రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని ‘గ్లోబల్ డిజిటల్ గేట్వే’గా ప్రచారం చేస్తూ గర్వపడుతున్నది. అయినప్పటికీ, అదే నగరం ఇప్పుడు ఊపిరి కోసం పోరాడుతోంది. ప్రాణాంతక స్థాయికి చేరిన గాలి కాలుష్యం వల్ల విశాఖ ప్రజల జీవితం దుర్భరంగా మారింది. అయినా ప్రభుత్వం మాత్రం ప్రజల బాధల పట్ల నిమ్మకి నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా ఉంది.
శీతాకాలం మొదలవడంతో గాలి నాణ్యత సూచీ(AQI)అన్ని భద్రతా పరిమితులను దాటింది. మనం పీలుస్తున్న గాలి నిశ్శబ్ద విషంగా మారిపోయింది. ఇటీవల వచ్చిన ఒక మీడియా నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా అత్యధిక కాలుష్య నగరాలలో విశాఖ ఒకటి. శీతాకాలంలో సమస్య తీవ్రత అధికంగా ఉన్నా ఇది ఋతువులతో సంబంధం లేని, కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న నిర్లక్ష్యం. మానవ జీవితాల కంటే పరిశ్రమల లాభాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పాలనా వైఫల్యం. ప్రభుత్వ నినాదమైన ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఇప్పుడు నియంత్రణల పతనానికి, అదుపులేని కాలుష్యానికి లైసెన్సుగా మారింది.
నగరంలోని వేలాది కుటుంబాలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాయి. ఆస్థమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, హృద్రోగాలు వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. పరిశ్రమల ప్రాంతాలు, రద్దీ ట్రాఫిక్ ప్రాంతాలు అత్యధిక ప్రభావానికి గురవుతున్నాయి. శీతాకాలంలో తక్కువ వర్షపాతం, ఉష్ణోగ్రత మార్పుల వల్ల కాలుష్య కణాలు నేల దగ్గరే చిక్కుబడి గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరిపోతుంది. ఈ పరిస్థితిని సాధారణ అసౌకర్యంగా కొట్టిపడేయలేము. ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించీ, మానవ హక్కులకు సంబంధించి ఒక అత్యవసర పరిస్థితి.
అమలు వైఫల్యం..
ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటని ప్రజలు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా అడుగుతూనే ఉన్నారు. నియంత్రణా సంస్థలు వాయు నాణ్యతకు సంబంధిoచిన గణాంక వివరాలు ఆలస్యంగా, అసంపూర్ణంగా విడుదల చేయడం, లేదా ఉద్దేశపూర్వకంగా దాయడం చేస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చట్టాన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది.
కాలుష్యకారకులను బాధ్యులుగా చేయాల్సిన ఇటువంటి నియంత్రణా సంస్థలు కాలుష్యకారక దోషులను రక్షించే విధంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ కాపాడే విషయంలో విఫలమై ఈ సంస్థలు అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయి.
ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని తేలికగా తీసుకుంటోంది. పర్యావరణహితమైన ప్రాజెక్టుల వైపు అడుగులు వేయడం, బలమైన ప్రజా రవాణా వ్యవస్థలు, కఠిన ఉద్గార నియంత్రణలువంటి అంశాల్లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ దిశగా ప్రభుత్వం కదలడం లేదు. శుభ్రమైన గాలి కోసం ప్రణాళిక లేదు. సమయానుకూల హెచ్చరికలు లేవు. తక్కువ ఉద్గార ప్రాంతాలు లేవు. ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా జరగడం లేదు. నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమలు శిక్షల భయం లేకుండా కొనసాగుతున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వ బాధ్యతను పూర్తిగా విస్మరించడమే.
కాలుష్య మరణాలు..
విస్వశనీయ డేటా లేకపోవడం వల్ల, కాలుష్య ప్రభావం వల్ల విశాఖ ప్రజలు ఎంత మూల్యం చెల్లిస్తున్నారో మనకు తెలియదు. అయినప్పటికీ, అందుబాటులో ఉన్న పరిమిత ఆధారాల ప్రకారం వేలాది మంది ప్రతి సంవత్సరం అకాల మరణానికి గురవుతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, పేదలు వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.
గాలి నాణ్యతకు సంబంధించి ఒకప్పుడు సురక్షితంగా భావించబడ్డ స్థాయి కూడా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. కలుషిత గాలిలో ఉన్న PM2.5 ఇంకా PM10 కణాలను స్వల్పకాలికంగా పీల్చినా కూడా ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
విశాఖ వాయు సంక్షోభాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రజా సంక్షేమానికి తీవ్రమైన హాని చేస్తూవుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక స్పష్టమైన, పారదర్శకమైన, అమలుచేయదగిన ప్రణాళికతో ముందుకు రావాలని మానవ హక్కుల వేదిక, గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్స్ఫోరం(జీవీసీఎఫ్)డిమాండ్ చేస్తున్నాయి.
కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు చేపట్టి, శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించుకుంటూ, సుస్థిర రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాలికలు రూపొందించడం చాలా అవసరం. అలాగే, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలో వాయు ప్రమాణాలను తాజా శాస్త్రీయ ఆధారాల ప్రకారం పునఃపరిశీలించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలతో సమన్వయపరచాలి.
వీఎస్ కృష్ణ
హ్యూమన్ రైట్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్& తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు
సోహన్ హట్టంగడి – ప్రెసిడెంట్, గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్స్ ఫోరం(జీవీసీఎఫ్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
