వెనుజులా మీద అమెరికా దాడి, దేశ అధ్యక్షుడు మదురోను బంధించటం మీద స్పందించిన ప్రపంచ దేశాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. అమెరికా దుందుడుకుతనాన్ని లాటిన్ అమెరికా ప్రధాన దేశాలు, రష్యా, ఇరాన్ ఖండిస్తే; అమెరికా మిత్ర దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి.
న్యూఢిల్లీ: వెనిజులాపై దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా బంధించే విషయంలో ప్రపంచదేశాలన్నీ నిట్టనిలువునా చీలిపోయాయి. చట్టవిరుద్ధమైన దురాక్రమణను లాటిన్ అమెరికా ప్రధాన దేశాలు, చైనా, రష్యా, ఇరాన్ విస్పష్టంగా ఖండించాయి. అమెరికా మిత్ర దేశాలు మాత్రం ఈ దాడి వెనిజులాకు స్వాతంత్రం ప్రసాదించే దిశగా వేసిన అడుగని వ్యాఖ్యానించాయి.
ప్రమాదకరమైన పర్యవసానాలకు అమెరికా తాజా చర్యలు పునాదులుగా మారే ప్రమాదమున్నదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్, జర్మనీ, బ్రిటన్లు ఆచితూచి స్పందించాయి.
ఈ నేపథ్యంలోనే భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా స్పందించింది. అంతేకాకుండా, శనివారం సాయంత్రం వెనుజులా ప్రయాణించదల్చుకున్న పర్యాటకులకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
ప్రమాదకర పర్యావసానాలకు దారితీస్తుంది: ఐరాసా హెచ్చరిక
పెచ్చరిల్లుతున్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.
వెనిజులాపై దాడి చేయడానికి ముందే, గత కొన్ని నెలలుగా అమెరికా ఆ ప్రాంతంలో తన సైనిక బలగాలను మోహరించింది. అంతేకాదు, వెనిజులా నుంచి చమురు తరలిస్తున్న నౌకలను కూడా మధ్యలోనే అడ్డుకుని స్వాధీనం చేసుకుంది.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ విడుదల చేసిన ఓ ప్రకటనలో, “తాజా సైనిక దాడులు ఈ ప్రాంతంలో తీవ్రమైన పర్యవసానాలకు దారి చేసే అవకాశం ఉంది”అని తెలిపారు.
“వెనిజులా దేశ పరిణామాలతో సంబంధం లేకుండానే, తాజా పరిణామాలు ఓ ప్రమాదకర పర్యవసానాలకు దారితీయనున్నాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్‌తో సహా అన్ని అంతర్జాతీయ సూత్రాలను, ఒప్పందాలను అన్ని దేశాలు పూర్తిస్థాయిలో గౌరవించాల్సిన అవసరం ఉంది”అని ఆయన వక్కాణించారు.
ఇరుదేశాలు సంయమనం పాటించాలని, వెనిజులా ప్రజల ప్రాణాలు కాపాడటం అత్యంత ప్రాధాన్యత కలిగిన తక్షణ కర్తవ్యమని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అధినేత వోల్కర్ తుర్క్ అన్నారు.
తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణమే సమావేశమవ్వాలని వెనిజులా డిమాండ్ చేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలోని మార్- ఎ- లాగో నుంచి చేసిన ప్రకటనలో, వెనిజులాలో ప్రభుత్వం మారేంతవరకు తమ దాడి కొనసాగుతుందంటూ వెల్లడించిన తర్వాత, పై విధంగా ఐక్యరాజ్యసమితి స్పందించింది. వెనిజులా పరిశ్రమల ఆధునీకరణకు అమెరికా సిద్ధంగా ఉందని కూడా ట్రంప్ ప్రకటించారు.
చీలిపోయిన లాటిన్ అమెరికా దేశాలు
వెనిజులాతో బలమైన సంబంధాలు కలిగిన లాటిన్ అమెరికా దేశాలు అమెరికా దాడులను ఖండించాయి. ఈ దాడులు జాతీయ సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డాయి.
