కులవృత్తులు – వారి జీవన పోరాటం, కులపరమైన వివక్ష- అణచివేతలను వివరిస్తూ వివిధ సాహిత్య రూపాలలో రచనలు వస్తున్నాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. బీసీ కులాలలో ఒక్కొక్క కులం గురించి బోలెడన్ని కథలు వచ్చినా, పరిమితంగానైనా కొన్ని కులాలకు సంబంధించి కథా సంకలనాలు రావడం ఆహ్వానించదగిన పరిణామం. దళితులు, దళిత ఉపకులాల మీద కూడా కథా సంకలనాలు వచ్చాయి. గిరిజనులకు సంబంధించి సవరల మీద మల్లిపురం జగదీష్, కోయల మీద పద్దం అనసూయ, బంజారాల మీద రమేష్ కార్తీక్ నాయక్ కథలు రాస్తున్నారు. సంపుటాలు కూడా తీసుకువచ్చారు. ఎరుకల మీద కూడా అడపాదడపా కథలు వచ్చినా అవి అవుట్ సైడర్స్ రాసినవి. మొదటిసారి ఒక ఇన్‌సైడర్‌గా పలమనేరు బాలాజీ ఎరుకల జీవన గాథలను “ఏకలవ్యకాలనీ” పేరిట సంపుటంగా తీసుకు రావడం అభినందనీయం.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు ప్రభుత్వం గుర్తించిన 35 తెగలలో అతి పెద్ద ఆదిమ గిరిజన తెగ ఎరుకల. వీరిని ఎరుకల, కుర్రు, కైకిడి అనే పేర్లతో వ్యవహరిస్తారు. వీరిలో అనేక ఉపతెగలవారు ఉన్నారు. వారు చేపట్టే వృత్తిని బట్టి ఆ తెగ పేరు ఉంటుంది.
వెదురు బుట్టలు అల్లేవారిని దబ్బ ఎరుకల, ఈత పుల్లలతో అల్లే వారిని ఈతపుల్లల ఎరుకల, దువ్వెనలు తయారు చేసే వారిని కాంచేపురి ఎరుకల, సోది చెప్పే వారిని పరికముగ్గుల ఎరుకల, ఆకుకూరలు అమ్ముకునే వారిని కరివేపాకు ఎరుకల, ఉప్పు అమ్ముకునే వారిని ఉప్పు ఎరుకల అని అంటారు. సాధారణంగా వీరు చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయి ఉంటారు. చిన్న చిన్న గుడిసెల్లో నివసిస్తారు. వీరిది పితృస్వామ్య వ్యవస్థ. ఎక్కువగా మేనరికాలను చేసుకుంటారు. వీరిలో కుల పంచాయితీ ఉంటుంది. వీరు సమస్యలు, ఏదైనా వివాదాలు ఉంటే ఇక్కడే పరిష్కరించుకుంటారు. ఎవరైనా నియమాలకు వ్యతిరేకంగా వెళితే వారిని సమాజం నుండి వెలివేసి శుద్ధి తంతు పూర్తి చేసి, అప్పుడు తిరిగి తమలో చేర్చుకుంటారు. ప్రధానంగా పందులను పెంచడం, బుట్టలు అల్లడం, చాపలు అల్లడం, తాళ్లు పేనడం వంటి అతి ప్రాచీనమైన వృత్తులు అవలంబించి జీవనాన్ని గడుపుతుంటారు. మన ప్రాచీన సాహిత్యంలో సోది చెప్పే ఎరుకలసాని పాత్ర వల్ల ఎరుకల జాతి ప్రాచీనతను మనం గుర్తించవచ్చు.
అనేక మార్పులు, సంవత్సరాలు గతించిన తరువాత కూడా ఎరుకల జాతి ప్రజలు అడవికి పరిమితమై అటవీ ఉత్పత్తులు, వేటాడటం ద్వారా జీవనం సాగించేవారు. బ్రిటీషు వారి పాలనలో 1878 సంవత్సరంలో అటవీ ఉత్పత్తులను ఉపయోగించడం, వేటాడటం నిషేధించిన కారణంగా ఎరుకల జాతి ప్రజలు మైదాన ప్రాంతాలకు (గ్రామాలకు) విస్తరించడం జరిగింది. ఆ కారణంగా ఎరుకల ప్రజలు అటవీసంపద మీద హక్కులు కోల్పోయి మైదాన ప్రాంతములలో నివసించుట వలన, గ్రామ సమాజంలో కనీస సౌకర్యాలు, గౌరవం పొందలేకపోయారు.
