న్యూయార్క్‌లోని ఒక బోధనా ఆసుపత్రిలో నైజీరియన్ వైద్యుడు మోకాలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు.
టెక్సాస్‌లోని గ్రామీణ ప్రాంతంలో మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న ప్రజలకు ఒక వెనిజులా వైద్యుడు చికిత్స అందించారు.
అమెరికాలో శిక్షణ పొందిన ఇరాన్‌కు చెందిన ఒక నేత్ర వైద్యుడు అర్కాన్సాస్లో కంటి శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
అమెరికా టాప్ అంటూ విదేశీయులపై ట్రంప్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే పై వైద్యుల పాస్‌పోర్టులు రద్దుచేసి తమ తమ దేశాలకు తిరిగి వెళ్లాలని ఆదేశించారు.
ఉద్యోగాల నుంచి తొలగించిన తర్వాత, ఆ ముగ్గురు వైద్యులు రోగులకు వైద్యం అందించడం మానేయవలసి వచ్చింది. ఈ చర్య గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు అంతరాయం కలిగించనుంది.
గ్రామీణ వైద్యంపై వీసా ఆంక్షల ప్రభావం
జనవరిలో 39 దేశాల పౌరులకు, అలాగే పాలస్తీనా అథారిటీ ప్రయాణ పత్రాలు ఉన్నవారికి వీసా పొడిగింపులు, పని అనుమతులు, గ్రీన్ కార్డ్‌లను ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది.
ఈ చర్య పర్యవసానాలు, దీర్ఘకాలంగా వైద్యుల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలలో అత్యంత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధ అమెరికన్లు అధిక సంఖ్యలో ఉన్న కమ్యూనిటీలలోని ప్రజలు పలు అవస్థలకు గురయ్యారు.
ట్రంప్ ప్రభుత్వం శరణార్థుల ప్రవేశాలను తగ్గించడం, వీసా పరిశీలనను కఠినతరం చేయడం వంటి ఇతర చర్యలతో పాటు, విస్తృతమైన వలసల అణచివేత చర్యల వల్ల ఈ అంతరాయం ఏర్పడింది.
“విదేశీ వైద్యులను నియమించుకునే వైద్య సంస్థలకు ప్రాతినిధ్యం వహించే న్యాయవాది ఆండ్రూ విజ్నర్ మాట్లాడుతూ- “అత్యంత అవసరమైన వైద్యుల వంటి నిర్దిష్ట వలసదారులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా చేస్తున్న ఒక పెద్ద దాడి ఇది” అని అన్నారు.
అధిక ప్రమాదం ఉన్న దేశాల నుండి వచ్చిన వలసదారులకు సంబంధించిన కేసులపై వారిని సాధ్యమైనంత గరిష్ట స్థాయిలో తనిఖీ చేసి, వడపోసేలా చూసేందుకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
తీవ్రమవుతున్న వైద్యుల కొరత
అమెరికన్ మెడికల్ కాలేజీల సంఘం అంచనా ప్రకారం, అమెరికా ప్రస్తుతం సుమారు 65,000 మంది వైద్యుల కొరతను ఎదుర్కొంటోంది.
అమెరికన్ల సగటు ఆయుర్దాయం ఎక్కువగా ఉండటం, అధిక సంఖ్యలో వైద్యులు పదవీ విరమణ చేయడం వల్ల రాబోయే దశాబ్దంలో ఈ కొరత భారీగా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులలో 25 శాతం మంది విదేశీ వైద్యులే ఉన్నారు. వారిలో చాలామంది అమెరికన్ పౌరసత్వం కలిగినవారే.
కొత్త విధానం వల్ల ప్రభావితమైన 100 మందికి పైగా వైద్యుల జాబితాను ‘ది టైమ్స్’ సమీక్షించింది.
ఈ జాబితాలో ఇప్పటికే సెలవులో ఉన్న వైద్యులు, అలాగే వారి పని అనుమతులు, వీసాల గడువు ముగిసినప్పుడు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్న ఇతరులు కూడా ఉన్నారు.
ఈ జాబితాను వైద్యులే స్వయంగా రూపొందించారు. ప్రతీకార చర్యలు ఉంటాయనే భయంతో తమ గుర్తింపును వెల్లడించకూడదనే షరతుపై కొందరు ఇంటర్వ్యూకు అంగీకరించారు.
