సైన్స్ ప్రమేయం లేకుండా ఈ విశాల విశ్వంలో ఏదీ లేదు. ఏ విషయం తీసుకున్నా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అది సైన్స్‌తో సంబంధాన్ని కలుపుకోవాల్సిందే. కొన్ని కోట్లమంది యాత్రికులు బస్సుల్లో, రైళ్లల్లో, విమానాలలో పుణ్యక్షేత్రాలకు, ధార్మిక కేంద్రాలకు వెళ్లి వస్తున్నారంటే; కంప్యూటర్ ద్వారా రిజర్వేషన్లు జరుగుతున్నాయంటే; దేవుడి వ్యవహారాల్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయంటే అందుకు సైన్సే కారణం. సైన్స్‌కు దేవుడు అవసరం లేకపోయినా, దేవుడి భావన నిలవడానికి మాత్రం సైన్స్ అవసరం ఉందన్నది ప్రత్యక్షంగా కనిపిస్తున్న సత్యం. మీరు ఏ స్వామిజీనో, సన్యాసినో, మాతాజీనో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టీవీ తెర మీదో చూడండి. జాగ్రత్తగా గమనించండి. విషయం మీకే అర్థమవుతుంది.
వాళ్లంతా ధవళ వస్త్రాలు ధరించి ఉంటారు, అవి సైన్స్ వల్ల లభించినవి. వారి ముందు ఓ పది మైకులుంటాయి, అవీ సైన్స్ వల్ల లభించినవే. విద్యుత్ దీపాల కాంతి చల్లగా, తెల్లగా వెలుగులు ప్రసరిస్తూ ఉంటుంది. అవీ సైన్సు వల్ల లభించినవే.
ఆకర్షణీయమైన అల్లికలు..
సైన్స్ సమకూర్చిన ఇన్ని సౌకర్యాల మధ్య కూర్చోని ఈ ఆధ్యాత్మిక గురువులు చెప్పేదేమిటీ? “మానవ జన్మ వృధా! వెంటనే ఏదో ఒక శక్తిని, దేవుణ్ణి, దేవతను నమ్మండి. మోక్షం సాధించండి” అని కదా? మోక్షమంటే ఏమిటీ? ఎవడు చూశాడు దాన్నీ? అనే ప్రశ్నలు ఎవరూ వేయకుండా గంభీరోపన్యాసాలు సాగుతూ ఉంటాయి.
మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశాలతో అతణ్ణి బలహీనపరచడం తప్ప, మనిషి మనిషిగా ఎదుగుతూ వచ్చిన విషయం ఒక్కటీ మాట్లాడరు. మనిషి తన మేధో సంపత్తి వల్ల సంపాదించిన విజ్ఞానంతో లబ్ధి పొందుతూ, వాటి గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆత్మ, పునర్జన్మ, దైవం, భక్తి వంటి మాటలతో అందమైన ఉపన్యాసాలు, ప్రవచనాలు చెపుతుంటారు. అందులో పిట్ట కథలు మరో ఆకర్షణ!
అందుకే విద్యావంతులకు, మేధావులకు నేను చెప్పేదేమిటంటే- మనిషి సాధించిన విజయాల గూరించి జనానికి చెప్పండని; భవిష్యత్తులో ఇంకా సాధించాల్సినవేవో బేరీజు వేసుకోండని. అంతేకానీ, మీ మానసిక రుగ్మతలు మీ మానసిక బలహీనతలు సమాజం మీద రుద్దకండని, మనుషుల్ని బలహీనులుగా తయారు చేసే ఈ స్వామీజీ తనకేదైనా అనారోగ్యం కలిగితే వెంటనే ప్రత్యేక నిపుణులయిన డాక్టర్లతో వైద్యం చేయించుకుంటాడు కదా? తప్పదు.
