హైదరాబాద్ ఒక అద్భుతానికి కేంద్ర స్థానం కాబోతున్నది. దానికి కారణం ఫుట్‌బాల్ మ్యాచ్. దీనికి మరో గ్లామరెస్ యాంగిల్ మెస్సీ. కోటానుకోట్ల ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈ ఆటగాని మ్యాచ్-మిస్ మ్యాచ్ అనొచ్చేమో..! ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు లేకపోలేదు.
ఆయనతో ఫొటో దిగితే పది లక్షలటా! దిగాలనుకున్నవారు ఎందరో!? అవకాశం దొరకకా దిగులుపడే వారు మరెందరో! ఒక్క ఫొటోకు.. ఒకే ఒక్క ఫొటోకు పది లక్షలా..! ఒక విద్యార్థి తన జీవిత గమ్యాన్ని చేరుకునేందుకు బహుశా వెచ్చించే మొత్తమిది.
అభిమానం తప్పు కాదు. కొంత మొత్తం వెచ్చించడమూ తప్పు కాదు. మనం ఏ సమాజంలో జీవిస్తున్నాము. ఎవరి ఆధారంగా బ్రతుకుతున్నాము. ఏ రక్షణ కవచాల మధ్య భద్రతను పొందుతున్నామనే విషయాలను గమనంలో ఉంచుకోవాలి. ఈ నేపథ్యం ఆధారంగా మెస్సీతో ఫొటో పది లక్షలు..! ఎంతటి విచిత్రం?.
అత్యంత అరుదైన చారిత్రాత్మకాంశం దృశ్యావిష్కరణకు తెలంగాణ వేదిక. వ్యాపారాత్మకత కంటే సమాజహితాన్ని కోరుకున్న నేల ఇది. కష్టాల కాలంలోనూ సాటి వారి కోసం పరితపించిన ప్రాంతమిది. కాల మార్పో, ప్రపంచీకరణ ప్రభావమో తెలియదు కానీ మనల్ని మనం తడిమి చూసుకునే సమయ సూచిక ఈ మెస్సీతో ఫొటోకు పది లక్షలు.
ఇదో ప్రత్యేకత
1880ల నుంచి 1948ల వరకు తెలంగాణ సమాజం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. తనను తాను నిలబెట్టుకున్నది. సరికొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు కేంద్రబూతమైంది ఆ కాలం. ఈ కాలంలోనే కడు పేదల కష్టాలను చూసిన ప్రభువులూ ఉన్నారు. పేదల కష్టాన్ని కొల్లగొట్టిన సామంతులూ ఉన్నారు. ఈ నేలకున్న ద్వైదీభావమిది.
కాల పరిణామక్రమంలో చాలా మార్పులు వచ్చాయి. ముందుముందు వస్తాయి కూడా. ఈ మార్పులో భాగమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆత్మగౌరవ ఆవిష్కరణ. 2014 ముందు తెలంగాణ వేరు అనంతరం తెలంగాణ నిలదొక్కుకున్న తీరు వేరు. గతానికి భిన్నంగా చాలా సమాజాలు మారాయి, మారుతున్నాయి. తెలంగాణ తన ఉనికి అస్తిత్వం విషయంలో నేటి వరకు రాజీ పడలేదు.
ఇప్పుడు మరో అడుగు ముందుకు..
కాకతీయుల పరిపాలన విదిశ వరకు దక్షిణాపథసాంతం విస్తరించి ఉన్నది. ఆ రాజవంశపు పతనాంతరం చాలా మార్పులు వచ్చాయి.
ఇంజనీరింగ్‌లో కాకతీయులది తిరుగులేని ప్రతిభ. దేశ విదేశాలకు ఇక్కడి నుంచి పచ్చళ్లు, ముత్యాలు, పగడాలు, బియ్యం ఎగుమతి అయ్యాయి. ఆనాటికి ఈ విధమైన పురోగతి సాధించిన సామ్రాజ్యం లేదు. వైద్యం, పరిపాలన, వ్యవసాయ రంగాలలో ప్రపంచరికార్డు కాకతీయులదే.
మళ్లీ వేయేళ్ల తర్వాత ఎగుమతుల, పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా తెలంగాణ నిలబడుతూ ఉన్నది. అంతేకాదు, మనదేశంలోని చాలా రాష్ట్రాల కడుపేదలను అక్కున చేర్చుకుంటున్న నేల కూడా తెలంగాణే. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక చర్యలు సామాజిక, ఆర్థిక, మేధోపర రంగాలలో తెలంగాణను ముందడుగు వేయించాయి.
మెస్సీతో ఫొటోకు పది లక్షలు..! ఆపరేషన్ పోలో తెలంగాణ గతిని మార్చిన ఆట.
1940- 70ల మధ్య అంతర్జాతీయ ఖ్యాతిగంచిన ఆటగాళ్లు, జర్నలిస్టులు హైదరాబాద్‌లో ఉండేవారు. మహాపండితులకు, విధ్వంసులకు కేంద్రస్థానం తెలంగాణ. చరిత్ర తనను తాను మార్చుకుంటూ అనివార్యంగా తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఎన్నో కష్టాలను, బాధలను భరించిన ఈ ప్రాంత ప్రజలు సరికొత్త చరిత్ర ఆవిష్కరణకు పూనుకుంటున్నారు. రాదానుకున్న తెలంగాణ వచ్చింది. విశ్లేషకుల అంచనాకు అందని తీర్పునిచ్చి రేవంత్‌ను ముఖ్యమంత్రి చేశారు తెలంగాణ ప్రజలు.
ఇవన్నీ బాగానే ఉన్నా, ఈ నేలను నిరంతరం చైతన్యం చేస్తున్న సగటు జీవి రాలిపోతున్నాడు. రైతు ఆగమవుతున్నాడు. గిట్టుబాటు ధర లేదని కాడెద్దులు ఏడుస్తున్నాయి. భవిష్యత్తుకు భరోసా లేదని కొందరు విలపిస్తున్నారు.
చాలా మార్పు వచ్చిన మాట వాస్తవమే కానీ రావాల్సినంతగా రాలేదని పచ్చి నిజం. మనుషులలో చైతన్యం, నూతనాలోచనల ఆవిష్కరణ, జరగాల్సి ఉన్నది. దీనికి ప్రభుత్వాలు పూనుకోవాల్సి ఉన్నది. తనదైన ప్రత్యేకతను తెలంగాణ పునరుజ్జీవింప చేసుకోవాల్సి ఉన్నది. ఆత్మీయానుబంధాలు, సరికొత్త ఆర్థికాభివృద్ధి నమూనాతో అల్లుకోవాల్సిన అనివార్యతా ఉన్నది.
“తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం” ఇది పెద్దల మాట. మెస్సీతో ఫొటో పది లక్షలు సంతోషం. మన పక్కనే ఉండి, మన నేలపై దిక్కులేక అల్లాడుతున్న దీనులతో ఫొటో అవసరం లేదు. వాటిని పట్టించుకుంటే సరిపోతుంది. ఇది ప్రభుత్వానిదే కాదు, మనందరి బాధ్యత. ఆఖరి మనిషీ ఆనందంగా ఉంటేనే మెస్సీతో ఫొటో పక్కా మ్యాచ్ అవుతుంది, లేకుంటే..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