1911వ సంవత్సరం బ్రిటిష్ పాలకులు ఎరుకల జాతి ప్రజలను నేరస్తుల జాబితాలో చేర్చారు. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా, ఎరుకల వారిని దోషులుగా నిర్ధారించి శిక్షలు వేసేవారు. వారి హయాంలో ఆంగ్లేయులు ఎరుకలను అనేక బాధలకు గురి చేసేవారు. వారిని గ్రామాల నుంచి వెళ్ళగొట్టి, ఒక ప్రత్యేకమైన స్థలంలో వారిని ఉంచి వారి హాజరు తీసుకునేవారు. అలా చేయకపోతే వాళ్ళను నిర్బంధించి జైల్లో పెట్టేవారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారత ప్రభుత్వం వారిని నేరపూరిత తెగల జాబితా నుంచి తొలగించి, గిరిజన తెగగా ప్రకటించింది. దీంతో ఎరుకల జీవితాలు కొత్త మలుపు తిరిగాయి. అయినా వీరి పట్ల సామాన్య ప్రజలకు, పోలీసులకు సదభిప్రాయం ఏర్పడలేకపోవడంతో- ఇప్పటికీ వీరు వివక్ష , అవమానాలకు, అణచివేతకు గురవుతూనే ఉన్నారు.
ఒకప్పుడు ఎరికళ్ల వాళ్లంటేనే పోలీసులు, నాయకుల మొహాలు మారిపోయేవి.”స్టువర్టుపురం అనే ఊరు మీకోసమే పుట్టిందట కదా. దొంగతనాలు చేసే వాళ్ళందరినీ అక్కడకు తీసుకువెళ్లి దూరంగా పెట్టేసి దొంగతనాలు చేయకుండా కట్టడి చేశారంట కదా.”
“అయ్యా! ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిందని మొత్తం కులాన్ని తప్పు పడితే ఎట్లా. గతాన్ని సాకుగా చూపి మొత్తం మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. ఎక్కడ దొంగతనాలు జరిగినా ముందు మీరు మా ఇండ్ల కాడికి వచ్చి వయసు మొగోళ్ళని, ముసిలోళ్ళని కూడా కుల్లబడుస్తారు. ముసిలోళ్ళనైనా విడిచిపెట్టండి సారు అని మేము అడుక్కుంటే- ముసలోళ్లకే అనుభవం ఎక్కువ, నేర్పరితనం పనితనం ఎక్కువ అంటారు. మేము చెప్పే ఒక్క మాటైనా వినకుండా మమ్మల్ని అనుమానాలతో అవమానాలతో చంపేస్తా ఉంటే, మేము యాడికి పోవాల సామీ” అంటున్న నారాయణప్ప “ఆ కులం పేరు చెప్పినందుకే కదా స్వామి ఒక కన్ను పోయేలా కుమ్మేస్తిరి. ఆ కులం పేరు చెప్పినందుకే కదా సామీ నా కొడుకును దేశాంతరం పోయేలా తరిమికొడుతిరి. ఇందులో “మా తప్పు ఏంది సామీ” ఎరుకల కులంలో పుట్టడమే మా తప్పా?”అని ప్రశ్నించిన ఒంటికన్ను నారాయణప్పకు సమాధానం దొరకదు. కేవలం కులం కారణంగా, అతడికి జరిగిన అవమానాల కారణంగా – పోలీసుల దెబ్బలకు భయపడి కొడుకు అట్లా దేశాంతరం వెళ్లిపోవడం అతన్ని బాగా కలచివేసింది.