ఇబ్బందుల్లో విదేశీ వైద్యులు, నిలిచిపోతున్న సేవలు
ఫెలోషిప్‌లో భాగంగా న్యూయార్క్ ఆసుపత్రిలో మోకాలు, తుంటి శస్త్రచికిత్సలు చేస్తున్న నైజీరియన్ సర్జన్ వర్క్ పర్మిట్‌ను ప్రభుత్వం పునరుద్ధరించకపోవడంతో ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తొలగించారు.
డజన్ల కొద్దీ పీర్-రివ్యూడ్ వ్యాసాలను ప్రచురించిన ఆ వైద్యుడికి, వైద్య సేవలు సరిగా అందని ప్రాంతంలోని ఒక విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో జూలై 1 నుంచి ఒక ఉద్యోగ ఆఫర్ వచ్చింది.
రోగులకు చికిత్స చేస్తూ, వైద్య విద్యార్థులకు బోధించే ఆ డాక్టరు ఉద్యోగం ఇప్పుడు ప్రమాదంలో పడింది.
సెనేటర్ కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్ కార్యాలయం ఆ వైద్యుడి కేసును వేగవంతం చేయమని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగాన్ని సంప్రదించింది.
అమెరికా నిషేధించిన దేశానికి చెందినవాడు కాబట్టి అతను వీసా పొడిగింపుకు అనర్హుడని ఆ విభాగం తెలియజేసింది.
ఆ వైద్యుని తొలగింపు రోగుల సంరక్షణకు హాని కలిగిస్తుందని, తోటివారి మనో నిబ్బరాన్ని దెబ్బతీస్తుందని, సిబ్బంది కొరత కారణంగా మిగిలిన వైద్యులపై భారం అధికం అవుతుందని సహోద్యోగులు, ఆసుపత్రి నాయకులు తెలిపారు.
“మేము దశాబ్దాలుగా ఈ వైద్య వృత్తిలో ఉన్నాము. విదేశీ వైద్యుల కోసం ఎప్పుడూ ఒక మార్గం ఉండేది” అని మిస్టర్ విజ్నర్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానం వల్ల విదేశీ వైద్య నిపుణులకే కాక అమెరికన్ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ఈ వైద్యులు అమెరికా నిషేధించిన దేశాలకు చెందినవారు. ప్రధానంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చారు.
ట్రంప్ ప్రభుత్వం నూతన వీసా విధానాన్ని ప్రకటించే నాటికి వీరి వీసా పొడిగింపు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా ఇప్పుడు వారు ఉద్యోగంలో కొనసాగడానికి ఆటంకం ఏర్పడింది.
నూతన వీసా విధానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వందలాది మంది విదేశీ వైద్యులు సమాచారాన్ని పంచుకోవడానికి ఒక అనధికారిక వృత్తిపరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
నిర్దిష్ట వ్యక్తుల దరఖాస్తులను ప్రాసెస్ చేయాలనే డిమాండ్‌తో ఫెడరల్ కోర్టులో 13 కేసులు దాఖలు చేసిన న్యాయవాది కర్టిస్ మోరిసన్ ఇటీవల ఇచ్చిన ఆన్లైన్ ప్రెజెంటేషన్‌కు సుమారు 200 మంది హాజరయ్యారు.
ఫిబ్రవరి 27న హోంల్యాండ్ సెక్యూరిటీ, స్టేట్ సెక్రటరీలకు రాసిన లేఖలో, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ వైట్, జాతీయ ప్రయోజనాలు, రోగులకు జరిగే హానిని ఉటంకిస్తూ, వైద్యులకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
“మన అమెరికా రోగులకు వైద్యం అందించడానికి, ఈ వైద్యులు ఇక్కడే కొనసాగేందుకు వీలుగా వారికి మద్దతు ఇవ్వడం, మార్గాలను విస్తరించడం చాలా ముఖ్యం” అని డాక్టర్ వైట్ రాశారు.
ఒక వైద్యుడిని బదిలీ చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో 900 మంది రోగులకు సరైన వైద్య సంరక్షణ అందకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు.
