
దరీ దాపులు లేని
సాంత్వనల సామ్రాజ్యపు ఆవలకు
బెరుకు, దిగులు లేని
సంఘీభావ సమూహ సాంగత్యంలో
ఎకాఎకిన ఓదార్పు తోరణ
తేరులపై బయలుదేరి
ఒకే ఒక్క ఆశల ఆధార వెనుగర్రతో
కలిసి పయనిస్తున్న గమనమిది
గోరంత ఓర్పుల చమురు దీపపు వెలుగులో
దారంతా ప్రేమామృత ధారలు చిలుకుతూ
చల్లని గాలి వాహనంలో
అమాంతం పైకెగిరి,
వెచ్చని వాయు మేఘాలలో
ఆకస తలంలో తేలియాడుతూ
తటాలున కిందకు జారుతూ
ధబేల్మని నీటిలో పడి
మళ్ళీ ఉవ్వెత్తున పైకెగసి
చురుకైన చూపులతో ఈదులాడే
పిట్టలకే ఈర్ష్య కలిగేట్టు
సొంత జీవనాన్ని, జీవికను
జాగరూకతతో కాపాడుకుంటూనే
మెళకువల నేర్పుతో
నిరంతరం నీటిలో
హాయిగా మునిగి తేలే
చేపలనే చకితుల్ని చేసేట్టు
భూతలంపైన
జోరుగా కలిసిమెలిసి పరిగెత్తే జింకలు,
పులులనే అప్రతిభుల్ని చేసేట్టు..
మహోన్నత లక్ష్యం వైపు
మనుగడకై సాగుతూ..
దివా సంధ్యా తీరంలోన రేరాజు
చల్లదనాన్ని విత్తనాలుగా చల్లే
వ్యవ’సాయ’పు క్షేత్ర కళకు అబ్బురపడుదాం
నిత్య చైతన్య కృషీవలుల
సహానుభూతుల
విశాల హృదయాలని
గాఢంగా హత్తుకుందాం
ఐక్యతా స్వర్గ సంగీతాలకు
డప్పులు, గజ్జెలతో నర్తిద్దాం
అసమానతల నరకాలకు
చరమ గీతం పాడుదాం
సమున్నత ఆశయాల సాధనకై
మూడో ప్రపంచాన్ని కలలోనే గాక
నేలపైనే సృజిద్దాం..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.