“మన కులం గురించి చెప్పకుండా ఉండలేం. కులాన్ని దాచి పెట్టాల్సిన అవసరం మనకి ఎవరికీ లేదు. ఎవరి కులం వాళ్లకు గొప్ప. ఎప్పుడో ఎవరో ఏ కాలంలోనో దొంగతనాలు చేసినారని, మొత్తం మన జాతిని దొంగలంటే ఎట్లా ఒప్పుకుంటాం. ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం. ఉద్యోగం వల్ల వచ్చేదే గౌరవం కాదు అంటున్న పోలీసు మునిరత్నం” తలపైన టోపీ పోయినా పర్వాలేదు. కానీ తలదించుకునే ఖర్మ నాకు వద్దనుకున్నాను” అని చెబుతాడు. చిన్నప్పుడు ఆటలోనే దొంగ – పోలీస్ ఆడుకోవాల. అంతేకానీ ఎరుకలోడు పోలీసు కావడం ఏంది? ఎరికిలోడంటే ఆ డిపార్ట్మెంటులో మర్యాద యాడ ఉంటుంది. పోలీసు ఉద్యోగం ఎందుకు వదులుకున్నావని అడిగితే మునిరత్నం ” ఏ తప్పు చెయ్యని మనోళ్ళని తప్పుడు కేసు లేకుండా పోరాడి వాళ్ళకి న్యాయం అయితే చేసిన. కానీ నా పైన పెద్ద కులపోళ్ళకి, పై ఆఫీసర్లకి మంట మొదలైపోయింది. ఏందేందో డ్యూటీలు వేసి ఎక్కడెక్కడో తిప్పుతా ఉన్నారులే. మనకి ఇది సెట్టు కాదని తేల్చుకున్నాక మన యూనిఫారంలో ఉన్న మన కులపోళ్ళకే మనం న్యాయం చేయలేమని తెలుసుకున్నాక గట్టిగా ఎదురు తిరిగినాలే. మన ఎరుకల కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకుంటానా. నాలో ఉండేది ఆ రక్తమే కదా. కులానికి ఎరుకలోడు అయితే దొంగే అంటావా. ఎవడ్రా దొంగ. దొంగ నా కొడకా అని ఎస్సై చొక్కా పట్టుకునేస్తి. ఉద్యోగం అయితే పోయింది కానీ నా పేరులోంచి పోలీసు అనే మాటను పీకే దానికి ఎవడి తరం కాలే అంటున్న మునిరత్నం, ఏటికీ ఎదురీదిన వైనం దాని ఫలితాలు మనం తెలుసుకోగలుగుతాం.
వివక్ష – అణచివేత, జీవన పోరాటం..
కాలం మారుతున్నా ఫలితాలలో ఎలాంటి మార్పు రాలేదు. కాలేజీలో చదువుతున్న ఎరికలోళ్లపైన టార్చర్ ఎక్కువవుతుంది. మానసికంగా వేధిస్తుంటారు. ఎవరైనా లెక్చరర్లు వాళ్లకు మంచి చెబితే మిగతా లెక్చరర్లు వారిపై కామెంట్లు చేస్తూ ఉంటారు. రాజు కాలేజీలో చేరినాక వాళ్ళ నాయన కొత్త సెల్ కొనిస్తే, యాడ కొట్టుకొస్తివి రా ఇంత మంచి ఫోన్ అంటారు. దొంగ అంటారు. “ఎరికలోళ్లంతా దొంగలని ఎవరు సార్ చెప్పింది. కులం పేరు చెప్పి తక్కువ చూస్తా ఉండారు సార్. అందుకే ఏదో ఒకటి చేయాలి సార్ అ నా కొడుకుల్ని” అని కాలేజీ విద్యార్థులు ఉద్రేక పడిపోతుంటారు.
చాలా కాలం కింద ఏరికలోల్లందరికీ కాలనీ ఇండ్లు కట్టించే దానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అందరూ కలిసి ఒక్కచోటికి వచ్చి కాయకష్టం చేసి, తిని తినక కూలి నాలి చేసి, ఒకరి ఇంటి పనుల్లో మరొకళ్ళు వంతుల వారిగా పని చేసుకుంటూ, ఒకరికొకరుగా నెలల తరబడి అహోరాత్రులు శ్రమ పడితే కాలనీ ఏర్పడుతుంది. బాగానే ఉంది కానీ ఎస్టీ కాలనీ అని కాలనీ మొదట్లో తోరణం మాదిరి పెద్ద బోర్డు పెట్టుకొని మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. కాలేజీలో కానీ, హాస్టల్లో కానీ ఇన్ని సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఏముందో చెప్పండి. మన కులం పేరు చెప్పుకోవాలంటే నామోషీగా ఉంటుంది. అందుకే ముందు ఈ కాలనీకి పేరు మార్చేద్దాం. ఎస్టీ కాలనీ అని ఎరికలోల కాలనీ అని అనడం మనకు ఏమైనా గౌరవంగా ఉందా. మీరే చెప్పండి. ముందు కాలనీ పేరు ఏకలవ్య కాలనీ అని మార్చేద్దాం అని తీర్మానిస్తారు.
