“మనుషుల చైతన్యాన్ని నిర్ణయించేది వాళ్ళ జీవన పరిస్థితులే తప్ప, వారి జీవన పరిస్థితులను వారి చైతన్యం నిర్ణయించదు” అన్నాడు మార్స్క్.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ప్రస్తుత వెనిజులా దేశం. అక్కడ రోజువారీ జీవనపోరాటమే ప్రధాన సమస్యగా తయారైనప్పుడు ప్రజలకు బతకడం ఒక్కటే లక్ష్యంగా మారుతుంది తప్ప మరే ఆలోచనలూ ఉండవు.
నిరంతర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార కొరత, వలసలు, పాలకులపై అపనమ్మకం వంటి అనేక అంశాలు ప్రజల్లో అసంతృప్తి, నిరాశా నిస్పృహకు కారణమయ్యాయి.
అంతేకాకుండా, తమ జీవితాల్లో మార్పు వస్తుందేమోననే ఆశతో అమెరికాలాంటి సామ్రాజ్యవాద దోపిడీదారుల ఆక్రమణను కూడా సమర్థించే స్థాయికి దిగజారిపోయారు.
ఇది ప్రజల తప్పు ఎంతమాత్రం కాదు, అకలితో ఉన్న ప్రజల నుంచి నైతికతను ఆశించలేము.
వెనిజులాపై అమెరికా దౌర్జన్యాన్ని మనం వ్యతిరేకించినంత మాత్రాన సరిపోదు.
అమెరికా దుశ్చర్యకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అంతకంటే లేదు.
ఇతర దేశాలను దోచుకోవడం అనేది సామ్రాజ్యవాదుల సహజ లక్షణం.
అది అవకాశం కోసం గోతికాడ నక్కలా కాచుకుని ఉంటుంది. అయితే, ఆ అవకాశాలు కల్పించే దేశాలది కూడా తప్పే అవుతుంది.
అమెరికా ఆంక్షలను అధిగమించిన క్యూబా
అమెరికాకు పక్కనే ఉన్న చిన్న దేశమైన క్యూబా 60 ఏళ్ళుగా తీవ్రమైన ఆర్థిక ఆంక్షల కింద జీవిస్తున్నప్పటికీ మానవాభివృద్ధిలో విప్లవాత్మక ప్రగతిని సాధించింది.
క్యూబా రక్షణార్థం క్యూబన్ భూభాగంలో ఉంచిన రష్యన్ అణ్వాయుధాలను- రష్యా ఉపసంహరించుకునేలా రష్యాను నయానాభయానా ఒప్పించి క్యూబాని ఒంటరిని చేయడంలో అమెరికా విజయవంతమైంది.
అమెరికా దురహంకారం వల్ల విప్లవం తొలినాళ్ళలో క్యూబన్ ప్రజల జీవితాలు దినదిన గండంగా గడిచినవే.
వెనిజులాతో పోల్చితే క్యూబాలో సహజ వనరులు చాలా పరిమితం.
అయినప్పటికీ నేడు క్యూబా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, నైతికంగా అన్ని రంగాల్లోనూ తిరుగులేని అభివృద్ధి సాధించగలిగింది.
అక్కడి ప్రజలు సంపూర్ణ భద్రతతో సురక్షితమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
క్యూబాను నాశనం చేయాలని అగ్రరాజ్యమని విర్రవీగే అమెరికా సర్వశక్తులూ ఒడ్డింది.
ఆ తర్వాత తనంతట తానే బొక్కబోర్లా పడింది తప్ప, క్యూబా మాత్రం చెక్కుచెదరకుండా తమ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోని నిలబడగలిగింది.
వెనిజులాలో మాత్రం ప్రజలు తిండిలేక, పనిలేక, ఉపాధి అవకాశాలులేక; నిత్యావసరాల కొరత, కరెన్సీ విలువ పతనం, హింస, నేరాలు, గన్ కల్చర్, డ్రగ్స్, వ్వభిచారం వంటి సామాజిక విచ్ఛిన్న కార్యకలాపాలు విపరీతంగా పెరిగి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది.
విరుద్ధ ఫలితాలకు కారణం?
ఈ రెండు దేశాలకూ ప్రధాన శత్రువు అమెరికానే. కానీ వెనిజులా మీద దౌర్జన్యం చేసినట్టు చాలా చిన్న దేశమైన క్యూబా మీద చేసే ధైర్యం, శక్తి అమెరికాకు లేదు.