తాజా పరిణామాలపై స్పందించిన తొలి దేశాధినేతగా కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో నిలిచారు. కారకాస్‌పై క్షిపణి దాడులు జరుగుతున్న సమయంలోనే పెట్రో తన ఎక్స్ వేదికగా వరుసగా అనేక అంశాలను ప్రస్తావించారు.
కొలంబియా, వెనిజులా దేశాలు సరిహద్దు దేశాలు– సార్వభౌమ వెనిజులూ దేశం, లాటిన్ అమెరికా ప్రాంతంపై ఈ దురాక్రమణలను తాము తిరస్కరిస్తున్నామని పెట్రో ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదికపై అమెరికా దాడుల్లో గాయపడిన పౌరుల ఫొటోలను, వెనిజులా ప్రభుత్వం ప్రకటన పూర్తి పాఠాన్ని పోస్ట్ చేశారు.
జాతీయ భద్రత మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెట్రో- వెనిజులా, కొలంబియా దేశాల సరిహద్దు వెంబడి బలగాలని మోహరించాలని, తలెత్తబోయే శరణార్థుల సంక్షోభానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కారకాస్‌లోని కొలంబియావాసులను కాపాడటానికి కొలంబియా దౌత్య కార్యాలయం పాటుపడుతోందని, ఈ విషయాలపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సమావేశం జరపాలని డిమాండ్ చేయనున్నామని తన సోషల్ మీడియా ఖాతాలో పెట్రో తెలిపారు. వెనిజులా ప్రజలను కాపాడుకోవాలని, చర్చకు సిద్ధంగా ఉండాలని సార్వభౌమత్వం లేకుంటే ఏ దేశానికైనా ఉనికే లేదని పెట్రో విజ్ఞప్తి చేశారు.
అమెరికా దాడులను రాజ్యప్రేరేపిత ఉగ్రవాదంగా క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ దియాజ్ కానల్ అభివర్ణించారు. అంతేకాకుండా లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు శాంతి వేదికలుగా ఉండాలనే అవగాహనను అమెరికా ఉల్లంఘించిందని విమర్శించారు.
“మా ప్రాంతంలో శాంతికి తీవ్రంగా భంగం వాటిల్లేలా చేశారు. ధీశాలులైన వెనిజులా ప్రజలపై, మా లాటిన్ అమెరికాపై ఇది రాజ్యప్రేరేపిత ఉగ్రవాదం తప్ప మరొకటి కాదు”అంటూ ఈ ప్రకటన చివర్లో మాతృదేశం లేదా మరణమో, ప్రస్తుత పరిస్థితిని అధిగమిద్దామంటూ నినాదాన్ని కూడా జోడించారు.
చీలి కూడా జాగ్రత్తగానే స్పందించినప్పటికీ, ఆ స్పందనలో తీవ్రమైన విమర్శ ఇమిడి ఉంది. చీలి అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ అమెరికా సైనిక చర్యను ఖండిస్తూ– ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు శాంతియుత పరిష్కార మార్గాలను వెతకాలని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఐక్యరాజ్యసమితి చార్టర్స్ విధివిధానాలను ఎప్పుడూ చీలి గౌరవిస్తుందని ప్రకటించారు.
సార్వభౌమత్వంపై దాడి ఆమోదయోగ్యం కాదు: బ్రెజిల్
వెనిజులాపై బాంబు దాడులు, దేశాధ్యక్షుడిని బంధించడం ద్వారా అమెరికా అన్ని హద్దులను ఉల్లంఘించిదంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఖండించారు.
“తాజా చర్యలు వెనిజులా సార్వభౌమత్వంపై ప్రత్యక్ష దాడి. యావత్ అంతర్జాతీయ సమాజానికి ఎదురుకానున్న మరో తీవ్రమైన ప్రమాదం” అంటూ తాజా దాడులను లూలా అన్నారు.