పందులు – బాతులు మేపడం, ఊరూరా తిరిగి గాడిదల పైన ఉప్పు అమ్మడం, వెదురుబుట్టలు – దబ్బలు – తడికలు అల్లడం, అడవిలోకి పోయి ఎండు కట్టెలు తెచ్చి ఊర్లో అమ్మడం, ఎండలో ఇల్లిల్లు తిరిగి ఎర్రమన్ను- ముగ్గుపిండి అమ్మడం, పెద్దోళ్ళ ఇండ్లలో ఇంటి పని చేయడం, కూలికి పోవడం, లేబరోళ్ళుగా తయారు కావడం – ఇవన్నీ ఎరుకల జీవన పోరాటంలో భాగమే. మెదడు వ్యాధి వ్యాపించినప్పుడు వైద్య సహాయం అందించాల్సిన ప్రభుత్వం వారు ఈ వ్యాధికి కారణం ఎరుకల వారు పందులను పెంచడమే అని నిర్ణయించి, పందుల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి వాటిని చంపాలని ఆదేశిస్తారు. పందుల పెంపకం మీద ఆధారపడిన ఎరుకల జీవితాలు దీనివల్ల అల్లకల్లోలమయ్యాయి.
“ఏనుగుల రాజ్యం”లో కరెంటు పనికి పోయిన మొగుడు షాక్ కొట్టి చనిపోగా, ఆదెమ్మ ఇద్దరు ఆడపిల్లల్ని పెంచుకుంటూ మగరాయుడిలా కష్టపడుతూ మామిడి తోపును పెంచుకుంటూ వస్తే, ఒకరోజు ఏనుగులు అడవి దాటి సరాసరి పొలాల్లోకి వచ్చి పడతాయి. విధ్వంసం సృష్టిస్తాయి. ఈ సంగతి తెలిసి వచ్చిన ట్రాకర్లు, అటవీ అధికారులలో ఒకడు “ఏందేంది.. ఎరికిలోళ్లు కూడా సేద్యం చేస్తారా.. అయినా వాళ్ళు ఎప్పుడు రైతులయ్యారు? దాంట్లో ఒక ఆడ ఎరుకిలామె..” అని ఆశ్చర్యపోతాడు. దాంతో రెచ్చిపోయిన ఆదెమ్మ “ఈ అడవి అయినా మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుతున్నది. కానీ ఈ ఊరే మా బతుకేదో మమ్మల్ని బతకనివ్వకుండా సంపుక తింటా ఉంది. కూలి పనులకు పిలుస్తారు. కానీ ఎరికలోలు పొలంలోకి దిగకూడదు అంటారు. అందుకే సారు ఇల్లు అమ్ముకొని, ఇంట్లో సామాన్లు అమ్ముకొని, నేను నా మొగుడు అన్నాలు తినేది కూడా వదిలేసి, ఈ మామిడి తోపు కొనింది. చస్తే మా పెద్దోళ్ళని పూడ్చేదానికి కూడా పెద్ద కులమోళ్ళు అడ్డం పడతా ఉంటే, మేము ఇంకెట్లా సస్తాం. మా చావేదో మేం సస్తే మా జాగాలోనే పూడ్చేదానికే, వడ్డీలకు అప్పులు చేసైనా ఇంత నేల మాదని పించుకున్నాం. మగ బిడ్డలు లేరు. ఇంత అధరువు అయినా లేకపోతే, రేపు మా ఆయన లాగా నేను కూడా అర్ధాంతరంగా సస్తే, నా బిడ్డలు ఎట్లా బ్రతకలంటారు సారూ.. అయినా మీ కాడ మా కులం పేరు చెప్పి మాట పడేదానికో, నా సొత్తు ఏనుగులకు ఇచ్చేసేదానికో కాదు, తోపుకొనిండేది. నా బిడ్డలకు ఏ కష్టం రాకూడదని. అయినా ఏనుగుల్ని తరిమే దానికి కూడా మీకు మా కులం అడ్డం వస్తా ఉండాదంటే చెప్పండి సారూ.. మిమ్మల్ని అడుక్కునే బదులు అదేందో నేను నా బిడ్డలు పోయి ఆ ఏనుగుల్నే అడుక్కుంటాం” అన్న ఆదెమ్మ ఆవేదన, ఆక్రందన అటవీ అధికారులను కదిలిస్తుందేమో చూడాలి.