ఈ రెండు దేశాలూ తమని తాము సోషలిస్ట్ దేశాలుగా ప్రకటించుకున్నప్పటికీ, ఈ విరుద్ధ ఫలితాలకు కారణమేంటి? ఇది సోషలిజం వైఫల్యమా? లేక సోషలిజం పేరుతో నడిచిన బూర్జువా రాజకీయ ఫలితమా?
“సోషలిజం అంటే పైపై మార్పు కాదు, ఉత్పత్తి సంబంధాల మౌలిక పరివర్తన” అనే కార్లమార్క్స్ మాటను గుర్తుచేసుకోవాలి.
సోషలిజం అంటే ఏమిటి?
మొట్టమొదటగా మనం గమనించాల్సింది వెనిజులా అసలు సోషలిస్ట్ దేశమేనా?
మార్క్స్ – లెనిన్ సిద్దాంతం ప్రకారం సోషలిజం అంటే, ప్రధానంగా ఉండాల్సింది
1. ఉత్పత్తి సాధనాలపై కార్మిక వర్గపు సామూహిక నియంత్రణ(ఉత్పత్తి యంత్రాలపై పూర్తి హక్కు, అధికారం కార్మికులదే)
2. బూర్జువా రాష్ట్ర యంత్రాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం
3. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం
4. ఉత్పత్తి అనేది లాభాలు, మార్కెట్ కోసం కాకుండా ప్రజల అవసరాల కోసం ఉపయోగపడాలి
ఈ నాలుగు ప్రమాణాలే సోషలిజానికి కొలమానం.
బొలివేరియన్ సోషలిజం
లాటిన్ ఆమెరికా విమోచన నాయకుడు సిమోన్ బొలివార్ పేరు మీదుగా బొలివేరియన్ సోషలిజం అనే సిద్ధాంతాన్ని 1999లో వెనిజులా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన హ్యూగో చావెజ్ అమల్లోకి తెచ్చాడు.
ఇది సామాజిక న్యాయం, జాతీయ స్వావలంబనం, ప్రజాస్వామ్య భాగస్వామ్యమనే మూడు అంశాల మీద ఆధారపడి ఉంది.
వెనిజులా ఆర్థిక వ్యవస్థ మొత్తం కేవలం ఒకే ఒక్క వనరైన చమురు మీద ఆధారపడి ఉంది.
90 శాతానికిపైగా దేశ ఆదాయం చమురు ఎగుమతులతోనే రావాలి. దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు చావేజ్కు ముందే దాదాపు నాశనమైపోవడంతో ఆహారం, వినియోగవస్తువుల కోసం దిగుమతుల మీదే ఆధారపడవలసిన దుస్థితి. అంటే దేశంలో ఉత్పత్తి శూన్యం. ప్రజలు బతకడానికి చమురు వనరుల అద్దె ఆదాయం ఒక్కటే మార్గమైంది. ఈ విధానాన్ని మార్క్స్ “రెంటియర్ కాపిటలిజం” అంటాడు.
చావేజ్కు ముందు చమురు అదాయంలో అధికభాగం దోపిడీ వర్గాల జేబుల్లోకి వెళితే, ఆయన హయాంలో చమురు ఆదాయాన్ని పేదల సంక్షేమానికి, విద్య , ఆరోగ్యానికీ మళ్ళించాడు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఉచితాలు భారీగా పంచిపెట్టాడు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు కాస్త మెరుగుపడినట్టు కనిపించాయి.
చమురు పరిశ్రమను చావేజ్ జాతీయం చేయడం ఒక ప్రగతిశీల చర్యగా కనిపించినప్పటికీ అది కార్మికుల ఆధీనంలోకి వెళ్ళలేదు. రాష్ట్ర యంత్రాంగం చేతుల్లోనే కేంద్రీకృతమైంది.
సోషలిజం అంటే ప్రభుత్వ పథకాలు కాదు, ఉత్పత్తి సంబంధాలలో విప్లవాత్మక మార్పు తేవాలి.
వెనిజులాలో అసలు ఉత్పత్తి రంగాల విస్తరణే జరగలేదు.
బూర్జువా వర్గ నిర్మూలన జరగలేదు పాత విధానాలే కొనసాగాయి. ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ లేదు.
చమురు జాతీయమైనా..
