
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి- బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో జూలై 16వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం మీద రెండు రాష్ట్రాలూ పెద్దఎత్తున ఆశలు పెంచుకున్నాయి. కానీ సమావేశంలో అసలు విషయం మాత్రం చర్చకే రాలేదు.
కీలకమైన వివాదాలను చర్చించి ఓ అవగాహనకు రావడానికి బదులుగా రెండు రాష్ట్రాలు ప్రతిపాదించిన పెండిరగ్ ప్రాజెక్టుల గురించి రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన కమిటీ చర్చించి ముప్పై రోజుల్లోగా ఓ అవగాహనకు రావాలని కేంద్రం సర్దిచెప్పింది. ఈ సమావేశం తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖే రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటిపారుదల శాఖకు చెందిన ఇంజనీర్లను ఎంపిక చేసి, ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నది.
జూన్ 19వ తేదీన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలవనరుల శాఖమంత్రిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ప్రకటించింది. పోలవరం నుంచి కృష్ణా బేసిన్ గుండా నీటిని పెన్నా బేసిన్‌కు పంపే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. తద్వారా నిరంతరం కరువుపీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమకు సాగునీరందించాలన్నది ఈ ప్రాజెక్టు ప్రకటిత లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అనుమతిస్తే గోదావరీ నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన గణనీయమైన వాటాను రాష్ట్రం కోల్పోయే ప్రమాదం ఉందన్నది రేవంత్ రెడ్డి లేవనెత్తిన అభ్యంతరం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ప్రాజెక్టులను కేంద్రం సత్వరమే అనుమతిస్తోందనీ, తెలంగాణ ప్రాజెక్టు ప్రతిపాదనల విషయంలో కేంద్రం కాలయాపన చేస్తోందని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి కావటమే తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించటానికి కారణమవుతోందని రేవంత్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ఇరువురు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూలై 16వ తేదీ సమావేశం గురించి కేంద్రం నుంచి వర్తమానం అందగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై15వ తేదీ హైదరాబాద్‌లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని చర్చించారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది.
మరోవైపున కేంద్రం నుంచి వర్తమానం అందుకున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సమావేశంలో కేవలం వివాదాస్పద బనకచర్ల ప్రాజెక్టు ఒక్కటే ఎజెండాగా ఉండాలని కోరుతూ లేఖ రాసింది. అయితే ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పాటైన ఎపెక్స్ కౌన్సిల్లు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపనందున ఈ ప్రాజెక్టుపై చర్చకే అవకాశం లేదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కూడా బనకచర్ల ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రీఫీజబిలిటీ నివేదికను తిరస్కరించింది.
రివర్ బేసిన్‌లోని ఇతర రాష్ట్రాల అనుమతి, జల పంపిణీలో మార్పుల విషయంలో ఈ ప్రాజెక్టు 1980 నాటి గోదావరి నదీ జలాల ఒప్పందాన్ని, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తోంది.
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు రాసిన లేఖలో 200 టీఎంసీల వరద నీటిని మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనీ, ఫలితంగా మొత్తంగా పోలవరం ప్రాజెక్టు రూపు రేఖలే మారిపోవడంతో పాటు గోదావరి నీటిలో తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కకుండా పోయే ప్రమాదం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతకు ముందే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖలో కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపున కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ తిరస్కరించిన తర్వాత కూడా శ్రీశైలం నుండి రాయలసీమకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు సరఫరా చేసేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కేంద్రం ఎలా అనుమతిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని ఆ లేఖలో ప్రశ్నించారు. పోలవరం తరహాలో ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్రం అనుమతించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయటమే కాక పౌర సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు నీళ్లే లేనప్పుడు వరద నీరు తరలింపుకోసం లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ప్రతిపాదించటం ఏమిటని పౌర సమాజం, జలవనరుల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 200 టీఎంసీల వరద నీటి లభ్యత 40 ఏళ్లల్లో వచ్చే వరదల నుంచి లభ్యమయ్యేనీరే తప్ప ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న నికర వరద నీరు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు శ్రీరాం వదిరే ఓ ప్రజెంటేషన్ ఇస్తూ కేంద్ర జల వనరుల సంఘం ఏర్పాటు చేసిన గేజ్ స్టేషన్ లెక్కల ప్రకారం 1966- 67 నుండి 2022- 23 వరకూ మొత్తం 57 ఏళ్ల కాలంలో సాలుసరి 3000 టీఎంసీల నీరు ప్రవహిస్తుంది. ఇందులో 75 శాతం లభ్యత ప్రకారం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒరిస్సాలకు చెందిన వాటా జలాలు కూడా ఉన్నాయి.
ఏదైనా ప్రాజెక్టు తలపెట్టినప్పుడు ఆ ప్రాజెక్టు కింద ఏర్పాటయ్యే ఆయకట్టుకు నాలుగేళ్లల్లో కనీసం మూడేళ్ల పాటైనా నిర్దేశిత సాగునీరు అందుబాటులో ఉంచే విధానాన్ని 75 శాతం లభ్యత అంటారు. ఈ అంచనా ప్రకారం 2018 నుంచి 2023 మధ్య కాలంలో గోదావరిలో మిగులు జలాలు అందుబాటులో ఉండే ప్రశ్నే లేదని శ్రీరాం అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేతమాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కూడా గోదావరిలో 3000 టీఎంసీల నీరు వృధా అవుతోందని, దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పేవారు. ఈ విషయాన్నే పదేపదే ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రయోజనాలను వైసీపీ నేత జగన్‌కు కేసిఆర్ తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించేవారు. 3000 టీఎంసీని సద్వినియోగం చేసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, తెరాసలు పరస్పరం విమర్శల వర్షం కురిపించుకున్నాయి.
ఈ విమర్శలు, వివాదాల నేపథ్యంలో జూలై 16వ తేదీన పాటిల్ సమక్షంలో జరిగిన సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. కానీ ఈ సమావేశంలో వివాదాస్పద బనకచర్ల గురించి చర్చకే రాలేదని సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయని పరస్పరం విమర్శించుకుంటున్న నేపథ్యంలో, కృష్ణా పరివాహక ప్రాంతంలో అన్ని కేంద్రాల్లోనే టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ఆనకట్టుకు మరమ్మతులు చేపట్టాలని కూడా నిర్ణయం అయ్యింది. ఈ ఆనకట్టకు తక్షణమే మరమ్మతు చేపట్టాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ పదేపదే కోరింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్రాన్ని తెలంగాణలోనూ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం జరిగినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. చివరిగా రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు, ఇంజనీర్ల బృందం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల వివాదాల జాబితా రూపొందించి, ముప్పై రోజుల్లో వాటికి పరిష్కార ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు.
ఎన్ రాహుల్
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.