిరూపించబడితే ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమం మరో కొత్త స్థాయికి చేరుతుంది. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు సాంప్రదాయక రిగ్గింగ్ ద్వారా ఎన్నికల ఫలితాలను మార్చే అక్రమాల నుంచి ఏకంగా ఓటర్ల రాజకీయ ఇష్టాయిష్టాలను పరోక్షంగా ప్రభావితం చేయటం, ఈ కసరత్తులో ఎన్నికల సంఘం లోపాయికారీ పాత్ర వైపు దృష్టి సారిస్తున్నాయి.
రాహుల్ గాంధీ లేవనెత్తిన అనేక అంశాలు దేశంలో ప్రజలు నిరంతరం దారీ తెన్నూ లేని భయాందోళనల నడుమ గడిపే పరిస్థితికి నెట్టే పరిణామాలుగా ఉన్నాయి.
ఒకటి: కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకలీ ఖాతాలు ద్వారా(ఫేక్ లాగిన్స్) కర్ణాటకలోని అలండ నియోజకవర్గంలోని కొందరు ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి, మహారాష్ట్రలోని రాజౌరా నియోజకవర్గంలో మరికొందరిని చేర్చాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు పంపారు. ఈ రెండు కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు. అయితే ఈ విధంగా ఫేక్ లాగిన్లు సృష్టించింది వ్యక్తులు కాదని, కంపెనీలు లేదా కాల్ సెంటర్లు అయి ఉంటాయని రాహుల్ ఆరోపించారు. ఈ విధంగా ఎన్నికల సంఘం సాప్ట్‌వేర్‌లోకి చొరబడిన తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్ల జాబితాలో 1తో మొదలయ్యే నంబర్లున్న ఓటర్లను గుర్తిస్తుంది. ఈ ఓటర్ల సమాచారాన్ని తస్కరించి వారి పేర్ల మీద మరికొంతమంది ఓటర్ల పేర్లకు సంబంధించిన ఫిర్యాదులు రూపొందిస్తుంది.
సదరు ఓటర్ల పేర్లను తొలగించాలంటూ వచ్చిన ఫిర్యాదులన్నీ ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్ల జాబితాలో ఒకటో నంబరు ఓటరు నుంచే వచ్చాయని ఆయన వివరించారు. తమ పేర్ల మీద వచ్చిన ఫిర్యాదులను వారి దృష్టికి తీసుకురాగా తాము అటువంటి ఫిర్యాదులు చేయటం కానీ, ఫారం 7ను నింపటం కానీ చేయలేదంటూ ఇద్దరు ఓటర్లు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా రాహుల్ గాంధీ విలేకరుల ముందుంచారు.
రెండు: నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం ఆశించిన కొందరు వ్యక్తులు ఈ విధంగా తప్పుడు మార్గాల్లో ఓటర్ల జాబితాను కలుషితం చేస్తున్నారని రాహుల్ గాంధీ, ఇతర కాగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షానికి ఓటు వేస్తారని అనుమానం ఉన్న ఓటర్లను పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు.
విలేకరుల సమావేశంలో ప్రదర్శించిన చిత్రాల్లో రాహుల్ గాంధీ అత్యంత సంక్లిష్టమైన పారం 7ను ఎంత వేగంగా నింపుతున్నారో చూపించారు.
ఇటువంటి ఫిర్యాదులు చేసిన అదృశ్య వ్యక్తుల్లో ఒకరు సూర్యకాంత్. ఇతను కేవలం 14 నిమిషాల వ్యవధిలో 12మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిందిగా విజ్ఞప్తులు తయారు చేశాడు. మరో బూత్‌లో మొదటి ఓటర్‌గా నమోదైన మరో వ్యక్తి నాగరాజ్. ఇతను కేవలం 36 సెకన్లలో రెండు దరఖాస్తులు పూర్తి చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తప్పుడు ఫోన్నంబర్లతో వీరి పేర్ల మీద ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో లాగిన్ సృష్టించి ఈ తప్పుడు పనంతా చేసిన సంగతి కనీసం వీరికి తెలీను కూడా తెలీదు.