సోషల్ మీడియా వేదికపై విడుదల చేసిన ప్రకటనలో, “‘అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించి– వివిధ దేశాలపై దాడులు చేయటం ప్రపంచాన్ని హింసాయుతంగా మార్చడానికి, గందరగోళానికి, అస్థిరతకు తొలిమెట్టు. బహుముఖ సహకారం స్థానంలో ఇటువంటి చర్యలు బలవంతుడిదే పైచేయిగా మారుస్తాయి” అని లూలా ఆందోళన వ్యక్తం చేశారు.
“తాజా దాడులు లాటిన్‌అమెరికా, కరేబియన్ దేశాలలో హేయమైన జోక్యానికి; ఈ ప్రాంతాన్ని శాంతికాముక ప్రాంతంగా సంరక్షించాలన్న లాటిన్ అమెరికా దేశాధినేతల ప్రయత్నాలకు భంగం కలిగించే చర్యలకు దారితీస్తుంది. ఈ దాడులను ప్రపంచం ఖండిస్తుంది. చర్చలు, సహకారం ద్వారా సమస్యను అదుపులో పెట్టడానికి మా వంతు సహకారాన్ని మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము” అనే లూలా ప్రకటన వెల్లడిస్తోంది.
బ్రెజిలియన్ టీవీ ఛానల్ గ్లోబో న్యూస్ కథనం ప్రకారం, లూలా బ్రెజిల్ విదేశాంగ శాఖ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ సమావేశం జరిగే సమయంలో విదేశాంగ మంత్రి అధికారికంగా సెలవులో ఉండగా, లూలా కూడా ఒకరోజు విశ్రాంతి కోసం రియో డీ జనిరియోలోని సైనిక స్థావరంలో ఉన్నారు.
ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ప్రస్తావించిన మెక్సికో
మెక్సికో అధ్యక్షులు క్లాడియా షీన్బామ్ విడుదల చేసిన ప్రకటనలో, ఐరాస చార్టర్‌లోని రెండో ఆర్టికల్ నాల్గో పేరాను ప్రస్తావిస్తూ “అంతర్జాతీయ వ్యవహారాల్లో బలప్రయోగంవంటి చర్యలకు, దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సవాలు చేసే చర్యలకు ఏ దేశాలు పాల్పడకూడదు. ఐక్య రాజ్యసమితి ప్రయోజనాలకు భిన్నంగా ఏ దేశమూ మరో దేశంతో వ్యవహరించకూడదు” అని గుర్తు చేశారు.
మెక్సికో ప్రభుత్వం అధికారిక ప్రకటనలో “అమెరికా సైనిక దళాలు బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా భూభాగంపై ఏకపక్షంగా సాగిన సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం” అని స్పష్టం చేశారు.
ఈ దాడులు ప్రాంతీయ సుస్థిరతకు సవాల్ విసురుతున్నాయని; లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాన్ని శాంతి మండలంగా ఉంచాలన్న ఇరుగుపొరుగు దేశాల నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ– పరస్పర గౌరవం, శాంతియుతంగా వివాదాల పరిష్కారం, బల ప్రయోగంపై నిషేధంవంటి సూత్రాలపై ఆధారపడి ఏర్పాటు చేసుకున్న శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నాయని మెక్సికో హెచ్చరించింది.
అమెరికా దాడిని తీవ్రంగా ఖండించినప్పటికీ, ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకుగాను అవసరమైతే మధ్యవర్తిత్వానికి తాము సిద్ధంగా ఉన్నామని మెక్సికో తెలిపింది.
అమెరికా అనుకూల దేశాధినేతల ఆనందోత్సాహాలు
పైన వ్యక్తమైన స్పందనలకు భిన్నంగా ఈ ప్రాంతంలోని అమెరికా అనుకూల నేతలు తాజాపరిణమాలపై ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
వెనిజులాలో వేగంగా మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే సోషల్ మీడియాలో స్పందిస్తూ– శుక్రవారం నాడు స్వాతంత్య్రం పురోగమిస్తోంది, స్వాతంత్య్రం వర్ధిల్లుగాక అన్న నినాదాన్ని పోస్ట్ చేశారు. ఈ నినాదం మిలే రాజకీయ సమీకరణలకు కేంద్రంగా ఉంది. మిలేకు అండగా నిలుద్దామన్నదే ఆయన రాజకీయ సంకీర్ణం నినాదం. ఈ నినాదాన్ని ట్రంప్ కూడా అర్జెంటీనా స్థానిక ఎన్నికల సందర్భంగా సమర్థించారు.
