
ఏ దేశపు ఆందోళనల వెనుకు ఎవున్నారనే విషయం గురించి ఆలోచించే ముందు ఆయా దేశాల నాయకులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్తించారా లేదానే విషయాల గురించి కూడా ఆలోచించాలి. నెపాన్ని కొంత కాలం పాటు ఇతరులపై నెట్టేయగలం. కానీ ఎల్లకాలం కాదు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ఈ విషయాన్ని నాయకులు గుర్తించాలి.
ప్రపంచ ప్రజాసమూహాం మునుపెన్నడూ లేని కొత్త సమస్యలను నేడు ఎదుర్కొంటున్నది. అందులో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు తొలి వరుసలో ఉన్నారు. మలి వరుసలో మూడో ప్రపపంచ దేశాలున్నాయి. ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలన్నీ దాదాపు భారత ఉపఖండంలోనే ఉన్నాయి.
2022 నుంచి ఉపఖండంలో ఏదో దేశంలో ఏదో ఒక ప్రజా సమూహం వెల్లువలా వీధుల్లోకి వస్తూ ఉన్నది. 1980ల వరకు ఉన్న పరిస్థితులు వేరు, 1999- 20ల తర్వాత ఉన్న రాజకీయ వాతావరణం వేరు. 2010 తర్వాత వచ్చిన మార్పులు మరో తీరులో ఉన్నాయి. సోషల్ మీడియా ప్రవాహం జనబాహుళ్యంలోకి బలంగా ప్రవేశించిన తర్వాత పరిస్థితులు మరింతగా మారాయి. మన కంటే కమ్యూనికేషన్పరంగా ప్రపంచంలో చాలా ముందున్న దేశాల్లో మన లాంటి పరిస్థితులు అక్కడ లేవు. అలాని పూర్తిగా లేవని కాదు. వేర్వేరు రూపాల్లో ఉన్నాయి. వాటి తీవ్రతల్లో కూడా తేడాలున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ దేశాలలోనైనా కూడా ఏదో రూపంలో ప్రభుత్వాలపై ఆయా దేశాల ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
సోషల్ మీడియా ప్రభావం ఇవ్వాల ప్రపంచాన్ని తీవ్రాతి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. రాజకీయ పార్టీల పాలసీలను కూడా అది మారుస్తున్నది.
ఉద్యమాల మీద ప్రభావం చూపిస్తున్న జీవనప్రమాణాలు, నిరుద్యోగం..
సమీప చరిత్రలో ఇంకా మనం మర్చిపోలేని ఒకానొక ఘటన ఈజిప్టు ఉద్యమం. 2010- 11 మధ్యలో ఈజిప్టులో ప్రజా సమూహాం భారీ ఎత్తున ఉద్యమించింది. రాజకీయాల పట్ల, అక్కడి అవినీతి పట్ల ప్రజలు వ్యక్తీకరించిన ఆగ్రహ దృశ్యాలు ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి. హోస్నీ ముబారక్ ప్రభుత్వాన్ని గద్దెదింపింది సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఉద్యమం.
ఆ తర్వాత వాల్ స్ట్రీట్ ఆక్యుపై ఉద్యమం, సోషల్ మీడియా ద్వారానే వచ్చింది. 1980ల్లో పుట్టిన వారి కేంద్రంగా ఈ ఆందోళన జరిగింది. న్యూయార్క్ నగరంలో 2007- 08 మధ్య అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం, దాని పర్యావసనంగా వచ్చిన సమస్యల పరిష్కారం కోసం 1980ల నాటి తరం తీవ్రంగా ఉద్యమించారు. అవకాశాల కోసం, జీవన ప్రమాణాల కోసం వీధుల్లో నినదించారు. ఇది ఈజిప్టులో జరిగిన ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకునే జరిగింది.