ఏదైనా ఒక రంగాన్ని జాతీయం చేయడం అంటే, ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేకుండా ప్రజల ప్రతినిధిగా ఉండే ప్రభుత్వం చేతిలోకి రావడం- అంటే ప్రజల చేతిలోకి రావడం.
పాలనాధికారంలో ప్రజల భాగస్వామ్యం లేనప్పుడు; ఉత్పత్తి అధికారం, నియంత్రణ ప్రజలకు లేనప్పుడు జాతీయం చేయడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.
కార్మికుల చేతుల్లో కాక బ్యూరోక్రసీ, టెక్నోక్రాట్స్, బూర్జువా వర్గాల చేతుల్లోనే వెనిజులా దేశం ఉంది.
జాతీయమైన చమురు ఆదాయం కూడా వాళ్ళ చేతుల్లోకే వెళ్ళింది.
ఆ రంగం కేవలం లాభాల కోసం పనిచేసే సంస్థగా మారి అంతర్జాతీయ ఆయిల్ కంపెనీలతో జాయింట్ వెంచర్ల, విదేశీ బ్యాంకుల మీద ఆధారపడుతూ మేనేజ్మెంట్ వర్గం పూర్తిగా కార్పొరేట్ తరహాలో వ్యవహరించింది.
ఫలితంగా లాభాలు ప్రజలకు కాక ఎలైట్, మధ్యవర్తులు, విదేశీ మూలధనానికి తరలిపోయాయి.
బూర్జువా ఆధిపత్యాన్ని చావేజ్ కొంతమేర సవాలు చేసినా, ప్రైవేట్ బూర్జువా స్టేట్ బూర్జువాగా మదురో పాలనలో మారిపోయింది.
అంటే దోపిడీ రూపం మారింది, స్వరూపం కాదు.
ఒక్క మాటలో చెప్పాలంటే వెనిజులాలో పెట్రోల్ జాతీయమైనా పాలన ప్రజల కంట్రోల్లో లేకపోవడం వల్ల అది రాష్ట్ర బూర్జువా చేతుల్లోకి జారిపోయింది.
ఏ దేశంలో అయినా అంతే ప్రజలకు పాలనలో భాగస్వామ్యం, ఉత్పత్తిలో అధికారం, నియంత్రణ లేకపోతే ప్రభుత్వ రంగాలు పేరుకే ప్రజలకు చెందినవిగా ఉంటాయి, వాటి మీద ఆధిపత్యం మాత్రం బూర్జువా వర్గానిదే.
కార్మికులు అది ప్రైవేటైనా, ప్రభుత్వ రంగమైనా ఎలాంటి హక్కులు లేకుండా కేవలం వేతన కార్మికులుగానే మిగిలిపోతారు. దీన్నే “స్టేట్ క్యాపిటలిజం” అంటారు.
అంటే ఉత్పత్తి సాధనాలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లో కాకుండా ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పటికీ అవి క్యాపిటలిస్ట్ లాజిక్ ప్రకారమే పనిచేస్తాయి. అంటే ఇక్కడ కేవలం యజమాని మాత్రమే మారతాడు వ్యవస్థ మారదు(క్యాపిటలిజమే).
దేశం ఎవరి చేతుల్లో ఉంది, ఉత్పత్తిపై నిర్ణయం ఎవరిది అనేదే కీలకం.
“కార్మికుల నియంత్రణ లేకుండా జరిగే జాతీయం కార్మిక విముక్తి కాదు, అది స్టేట్ క్యాపిటలిజమే అవుతుంది”అని అన్నాడు లెనిన్
‘స్టేట్ క్యాపిటలిజం’ వైఫల్యం
వెనిజులాలో విఫలమైంది సోషలిజం కాదు, స్టేట్ క్యాపిటలిజం మాత్రమే. అసలు అక్కడ సోషలిజమే లేదు. కానీ మేధావులుగా చెలామణి అయ్యే చాలా మంది వెనిజులాలో సోషలిజం విఫలమైందనే దుషప్రచారం చేస్తున్నారు.
చమురు ధరలు ఎక్కువగా ఉన్నంత కాలం ప్రజలకు సబ్సీడీలు, సంక్షేమ పథకాలు సాఫీగానే సాగాయి. కానీ ఆర్థికవ్యవస్థను విభిన్న రంగాలకు విస్తరించకపోవడం వల్ల, ఒకే వనరుపై ఆధారపడడం వల్ల ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పడిపోగానే వెనిజులా ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయింది. కోలుకోలేని సంక్షోభంలో కూరుకుపోయింది.
