హైదరాబాద్: విచ్చలవిడిగా సుంకాలు విధించే హక్కు అమెరికా అధ్యక్షుడికి లేదంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీని మీద డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, యావత్ అమెరికా ఆర్థిక వ్యవస్థ– ఆర్థిక, పరిపాలనాపరమైన సంక్షోభానికి గురవుతుందని హెచ్చరించారు.
తన వాదనను ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడిస్తూ, “ఒకవేళ సుప్రీంకోర్టు ఆ రకమైన నిర్ణయానికి వస్తే, ఇప్పటికే అదనపు సుంకాల రూపంలో వసూలు చేసిన లక్షల కోట్ల డాలర్లు తిరిగి చెల్లించాల్సి వస్తుంది. ఆచరణలో ఇది అసాధ్యమైన విషయం”అని ట్రంప్ అన్నారు.
“మొత్తం గజిబిజిగా తయారవుతుంది. అంతంత మొత్తాలను ఇప్పుడు దేశం తిరిగి చెల్లించే స్థితిలో లేదు”అని ట్రంప్ స్పష్టం చేశారు.
సుంకాల ద్వారా సేకరించిన నిధులను తిరిగి చెల్లించాల్సి వస్తే అవే వేలా కోట్ల డాలర్లు అవుతాయని, అటువంటి చర్యలు ఆర్థిక వ్యవస్థపై చూపించే విస్త్రృత ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటే– ఈ నష్టం లక్షల కోట్ల డాలర్ల మేర ఉంటుందని పేర్కొన్నారు.
నిర్ధారణకే కొన్నేళ్లు..!
“ఏ కారణాలతోనైనా సుప్రీంకోర్టు అమెరికా విధించే సుంకాలను నిలువరిస్తే, ఇప్పటి వరకు సుంకాల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల డాలర్లు తిరిగి చెల్లించాల్సి వస్తుంది”అన్నారు.
అంతేకాకుండా, పెట్టుబడి ఆధారిత వ్యయాలను లెక్కలోకి తీసుకుంటే ఈ భారం మరింత పెరుగుతుందన్నారు.
“అమెరికా విధించిన అదనపు సుంకాల భారాన్ని తప్పించుకోవడానికి వివిధ కంపెనీలు, దేశాలు కొత్తగా నిర్మించ తలపెట్టిన– ప్లాంట్లు, ఫ్యాక్టరీలు, కొనుగోలు చేయదల్చుకున్న యాంత్రలు, వనరులను తిరిగి చెల్లించాల్సిన జాబితాలో చేర్చడం లేదు”అని అన్నారు.
ఇవన్నీ కలుపుకుంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని హెచ్చరించారు.
ఈ తిరుగు చెల్లింపులు ఎవరికి ఎంతని నిర్ధారించడానికే కొన్నేళ్ల గడువు పడుతుందన్నారు. సుంకాలు విధించే హక్కు– అమెరికా జాతీయ శక్తికి నిదర్శనమని, దీనిని సవాలు చేస్తే అంర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
తన పోస్టును ముగిస్తూ, అమెరికా ధగధగలాడుతుంటేనే ప్రపంచం కూడా ధగధగలాడుతుందని సెలవిచ్చారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
