ఉన్నావ్ అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇవ్వడానికి, శిక్షను నిలిపివేయడానికి కోర్టు వివిధ షరతులను విధించింది. 2019లో మైనర్‌ను అత్యాచారం చేసినందుకు సెంగర్ దోషిగా నిర్ధారించబడ్డారు.
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ శిక్షను ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 23న నిలిపివేసింది.
లైవ్ లా కథనం ప్రకారం, సెంగర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ- జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం రూ 15 లక్షల వ్యక్తిగత బాండ్; అదే మొత్తానికి ముగ్గురు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది.
బాధితురాలి ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోకి సెంగార్ వెళ్లకూడదని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించకూడదని కూడా హైకోర్టు ఆదేశించింది.
“శిక్షను నిలిపివేస్తున్నాము. తను రూ 1.5 లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు, దీనికి సరిసమానంగా ముగ్గురు వ్యక్తులతో పూచీకత్తును సమర్పించాలి. బాధిత కుటంబం ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోకి తను అడుగు పెట్టకూడదు. అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంత వరకు తను ఢిల్లీలోనే ఉండాలి. నేరం రుజువైతే తన మిగిలిన శిక్షను అనుభవించడానికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. బాధితురాలిని లేదా ఆమె తల్లిని ఏ విధంగానూ బెదిరించకూడదు. తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్ కోర్టుకు తను అప్పగించాలి. అంతేకాకుండా ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి”అని కోర్టు పేర్కొన్నది.
అదనంగా ఈ షరతులలో దేనినైనా ఉల్లంఘిస్తే, బెయిల్ రద్దు చేయబడుతుందని కోర్టు తెలియజేసింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో, దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకోవడానికి సెంగర్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. గత సంవత్సరం డిసెంబర్లో కూడా అతనికి ఇలాంటి ఉపశమనం లభించింది.

సెంగర్ అప్పీలుపై తుది నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు తన శిక్షను నిలిపివేసింది. 2019 డిసెంబరులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సెంగర్ సవాలు చేశారు.
బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో తను దోషిగా నిర్ధారించబడినందుకు; తను దాఖలు చేసిన అప్పీల్ కూడా పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో తనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఇప్పటికే చాలా కాలం తను జైలు జీవితం గడిపానని సెంగర్ వాదిస్తూ ఈ శిక్షపై స్టే కోరారు.
గమనించాల్సిందేంటే, ఈ కేసు 2017 జూన్ 4నాటిది. 2017లో 17 ఏళ్ల బాలికపై ఉత్తరప్రదేశ్‌లోని బంగార్మౌకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ అత్యాచారం చేశారని ఆరోపించబడింది .
బాధితురాలు, ఆమె కుటుంబం రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఆగస్టు 2019లో బంగార్మౌ నుంచి నాలుగుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సెంగర్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. 2019 జూలై 28న రాయ్‌బరేలి జిల్లాలో జరిగిన ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. బాధితురాలి కారును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడంతో- ఆమె ఇద్దరు బంధువులు మరణించగా, తన న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు.
2018 ఏప్రిల్ 3న బాధితురాలి తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో ఇరికించి అరెస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత 2018 ఏప్రిల్ 29న తను జ్యుడీషియల్ కస్టడీలో మరణించాడు .
తదనంతరం, 2020 మార్చి 4న అత్యాచార బాధితురాలి తండ్రి జ్యుడీషియల్ కస్టడీలో మరణించిన కేసులో సెంగర్, తన సోదరుడు, మరో ఐదుగురు కూడా దోషులుగా నిర్ధారించబడి పదేళ్ల జైలు శిక్ష ఖరారుచేయబడింది.
ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు 2019 ఆగస్టు 1న ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేసింది. 2017లో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో సెంగార్‌కు 2019 డిసెంబర్ 20న జీవిత ఖైదు విధించబడింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