కేవలం చమురు మీదే ఆధారపడే దేశం ఎప్పటికైనా కుప్పకూలిపోతుందని చెప్పే చావేజ్- వ్యవసాయాన్ని, పరిశ్రమల అభివృద్ధిని ఎందుకు నిర్లక్ష్యం చేశాడు?
చావేజ్- ఒక విప్లవాత్మక వామపక్ష నేత, కానీ అతను కార్మిక విప్లవం ద్వారా అధికారంలోకి రాలేదు. కేవలం ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ఒక రాడికల్ నేషనలిస్ట్- రిఫార్మిస్ట్ సోషలిస్ట్. ఎన్నికల్లో విజయం ద్వారా అధికారంలోకి రావడం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. అప్పటి వరకూ ఉన్న బూర్జువా వ్యవస్థలను సమూలంగా ధ్వంసం చేసే అవకాశం అంతగా ఉండదు. బూర్జువా చేతుల్లోని బ్యూరోక్రసీ, పాత రాష్ట్ర యంత్రాంగంతోనే పాలన కొనసాగించాడు.
చమురు ఆదాయం తక్షణ రాజకీయ ఆయుధంగా మారింది. వ్యవసాయం, పరిశ్రమలు దీర్ఘకాలిక ప్రణాళికలుగా ఫలితం నెమ్మదిగా కనిపిస్తుంది. రాజకీయంగా ఇప్పుడు ఓట్లు కావాలి. 20, 30 ఏళ్ళ తర్వాత ఫలితాలు కాదు.
దేశంలోని బూర్జువా వర్గమైన భూస్వాములు, దిగుమతి వ్యాపారులు, పరిశ్రమ యజమానులు కృత్రిమ కొరతలు సృష్టించిన ప్రతిసారీ చావేజ్ సంక్షేమాన్ని విస్తరిస్తూపోయాడు తప్ప ఆ వర్గాన్ని ధ్వంసం చేయలేదు. ఉద్యోగాలు కల్పించలేకపోయాడు. చావేజ్ తెగించి అడుగులు వేయలేకపోవడం వల్ల, ఉత్పత్తిదారులుగా ఉండాల్సిన ప్రజలు కేవలం వినియోగదారులుగా మిగిలిపోయారు.
“సంక్షేమం విప్లవానికి ప్రత్యామ్నాయం కాదు, అది ఉత్పత్తి విప్లవానికి అనుబంధం మాత్రమే”అని మార్క్సిజం స్పష్టంగా చెబుతోంది.
విప్లవాత్మక మార్పులకు చావేజ్ సాహసించలేకపోయాడు. జాతీయమనేది మొదటి అడుగు మాత్రమే, దానికి కార్మిక నియంత్రణ, ప్రజా ప్రణాళిక లేకపోతే జాతీయం కాస్తా స్టేట్ క్యాపిటలిజం అవుతుంది. చివరికి ప్రైవేటీకరణ అవుతుంది. భారత్లో జరుగుతుంది ఇదే.
క్రమంగా మార్పు తీసుకురావచ్చని చావేజ్ అనుకున్నాడే కానీ, బూర్జువా వర్గాన్ని దూరం చేసుకోవడానికి సిద్ధపడలేదు.
కానీ బూర్జువా అధికారాన్ని క్రమంగా తొలగించడం అసాధ్యమైన విషయం(నిర్లక్ష్యం చేస్తే విష కోరల్ని మరింత విస్తరిస్తుంది) అనేది మనకు చరిత్ర నేర్పిన పాఠం.
క్యూబాలో సోషలిజం
క్యూబాలో ఫిడేల్ క్యాస్ట్రో ఎన్నికలతో కాకుండా విప్లవ మార్గంలో అధికారంలోకి వచ్చాడు. ఆ విప్లవం అధికార మార్పుతో ఆగిపోలేదు, కొనసాగుతూనే ఉంది.
దేశంలో నిజమైన భూసంస్కరణలు జరిగాయి. భూస్వామ్యాన్ని పూర్తిగా రద్దు చేశాడు. పాత బూర్జువా వ్యవస్థలన్నిటినీ సమూలంగా ధ్వంసం చేశాడు. అప్పటి వరకు దేశంలో ఉన్న అమెరికా కంపెనీలన్నింటినీ జాతీయం చేశాడు.