మూడు: ఈ విధంగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో తప్పుడు లాగిన్లు సృష్టించేందుకు ఉపయోగించిన ఫోన్లు వేర్వేరు రాష్ట్రాలలో జారీ చేయబడిన సిమ్ కార్డులని రాహుల్ గాంధీ వెల్లడించారు. అంటే ఎవరో రాష్ట్రం బయట కూర్చుని అసలైన ఓటర్లతో సంబంధం లేకుండా ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారా అన్న ప్రశ్నను ఈ వివరాలు లేవనెత్తుతున్నాయి.
ఈ ఆరోపణలు తీవ్ర స్వభావం కలిగినవి. భారత ప్రజాస్వామ్య పునాదులను కదిలించేవి. కర్ణాటకలో ఒక్క మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఓటర్ల జాబితాలో 15 శాతం మంది దొంగ ఓటర్లు లేదా లేని ఓటర్లు చోటు సంపాదించుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
భారత రాజకీయాల్లో ఓటర్ల జాబితాను కలుషితం చేయటం కొత్తేమీ కాదు. కానీ మహదేవ్పుర నియోజకవర్గానికి సంబంధించిన రాహుల్ గాంధీ వెల్లడించిన వివరాల్లాగా ప్రస్తుతం ఈ కసరత్తు అనూహ్య స్థాయిలో జరుగుతోంది. ఈ స్థాయిలో జరిగే ఓటర్ల జాబితా తారుమారు మొత్తంగా ఎన్నికల వ్యవస్థ మీదనే ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తోంది.
ఢిల్లీ కేంద్రంగా పని చేసే సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ అడ్వాన్స్డ్ సొసైటీస్ ఈ మధ్యనే నిర్వహించిన సర్వేలో ఈ మధ్య కాలంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగటం అన్న ఆలోచనకే పెద్ద విఘాతం కలిగినట్లు ఓటర్లు భావిస్తున్న విషయం వెల్లడైంది. గత దశాబ్దకాలంలో ఎన్నికల నిర్వహణలో ఏదో పొరపాటు జరుగుతోందన్న అభిప్రాయాన్ని సగానికి పైగా ఓటర్లు వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం హడావుడి స్పందన..
రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం దారీతెన్నూ లేకుండా స్పందించింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగవన్న సూత్రాన్ని వక్కాణించిందే తప్ప కర్ణాటకలోని అలండ్ నియోజకవర్గంలో అడ్డగోలు తొలగింపులు, మహారాష్ట్రలోని మరో నియోజకవర్గంలో అడ్డగోలు చేర్పులు, తప్పుడు ఫోన్ నంబర్లతో ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఖాతాలు ప్రారంభించి ఇష్టం వచ్చినట్లు ఓటర్ల తొలగింపు కోసం ఫిర్యాదులు చేయటం వంటి రాహుల్ గాంధీ లేవనెత్తిన అనేక అంశాలపై వివరణలు మాత్రం ఇవ్వలేదు.
నైగా అలండ్ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు కోసం పదేపదే తప్పుడు ప్రయత్నాలు జరిగాయని అంగీకరించిన ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణల విషయంలో మాత్రం నోరు మెదపటం లేదు.
ఈ ఆరోపణలకు సంబంధించి కర్ణాటక ఎన్నికల సంఘం ఓ ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ విలేకరుల దృష్టికి తెచ్చారు. అయితే ఓ బూత్ స్థాయి ఎన్నికల అధికారి తన బంధువు పేరు తొలగించేందుకు పొరుగునున్న ఓ మహిళ ఓటరు, ఆధార్ వివరాలతో ఫిర్యాదు చేయటానికి రావటం, సదరు బంధువు పేరు ఓటరు జాబితా నుంచి తొలగించబడడం జరిగిన తర్వాతనే ఈ ఎఫ్ఐర్పై దర్యాప్తు మొదలైందని ఆయన అన్నారు.