నీలమ్మ పదో తరగతి వరకు చదువుకుంది. కులవృత్తి వద్దు. ఈ బానిస బతుకు వద్దు. మనం మన కష్టంతో ఎట్లా అయినా బతకవచ్చు. టౌన్‌కు వెళ్ళిపోదాం అంటే మొగుడు ఒప్పుకునింది లేదు. పల్లెలోనే ఉండాలన్నాడు. భర్త వద్దంటున్నా వినకుండా నీలమ్మ, రామకృష్ణారెడ్డితో మాట్లాడి ఎకరా పొలానికి నీళ్లు అరువు ఇప్పించుకుంది. అలాంటి పరిస్థితుల్లో నాయుడు ప్రాపకంలోకి మొగుడు తిరిగి వెళ్ళాడు అంటే ఆ రామకృష్ణారెడ్డి తమ పొలానికి నీళ్లు ఇవ్వడు. నీళ్లు లేకుండా సేద్యం చేయటం అస్సలు కుదరదు. ఊర్లో అందరికీ కంటగింపుగానే ఉంది ఎరుకల దొరస్వామి సేద్యం. ఆ సంగతి నీలమ్మకు తెలుసు. ఏం చేయాలి? మొగుడ్ని ఎట్లా నిలువరించాలి? కలోగంజో సొంతంగా సంపాదించుకొని తాగుదామనుకుంటే చాలని దరిద్రానికి ఏనుగుల పీడ ఒకటి. ఏనుగులు విరుచుకుపడి దండయాత్ర జరిగినట్టు పొలమంతా నానా బీభత్సంగా ఉంది. టమోటాలు చితికిపోయి నలిగిపోయి ఉన్నాయి. ఎకరా పొలంలో ఎక్కడా ఒక మొక్క బతకలేదు. అయినా ఆ ఏనుగులకు కూడా పేదోడిపంటే కావలసి వచ్చిందా! అడవిలోంచి వచ్చిన ఏనుగులు ఐదారు మంది పెద్ద కులపోళ్ళ రైతుల పొలాలని దాటుకునే కదా రావాలి. సరిగ్గా ఎరికలోడి పంటే ఆ ఏనుగులకు కావాల్సి వచ్చిందా. మెల్లగా మొదలైన అనుమానం క్షణాల్లో పెరిగి పెద్దదైపోయింది నీలమ్మ మనసులో.”నువ్వు ఊరికే నాయుడిని గుడ్డిగా నమ్మొద్దు. దారిలో అన్ని పొలాలని వదిలేసి మన పొలంలోకి కక్ష కట్టినట్లు నేరుగా వస్తాయా ఆ ఏనుగులు” అని పరిస్థితి వివరిస్తే, అది గుర్తించని భర్త నీలమ్మను చితకబాది తన స్వామిభక్తిని నిరూపించుకుంటాడు. ఇక చేసేదిలేని నీలమ్మ “వెదుర్లు”, వెదురు పనులలోనే తన జీవనాధారాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది.
బావి ఎండిపోయి సేద్యం కుంటుపడటంతో ఎరుకల మునిరాజుకు పిచ్చెక్కినట్లు అయిపోతుంది. ఎట్లా ఏం చెప్పిలాక్కున్నాడో కానీ మునిరాజు, మల్లీశ్వరరెడ్డి ప్రాపకంలోకి చేరిపోయాడు. మునిరాజుకు బీడీలు, మందు రెడ్డి ఎందుకు పంపిణీ చేస్తున్నాడో భర్తకు తెలియదు. కానీ అంతో ఇంతో చదువుకున్న మంజులకు అంతా అర్థమయింది. మల్లీశ్వర రెడ్డి వెకిలిచూపులు, పిచ్చి చేష్టలు మొగుడికి నిజంగా అర్థం కాలేదా లేక నటిస్తున్నాడా అనే ఆలోచనలో పడుతుంది. చివరకు ఎట్టి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. అలా ఊరి పెత్తందార్ల దోపిడీ – అణచివేతల నుండి “ఏనుగుల రాజ్యం” లో ఆదెమ్మ,” వెదుర్లు”లో నీలమ్మ, “గురి”లో మంజుల చూపించిన ఎదిరింపు చైతన్యం పాఠకులను ఆకట్టుకుంటుంది.
