సతార్క్ నాగరిక్ సంఘటన్(ఎస్ఎన్ఎస్) “భారతదేశంలో సమాచార కమిషన్ల పనితీరు నివేదిక 2023- 24”ను 2025 జనవరిలో పౌర మేధావుల బృందం వెలువరించింది.
నివేదిక ప్రకారం జార్ఖండ్, తెలంగాణ, గోవా, త్రిపుర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఏడు సమాచార కమిషన్ల సేవలు 2023 జూలై 1- 2024 జూన్ 30 మధ్య నిలిచిపోయాయి. జార్ఖండ్, తెలంగాణ, త్రిపుర, గోవాలలో దీర్ఘకాలంగా రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాలు జరగలేదు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఒడిశాలో ఐదు కమిషన్లలో చీఫ్ కమిషనర్ లేరు. 2024 జూన్ 30నాటికి మొత్తం 29 కమిషన్లలో నాలుగు లక్షల కంటే ఎక్కువ అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల తప్ప అన్ని రాష్ట్రాలలో ప్రధాన సమాచార కమిషనర్ పోస్టులు కూడా నియామకాలు జరగలేదు. ఇకపోతే కేంద్ర సమాచార కమిషన్ ఉన్నదని కూడా జనం మర్చిపోతున్నారు.
కేంద్ర, రాష్ట్రాలలో ఉన్న ఖాళీలను కావాలనే భర్తీ చేయడం లేదు. రాష్ట్ర సమాచార కమిషనర్లను ప్రతి మూడేళ్లకోసారి నియమించాలి. కానీ అలా జరగడం లేదు. ఆర్టీఐ చట్టాన్ని బలహీనం చేశారు. ఆర్టీఐ ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం సమాచార కమిషనర్లను తీవ్ర పక్షవాతానికి గురిచేసింది. ఇదిగాక వ్యక్తిగత డేటా రక్షణ చట్టం(Personal Data Protection Act) పిడుగుపాటుగా పౌరుల సమాచార హక్కును మరింత నిర్వీర్యం చేస్తున్నది. పారదర్శకత కోసం 20 సంవత్సరాలుగా సాగిన పోరాటం ఈ పర్యవసానాల వల్ల బలహీనపడింది.
26,000 అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్..
కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో 11 ఏళ్లలలో ప్రధాన కమిషనర్ పదవి ఖాళీగా ఉండడం ఇది ఏడవసారి: 2025 సెప్టెంబర్ 14న అప్పటి చీఫ్ సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా పదవీ విరమణ చేసినప్పటి నుంచి, ఈ సంస్థ కేవలం ఇద్దరు కమిషనర్లతో మాత్రమే పనిచేస్తోంది. చీఫ్ సమాచార కమిషనర్ పదవితో సహా మొత్తం తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఫలితంగా, దాదాపు 26,000 అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. తమ దరఖాస్తుల పరిష్కారం కోసం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొందరు దరఖాస్తుదారులు వేచి ఉన్నారు. ఇటువంటి జాప్యాలు సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
పదవీ విరమణ తేదీలు పూర్తిగా తెలిసి కూడా, ప్రభుత్వం కావాలనే నియామకాలు చేపట్టకుండా పారదర్శకతను కావాలని నీర్వీర్యం చేస్తోంది. సీఐసీకి తాత్కాలిక చీఫ్ కమిషనర్‌ను నియమించడానికి ఆర్టీఐ చట్టంలో ఎటువంటి నిబంధన లేదు.
పాలనలో పౌరులు పాల్గొనడానికి ఆర్టీఐ చట్టం ఒక ముఖ్య సాధనం. ప్రభుత్య చర్యలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని రాజ్యాంగంలో రాసుకున్నాము. కాబట్టి ప్రభుత్వం దేనికీ యజమాని కాదని గుర్తుంచుకోవాలి. రోడ్లు, మౌలిక సదుపాయాలు, భవనాలు అన్నీ పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్మిస్తారు తెలుసా? ఇదంతా ప్రజలకు చెందిన ఆస్తి. ఏం చేసినా తెలిసి పనిచేయకపోతే రాజ్యాంగం పనిచేయదు. రోజువారీ సమాచారం కూడా ప్రజలకే చెందుతుంది.
