“ప్రతి నౌక రాకపోకల వ్యవహారం దేనికదే విడి ఘటన”అని ఫైనాన్షియల్ టైమ్స్‌కు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తెలియజేశారు.
న్యూఢిల్లీ: హర్ముజ్ జలసంధి ద్వారా భారత నౌకలు ప్రయాణించడానికి ఏర్పాట్లపై టెహ్రాన్‌తో ఇంతవరకు న్యూఢిల్లీ ఎలాంటి గుండుగుత్త ఒప్పందం కుదుర్చుకోలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలియజేశారు.
దీనికి బదులుగా ఆ మార్గం ద్వారా వెళ్లాలంటే ప్రతి నౌకకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
తనపై ఇజ్రాయెల్-అమెరికా దాడికి స్పందించి, ప్రపంచంలో ఐదవ వంతు ఇంధన రవాణా జరిగే కీలక జలమార్గాన్ని ఇరాన్ మూసివేసింది.
హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రవాణాను పునరుద్ధరించడానికి ఇరాన్‌తో సమర్థవంతమైన దౌత్యమే అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో జయశంకర్ నొక్కిచెప్పారు.
టెహ్రాన్‌తో చర్చల వల్ల భారత జెండాలున్న రెండు గ్యాస్ ట్యాంకర్లను జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించారని కూడా జయశంకర్ తెలియజేశారు.
ఎల్పీజీ ట్యాంకర్ ‘శివాలిక్’ హర్ముజ్ జలసంధిని దాటి ఈ రోజు గుజరాత్‌లోని ముంద్రా రేవుకు చేరుకుంటుందని కథనాలు తెలియజేస్తున్నాయి.
అయితే ఉదాహరణకు బంగ్లాదేశ్, చైనా సాధించినట్టుగా, భారత జెండాలున్న అన్ని నౌకలకు వర్తించే విధంగా ఎలాంటి ఒప్పందం లేదు.
భారత జెండాలతో ఉన్న నౌకల కోసం ఇరాన్‌తో “గుండుగుత్త ఏర్పాట్లు” ఏవీ లేవని జయశంకర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా, “ప్రతి నౌక కదలిక దేనికదే విడి ఘటనగా జరుగుతోందని” ఆయన అన్నారు.
ఈ మార్గాన్ని తిరిగి పునరుద్ధరించడానికి యుద్ధనౌకలను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
సహాయం చేయడానికి నిరాకరించిన దేశాలను తాను మర్చిపోలేనని ఆయన చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇది జరిగింది.
దేశీయ కొరతతో తీవ్ర ఆందోళన చెందుతున్న భారత్, యూఏఈతో సహా గల్ఫ్ సహకార మండలి దేశాలపై ఇరాన్ దాడులను ఖండించింది. అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా చేసిన ప్రారంభ దాడులపై అధికారికంగా ఎటువంటి విమర్శలను చేయలేదు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు జరిగిన నాటి నుంచి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో నాలుగుసార్లు జయశంకర్ మాట్లాడారు.
హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల భద్రతపై ఈ చర్చల్లో ఎక్కువగా దృష్టి పెట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం మార్చి 12న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో చర్చించారు.
యుద్ధం మొదలైన తర్వాత నుంచి భారత్-ఇరాన్‌ల మధ్య నాయకత్వ స్థాయిలో సంప్రదింపులు జరగడం ఇదే తొలిసారి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