వంట మాస్టర్ ఎరుకల కపాలిని కలవాలంటే మాత్రం ఎవరైనా పాతపేటలోని ఏకలవ్య ఎస్టీ కాలనీ కి రావాల్సిందే. ఒకప్పుడు కపాలి అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు కపాలి అంటే అందరికీ తెలుసు.”కబాబ్ కపాలి” ఉంటే ఊర్లో చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది. చికెన్ కబాబ్ చేయడంలో కపాలి మంచి నేర్పరి. వివాహాలకు శుభ, అశుభ కార్యాలన్నింటికీ కపాలి వంట చేస్తాడు. శాఖాహారమైనా, మాంసాహారమైన వంటలు చేయించాలంటే ఊర్లోనే కాక, చుట్టుపక్కల మండలాల్లో సైతం ముందు కపాలికి వీలవుతుందేమో అని జనం వాకబు చేస్తారు. కపాలికి వీలు కాదంటేనే మరి ఇంకెవరినైనా వెతుక్కుంటారు. ‘అయినా ఎరుకలోడు ఏంది? వంటలు చేయడమేంది? అని మొదట్లో సందేహపడి రకరకాలుగా మొహమాటాలకు, నిష్ఠూరాలకు పోయిన జనమే కపాలి చేతిలోని మహత్తు తెలిసాక, అతడి వంట ఒకసారి రుచి చూశాక కులం గురించి మాట్లాడటం మానేశారు. ఇదంతా జరగడానికి మాత్రం కొన్ని సంవత్సరాలే పట్టింది. ఆకలి ముందు, అన్నం ముందు అతడి కులం లెక్కల్లో లేకుండా గాల్లో కలిసిపోయింది. అసలు రుచి తెలుసుకున్నాక ఏ నాలుకా కులం పేరు ఎత్తడం మానేసింది. పని కోసం ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరి ముందో చేతులు కట్టుకొని నిలబడిన కపాలి దగ్గరకు వంటలు చేయడం నేర్చుకోవడం కోసం, శిష్యరికం చేయడానికి ఎందరో పోటీలు పడి వచ్చేవాళ్ళు. అంత డిమాండ్ ఉన్న కపాలి సారావ్యసనంలో పడి అన్నీ మానేస్తాడు.”నా కులమేందో ఖాయంగా ఎవరైనా పని ఇచ్చే ముందు అడుగుతారు కదన్న. నేను ఖాయంగా నిజమే చెప్తా. ఎరికిలోడనే చెప్తా. చెప్తే ఏమి పోతాది అన్నా. నిజమే చెప్తాను. ఇస్తే పని ఇస్తాడు, లేదంటే లేదు అంతే కదా. సారాయి మానేస్తే మా కులంలో కూడా రత్నాల్లాంటోళ్లు దండిగా ఉంటారు. అయినా కులం వల్ల ఎవరు చెడిపోలేదు. ఎవరైనా చెడిపోయాడంటే మాత్రం అది సారాయి వల్లనే” అని స్పష్టం చేస్తాడు.
ఎవరింట్లో అయినా పనికి చేరే ముందు సర్వసాధారణంగా ఎవరైనా అడిగేది “అదే ప్రశ్న” మీదే కులం అని. ఆ జవాబు పైనే ఆ ఇంట్లో పని చేయటమా లేదా అనే విషయం యజమాని, సేవకురాలి మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఇండ్లలో పాచి పనులు చేసే దానికి కూడా కులం అడ్డు వస్తుంది. తిట్టటానికి తప్పు పట్టడానికి వేరే కారణాలేం లేకపోయినా, కులాన్ని సాకుగా చూపిస్తారు. అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని పని కోసం వచ్చిన కమలమ్మ ‘మేము ఎరుకలోల్లం’ అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. పని ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. దానికోసం అనవసర గొడవలు ఎందుకని అనుకుంటుంది.