హీరాలాల్ సమారియా 2023 నవంబర్ 6న నియమితులైన చీఫ్ సమాచార కమిషనర్ 65 ఏళ్ల వయస్సు తర్వాత పదవీ విరమణ చేశారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు, వైకే సింగ్ పదవీ విరమణ తర్వాత ఒక నెలపాటు ఆ పదవి ఖాళీగా ఉంది. 2005లో ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పదవీ బాధ్యతలు చేపట్టిన 12 మంది చీఫ్ సమాచార కమిషనర్లలో, కేవలం 5 మంది మాత్రమే పోస్టు ఖాళీ అవ్వగానే నియమించబడ్డారు. సీఐసీ మొదటగా 2014 ఆగస్టులో రాజీవ్ మాథుర్ పదవీ విరమణ చేసినప్పుడు చీఫ్ కమిషనర్ లేకుండా ఉంది. అప్పుడు మాథూర్ తరువాత రెండురోజుల్లో ముగ్గురు సీఐసీ(ఈ రచయిత కూడా) 2018లో పదవి ముగిసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన, నియామకాలలో ఆలస్యం వల్ల దెబ్బతింటున్నాం. పదవీ విరమణ, ఖాళీల తేదీలు ముందుగానే తెలుసు అయినప్పటికీ, ప్రభుత్వం సకాలంలో పోస్టులను భర్తీ చేయడంలో పదేపదే విఫలమైంది. ఇది ఖాళీలను సకాలంలో భర్తీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు 2019 తీర్పును నేరుగా ఉల్లంఘించడమేనని అంజలి భరద్వాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2019) కేసులో, ఖాళీలు ఆర్టీఐ చట్టం పనితీరును “తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, ఇది ఈ చట్టం అమలులోకి రావడానికి ఉద్దేశించిన లక్ష్యాన్నినిర్వీర్యం చేసినట్లవుతుందని” కోర్టు హెచ్చరించింది. తాజాగా 2023 అక్టోబర్‌లో పోస్టులు భర్తీ చేయకపోతే ఆర్టీఐ చట్టం “మృత అక్షరం(dead letter)”గా మారే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించింది.
నవంబర్ 2023 నుంచి ఖాళీలు భర్తీ కాలేదు. తొలుత ఆగస్టు 2024లో ఎనిమిది సమాచార కమిషనర్ పోస్టుల కోసం, ఆపై 2025 మేలో ఛీఫ్ కమిషనర్ పదవి కోసం ప్రకటనలు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వం నియామక ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ సంవత్సరం జనవరి, ఏప్రిల్ 2025నాటికి నియామకాలు చేపడతామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
2025 సెప్టెంబర్ 26న, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్య కాంత్, జోయ్‌మాల్య బాగ్చిల ధర్మాసనం ముందు సమాచార కమిషనర్లను నియమించకపోవడంపై ఒక కేసు విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మునుపటి ఆదేశాలు ఉన్నప్పటికీ, కేంద్ర సమాచార కమిషన్‌లో ఖాళీలు భర్తీ కాలేదని పేర్కొన్నారు. కమిషన్‌లో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారని, 26,800 కంటే ఎక్కువ అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని విచారణలు ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఆలస్యం అవుతున్నాయని తెలిపారు.
జార్ఖండ్ రాష్ట్ర సమాచార కమిషన్ 2020 నుంచి, ఐదు సంవత్సరాలకు పైగా పనిలో లేదని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. చీఫ్ కమిషనర్, కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీకి దాని సభ్యులలో ఒకరిని నామినేట్ చేయాలని జనవరి 2025లో కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2025 జూలైలో బాత్రా దాఖలు చేసిన ఒక ఆర్టీఐ దరఖాస్తుకు ప్రతిస్పందనగా, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) మే ప్రకటనకు ప్రతిస్పందనగా ఛీఫ్ సమాచార కమిషనర్ పదవి కోసం 83 దరఖాస్తులు అందినట్లు ధృవీకరించింది. అంతకుముందు, 2024 సెప్టెంబర్‌లో మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచార కమిషనర్ల ఖాళీల కోసం ప్రకటన తర్వాత 161 దరఖాస్తులు అందినట్లు వెల్లడైంది; అయినప్పటికీ, నియామకాలు జరగలేదు. “అప్పటి నుంచి, ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఆలస్యం జరిగింది. ఖాళీలు ఇంకా భర్తీ కాలేదు” అని బాత్రా అన్నారు.
