దేశంలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ‘సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్’ 2025 నవంబర్ 22న యువజన సాహిత్యోత్సవాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లో కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సమూహ నిర్వహించిన యువజన సాహిత్యోత్సవంలో యువత పెద్దెత్తున పాల్గొన్నారు.
ద్వేషాన్ని దేశభక్తిలా; అమానుషాన్ని, నీచ ప్రవృత్తిని జాతీయవాదంలా- సంఘ్ పరివార్, మనువాద శక్తులు చిత్రీకరిస్తున్నాయని సాహితీకారులు, మేధావులు కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య కట్టబడుతోన్న ద్వేషపూరిత గోడలను ప్రేమతో బలంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ద్వేషపూరితకాలంలోనే ప్రజల మధ్య మానవత్వ భావాలను పెంపొందించే ఆవశ్యకత ఎంతైనా ఉందని వక్తలు గుర్తుచేశారు. అంతేకాకుండా రాజ్యాంగ ఆవశ్యతను, లౌకికవాద ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.
దిక్సూచి, ఆవాజ్(స్వరం) పేరుతో ఏర్పాటు చేసిన రెండు వేదికల మీద సాహితీ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు వేదికల్లో పదహారు సెషన్లుగా చర్చోపచర్చలు, మేధోమథనం, కవితా గానం, పుస్తకావిష్కరణతో కూడిన కార్యక్రమాలను నిర్వహించారు. గమనించాల్సి విషయమేంటంటే, 60 మందికి పైగా యువ సాహితీకారులు వేదికలను పంచుకున్నారు.
పలు కార్యక్రమాలకు వేదికగా దిక్సూచి- ఆవాజ్..
ఆరు బయట దిక్సూచి వేదికగా “గోడల్ని ఛేదించే అక్షరాలు” పేరుతో ప్రారంభ సమావేశం జరిగింది. కార్యక్రమాన్ని రూప రక్మిణి నిర్వహించారు. ఏకే ప్రభాకర్ అధ్యక్షతలో జరిగిన ఈ కార్యక్రమానికి సాహిత్యోత్యత్సవం- ఉద్దేశ్యాలు, లక్ష్యాలను కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహిత మెర్సీ మార్గరెట్ వివరించారు. ప్రముఖ తమిళ రచయిత సుకీర్త రాణి ప్రారంభోపన్యాసమిచ్చారు. వైస్ చాన్సలర్ సూర్యా ధనంజయ్, దేవరాజు మహారాజు ఆత్మీయ అతిథులుగా; పల్లెపట్టు నాగరాజు వక్తగా కార్యక్రమానికి హాజరైయ్యారు.
ప్రారంభ సమావేశం ముగిసిన తర్వాత “విద్వేషకాలంలో రచయితలు”, కవిత్వంతో సంభాషణ, ప్రతిఘటన రూపంలో రచన, బహుళ అస్తిత్వాలు- నిరసన గళాలు, పుస్తకంతో కాసేపు కార్యక్రమాలు దిక్సూచి వేదిక మీద జరిగాయి.
ముగింపు సమావేశం తర్వాత లయాత్మక ప్రతిఘటన పేరుతో మెర్సీ మార్గరెట్, పసునూరి రవీందర్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జాన్ కే జోసఫ్, రేలారే ప్రసాద్ తమ పాటలతో ప్రతిఘటనా స్వరాన్ని వినిపిస్తూ యువతను ఉర్రూతలూగించి, సభికులలో ఉత్సాహాన్ని నింపారు.
దర్బార్ హాల్లో ఆవాజ్ వేదికగా భాష అస్తిత్వం- ప్రతిఘటన స్వరాలు; ధిక్కార స్వరం పేరుతో డార్జిలింగ్‌కు చెందిన నేపాలి కవి మనోజ్ బోగటితో సంభాషణ; పసునూరి రవీందర్ నిర్వహణలో నా రచనానుభవాలు- సామాజిక నేపథ్యం; కథతో ప్రయాణం, ప్రచురణ రంగంలో సవాళ్లు, పుస్తకంతో కాసేపు కార్యక్రమాలు జరిగాయి.
ఆలోచింపజేసే కార్యక్రమాలు..
“సోషల్ మీడియా, సినిమాల ద్వారా యువత మెదళ్లను మొద్దబార్చి దుర్బలపరచే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. వ్యాపార మార్కెట్ శక్తులు వారిని కేవలం వినియోగదారులుగా మార్చేస్తున్నాయి. మరోవైపు రాజకీయ శక్తులు వారిని పావులుగా వాడుకుంటున్నాయి. ప్రశ్నించాల్సిన గొంతుకలు మౌనం దాల్చేలా, లేదా దారి మళ్ళేలా వ్యవస్థీకృత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో యువతకు కావాల్సింది వినోదం కాదు, విచారణ, వివేచన” అని సమూహ చాటి చెప్పింది.