“గుడిసెలో ఉండేటప్పుడు పందులు పెంచినా, గాడిదలు పెంచినా సరిపోతుంది. గుడిసె వదిలి కాలనీ ఇంట్లోకి చేరిన తర్వాత కూడా పందులు అన్నావంటే, నేను పిల్లలను తీసుకొని మా పెద్దయ్య కాడికి బెంగళూరు వెళ్ళిపోతా. కూలో నాలో చేసుకుని అయినా నా బిడ్డను నేనే చదివించుకుంటా. ఊరు పేరు, ముక్కు మొఖం తెలియని చోట జనాలు ఎవరిని ఎవరు పట్టించుకోని చోట అయితే మన కులం ఏంది అని అడిగే వారు ఎవరూ ఉండరు” అని రాధమ్మ గట్టిగా బెదిరించేసరికి కృష్ణప్ప ప్రాణప్రదంగా పెంచుకుంటున్న పందుల్ని అమ్మేయక తప్పలేదు. పిల్లల చదువు కోసం భార్యాభర్తలు పగలనక రేయి అనక రకరకాల పనులు చేసి వాళ్లను చదివిస్తారు. పదవ తరగతి దాటి ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత వాళ్లు అడిగిందంతా కొనిస్తారు. డిగ్రీ చదువులు అయిపోయేసరికి వాళ్లు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అయినా కొడుకుల చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు వస్తే మనకు మంచి రోజులు వస్తాయి అనే నమ్మకంతో ఉంటారు. కొడుకులిద్దరికీ ఎస్టీ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. వాళ్లకి ఉద్యోగాలు చేసే ఆడవాళ్లే దొరికారు. వాళ్లు సాటి కులమోళ్ళు కాదు. కొడుకులిద్దరూ ఇంటికొచ్చి రెండేళ్లు దాటుతుంది. రాధమ్మకు బిడ్డల్ని చూడాలనిపిచ్చి చిన్న కూతురును వెంటబెట్టుకొని కొడుకుల ఇండ్లకు వెళ్లాల్సి వచ్చింది. వెళితే “ఎప్పుడూ ఈ పక్క రాబోకమ్మ. మనం ఎరుకలోళ్ళం అని ఈ పక్క ఎవరికీ తెలియదు. నువ్వు వచ్చి మమ్మల్ని అగుడు చేయొద్దు. మాకు ఉండే మానం మర్యాద అట్లనే ఉండాలంటే, ఇంకెప్పుడు మా ఇండ్లకు రావద్దు. నీకు పుణ్యం ఉంటుంది” అనేసిన కొడుకుల్ని చూసి నిర్ఘాంత పోయిన ఆమె అసహ్యించుకోలేదు, కోపం తెచ్చుకోలేదు. అది తెలుసుకున్న భర్త కృష్ణప్ప మనసు ఉండబట్ట లేక “ఆ ఇద్దరు మగ పిల్లల్ని సాకే బదులు నాలుగు పందులు పెంచుకున్నా బాగుండేది” అని తలపోస్తాడు.” అట్లా అనొద్దు. కొడుకులకు తెలిస్తే బాధపడతారు” అన్న రాధమ్మ తల్లిహృదయం ఎవరు అర్థం చేసుకుంటారు.
తిండి కూడా దొరకని కరువు కాలంలో ఎరుకల పాట్లు వర్ణనాతీతం. ఇంట్లో జరుగుబాటు లేనప్పుడు, వండడానికి ఏమీ లేనప్పుడు, వండింది చాలనప్పుడు మనుషులు – చావులప్పుడు, దినాలప్పుడు, పెండ్లి దేవరలప్పుడు కడుపు నింపుకోవడానికి చూస్తారు.”ఆకలేస్తున్నప్పుడు” అది తీర్చుకోవడానికి ఏమైనా చేయక తప్పదు కదా. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు నిజమైన అర్హులకు గిరిజనులకు అందటం లేదు. నిరుపేదలకు అందాల్సినవన్నీ పక్క దారిలో బినామీలకు చేరిపోతున్నాయి. ఇంటి స్థలాలు లేని వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు – కోల్పోయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారికి న్యాయంగా కేటాయించిన ఇంటి పట్టాలని రద్దుచేసి, బినామీలకు అమ్ముకున్న అధికారులకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని చెప్పి ఎమ్మార్వో ఆఫీసు ముందు “ధర్నా” చేస్తారు.