ఆ పొరుగునున్న మహిళా ఓటరు తాను ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, ఎవరి పేరూ తొలగించమని అడగలేదని చెప్పిన తర్వాతనే ఈ మొత్తం కుంభకోణం బట్టబయలైంది.
ఎన్నికల సంఘం స్పందన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం కంటే మరిన్ని ప్రశ్నలు లేవనెత్తేదిగా మారటంతో చివరకు కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి సంతకం లేని ఓ ప్రకటనను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన అనేక అంశాలను ఈ ప్రకటనలో చర్చించారు. పరిశీలించారు.
ఈ ప్రకటన ప్రకారం, అలండ్ నియోజకవర్గంలో వేర్వేరు ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా ఫారం 7 రూపంలో 6018 దరఖాస్తులు వచ్చాయన్న విషయం ఎన్నికల సంఘానికి తెలుసు. ఒక్క నియోజకవర్గంలో ఈ విధంగా జరగటం అంటే ఆందోళనకరమైన అంశమే అన్నది కూడా ఎన్నికల సంఘానికి తెలుసు. ఇందులో కేవలం 24 దరఖాస్తులు మాత్రమే వాస్తవమైనవనీ, మిగిలినవి తప్పుడు దరఖాస్తులు అనీ ఎన్నికల సంఘం నిర్ధారించింది.
బూత్ స్థాయి ఎన్నికల అధికారులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా కల్బుర్గి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు కూడా ఎన్నికల సంఘం ధృవీకరించింది.
ఈ కేసు గురించి జరుగుతున్న దర్యాప్తులో కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు విభాగం(సీఐడీ) వారికి ఎన్నికల సంఘం సహకరించలేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నంలో ‘‘ ఓటర్ల జాబితా గురించి అభ్యంతరాలు దాఖలు చేసిన వారి పేరు, వారి ఓటరు గుర్తింపు కార్డు, ఫిర్యాదు దాఖలు చేయటానికి ఉపయోగించిన ఫోన్ నంబరు, ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఈ ఓటరు గుర్తింపు కార్డుతో ప్రారంభించిన ఖాతా, దానికోసం ఉపయోగించిన ఫోన్ నంబరు, ఉపయోగించిన కంప్యూటర్ వివరాలు, ఉపయోగించిన సాఫ్ట్వేర్ మాధ్యమం, ఫిర్యాదుదారుని చిరునామా, ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఖాతా ప్రారంభించిన తేదీ, ఫిర్యాదు నమోదు చేసిన తేదీ, సమయం వంటి వివరాలు సీఐడీ బృందానికి అందచేశాము’’ అని వివరించింది.
ఎక్స్ పోస్ట్‌లో ఇచ్చిన వివరణ కంటే పై వివరణ మరింత అర్థవంతంగా ఉంది. కానీ దర్యాప్తును మరో మెట్టుకు తీసుకెళ్లటానికి కావల్సిన కీలకమైన వివరాలు తమకు అందలేదన్న సీఐడీ వాదనలకు మాత్రం సమాధానం ఇవ్వటానికి ఎన్నికల సంఘం సిద్ధం కాలేదు. ఐపీ అడ్రస్ ఉన్న కంప్యూటర్ ఎక్కడ ఉంది, సంబంధిత పోర్టు(కంప్యూటర్ ద్వారా సమాచారం పంపేందుకు ఉపయోగించే సాధనం), తప్పుడు ఫోన్ నంబర్లకు వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్లు వంటి వివరాలు అందచేయాలని కోరినట్లు సీఐడీ విభాగం వెల్లడించింది.
ది వైర్ పరిశీలించిన పత్రాలు ఈ సంవత్సరం జనవరికి సంబంధించిన కంప్యూటర్ ఐపీ లాగ్‌లు మాత్రమే. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలానికి సంబంధించిన వివరాలు లేవని అర్థమవుతుంది.