భారత ఉప ఖండంలోని దేశాల్లో తొలి సారిగా శ్రీలంకలో 2022లో ప్రజాతిరుగుబాటు వచ్చింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని గొటబాయ రాజపక్ష ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొలేక పోయింది. అందువల్ల అక్కడి ప్రజలు ఏ స్థాయిలో, ఎట్లా ఆందోళన చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ కూడా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. శ్రీలంకలో అధ్యక్షుని కుటుంబ సభ్యులపైనా, నాటి ప్రభుత్వంలోని మంత్రులపైనా ప్రజలు ఎట్లా తమ ఆగ్రహాన్ని వ్యక్తీకరించారో అందరి కళ్ల ముందే ఇంకా ఉంది.
మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వ చర్యల పట్ల అక్కడి ప్రజలు చేసిన ఆందోళన గురించి కూడా ప్రపంచానికి తెలుసు. కొందరు కావాలనే ప్రజలను రెచ్చ గొట్టారని, ఆందోళనల వెనుక ఒకానొక దేశం కుట్ర కూడా ఉందని ఆమె చెప్పారు. ఎవరి కుట్రలు, ఎవరి పాత్ర ఎట్లా ఉన్నా ప్రజలు అంత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసిన సందర్బంలో వినవచ్చిన మాటలు కొన్ని ఉన్నాయి. ఒకటి అవినీతి, రెండోది నిరుద్యోగ సమస్య గురించి.
పైన పేర్కొన్న అన్ని ఉద్యమాల్లో అంతర్లీనంగా ఉన్నది జీవన ప్రమాణాల మెరుగుదల, నిరుద్యోగం. అంటే జీవన భద్రతనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతెందుకు ఇంకా పాకిస్తాన్లో ఆందోళనలు జరుగుతునే ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం పెరుగుతోన్న ద్రవోల్బణాన్ని అరికట్టలేక పోతున్నది. ఆ దేశం ఇంకా సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతున్నది. అక్కడా సోషల్ మీడియా ప్రభావం లేకపోలేదు. ఏ స్థాయిలో ఉందనే విషయం కంటే, ఆ దేశం ఇంకా చాలా విషయాల్లో వెనుకబడే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దేశానికి అమెరికా, చైనా దేశాలు మద్దతునిస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. ఇప్పటికీ ఈ దేశంలో రాజకీయంగా చాలా సమస్యలున్నాయి. వాటికే ఆ దేశం పరిష్కారం చూపించలేక పోతున్నది.

అయితే, తాజాగా నేపాల్‌లో జరుగుతున్న ఘర్షణలూ సోషల్ మీడియా వల్లనే వచ్చాయని చాలా మంది అనుకుంటున్నారు. ఇందులో నిజం ఉంది. కేవలం సోషల్ మీడియాను నిషేధించడం వల్లనే రాలేదు. దాని వెనుక చాలా కారణాలున్నాయి. రాచరిక వ్యవస్థ పోయి, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా జీవితంలో రావాల్సిన మార్పులు రాలేదు. చేయాల్సిన విధంగా నేపాల్‌కు అవసరమైన అభివృద్ధి నమూనాను అక్కడి ప్రభుత్వాలు చేయలేక పోయాయి. అంతేకాదు, ప్రపంచీకరణ అన్ని దేశాల్లో తన ప్రభావాన్ని చూపిస్తున్నది. నేపాల్ కూడా ఆ ప్రభావానికి లోనైంది. అక్కడి జనాభా ఫేస్బుక్, యూట్యూబ్ తదితర వేదికల్లో ఉన్నది. లక్షలాది మంది ప్రజల నిత్య జీవితంలో సోషల్ మీడియా ప్రధాన భాగం అయింది.
