ఉత్తర భారత రాజకీయ ముఖచిత్రం మారబోతున్నదా? రాజకీయ రంగస్థలం నుంచి ముఖ్యపాత్రలు తెరవెనకకు వెళ్తున్నాయా? సమీప భవిష్యత్తులో సరికొత్త తరహా రాజకీయ స్వరం వినిపించే సూచన ఉందా? ఈ తరహా సందేహాలు వ్యక్తమవుతున్న సందర్భం ఇది.
1992 నుంచి 2014 వరకు యూపీ, బీహార్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన ముగ్గురు ముఖ్యమంత్రులు తమదైన ముద్రను వేశారు.
ఉత్తరప్రదేశ్ నుంచి మాయావతి బహుజన సమాజ్ పార్టీ రాజకీయ భావజాలాన్ని దేశవ్యాప్తం చేయడానికి ప్రయత్నించారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రయత్నం చేశారు.
బీహార్ నుంచి లాలూ యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరూ జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసినవారే.
వీరు నిన్నా మొన్నటి వరకు ప్రధాన స్రవంతి రాజకీయాలలో అగ్ర పాత్ర పోషించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే రాజ్యసభకు వెళ్లారు. ఇదొక చారిత్రకమైన మలుపు.
రాజకీయాన్ని తలకిందులు చేసిన నాయకులు..
పైన పేర్కొన్న ఈ ముగ్గురు రాజకీయ నాయకులు 1980కు ముందు నాటి రాజకీయాన్ని తలకిందులు చేసినవారు.
సోషలిస్టు తరహా ఆలోచనలతో లాలూ, నితీష్ వచ్చారు. బీహార్ ద్వయంగా వీరికి పేరున్నది.
“సమోసాలో ఆలూ – బీహార్‌లో లాలూ” ఈ ప్రాస పంచ్ డైలాగ్‌లతో తన రాజకీయ ఉనికిని, అస్తిత్వాన్ని బలంగా వ్యక్తీకరించిన నాయకుడు లాలూ. తనదైన వేషధారణ, తన చర్యలు, చివరికి దాణా కుంభకోణం వరకు ప్రతీదీ ఒక సంచలనమే.
ఆయన నుంచి విభేదించి బయటకు వచ్చిన నితీష్ జేడీయూ ఏర్పాటు చేశారు. బీహార్‌కు తిరుగులేని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.
అధికారం కోసం ఎవరితోనైనా పొత్తులకు వెనుకాడలేదు. ఒకానొక సందర్భంలో దేశ ప్రధానమంత్రి అభ్యర్థి తానేనని చెప్పుకున్నారు.
బీజేపీ, నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు పెను దుమారం కలిగించాయి.
అదే నాయకుడు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు. బహిరంగ సభా వేదికపై మోదీ కాళ్లపై పడి ఆశీర్వాదమూ తీసుకున్నారు.
దాణా కుంభకోణం తర్వాత లాలూ జైలు జీవితం భారత రాజకీయాలలో ఒక చర్చనీయాంశం.
అనంతరం ఆయన అనారోగ్యం కారణంగా పార్టీ వారసుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
గత రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆయన వారసుడు చాలా వెనుకబడి ఉన్నాడు.
బహుజన రాజకీయ ఎజెండాను విస్తృత పరిచిన కాన్షీరాం..
1980ల్లో మాన్యవర్ కాన్షీరాం బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావానికి పునాది వేశారు. దేశ వ్యాప్తంగా పర్యటించారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆచరణ ఎట్లా ఉంటుందో చూపించారు. ఓటును తిరుగులేని ఆయుధంగా మలుచుకున్న నాయకుడు. తాను ముఖ్యమంత్రి కాలేదు కానీ, మరొకరికి ఆ అవకాశం ఇచ్చారు.
బహుజన రాజకీయ ఎజెండాను మరింత విస్తృత పరిచారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్లలో బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతా దళ్ యునైటెడ్ తదితర బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజకీయాలకు ఒక చోదక శక్తిగా ఆయన పని చేశారు.
సంకీర్ణ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల శక్తి ఏమిటో బహిర్గతమైన కాలం 1990 నుంచి నేటి వరకు కనిపిస్తున్న ఒక రాజకీయ చిత్రం. జయ ప్రకాశ్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా రాజకీయ ప్రభావాలతో బీసీలు ఒక బలమైన రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇదంతా బహుజన రాజకీయ విస్తరణ కాలంగా చెప్పవచ్చు.
మిణుకుమిణుకుమంటున్న ప్రాంతీయ పార్టీలు..
2014 తర్వాత భారతీయ రాజకీయాలలో పెను మార్పులు వచ్చాయి. ఇదే సందర్భంలో సామాజిక మాధ్యమాల విజృంభణ మరొక అంశం.
భారతీయ రాజకీయాలలో మునుపెన్నడూ బలంగా లేని చర్చనీయాంశాలు తెరపైకి వచ్చాయి. ప్రాంతీయ పార్టీలు చాలా రాష్ట్రాల్లో తమ ప్రభను మెల్లమెల్లగా కోల్పోతున్నాయి.
ఎన్సీపీ, శివసేన, జేడీఎస్ తదితర పార్టీల స్థితిగతులు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతీయ పార్టీలు మిణుకుమిణుకుమంటూ తమ ఉనికిని వ్యక్తీకరిస్తున్నాయి. ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు అనివార్యమయ్యే పరిస్థితి వచ్చింది.
దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎట్లా ఉన్నా యూపీ, బీహార్లు మాత్రం తమదైన రాజకీయ చైతన్యాన్ని గతంలో కనబరిచాయి.
ఈ మధ్య కాలంలో పతాక శీర్షిక వార్తగా కాకపోయినా కనీసం లోపలి పేజీలో వార్తగా కూడా మాయావతి, లాలూ కనిపించడం లేదు. ఇది భారతీయ వర్తమాన దృశ్యం.
కొద్దిమంది నాయకులను వారి గత ఆచరణ, భవిష్యత్తు అంచనాతో వ్యక్తం చేస్తున్న అభిప్రాయం మాత్రమే ఇది.
మెల్లగా తెర వెనక్కి..
కొత్తతరం, కొత్త రాజకీయ ఆలోచనలను గత తరం నాయకులు అందుకోలేకపోతున్నారు. ఒకప్పుడు తారాజువ్వల్లా వెలిగిన వాళ్లు స్వయం కృతాపరాధం వల్లనో కాల ప్రవాహాన్ని అందుకోలేని కారణంగానో తెర వెనక్కి వెళ్లిపోతున్నారు. మూడు దశాబ్దాల కిందటి రాజకీయ సంచలనాలుగా మిగిలిపోతున్నారు.
బహుజన ఎజెండాను భారతీయ రాజకీయాలలో చర్చనీయాంశంగా చేసిన వారు, సరికొత్త భావ ధారను ప్రసరింపజేసిన వారు భవిష్యత్తు భరోసాను ఇవ్వలేకపోతున్నారు.
అయితే బహుజన రాజకీయాల ఎజెండా అట్లాగే ఉన్నది. ఆయా సమూహాల రాజకీయ అవకాశాల చర్చ అట్లాగే ఉన్నది.
ముగ్గురూ బలీయమైన ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. అందులో మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ గతంలోనే మాజీ సీఎంలయ్యారు. తాజాగా నితీశ్ మాజీ సీఎం అయ్యారు. నేడు ఎంపీగా రాజ్యసభలో ఉన్నారు. ముగ్గురూ మాజీ ముఖ్యమంత్రులే. ఒకప్పటి సంచలన నిర్ణయ రాజకీయ కేంద్రాలే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
