భారతీయ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకున్న వారు అతికొద్ది మంది. వారిలో తొలుత చెప్పాల్సిన పేరు మహాత్మా జ్యోతిరావుఫూలే.
ఈ మహనీయున్ని ఆదర్శంగా తీసుకున్న ప్రపంచ మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్.
మన దేశ నిచ్చెన మెట్ల కులవ్యవస్థ- ఆర్థిక, సామాజిక నిర్మాణ మూలాన్ని కనుగొన్నవారు వీరు. అంతేకాదు, దానికి విరుగుడును చూపించారు.
ఈ మహనీయుల దారిలో నడుస్తోన్న వారే “సఫాయి- ఫూలే, అంబేద్కర్ సిపాయి” సత్తయ్య సర్.
పారిశుద్ధ్య కార్మికుల గురించి సాధారణంగా ఎవరూ పట్టించుకోరు.
ఒకవేళ, వారే చరిత్ర నిర్మాతలైతే.. వారి వైపు తలెత్తి చూడక తప్పదు.
ఇంతటి కార్యాన్ని హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్న వారు సత్తయ్య సర్.
తను చదువుకోలేదు. ప్రజాస్వామ్య సూత్రాలు, ఆర్థిక సిద్ధాంతాలు, గతి తార్కిక భౌతిక వాదాలు ఆయనకు తెలియదు.
తెలిసిందల్లా సర్వజన సమానత్వ విలువల పాటింపు. తాను చేయడమే కాదు, రాబోయే తరాల చేత ఆచరింప యత్నిస్తున్నారు.
ఇందుకు కేంద్రంగా PACPET(Phule Ambedkar Center for Philosophical and English Training) నిర్వహిస్తున్నారు.
ఈ PACPET సంస్థ ఏర్పడి నాలుగేళ్లు నిండి ఐదోయేట అడుగిడుతున్నది.
ఈ సందర్భంగా సత్తయ్య సర్ చేసిన ప్రయత్నాన్ని, సాధించిన ఫలితాన్ని గుర్తు చేయడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.
దేశ భవిష్యత్తుకు దారిదీపంగా..
సత్తయ్య సర్ది రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామం. ఈయన వృత్తి రీత్యా పారిశుద్ధ్య కార్మికుడు. కొన్నాళ్ల కిందటి వరకు వందలాది మంది కార్మికుల నాయకుడు.
అయినప్పటికీ, తనకు ఉన్నత విద్య దక్కలేదు- కారణం కుటుంబ స్థితిగతులు. దీన్ని బద్దలుకొట్టి తనలాంటి వారు జీవితంలో పైకి ఎదగాలని కోరుకున్నారు.
ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఫూలే అంబేద్కర్ తాత్త్విక ఇంగ్లీషు బోధన సంస్థ. ఇది దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు టార్చ్‌బేరర్ అయ్యింది.
జీవితంలో ఎదగాలని కలలుగనే వారి ఆలోచనలకు ఆచరణను ఈ సంస్థ జోడిస్తున్నది. తాను చదువుకోకున్నా ఎంతో మంది చదువరులకు జీవిత పాఠాన్ని బోధిస్తున్న అధ్యాపకుడీయన. విశ్వవిద్యాలయాల్లో పట్టాలు తీసుకున్న వాళ్లు, ప్యాక్పెట్లో శిక్షణ పొంది- సరికొత్త జ్ఞానాన్ని పొందుతున్నారు.
ఒకరిద్దరని కాదు, ఫలాన కులం- మతమనీ కాదు. బుద్ధుడు, సంత్ రవిదాస్, ఫూలే, సంత్ గాడ్గే బాబా, అంబేద్కర్ల సామాజిక చైతన్య స్ఫూర్తిని దేశవ్యాప్తం చేస్తున్నారు.

దేశ నలుమూలల నుంచి శిక్షణార్ధులు
ప్రతియేటా మూడు నెలలకు ఒక బ్యాచ్ ఈ సంస్థలో శిక్షణ పొందుతున్నది. ఇంగ్లీషు భాషలో శిక్షణనిస్తారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య గొప్పతనం గురించి చెప్తారు. స్త్రీ- పురుష సమానత్వం, ఆధునిక జీవనరీతులు, చారిత్రక పరిణామ క్రమాన్ని విడమరిచి నిపుణుల చేత చెప్పిస్తారు.