బయటి కొచ్చి “ఆ భగవంతుడి కరుణ వల్ల బతికి బయటపడ్డా”నంటాడు. జనం దాన్ని నమ్ముతారు. డాక్టర్ల బృందం అతడికి ఎంతో శ్రద్ధగా వైద్యం చేసిందీ; నర్సుల బృందం అతణ్ణి కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుందీ; అందరూ కలిసి ఎంతో కష్టపడి మళ్లీ మామూలు మనిషిని చేశారన్నది మరుగున పడుతుంది.
జరుగుతున్న ఘోరమేమంటే ప్రతివారూ సైన్సును ఉపయోగించుకుంటారు. కానీ దాని గూరించి ఒక్కమాట కూడా మాట్లాడారు. నమ్మకాలలో, మూఢ విశ్వాసాలలో బతకడం అలవాటు పడినవారికి వాస్తవాలు రుచించవు. మసాలాల చిరుతిండికి అలవాటు పడ్డవారు సాత్వికమైన పౌష్టికాహారం ఇష్టపడరు. అలాంటివారికి అసలు వాస్తవాలని గ్రహిద్దామన్న స్పృహ కూడా ఉండదు.
సమన్వయ లోపమే అవరోధం..
ఈ రోజు బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, జెనటిక్ ఇంజనీరింగ్, హ్యూమన్ జీనోమ్, జీన్ థెరపి, క్లోనింగ్, స్టెమ్‌సెల్ రీసర్చ్, చంద్రయాన్ ప్రాజెక్ట్, నానో టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఫార్మా సుటికల్ రీసర్చ్, ఆర్టిఫీషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్వంటి అనేక విషయాలపై పరిశోధనలు విజయవంతమవుతే; ఇక మనిషికి పెరిగిన తర్వాత రాబోయే వ్యాధులు, అతను పిండ దశలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే నివారించొచ్చు.
విశ్వ విజ్ఞానం ఎంతగా పెరిగి పోయిందంటే, విభిన్న రంగాలకు చెందిన శాస్త్రవేత్తలందరూ మనఃస్ఫూర్తిగా తమతమ అహాలని వదులుకుని కృషి చేస్తే, నూతన సృష్టికి రూపకల్పన చేయగలరు. అంతటి విజ్ఞానం మనకుంది. అంతటి ప్రజ్ఞాపాటవాలూ మన వాళ్లకున్నాయి. అయితే, సమన్వయ లోపమే అవరోధంగా నిలుస్తోంది. “ఎన్ని పరిశోధనలు జరిగినా కొత్త ప్రాణికి మనిషి జీవం పోయగలరా?” అనే సంశయానికి శాస్త్రవేత్తలు తప్పక సమాధానం చెప్పగలుగుతారు.
ఇటీవల ఒక కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. “మైకో ప్లాస్మా జెనిటీలియం” అనే బ్యాక్టిరియాలోని మొత్తం డీఎన్ఏను ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించగలిగారు. లోగడ వైరస్ డీఎన్ఏలను కృత్రిమంగా సృష్టించగలిగినా, బ్యాక్టిరియా డీఎన్ఏకు మాత్రం ఇంత వరకు రూపకల్పన చేయలేకపోయారు. అదిప్పుడు సాధ్యమయింది. వైరస్ల కంటే బ్యాక్టీరియాలలో ఎక్కువ డీఎన్ఏ ఉండడమే ఈ ఆలస్యానికి కారణమైంది. ఉదాహరణకిప్పుడు సృష్టించగలిగిన మైక్రో ప్లాస్మా జెనిటీలియం కోసం సుమారు ఆరు లక్షల డీఎన్ఏ బేస్ పెయిర్స్ తయారు చేయల్సి వచ్చింది. అందువల్ల సహజంగానే మైక్రో ప్లాస్మా జెనిటీలియంలో ఉండే డీఎన్ఏకు ప్రతి సృష్టి చేయటం జీవ శాస్త్రంలో ఒక గొప్ప పరిణామం.