వెనిజులాకు చెందిన ఫ్యామిలీ ఫిజీషియన్, ఎజెక్వియెల్ వెలిజ్, యూటీ హెల్త్, రియో గ్రాండే వ్యాలీలో 2025 సంవత్సరానికి ‘రెసిడెంట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన కొన్ని నెలలకే నూతన వీసా విధానం రావడంతో ఆయన ప్రస్తుతం పని చేయలేకపోతున్నారు.
“నేను ప్రాసెసింగ్ నరకంలో చిక్కుకుపోయాను” అని 32 ఏళ్ల డాక్టర్ వెలిజ్ అన్నారు. “నా రోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురవడం అత్యంత బాధాకరమైన విషయం” అని ఆయన అన్నారు.
అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగానికి రాసిన లేఖలో, అతని మాజీ సూపర్వైజర్ జోస్ కానో, “డాక్టర్ వెలిజ్ రియో గ్రాండే వ్యాలీలోని రోగులకు అద్భుతమైన, ఓర్పుతో వైద్యాన్ని అందిస్తున్నారు” అని పేర్కొన్నారు.
డాక్టర్ వెలిజ్ రోగులు చికిత్సా ప్రణాళికలను పాటించారని, అపాయింట్మెంట్లకు క్రమం తప్పకుండా హాజరయ్యారని డాక్టర్ కానో అన్నారు.
అంతేకాకుండా, రెసిడెంట్ దరఖాస్తుదారులను సమీక్షించే కమిటీలో డాక్టర్ వెలిజ్ పనిచేశారని, రాష్ట్ర నాయకత్వ కార్యక్రమానికి ఎంపికైన 20 మంది యువ వైద్యులలో ఆయన కూడా ఒకరని డాక్టర్ కానో తెలిపారు.
అమెరికన్ వైద్య కళాశాలలు తగినంత మంది వైద్యులను తయారు చేయడం లేదు.
అధికారిక సమాచారం ప్రకారం, ఈ జూలైలో ప్రారంభమయ్యే రెసిడెన్సీ స్థానాలకు 41,000 ఖాళీలు ఉండగా, అమెరికా వైద్య కళాశాలల నుంచి కేవలం 32,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
ఈ లోటును పూరించడానికి కఠినమైన పరీక్షలు, తనిఖీల తర్వాత- సుమారు 7,000 మంది విదేశీ వైద్యులను ఎంపిక చేశారు.
వారు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, వారిలో చాలామంది కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వెనుకబడిన ప్రాంతాలలో ఉద్యోగాలు పొందుతున్నారు.
అమెరికా ఆరోగ్య వ్యవస్థపై పెనుభారం..
60 శాతానికి పైగా విదేశీ వైద్యులు ఫ్యామిలీ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగాలలో పనిచేస్తున్నారు.
ఇతర స్పెషాలిటీలతో పోలిస్తే అధిక పనిభారం, తక్కువ జీతం కారణంగా అమెరికన్లు తరచుగా ఈ రంగాలకు దూరంగా ఉంటారు.
“అంతర్జాతీయ వైద్య పట్టభద్రులు మన దేశానికి ఉన్న ఒక కీలకమైన అవసరాన్ని తీరుస్తున్నారు” అని పెద్దలకు చికిత్స చేసే ప్రాథమిక సంరక్షణ వైద్యులైన ఇంటర్నిస్టులకు ప్రాతినిధ్యం వహించే అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ బోర్డ్ ఆఫ్ రీజెంట్స్ ఛైర్ డాక్టర్ రెబెక్కా ఆండ్రూస్ అన్నారు.
“ఈ వైద్యుల రాకకు ఆటంకం కలిగించడం వల్ల మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులలో పడుతుంది” అని డాక్టర్ ఆండ్రూస్ అన్నారు.
ఏటా సుమారు లక్ష మంది రోగులకు ప్రాథమిక సంరక్షణ అందించే సౌత్‌వెస్ట్ ఫ్లోరిడాలోని ఫ్యామిలీ హెల్త్ సెంటర్స్‌లో, సగం మంది వైద్యులు విదేశాలలో జన్మించినవారేనని, వారిలో కొందరు నిషేధిత దేశాలకు చెందినవారని ఆ నెట్వర్క్ ఉపాధ్యక్షుడు డేవిడ్ కోస్టర్ తెలిపారు.