ఇక్కడ ప్రజలే పాలకులు కాబట్టి జాతీయం చేయడం అంటే ప్రజల ఆధీనంలోకి తీసుకురావడమే అవుతుంది.
రైతు సహకార వ్వవస్థలను స్థాపించాడు. పాలనా నిర్ణయాలలో రైతులను భాగస్వాములుగా చేయడం వల్ల అన్ని ఆంక్షల మధ్య కూడా ఆహార ఉత్పత్తి కనీస స్థాయిలో నిలబడగలిగింది. భారీ క్యాపిటలిస్ట్ పరిశ్రమల జోలికి వెళ్ళకుండా- ప్రాథమిక వినియోగ వస్తువులు, ఔషధాలపై దృష్టి కేంద్రీకరించి తక్కువ వేతనాలైనప్పటికీ స్థిరమైన ఉద్యోగాలు భారీగా కల్పించారు. అక్కడ ఉత్పత్తి సాధనాలపై పూర్తి నియంత్రణ కార్మికులదే.
విద్యా , ఆరోగ్యం ప్రజల హక్కులుగా మారాయి. ఉత్పత్తిలో, పాలనలో ప్రజలు భాగస్వాములయ్యారు. ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ అవి దానంగా, వాటిమీద ఆధారపడే సంస్కృతిగా కాకుండా– సంక్షేమం, సామాజిక బాధ్యతగా మారింది. దేశ జీడీపీకంటే మానవాభివృద్ధిని క్యూబా ప్రామాణికంగా తీసుకుంది.
అత్యంత కీలకమైన విషయమేమంటే క్యూబాలో విప్లవం ప్రజల్లో చైతన్యాన్ని సృష్టించింది. ఆ చైతన్యమే అమెరికా ఆంక్షలను ఎదుర్కొనే శక్తిగా మారింది.
“విప్లవం అనేది కేవలం అధికార మార్పు కాదు, అది ప్రజల చైతన్యంలో మార్పు”.
“రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం విప్లవం కాదు, ఉత్పత్తి సంబంధాలను ధ్వంసం చేయడమే నిజమైన మార్పు” అన్నాడు మార్క్స్.
మార్క్స్ మాటలను క్యూబా అక్షర సత్యాలుగా చేసి చూపించింది.
క్యూబాపై దాడి అమెరికాకు అసాధ్యం
వెనిజులా సమాజం అంతర్గతంగా చీలిపోయి ఉండడం, పాలనలో ప్రజల జోక్యం లేకపోవడం, పాలకులు- ప్రజల మధ్య విశ్వాస లోపం, ప్రజల్లో చైతన్య రాహిత్యం- వంటి కారణాల వల్ల అమెరికా వెనిజులాపై రాజకీయ, ఆర్థిక , దౌత్య ఒత్తిళ్ళను పెంచగలిగింది. చమురు దోపిడీ కోసం అధ్యక్షున్ని అపహరించగలిగింది.
కానీ క్యూబాలో మాత్రం ప్రజల ఐక్యత, విప్లవ అనుభవం, దేశం పట్ల గౌరవభావన అమెరికా దాడులను నిరోధించే గోడలా నిలిచాయి. క్యూబా ప్రజలే అక్కడి వ్యవస్థలన్నింటికీ రక్షకులుగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్యూబాలో ఫిడేల్ క్యాస్ట్రో దేశ పాలనాధికారం, విద్య, ఆరోగ్యం , ఉత్పత్తి నియంత్రణ సమస్తం ప్రజల చేతుల్లో పెట్టి తను కేవలం ఒక నాయకుడిగా, సిద్దాంతకర్తగా, ప్రజలలో ఒకడిగా ఉన్నాడు.
కార్మిక వర్గం పాలక వర్గంగా మారడమే నిజమైన సోషలిజం. క్యూబా సోషలిజాన్ని సాధించింది. నిలబెట్టుకుంది.
ఐక్యమైన ప్రజలపై సామ్రాజ్యవాదం దాడి చేయలేదు. ఏ దేశంలో అయినా ప్రజల చేతుల్లో అధికారం ఉంటే అది అమెరికాలాంటి సామ్రాజ్యవాదులకు బూర్జువా వర్గాలకు వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ప్రజల ఐక్యతను దెబ్బతీసి, విడగొట్టి బలహీనపరిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతుంది.