నికోలస్ మదురో నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వం ఆదేశం గురించి గత సంవత్సరం జూలైలో చేసిన ఒక పోస్టును ఎల్ సాల్వేడార్ అధ్యక్షుడు రీపోస్ట్ చేశారు. అప్పట్లో బందీలుగా ఉన్న వెనిజులా పౌరులను విడుదల చేసుకునే క్రమంలో ఒక ఖైదీని సాల్వేడారుకు తిరిగి పంపించిన సందర్భం గురించి జేవియర్ మిలే స్పందించారు.
అమెరికా నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమించడానికి, సంపన్న దేశాల నుంచి వచ్చిన వారిని మదురో ఖైదీలుగా ఉపయోగించుకుంటున్నారని; అయితే వెనిజులా నుంచి చివరి ఖైదీ కూడా బయటకు రావడం వల్ల, తమ దేశం ముందు మరో మార్గం లేకుండా పోయిందని ఒక కథనం వెలువడింది.
ఈక్విడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా నేరుగా వెనిజులా ప్రతిపక్ష నేతలు మేరియా కోరిన మచాడో, ఎడ్మండు గుంజాలెస్ ఉరిటీయాలను ఉద్దేశించి ఓ సందేశం జారీ చేశారు.
2024లో జూలైలో జరిగిన ఎన్నికలలో తాము గెలిచామని ఈ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. వీరిని ఉద్దేశించి అధ్యక్షుడు డేనియల్ “చావిస్తా ప్రభుత్వంలో మాదకద్రవ్య నేరగాళ్లారా, మీ సమయం ఆసన్నమైంది. లాటిన్ అమెరికా వ్యాప్తంగా మీరు ఏర్పాటు చేసుకున్న మీ యంత్రాంగం కకావికలం కానున్నది. మారియా, ఎడ్మండు, వెనిజుల ప్రజలారా మీ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈక్వెడార్ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది” అని ప్రకటించారు.
తాజా దాడులతో తనకేమి సంబంధం లేదంటూ ట్రీనిడాడ్– టుబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ ఓ సంక్షిప్త ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో “ఈరోజు ఉదయం, 2026 జనవరి3న అమెరికా వెనిజులా భూభాగంపై సైనిక చర్యను ప్రారంభించింది. ఈ చర్యలలో ట్రీనిడాడ్- టుబాగో భాగస్వామి కాదు. ట్రీనిడాడ్– టుబాగోలు వెనిజులాతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
సాయుధ దురాక్రమణను ఖండించిన రష్యా
అమెరికా దురాక్రమణను తీవ్రంగా ఖండించిన దేశాలలో రష్యా ఒకటి.
వెనిజులాకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ దురాక్రమణను ఖండిస్తూ రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటనను జారీ చేసింది.
“ఈ చర్య తీవ్ర ఆందోళనకరమైనది. ఖండనార్హమైనది. అమెరికా సమర్థింపులు నిరాధారమైనవి అవాస్తవికమైనవి. వెనిజులా పట్ల ఉన్న సైద్ధాంతిక శత్రుత్వమే అమెరికాను ఈ దాడికి పురిగొల్పింది” అని స్పష్టంగా ప్రకటించింది.
తక్షణమే దాడులను నియంత్రించాలని, చర్చలను ప్రారంభించాలని; 2014లో తీర్మానించినట్టు లాటిన్ అమెరికా శాంతియుత మండలంగా కొనసాగాలని; ఆయా దేశాల భవిష్యత్తును ఆ దేశ ప్రజలే నిర్ణయించుకునేందుకు అవకాశం కల్పించాలని; ఇతర దేశాలు ఏ రకమైన జోక్యానికి, ప్రత్యేకించి సైనిక జోక్యానికి పాల్పడకూడదని రష్యా పిలుపునిచ్చింది.