నేపాల్‌లో విప్లవం వచ్చి దశాబ్దం పూర్తయినా అక్కడ రావాల్సిన మార్పు రాలేదు. ఆ దేశ చాలా మంది పౌరులు బతుకుదెరువు కోసం భారతదేశానికి వలస వస్తున్నారు. వేరే దేశాలకు కూడా వెళ్తున్నారు. వారంతా తమ వారితో సోషల్ మీడియా ద్వారా కుటుంబంతో అనుసంధానమై ఉన్నారు. అంతే కాదు అక్కడ టూరిజం కూడా సోషల్ మీడియాపైనే ఆధారపడి ఉన్నది. సోషల్ మీడియా బ్యాన్ చేసే వరకల్లా అక్కడి ప్రజల ఉపాధిపై కూడా ప్రభావం చూపించింది. రాజకీయ నాయకుల వారసులు సుఖవంతమైన జీవితం గడుపుతున్నారని, తమ గతేమిటని అక్కడి యువత వేస్తున్న ప్రశ్న.
ఆందోళనలు శాంతియుతంగా ఉంటే మంచిది..
“జనరేషన్ జెడ్” పేరుతో అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. రాజకీ నెపోటిజం అని చెప్పినా, రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడినా పెరుగుతున్న ఆర్థిక అంతరాలు ప్రధానాంశంగా ఉన్నాయి. సాపేక్ష, నిరపేక్ష పేదరికాల అంశం ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వస్తున్నది.
నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీలు తాము చేయాల్సిన పూర్తి స్థాయి కసరత్తు చేయలేక పోయాయనే భావన చాలా మందిలో ఉన్నది. అంతే కాదు, నేపాల్ సమాజాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లేందుకు కొందరు కావాలని మళ్లీ రాచరికం రావాలనే డిమాండ్లు చేస్తున్నారనే చర్చ కూడా ఉన్నది. ప్రభువులు నిరంకుశులు. వారి విలాసాలకు లెక్కలుండవు, పత్రాలూ ఉండవు. తారీఖులు- దస్తావీజులు పరిగణలోకి రాని జనజీవితాన్ని అక్కడి వారు నిజంగా కోరుకుంటున్నారా? 17 ఏళ్ల నేపాల్ ప్రజాస్వామ్య ప్రభుత్వ చరిత్రలో పద్నాలుగు సార్లు ప్రభుత్వాలు మారడం గమనించాల్సిన విషయం.
ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టుల కర్తవ్యాల గురించిన చర్చ ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలో జరుగుతున్నది. కేవలం కమ్యూనిస్టులే కాదు మిగతా పార్టీల్లో కూడా లోపాలు ఉంటే నాయకత్వాల ఆలోచన, కార్యాచరణలో తప్పులంటూ సరిదిద్దుకునేందుకు సిద్ధం కావాలనే పరోక్ష సందేశం కూడా ఈ ఆందోళనల్లో ఉందని చాలా మంది భావిస్తున్నారు.
ఏ దేశపు ఆందోళనల వెనుకు ఎవున్నారనే విషయం గురించి ఆలోచించే ముందు ఆయా దేశాల నాయకులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించారా లేదానే విషయాల గురించి కూడా ఆలోచించాలి. నెపాన్ని కొంత కాలం పాటు ఇతరులపై నెట్టేయగలం. కానీ ఎల్ల కాలం కాదు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ఈ విషయాన్ని నాయకులు గుర్తించాలి.
అయితే, ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న కారణంగా ఇట్లా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కానీ అమెరికా వంటి దేశాల్లో ఎందుకింత స్థాయిలో ఉండటం లేదనే ప్రశ్నకూడా సహజంగానే వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలి. ఉద్యమాల పేరుతో ఆరాచకాలకు తావీవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అనివార్యత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ప్రభుత్వాలు తాము తీసుకున్న నిర్ణయాల సారాంశాలను కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఏ ఆందోళనైనా శాంతియుతంగా ఉంటే మంచిది. ప్రజలు రోడ్లపైకి రాకుండా ప్రభుత్వాలు, నాయకులు వారి సమస్యలను గుర్తెరిగి మసలుకుంటే మరింత బాగుంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.