అట్టడుగు సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోతకు సంబంధించిన ప్రభుత్వ డేటాను రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ పంచుకున్నారు.
ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్ని కేటగిరీలలోనూ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ), డీనోటిఫైడ్ తెగలకు(డీఎన్టీ) చెందిన విద్యార్థులకు కేటాయించిన నిధులు నిరుపయోగంగా మిగిలిపోయాయని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మార్చి 12న అన్నారు.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడైన ప్రభుత్వ సొంత లెక్కలను ఆయన ఉదహరించారు.
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం ఉన్న వివిధ స్కాలర్షిప్ పథకాలు; వాటి నిధుల కేటాయింపుతోపాటు వినియోగం గురించి సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావలే మార్చి 11న రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు.
“ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం ఉద్దేశించిన వేల కోట్ల రూపాయలు ఖర్చు కాలేదు” అని వివరాలను పంచుకుంటూ బ్రిట్టాస్ తర్వాత ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

నిధుల కేటాయింపులు వర్సెస్ ఖర్చులు
సామాజిక న్యాయం- సాధికారత విభాగం డేటా ప్రకారం, 2024-25లో రూ 14,164.42 కోట్లు కేటాయించగా; కేవలం రూ 8,679.02 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
అలాగే అదే ఆర్థిక సంవత్సరం 2024-25లో(మరొక పద్దు కింద) రూ 9,163.98 కోట్లు కేటాయించగా; రూ 8,008.79 కోట్లు ఖర్చు చేశారు.
అదేవిధంగా 2023-24లో రూ 8,874.14 కోట్లు కేటాయించారు కానీ రూ 7,762.82 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
2022-23లో రూ 8,165 కోట్లు కేటాయించి రూ. 6,372.38 కోట్లు ఖర్చు చేశారు. అంతకు ముందు సంవత్సరం 2021-22లో కేటాయించిన రూ 6,220.62 కోట్లకు గాను రూ 4,446.24 కోట్లను ఖర్చు చేసినట్లు డేటా తెలియజేసింది.
భారీగా తగ్గిన లబ్ధిదారుల సంఖ్య
వివిధ కేటగిరీలలో స్కాలర్షిప్ లబ్ధిదారులు కూడా గణనీయంగా తగ్గిపోయారని బ్రిట్టాస్ నొక్కి చెప్పారు.
అధికారిక డేటా ప్రకారం, ఎస్సీ ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ లబ్ధిదారుల సంఖ్య 2020-21లో 31.22 లక్షల నుంచి 2024-25 నాటికి 21.65 లక్షలకు తగ్గిపోయినట్లు ఆయన చెప్పారు.
అంటే దాదాపు 10 లక్షల మేర లబ్ధిదారులు తగ్గారు. కాగా, షెడ్యూల్డ్ కులాలకు చెందిన పోస్ట్-మెట్రిక్ లబ్ధిదారులు 50.16 లక్షల నుంచి 48.04 లక్షలకు తగ్గారు.
ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులలో ఈ తగ్గుదల మరింత తీవ్రంగా ఉంది.
వీరి ప్రీ-మెట్రిక్ లబ్ధిదారులు 54.95 లక్షల నుంచి 20.61 లక్షలకు భారీగా పడిపోగా, పోస్ట్-మెట్రిక్ లబ్ధిదారులు దాదాపు సగానికి (45.45 లక్షల నుంచి 24.53 లక్షలకు) పడిపోయారు.
“స్కాలర్షిప్ జాబితాల నుంచి లక్షలాది మంది విద్యార్థులు మాయమైపోతున్నారు. అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఇవి కేవలం లెక్కలు మాత్రమే కావు – ఇది వారు కోల్పోతున్న అవకాశం” అని బ్రిట్టాస్ పేర్కొన్నారు.
పెరగనున్న ఆదాయ పరిమితి
ఇదిలా ఉండగా, అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల అర్హత ప్రమాణాలను పెంచాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు ‘ది హిందూ’ కథనం తెలియజేసింది.
దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన వార్షిక కుటుంబ ఆదాయ పరిమితిని 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి రూ 2.5 లక్షల నుంచి రూ 4.5 లక్షలకు పెంచనున్నట్లు ఆ కథనం పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డీఎన్టీ వర్గాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వివిధ స్కాలర్షిప్ పథకాలను భారీగా సవరించనున్నట్లు సంబంధిత పార్లమెంటరీ ప్యానల్‌కు ప్రభుత్వం తెలియజేసినట్లు ‘ది హిందూ’ కథనం వెల్లడించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