సామాజిక అంశాలు, అంబేద్కర్- ఫూలే తాత్విక చింతనను స్కాలర్ సుదర్శన్ బోధిస్తున్నారు. మణికంఠ అకడమిక్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా ప్రతియేటా రెండు వందల మందిలోపు యువతీయువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కేలా ఈ సంస్థ కృషి చేస్తున్నది. ప్రతియేటా యువతుల కోసం డేటా సైన్స్ ప్రత్యేక శిక్షణను అందిస్తున్నది.
మన దేశంలో ఉత్తరాదికి చెందిన యూపీ, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన అన్ని సామాజిక వర్గాల యువతీయువకులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్వంటి రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల వారూ ఇక్కడ శిక్షణ పొందారు, పొందుతున్నారు.
ఈ సంస్థలోకి శిక్షణార్థులను తీసుకోవడనికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇందులో ఫైరవిలకు తావు లేదు. అంతా ఆన్లైన్ వేదికగా జరుగుతోంది. శిక్షణకు అర్హులైన వారికి మూడు పూటల పౌష్టిక ఆహారాన్ని అందిస్తారు. అంతేకాదు, సౌకర్యవంతమైన ఉచిత వసతిని అందిస్తున్నారు. భారతీయ సమాజం- దాని దశాదిశ, ప్రజాస్వామ్య భావన తదితర అంశాలపై ఇక్కడ బోధిస్తున్నారు.
ప్రేరణనిచ్చిన గద్దర్
తాను సంపాదించిన దాంట్లో ఫూలే, అంబేడ్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు ప్రేరణ ఇచ్చినవారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రజా గాయకుడు గద్దర్ అని సత్తయ్య సర్ చెపుతారు. మన దేశంలో భిన్న సామాజిక వర్గాలు, భిన్న జీవనరీతులు ఉన్నాయి. పరస్పరం ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో తమ సంస్థ ఈ తరానికి బోధిస్తున్నదని అంటున్నారు ఈ పారిశుద్ధ్య ప్రొఫేసర్.
అంతేకాదు, భారత రాజ్యాంగం దాని ఆవశ్యకత గురించి విస్త్రృతంగా జనబాహుళ్యంలో చర్చకు పెట్టాల్సిన అనివార్యత ఉన్నదనే అంశాన్ని ఈ సంస్థ చెప్పకనే చెప్తున్నది.
ఐఏఎస్, ఐపీఎస్‌లాంటి అఖిల భారత సర్వీస్‌లకు శిక్షణ పొందాలనేవారికి దిక్సూచిలాంటిది ఈ ప్యాక్పెట్. కరోనా కాలంలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులకు రోజుల తరబడి ఉచితంగా పౌష్టిక ఆహారాన్ని సత్యయ్య సర్ అందించారు.
మానవతకు ప్రతిబింబం
పరులకష్టాల్లో భాగం పంచుకోని వారిని ఓదార్చడం అందరూ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అంటారు. తానేర్పాటు చేసిన బువ్వ బండి ద్వారా ఇప్పటికీ వందల మంది తెల్లాపూర్ చౌరస్తాలో మిల్లట్ అల్పాహారాన్ని ఉచితంగా పొందుతున్నారు.
జ్ఞానం ద్వారా సమాజం మారుతుందని కేవలం మాటల ద్వారానే కాదు, చేతల ద్వారా సత్యయ్య సర్ చూపిస్తున్నారు. “ఈ సఫాయి ఫూలే- అంబేద్కర్ సిపాయి”అని దేశవ్యాప్త ఆయన అభిమానులు, శిష్యులు, కార్మికులు ప్రేమగా చెప్పుకుంటారు.
ఈ నెల 26కు నాలుగు సంవత్సరాలు పూర్తై ఐదేళ్లలోకి సంస్థ అడుగిడుతుంది. ఈ చైతన్యం మరింత ముందుకు వెళ్లాలని కోరుకుందాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
