♦ బెదిరింపులను తీవ్రతరం చేసిన ట్రంప్
♦ దాడులు నిలిపివేస్తామన్న హామీతోనే ఒప్పందానికి సమ్మతమంటున్న ఇరాన్
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా, భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వనంత వరకు యుద్ధాన్ని ముగించే ప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు, అనిశ్చితి కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఏప్రిల్ 7 నాటికి 39వ రోజుకు చేరుకున్నాయి. సైనిక చర్యలు, తీవ్రమైన మాటల యుద్ధం కొనసాగుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఈలోగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తన బెదిరింపుల దాడిని మరింత తీవ్రతరం చేస్తూ, ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.
రాత్రికి రాత్రే నాశనమైపోతుంది: ట్రంప్ వార్నింగ్..
పెట్టిన గడువులోగా ఇరాన్ ఒప్పందానికి రాకపోతే, “ఆ దేశం మొత్తం రాత్రికి రాత్రే నాశనమైపోవచ్చు” అని ట్రంప్ హెచ్చరించారు.
అంతకుముందు ఇరాన్‌కు అనేక అవకాశాలు ఇచ్చామని చెబుతూ, మంగళవారం రాత్రి 8 గంటల(ఈడీటీ) గడువును ఆయన తుది డెడ్‌లైన్‌గా పేర్కొన్నారు.
అమెరికా 45 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించగా- టెహ్రాన్ దానిని తిరస్కరించి, యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని డిమాండ్ చేసింది.
భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇస్తేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
గత విడత చర్చల సందర్భంగా అమెరికా జరిపిన దాడుల తర్వాత, ట్రంప్ పరిపాలనను తాము ఇకపై ఎంతమాత్రం విశ్వసించడం లేదని కైరోలోని ఇరాన్ దౌత్య కార్యాలయ అధిపతి మొజ్తాబా ఫెర్దౌసి పూర్ అన్నారు.
కాజ్వే మూసివేత – గల్ఫ్‌లో టెన్షన్..
ఈ ఉద్రిక్తతల ప్రభావం గల్ఫ్ ప్రాంతంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సౌదీ అరేబియాను బహ్రెయిన్‌తో కలిపే ‘కింగ్ ఫహద్ కాజ్వే’ను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు.
ఇరాన్ దాడులు జరిగే అవకాశం ఉన్నందునే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 25 కిలోమీటర్ల పొడవున్న ఈ కాజ్వే, బహ్రెయిన్‌కు, అరేబియా ద్వీపకల్పానికి మధ్య ఉన్న ఏకైక రహదారి మార్గం కావడంతో వ్యూహాత్మకంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
తీవ్రమవుతున్న ఇజ్రాయెల్ దాడులు..
ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కూడా అంతకంతకూ తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు నిల్వగా పరిగణించబడే, ఖతార్‌తో పంచుకోబడిన, అలాగే ఇరాన్ దేశీయ ఇంధన అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న ‘సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం’లోని ఒక ప్రధాన పెట్రోకెమికల్ ప్లాంట్‌ను ఇజ్రాయెల్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి.
మార్చిలో ఇదే ప్రాంతంపై దాడి చేసిన తరువాత, ఇరాన్ దానికి ప్రతిగా ఇతర మధ్యప్రాచ్య దేశాలలోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని, ఉద్రిక్తతలను మరింత పెంచింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మజీద్ ఖాదెమీ, రహస్య ఖుద్స్ ఫోర్స్ విభాగాధిపతి అస్గర్ బఖేరీలను కూడా హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇరాన్ ఉన్నతాధికారులను “ఒక్కొక్కరిగా” లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు.
టెహ్రాన్‌లో దుర్భర పరిస్థితులు..
టెహ్రాన్‌లో పౌరుల పరిస్థితి రోజురోజుకీ దుర్భరంగా మారుతోంది. నిరంతర బాంబు దాడులు, డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థల హోరు మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
రాత్రిళ్లు నిద్రపోవడానికి చాలామంది నిద్రమాత్రలను ఆశ్రయిస్తుండగా- విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోతుందనే ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.
ఇజ్రాయెల్ టెహ్రాన్‌లోని బహ్రామ్, మెహ్రాబాద్, అజ్మయేష్ విమానాశ్రయాలపై కూడా దాడులు చేసింది. ఈ దాడులలో ఇరాన్ వైమానిక దళానికి చెందిన పలు హెలికాప్టర్లు, విమానాలు ధ్వంసమైనట్టు సమాచారం.
యుద్ధ నేరాల ఆరోపణలు కొట్టిపారేసిన ట్రంప్..
మరోవైపు, క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున తిరుగుబాటుకు ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ, ఇరాన్ పౌరులు “స్వేచ్ఛ కోసం కష్టాలను భరించడానికి సిద్ధంగా ఉన్నారు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
పౌర మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడటం యుద్ధ నేరం కదా అని ప్రశ్నించగా, ఆ ఆరోపణలను ఆయన తేలిగ్గా కొట్టిపారేశారు.
ఈ సంఘర్షణపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పౌర మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడటం అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అటువంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని ఐరాస ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ అన్నారు.
కొలిక్కిరాని దౌత్య ప్రయత్నాలు..
దౌత్య స్థాయిలో కూడా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈజిప్ట్, పాకిస్థాన్, టర్కీల మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని కోరుతూ ఒక ప్రతిపాదన రూపొందించారు.
అయితే, ఇప్పటివరకు ఇందులో ఎటువంటి స్పష్టమైన పురోగతి కనిపించలేదు.
క్రిటికల్ పాయింట్‌గా హోర్ముజ్ జలసంధి..
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైనది. సాధారణ సమయాల్లో ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదవ వంతు దీని గుండానే జరుగుతుంది.
ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, అమెరికా- ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలను దీని గుండా వెళ్లడానికి ఇరాన్ అనుమతించడం లేదు.
మొత్తం మీద, 39 రోజులుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణలో భీకర సైనిక దాడులు, తీవ్రమైన వాగ్వివాదాలు, విఫలమైన దౌత్య ప్రయత్నాలే చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతానికి మాత్రం ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఎటువంటి స్పష్టమైన మెరుగుదల సంకేతాలు కనిపించడం లేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