“వారు పని చేయలేకపోతే లేదా మనం కొత్తవారిని నియమించుకోలేకపోతే మన పరిస్థితి దుర్భరం అవుతుంది” అని ఆయన అన్నారు.
“ఈ రోగులలో చాలామంది అత్యవసర విభాగాలను నింపేసి, ఆసుపత్రులపై భారం మోపుతారు.”
అగమ్యగోచరంగా వైద్యుల భవిష్యత్తు
నిషేధిత దేశాలకు చెందిన, త్వరలో వీసాల గడువు ముగియనున్న వైద్యులు రాబోయే పరిణామాలకు సన్నద్ధమవుతున్నారు.
వారిలో ఒకరైన ఇరాన్‌కు చెందిన వైద్యుడు కస్రా మోయిన్, ఓక్లహోమా విశ్వవిద్యాలయంలో గుండె జబ్బులు, వృద్ధాప్యంపై నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నిధులతో పరిశోధన చేస్తున్న ఒక చిన్న బృందంలో ఉన్నారు.
డాక్టర్ మోయిన్ ఈ ప్రాజెక్టుకు గణనీయమైన తోడ్పాటు అందించారని ఈ అధ్యయనానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ ఆండ్రూ గార్డనర్ అన్నారు.
లిబియాకు చెందిన మరో వైద్యుడు ఫైసల్ అల్ఘౌలా, ఇండియానాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రెండు ఆసుపత్రులలో మాజీ సైనికులతో సహా 960 మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
అతను 2019లో అమెరికాకు వచ్చాడు. నెబ్రాస్కాలోని క్రైటన్ యూనివర్శిటీ ఆసుపత్రిలో చీఫ్ రెసిడెంట్ స్థాయికి ఎదిగిన తరువాత, అతను మిన్నెసోటాలోని రోచెస్టర్‌లోని మే క్లినిక్‌కు వెళ్ళాడు.
అక్కడ అతను పల్మనాలజీ, క్రిటికల్ కేర్‌లో మూడు సంవత్సరాల శిక్షణను పూర్తి చేశాడు.
డాక్టర్ అల్ఘౌలా ఇండియానా ప్రాంతం నలుమూలల నుంచి ఊపిరితిత్తులపై అనుమానాస్పద మచ్చలతో తన వద్దకు పంపబడిన రోగులను అంచనా వేసి, తగిన చికిత్స, శస్త్రచికిత్సను నిర్ణయిస్తారు.
కీమోథెరపీ పర్యవేక్షణ, ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్న, గుండె వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు సేవలు అందిస్తాడు.
అయితే, అసాధారణ సామర్థ్యం ఉన్న వ్యక్తులకు జారీ చేసే అతని ఓ-1 వీసా సెప్టెంబర్ 6న గడువు ముగుస్తుంది. అతని గ్రీన్ కార్డ్ దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, వీసా గడువు ముగియగానే అతను పని చేయడం మానేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వీసా పొడిగింపు చేసేలా ఒత్తిడి చేయడానికి అతను కోర్టులో కేసు వేశాడు.
“నా జీవితం స్తంభించిపోయింది” అని అతను వాపోతున్నాడు. అమెరికాలో పుట్టిన 3, 4 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లల తండ్రి. “నేను లీజును పునరుద్ధరించాలా వద్దా? నేను వేరే దేశంలో ఉద్యోగం చేయాలా వద్దా?” అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఆయనకు కెనడా నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ వైద్యుల కొరత ఉన్న, ప్రస్తుతం పనిచేస్తున్న ఇండియానా(అమెరికా)లోనే ఉండటానికి ఇష్టపడతానని చెప్పాడు.
“నన్ను క్షుణ్ణంగా పరీక్షించారు. నేను లిబియా దేశస్థుడను కావడం వల్ల నా నుంచి అమెరికాకు అధిక ప్రమాదం ఉందని ఇప్పుడు చెబుతున్నారు” అని చింతిస్తున్నాడు.
గమనిక: న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మిరియం జోర్డాన్ రాసిన వ్యాసానికి స్వేచ్ఛానువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