ఇందులో భాగంగా తన బాధ్యతగా విచారణ, వివేచన, వాస్తవికత పట్ల అవగాహన యువతలో కలిగేలా సమూహ నిర్వహించిన కార్యక్రమాలు ఉన్నాయి. కార్యక్రమాలలో పాల్గొన్న వక్తలు వర్తమాన కాలాన్ని ఎలా చూడాలి. ద్వేషాన్ని ఎలా ప్రతిఘటించాలో యువతకు, యువ సాహితీకారులకు సూచించారు. సాహిత్య ఉత్సవాలు యువతకు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని విమర్శనాత్మకంగా చూసే చూపును అందిస్తాయని తెలియజేశారు.
వర్తమాన కాలంలో యువజనోత్సవాలు ఎందుకనే ప్రశ్నకు- ఏ సమాజమైన పతానవస్థ తిరోమగనం చెందకుండా ఉండాలంటే సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుందని, పరస్పర గౌరవప్రదమైన మేధోపరమైన చర్చ పురోభివృద్ధికి- నవశకానికి నాంది పలుకుతుందని సమూహ కార్యక్రమానికి హాజరైన పెద్దలతో పాటు యువకులు పేర్కొన్నారు.
యువ రచయితలకు ప్రముఖుల సందేశం..
యువకులు ఎందుకు సాహితీ రచనలు చేయాలి? మానవీయ సంక్షోభకాలంలో సాహితీకారులు ఎలా ఉండాలి, కళ కళ కోసమా- లేక ప్రజల కోసమా? సాహితీకారుల వ్యక్తిత్వానికి రూపునిచ్చేవేవి? అనే ప్రశ్నలకు దళిత స్త్రీవాద రచయిత్రి సుకీర్త రాణి, నేపాలి కవి మనోజ్ బోగాటి, ఆంధ్రోజ్యోతి పూర్వ సంపాదకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అంతేకాకుండా యువ సాహితీకారులకు దిశానిర్దేశం చేశారు.
“ఏ కళయినా కళ కోసమా? లేదా ఆ కళ ప్రజల కోసమానే చర్చ జరుగుతన్నప్పుడు నిస్సందేహంగా అది ప్రజల కోసమే అవుతుంది. నిజమైన కళ అత్యంత సౌందర్యంగా ఉంటుంది. అందులో సత్యం ఉంటుంది. దళిత సాహిత్యం గొంతులేని వారికి గొంతు అందించడంలో ముందు ఉంటుంది. ప్రస్తుత విద్వేషపూరితకాలంలో యువత సామాజిక అవగాహనతో, ప్రజాస్వామ్య ఆలోచనలతో తమ కలాలను సామాజిక న్యాయం కోసం కదిలించాలి.”


“జీవితానుభవంతో పాటు కాలం, పరిసరాలు సాహితీకారులకు రూపునిస్తాయి. నేనున్న డార్జిలింగ్‌లో అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిపాదించకుండా రచన చేయలేను. ధిక్కర స్వరాలు ఆ జీవిత నేపథ్యంలోంచి పుట్టుకొస్తాయి. ప్రజల ఆశ లు, ఆకాంక్షలను వ్యక్తీకరించడం- అణిచివేతకు వ్యతిరేకంగా ధిక్కారాన్ని వినిపించడమే రచయిత బాధ్యత.”

“రచయిత తన అభిప్రాయాలను ప్రకటించడానికి రాయటం కాదు, సమాజాన్ని ముందుకు నడిపించడానికి రాయాలి. సామాజిక అభ్యున్నతి మాత్రమే సాహితీకారుల బాధ్యత. అంతిమంగా సమాజాన్ని మానవీయ విలువల పునాదిపై నిలపటానికి రచయిత రచనలు చేయాలి.”
యువజన సాహిత్యోత్సవంలో మేధోపరమైన చర్చలతో ‘సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్’ జ్ఞాన జ్యోతిని వెలిగించడమే కాదు, ప్రత్యామ్నాయ ఆలోచనాకు పునాది చేసింది. యువ సాహితీకారులకు తమ బాధ్యతను గుర్తుచేసింది. దేశవ్యాప్తంగా అలుముకున్న ద్వేష- నిరాశాపూరిత వాతావరణంలో సాహిత్యోత్సవంలో పాల్గొన్న యువ సాహితీకారులు ఆశాజనక అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