ఎన్నికల సంఘం ఈ వివరాలు అందచేస్తేనే అసలు ఓటర్ల జాబితా కలుషితం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులను, వారి వెనక ఉన్న కీలక పాత్రధారిని పట్టుకునేందుకు అవకాశాలు ఉంటాయన్నది సీఐడీ వాదన. అటువంటి కీలక పాత్రధారి ఓ వ్యక్తి కావచ్చు, ఓ కంపెనీ కావచ్చు, కాల్ సెంటర్ కావచ్చు, లేదా చివరకు జాతీయ భద్రతకు ఎదురవుతున్న ముప్పు కూడా కావచ్చు.
ఓటర్ల జాబితాతో ‘ఎవరో’ ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారు..
కర్ణాటక సీఐడీ అధికారులు 18 నెలల్లో 18సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం ఈ విజ్ఞప్తులను పట్టించుకోలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉదయం రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో లేవనెత్తిన విషయాలు ఆరోపణలు మాత్రమే. కానీ ఎవరో ఒకరు ఓటర్ల జాబితాను తారుమారుచేయానికి ఉద్దేశ్యపూర్వకంగా ఓ పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారని ఎన్నికల సంఘం ధృవీకరించటంతో ఆ ఆరోపణలు కాస్తా సాయంత్రానికి వాస్తవాలై కూర్చున్నాయి.
అలెండ్ నియోజకవర్గంలో పది పోలింగ్ బూత్‌లలో 6,018 మంది ఓటర్లకు సంబంధించి దాఖలైన ఫిర్యాదుల్లో కేవలం 24 మాత్రమే వాస్తవాలని, మిగిలినవి తప్పుడు ఫిర్యాదులని కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి ధృవీకరించారు. కాంగ్రెస్ ఎంఎల్యే బీఆర్ పాటిల్ ఫోర్జరీ గురించి చేసిన ఫిర్యాదులు, పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓటర్ల నమోదు అధికారులు స్పందించారు. చివరకు 5,994 ఫిర్యాదులు తప్పుడు ఫిర్యాదులని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాంతో ఈ ఫిర్యాదులను తిరస్కరిస్తూ ఈ తప్పుడు వ్యవహారం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
రాహుల్ గాంధీ వెల్లడించిన వివరాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాలో మార్పులు కోసం ఫారం 7 రూపంలో వచ్చే ఫిర్యాదులను బూత్ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో లోపరహితంగా తనిఖీ చేస్తున్నారా? భారతదేశపు ఎన్నికల ప్రస్థానంతో చెడుగుడు ఆడుకోవటం ద్వారా ప్రయోజనం పొందాలని ఆశిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? వ్యక్తులు కానీ కంపెనీలు కానీ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ద్వారా ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా? తద్వారా ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? ప్రాథమిక ఆధారాలతో సహా వెలుగు చూస్తున్న ఆరోపణలను తోసిపుచ్చటానికి ఎన్నికల సంఘం ఎందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది? ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామమా? ఓటర్ల జాబితాకు సంబంధించిన ఆరోపణలు పదేపదే వెలుగు చూస్తున్నప్పుడు ఎన్నికల సంఘం లోపాలు సవరించేందుకు తీవ్రంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందా?
ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడటమే కాదు. ఎన్నికల్లో పాల్గొనే అందరికీ సమాన అవకాశాలు కల్పించటం కూడా ఎన్నికల సంఘం బాధ్యతే.
ప్రస్తుత పరిస్థితిని, ఎన్నికల వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించటానికి అత్యున్నత స్థాయి న్యాయ విచారణ, లేదా స్వతంత్ర నిపుణులు, అఖిలపక్ష పార్టీల ప్రతినిధులతో కూడిన సమగ్ర దర్యాప్తు ఓ మార్గం. అంతే తప్ప కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చే హడావుడి స్పందనలు, ప్రతిస్పందనలు, సమర్థనలు మార్గం కాదు. తాజాగా ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశం మొత్తంగా ఎన్నికల సంఘం ప్రతిష్టనే అభాసుపాలు చేసింది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.