వెనిజులా ప్రజలకు రష్యా సంఘీభావం ప్రకటించింది.
ఆ దేశ ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని సంరక్షించేందుకు బొలివేరియన్ రిపబ్లిక్ నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలని; ఆ చర్యలకు రష్యా మద్దతుగా నిలుస్తుందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సమావేశాలు తక్షణమే ఏర్పాటు చేయాలనే ఇతర దేశాల ప్రతిపాదనను రష్యా సమర్ధించింది.
ఇరాన్ ఖండన
అమెరికా సైనిక చర్యలను వెనిజులా సన్నిహిత మిత్ర దేశం ఇరాన్ ఖండించింది. ఈ దాడి వెనిజులా భౌగోళిక సమగ్రత, జాతీయ సార్వభౌమత్వాలను ఉల్లంఘించే చర్య అని ప్రకటించింది.
ఈ దాడి ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రాథమిక సూత్రాలను, అంతర్జాతీయ ప్రాథమిక న్యాయ సూత్రాలను– ప్రత్యేకించి ఆర్టికల్ 2లోని నాలుగవ పేరాగ్రాఫ్‌ను ఉల్లంఘించేదిగా ఉందని ఇరాన్ అభిప్రాయపడింది.
ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని రెండవ ఆర్టికల్ నాలుగో పేరాగ్రాఫ్‌లో ఒక దేశం మరొక దేశంపై బలప్రయోగానికి దిగరాదని పేర్కొంటుంది.
అమెరికా దుందుడుకు చర్యకు ఇది తాజా ఉదాహరణని, దీన్ని తక్షణమే బహిరంగంగా ఐక్యరాజ్యసమితి– ఇతర సభ్య దేశాలు ఖండించాలని; అంతర్జాతీయ భద్రత, శాంతి న్యాయ సూత్రాలను పాటించాలని తమ విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటనలో ఇరాన్ కోరింది.
ఐక్యరాజ్యసమితి సభ్య దేశంపై అమెరికా సైనిక జోక్యం ప్రాంతీయ అంతర్జాతీయ శాంతి భద్రతలను ఉల్లంఘిస్తుందని, దీంతో అంతర్జాతీయ సమాజంపైన తీవ్ర ప్రభావం చూపుతుందని ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవించాలంటున్న యూరోపియన్ యూనియన్
ఉద్రిక్తతలను నివారించాలని యూరోపియన్ యూనియన్ పిలుపునిచ్చింది. అయితే అమెరికా దాడిని ప్రత్యక్షంగా ఖండించలేదు.
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనీయో కోస్తా పరిస్థితిని చాలా ఆందోళనతో పరిశీలిస్తున్నామని, తాజా పరిస్థితి నుంచి బయటపడేందుకు జరిగే ఏ ప్రయత్నమైనా ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు సంపూర్ణ గౌరవమిచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు.
తాను అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో, వెనిజులాలోని యూరోపియన్ యూనియన్ రాయబారితోను మాట్లాడినట్టు యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాల ఉన్నత ప్రతినిధి కాజా కల్లాస్ వెల్లడించారు.
వెనిజుల అధ్యక్షుడు మదురో పాలనకు చట్టబద్ధత లేదన్న విషయాన్ని యూరోపియన్ యూనియన్ పదేపదే గుర్తు చేస్తోంది. ఆ దేశంలో శాంతియుతంగా అధికార బదిలి జరగాలని కూడా యూరోపియన్ యూనియన్ ప్రతిపాదిస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. సంయమనం పాటించమని కోరుతున్నామని, వెనిజూలలోని యూరోపియన్ యూనియన్ పౌరుల భద్రతే తమకు ప్రధానమని కల్లాస్ అన్నారు.