సమాచార కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉండడమంటే పరిపాలనే ఖాళీ..
2023 నవంబర్‌లో జరిగిన చివరి నియామకాల కథ వివాదంలో చిక్కుకుంది. ప్రతిపక్ష నాయకుడిని మినహాయించి ఎంపిక కమిటీలో ఏకపక్షంగా నియామకాలు చేసింది.
ఆర్టీఐ చట్టం ప్రకారం, ఎంపిక కమిటీలోప్రధానమంత్రి(ఛైర్పర్సన్), లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఉండాలి. ఈ రోజు, కమిషన్ ముందు సాధారణంగా వేచి ఉండే సమయం దాదాపు 8 నుంచి 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ,” అని ఆర్టీఐ యాక్టివిస్ట్ నాయక్ పేర్కొన్నారు. “25,000 కంటే ఎక్కువ అప్పీళ్లు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. అడిగిన సమాచారం వెల్లడయ్యే సమయానికి, ఏ అవసరం కోసమైతే అడిగామో అది తరచుగా నిరుపయోగంగా మారుతోంది.”
భారతదేశంలో 28 రాష్ట్ర సమాచార కమిషన్లు(ఎస్ఐసీఎస్)ఒక సీఐసీ ఉన్నాయి. ఆర్టీఐ చట్టం ప్రతి కమిషన్‌లో పనిభారం ఆధారంగా ఒక చీఫ్ సమాచార కమిషనర్,10 సమాచార కమిషనర్లు ఉండాలని ఆదేశిస్తుంది. దేశవ్యాప్తంగా అదనపు సమాచార కమిషనర్ల పోస్టులు కూడా ఇదే నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. “జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో గత సంవత్సరం నాటికి ఒక్క కమిషనర్ కూడాలేరు” అని సతర్క్ నాగరిక్ సంఘటన్(SNS)చేసిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ నాయక్ ఎత్తి చూపారు.
“కర్ణాటక, మహారాష్ట్రలో అనేక కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దీంతో మొత్తం విభాగాలు న్యాయనిర్ణేతలు లేకుండా ఉన్నాయి. ఖాళీలు భర్తీ కానప్పుడు, కేసులు విచారణకు నోచుకోవు.”
ఈ నివేదిక మరొక విచిత్రాన్ని కూడా వెల్లడించింది: ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 25 ప్రతి కమిషన్ చట్టం అమలుపై వార్షిక నివేదికను తయారు చేసి ప్రచురించాలని ఆదేశించారు. అయినప్పటికీ, 62 శాతం కమిషన్లు తమ 2022-23 నివేదికలను నేటికీ ప్రచురించలేదు. “పారదర్శకత సంస్థలు ఆర్టీఐలకు సంబంధించిన డేటాను ప్రచురించడం లేదు. దీని వలన సీఐసీ, ఎస్ఐసీలలో ఆర్టీఐ వినియోగం పూర్తి స్థాయిని అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది.
జరిమానా భయం లేదు..
ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 20 లోపభూయిష్టమైన సమాచారాన్ని ఇచ్చిన అధికారుల(పీఐఓ)పై రూ 25,000 వరకు జరిమానా విధించే అధికారాన్ని సమాచార కమిషన్లకు ఇస్తుంది. ఈ నిబంధనలు పాటించని అధికారులకు జరిమానాల భయం ఉండడం లేదు. ఒక ప్రాథమిక సమాచార అధికారి(పీఐఓ), ఆర్టీఐ దరఖాస్తును విస్మరించినా లేదా సమాచారాన్ని తిరస్కరించినా, పిటిషినర్ కేసు విచారణకొచ్చేటప్పటికి సంవత్సరానికి పైగా కాలయాపన జరుగుతోంది. ఈలోగా పీఐఓ మారిపోతారు. కమిషన్ పదవి ముగుస్తుంది. ఆర్టీఐ అమలు జవాబుదారీతనం గాలిలో కలిసిపోతుంది.
ఎస్ఎన్ఎస్ నివేదిక ప్రకారం, జరిమానాలు వర్తించే కేసులలో 95 శాతంకేసులలో కమిషన్లు జరిమానాలను విధించడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వమే రాజ్యాంగాన్ని, ఆర్టీఐని, ప్రశ్నించే తెలుసుకునే హక్కును, జీవించే హక్కును దెబ్బతీస్తామంటే ఇంకా చేయగలిగేదేముంది?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