మానవుని జన్యువును రూపొందించే దిశగా అడుగులు..
“మైక్రో ప్లాస్మా జెనిటీలియం” అనే ఈ బ్యాక్టీరియా ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఉంటుంది. సెక్స్ సమయంలో ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అందువల్ల రాగల కాలాలలో మానవుని జన్యువును కూడా శాస్త్రవేత్తలు రూపొందించగలరనే నమ్మకం కలుగుతోంది. సహజమైన బ్యాక్టరీయూకు సరిసమానమైన బ్యాక్టీరియాను రూపొందించగలిగినప్పుడు, సహజమైన మానవుడికి సరిసమానమైన మానవుణ్ణి శాస్త్రవేత్తలు రూపొందించగలరు. ఇది ఏదో ఆశాభావంతో ఊరికే అంటున్న మాట కాదు. కాబోయే వాస్తవం.
ఇటీవల శాస్త్రజ్ఞులు ఒక మైక్రోబ్(సూక్ష్మక్రీమి) నుంచి డీఎన్ఏను మరో మైక్రోబ్లోకి మార్చారు. అంటే ఒక జీవిగా పుట్టబోయే దాన్ని మరో జీవిగా మార్చి పుట్టించినట్టు లెక్క. కృత్రిమంగా తయారు చేసిన క్రోమోజోమ్‌ను ఇక బ్యాక్టీరియాలో ప్రవేశపెట్టే ప్రక్రియ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఈ ప్రయత్నాలు విజయవంతమవుతే ఒక కణం నుంచి జీవిపూర్తి రూపాన్ని తయారు చేయడానికి వీలవుతుంది. జీవులను, జీవలక్షణాలను మానవుడే సృష్టించినట్లవుతుంది. విశ్వాస పాత్రులైన ఈ భక్తులప్పుడు మరి దేవుణ్ణి- సృష్టికర్తను ఎక్కడ దాచుకుంటారో తెలియదు.
ఈ మాట ఎందుకు అనాల్సివస్తోందంటే, దేవుడైనా సరే సైన్సును గుర్తించాల్సిందే. సైన్సు మాత్రం దేవుడి ఉనికిని ఒప్పుకోలేదు. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి.
“ఆన్లైన్” బుకింగ్‌లు జరగకపోతే భక్తులు కోట్ల సంఖ్యలో తమతమ ఇష్ట దైవాల దర్శనం చేసుకోలేరు కదా? అవి గుళ్లు. మసీదులు, చర్చ్‌లు ఏవైనా కావొచ్చు. ఏ మతానికి సంబంధించిన దేవుళ్లయినా కావొచ్చు. పైగా వీటన్నింటిలోకి విద్యుద్దీపాలు కావాలి. ఆన్లైన్ బుకింగ్‌లు సైన్సే. ఎలక్ట్రిక్ దీపాలు సైన్సే. మైకు సైన్సే. మైక్ లేకపోతే సుప్రభాతాలు, అజాలు, ప్రేయర్లూ జనానికి చేరవు. దైవభావన ప్రచారం చేయడానికి ఉపయోగపడుతున్న టెలివిజన్ ఛానళ్లు, పత్రికలూ పుస్తకాలూ అన్నీ సైన్స్ ఫలితాలు.
అంటే ఇక్కడ జరుగుతున్నదేమంటే, వైజ్ఞానికులు జీవితాలు ధారపోసి ఆవిష్కరించిన సైన్సు ఫలితాలని కొందరు మూఢ విశ్వాసకులు తమ స్వార్థం కోసం, తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం కోసం వాడుకుంటున్నారన్న మాట! ఇది ఎంత దుర్మార్గమంటే, మన వేలితో మన కంటినే పొడవడంలాంటిది. ప్రజలు ఈ విషయాలు గ్రహిస్తూ, అప్రమత్తంగా ఉంటూ ఎదురౌతున్న సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