ప్రపంచ భద్రతకు భారీ పర్యవసానాలు: ఫ్రాన్స్ ఆందోళన
ఫ్రాన్స్ విదేశాంగమంత్రి జీన్ నోయెల్ బరోట్ విడుదల చేసిన ప్రకటనలో– అటు మదురోనూ, ఇటు అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు. తాజా పరిణామాలు అంతర్జాతీయ సమాజంపై తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తాయని హెచ్చరించారు.
వెనిజులా ప్రజల ప్రాథమిక స్వేచ్ఛలను హరించడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా నికోలోస్ మదురో ఆ దేశ ప్రజల స్వయం నిర్ణయధికారాన్ని హరించారు. ఫ్రాన్స్ నిరంతరం మధ్యవర్తిత్వం ద్వారా వెనిజులా ప్రజల సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉంది. ఫ్రాన్స్ అభిప్రాయాలకు అగ్రతాంబూలమివ్వాలని రాశారు.
అదే సమయంలో మదురోను బంధించి దేశంపై సైనిక చర్యకు పాల్పడటం– ఏ దేశమూ పొరుగు దేశంపై అకారణంగా దాడి చేయకూడదనే అంతర్జాతీయ న్యాయ సూత్రాన్ని ఉల్లఘించడమేనని కూడా బరోట్ విస్పష్టంగా ప్రకటించారు.
ఏ దేశ అంతర్గత విషయాలలోనైనా మరో దేశం జోక్యం చేసుకోవడం ద్వారా శాశ్వతమైన రాజకీయ పరిష్కారాన్ని సాధించలేమని, అటువంటి పరిష్కారాన్ని ఆదేశ ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకునే క్రమంలో సాధించుకోవాలని ఫ్రాన్స్ ప్రతిపాదిస్తుందని ఆయన అన్నారు.
రాజకీయ పరిష్కారం కోసం జర్మనీ విజ్ఞప్తి
జర్మనీ విదేశాంగ మంత్రి జారీ చేసిన ఒక ప్రకటనలో, రాజకీయ పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత పాత్రధారులు అందరూ ఉద్రిక్తతలు పెంచకుండా చూడాలని, రాజకీయ పరిష్కారం కోసం మార్గాలు వెతకాలని జర్మనీ విదేశాంగ శాఖ అభిప్రాయపడినట్టు రాయటర్స్ కథనం వెల్లడించింది.
“అంతర్జాతీయ సూత్రాలను గౌరవించాలి. తమ భవిష్యత్తును ప్రజాతంత్రయుతంగా ఎన్నుకునే అవకాశం పౌరులకు వెనిజులా ఇవ్వాలి” అని జర్మనీ ఆ ప్రకటనలో పేర్కొన్నది.
మధ్యవర్తిత్వానికి సిద్ధమంటున్న స్పెయిన్
2024 జూలై 28న జరిగిన వెనిజులా ఎన్నికలను గుర్తించని దేశాలలో స్పెయిన్ ఒకటి. తాజా సందర్భంలో ఉద్రిక్తతలను నివారించేందుకు రెండు దేశాల మధ్య శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
స్పెయిన్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో– తాజా సంక్షోభం నుంచి బయటపడేందుకు; చర్చల ద్వారా శాంతిని, పరిష్కారాన్ని సాధించేందుకు జరిగే ప్రయత్నాలకు తమ దేశం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు.
తమ పాత్ర ఏమీ లేదంటున్న బ్రిటన్
వెనిజూలపై అమెరికా చేసిన దాడిలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదని ఆదేశ ప్రధాని కేర్ స్టార్మర్ ధ్రువీకరించారు. ఈ సంఘటనను ఖండించినప్పటికీ ఉభయ పక్షాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు గౌరవించాలని ఆయన కోరారు.
“పరిస్థితి చాలా వేగంగా మారిపోతుంది. వాస్తవాలను రూఢీపరుచుకోవాలి” అని స్టార్మర్ అభిప్రాయపడినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనంలో తెలిపింది.
“అధ్యక్షుడు ట్రంప్, మిత్ర దేశాలతోనూ సంప్రదించాలి. ఈ దాడులతో మాకేమి సంబంధం లేదు అన్న విషయం నేను ఖరాకండిగా చెప్పగలను. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవించాలని మాత్రం చెప్పగలను” అన్నారు.