క్యూబాలో నియంతృత్వ పాలన ఉందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని మాట్లాడే కొందరు మేధావులను చూస్తే నవ్వొస్తుంది. స్వయంగా తామే పాలకులుగా ఉన్న ప్రజలు తమను పాలించడానికి తమ అధికారాన్ని ఓ వ్యక్తి చేతిలో పెట్టడానికి ఒక నాయకుడిని ప్రజాస్వామ్య(పేరులో మాత్రమే ప్రజలుంటారు) బూటకపు ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలనడం ఎంత హాస్యాస్పదం!
కొంప ముంచిన అస్పష్ట విధానాలు
వెనిజులా అభివృద్ధి పట్ల చావేజ్కు నిజంగా చిత్తశుద్ధి ఉండివుంటే ఉత్పత్తి రంగాన్ని భారీగా విస్తరించి ఆర్థికవ్యవస్థను పటిష్టపరిచి, ప్రజల్లో చైతన్యాన్ని నింపి విప్లవాన్ని బతికించుకునేందుకు కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, ఆ రకమైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం కూడా చావేజ్కు ఉంది.
క్యూబా విప్లవం తర్వాత క్యాస్ట్రో, చేగువేరాలు లాటిన్ అమెరికా దేశాల విముక్తి కోసం; సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు గెరిల్లా శిక్షణనిచ్చి ఉద్యమకారులుగా తయారుచేసే సంస్థలను ఏర్పాటు చేశారు.
చావేజ్ జనాకర్షణ కలిగిన నాయకుడు- ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. తాను ఆదేశించాలేగానీ రాజకీయ చైతన్యంతో విప్లవస్ఫూర్తి నింపుకుని ఉద్యమకారులుగా తయారవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఈ విషయంలో క్యూబా సహాయ సహకారాలు కచ్చితంగా ఉండేవి.
నిర్ణయాధికారాల్లో కూడా ప్రజలను కొంతమేర భాగస్వాములను చేసి, తనకు అనుకూలమైన సైన్యాన్ని తయారుచేసుకుని ఉంటే అధికారంలో ఉన్న చావేజ్కు దేశంలోని బూర్జువాలను అణిచివేయడం అసాధ్యమైన విషయమేమీ కాదు. కానీ ఎలక్టోరల్ మార్గంలో అధికారాన్ని స్వీకరించిన చావేజ్- ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పాత రాష్ట్ర యంత్రాంగాన్ని కూల్చకుండా వాడుకున్నాడు. తర్వాత వచ్చిన మదురో బూర్జువాలకు మరింత వెసులుబాటు కలిగేలా చేశాడు.
అయినప్పటికీ వెనిజులా అమెరికాకు పూర్తిగా బానిస కాలేదు. అక్కడ అమెరికాకు అనుకూల బూర్జువా ఉన్నప్పటికీ దానికి బలమైన స్థానిక ఏజెంట్ లేదు. అందుకే “ఇంటర్నేషనల్ ట్రాన్ఫర్ ఆఫ్ పవర్” జరగలేదు.
అమెరికాని వ్యతిరేకించే వర్గం ఒకటి ఇంకా బలంగానే ఉంది. అదే చావిజ్మోతో రాజీ పడిన స్టేట్ బూర్జువా అమెరికా పెత్తనాన్ని అంగీకరించదు.
మదురో ఎంత బలహీనుడైనా అమెరికా మద్దతుతో వచ్చిన నేతను ప్రజలు సులభంగా అంగీకరించరు. అంటే ఇప్పటికీ వెనిజులా ప్రజలు పూర్తిగా నిర్వీర్యం కాలేదు. చావేజ్కాలంలో పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఉండేవి వారికి అప్పుడే సరైన ప్రోత్సాహాన్ని అందించి ఉంటే శక్తివంతమైన ఉద్యమకారులుగా మారేవారు, ప్రజా ఉద్యమాలు బతికి ఉండేవి.
చావేజ్ విప్లవ నినాదాలు వల్లించేవాడు కానీ విప్లవ మార్గంలో పయనించలేదు. ప్రజలను ప్రశ్నించే గొంతులుగా మారమన్నాడు. కానీ ప్రజలకు నిజంగా కావలసిన శక్తిని ఇవ్వలేదు. చావేజ్, మదురో అస్పష్ట సిద్ధాంత విధానాలే నేడు వెనిజులాని ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