బ్రిటన్‌లోని వామపక్ష స్రవంతికి చెందిన లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ నాయకులు అమెరికా దాడులను చట్టవిరుద్ధమైనవిగా ఖండించారని; బ్రిటిష్ ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉన్నదానే ప్రశ్నకు సమాధానంగా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నామని స్టార్మర్ అన్నారు.
ఆధిపత్యపు చర్య- చైనా ఆగ్రహం
అమెరికా సైనిక చర్యను ఖండించడంలో కొంత జాప్యం చేసిన చైనా చివరకు తీవ్రంగా స్పందించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బీజింగ్‌లో మాట్లాడుతూ ” తీవ్రమైన షాక్‌కు గురయ్యాము. సార్వభౌమత్వం కలిగిన దేశం, ఆ దేశ అధ్యక్షుడి విషయంలో అమెరికా బహిరంగ సైనిక జోక్యానికి పాల్పడింది, దీనిని ఖండిస్తున్నాము.
అమెరికా అనుసరిస్తున్న ఈ అధిపత్యపు చర్యలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, వెనిజులా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నాయి. లాటిన్ అమెరికా, కరేబియా ప్రాంతాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఈ చర్యలను చైనా నిస్సంకోచంగా వ్యతిరేకిస్తుంది” అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో జారీ చేసిన ఒక పోస్టులో తెలిపింది.
అమెరికా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, ఐక్యరాజ్యసమితి చార్టర్ వ్యవస్థాపక లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే చర్యలకు, భద్రత సమస్యలకు కారణం కాకూడదని చైనా ఈ ప్రకటనలో కోరింది.
వెనిజులాతో చైనాకు సన్నిహితమైన ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నప్పటికీ దాడి జరిగిన కొన్ని గంటలపాటు చైనా తన స్పందనను వెల్లడించలేదు. ఈ దాడి జరగడానికి రెండు రోజులు ముందు అంటే, జనవరి ఒకటో తేదీన వెనిజులా చమురు పరిశ్రమతో సంబంధాలున్న నాలుగు చైనా, హాంకాంగ్ కంపెనీలపై అమెరికా ఆర్థిక శాఖ అంక్షలు విధించింది.
కొన్నివారాల క్రితం డిసెంబర్ 18న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెనిజులా విదేశాంగ మంత్రి యువన్ గిల్‌తో మాట్లాడుతూ, ఏ దేశమైనా ఏకపక్షంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటాన్ని బీజింగ్ వ్యతిరేకిస్తుందని– వెనిజులాకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
అమెరికా చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనే – దక్షిణాఫ్రికా ఖండన
దక్షిణార్ధగోళ దేశాలలో దక్షిణాఫ్రికా కీలకమైన దేశం. ఆఫ్రికా యూనియన్‌లో ప్రధానమైన దేశం. వెనిజులాపై అమెరికా దాడి ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమేనని దక్షిణాఫ్రికా తీవ్రంగా ఖండించింది.
దక్షిణాఫ్రికా దేశపు అంతర్జాతీయ సంబంధాలు– సహకార శాఖ వెనిజులాపై దాడి, అధ్యక్షుడిని అపహరించటం వంటి చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమేనని దక్షిణాఫ్రికా భావిస్తోంది.
ఒక సార్వభౌమ దేశపు అంతర్గత వ్యవహారాలపై మరో దేశపు సైనిక జోక్యం ఏమాత్రం సరికాదని, ఇటువంటి ఏకపక్ష దుందుడుకు సైనిక చర్యలు అంతర్జాతీయ సంబంధాలకు విఘాతం కల్పిస్తాయని, సార్వభౌమ దేశాల మధ్య ఉన్న సమానత్వాన్ని ఉల్లంఘిస్తాయని, తక్షణమే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం ఏర్పాటు చేయాలని దక్షిణాఫ్రికా పిలుపునిచ్చింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