శ్రీనివాసులు గిరిజనుడు. కులానికి ఎరుకలవాడు. రిజర్వేషన్ కింద ఆ ఊరికి శ్రీనివాసులును సర్పంచిగా ఎంపిక చేస్తారు. రెడ్డిగారి ఇంట్లో నౌకరుగా పనిచేసే శీనుగాడిని, రెడ్డిగారి భార్య కూడా వంటింటి గుమ్మం తొక్కనీయదు. రెడ్డిగారు అతన్ని తన గదిలోకి అస్సలు రానివ్వడు. పంచాయతీ రికార్డులన్నీ ఆ గదిలోనే ఉంటాయి. అదే పంచాయతీ ఆఫీస్. అక్కడ ఆఫీసర్ అయినా, గుమాస్తా అయినా, పంచాయతీ కార్యదర్శి అయినా, సర్పంచ్ అయినా అది రెడ్డిగారే. తెల్ల కాగితం పైన, ఖాళీ రిజిస్టర్ల పైన సంతకాలు పెట్టమంటాడు రెడ్డి. అతడు చెప్పిన చోట శీను సంతకం పెట్టాల్సిందే. ఎందుకు అని ఇతడు అడగడు. ఎందుకో ఏమిటో ఎప్పుడూ రెడ్డి చెప్పడు. అదే అక్కడి ఆనవాయితీ. పంచాయితీలో ఏ పని జరగాలన్నా నిలిపేయాలన్నా అది రెడ్డి గారి ఇష్టం అంటారు అదే ప్రభుత్వానికి చెందిన ఆఫీసర్లు. పంచాయితీ పరిధిలో ఏం జరిగినా సర్పంచ్‌కు తెలపాలని అంటుంది చట్టం. రెడ్డికి చెబితే చాలు అంటారు ఆఫీసర్లు. ఇలాంటి నేపథ్యంలో వానలు లేక చెరువులు, బావులు ఎండిపోయి ఊర్లో తాగడానికి నీళ్ల కరువు ఏర్పడుతుంది. మామూలుగా అడిగినట్లుగానే ఆ ఊరి జనం రెడ్డిగారిని అడిగి కాదనిపించుకుంటారు. సర్పంచిగా శీను దళిత గిరిజన సంఘాలను కలుపుకొని కలెక్టర్‌ను కలిసి అర్జీలు రాయించుకొని కాళ్లు అరిగేదాకా తిరిగి కష్టార్జితం కొంత కరిగినాక పై అధికారులు కరుణించడంతో బోరు మంజూరు అవుతుంది. జియాలజిస్టులు వచ్చి సర్వే చేస్తారు. ఎస్టీ కాలనీలో నీళ్లు పడతాయని తేల్చి చెబుతారు. అది మింగుడు పడలేదు రెడ్డిగారికి, ఊర్లో జనాలకి. ఊర్లో బోర్ ఉంటే ఎస్టీ కాలనీ వాళ్లు నీళ్ల కోసం ఊర్లోకి వస్తారు. పెద్ద కులం వాళ్ళు నీళ్లు పట్టుకున్నాక కాలనీ వాళ్లు పట్టుకోవచ్చు. ఊర్లో కుళాయిలు ఉన్నాయి. కానీ కాలనీలోనే ఇప్పటిదాకా ఒక కుళాయి లేదు. రెడ్డి వేయించలేదు. సర్పంచు వేయించుకోలేకపోయాడు. ఇప్పుడు ఎస్టీ కాలనీలో బోరు వేయడం అనివార్య కారణాలవల్ల కుదరదు అనే ఏకగ్రీవ తీర్మానాన్ని పంచాయతీ ఆమోదించినట్లు, శీను సర్పంచి హోదాలో సంతకం పెట్టాలి. రెడ్డి ఎంత గద్దించినా శీనుగాడు సంతకం చేయడు. ఇక్కడే శీను ఎదిరింపు చైతన్యం “చప్పుడు” మనకు వినబడుతుంది.
రిజర్వుడు కేటగిరిలో ఎంపికైన పంచాయితీ కార్యదర్శి లలితమ్మ, దళిత గిరిజనులకు తన వంతు సేవగా వారికి తగిన న్యాయం చేకూర్చాలని తపన పడుతుంది. “నిరుపేదల్లో నిరుపేదల కోసం ఉద్దేశించిన రుణాలు చాలావరకు బినామీల పేరుతోనే స్వాహా అయిపోతూ ఉన్నాయి. నేను కింది స్థాయి కులాల నుండి వచ్చిన దాన్నే. మన ఎంపీడీవో కూడా రిజర్వ్డ్ కులాలకు చెందిన వ్యక్తి కావడం వల్లే ఏదో ఎండీఓ ఆఫీసులో కూర్చుని పెద్దపెద్ద నాయకులు, కుల నాయకులు, దళారులు చెప్పే పేర్లు రాసి రుణాలు మంజూరు చేసే పురాతన సంప్రదాయాన్ని కాదని ఇట్లా నన్ను మీ ఊరికి పంపించారు. ఒక మంచి వ్యక్తి మంచి చేద్దాం అనుకున్నప్పుడు అతనికి అందరం సహకరించాల. ఎవరూ ఈ లబ్ధిదారుల ఎంపికలో చెయ్యెత్తి చూపించని విధంగా అర్హుల జాబితా ఉండాలనుకున్నాం. ఇదంతా మీకు అర్థమవుతుందని అనుకుంటాను. మీకు తెలుసో తెలీదో ఒక నాయుడో, రెడ్డో ఇంకో అగ్రవర్ణాల అధికారో కులపిచ్చి చూపిస్తే చెల్లుబాటు అయినట్లు- ఒక ఎస్సీనో, ఎస్టీనో, బీసీనో అధికారి తన కులం వాళ్లకు ఏదైనా మంచి చేద్దామని చూస్తే అదెంత మాత్రము జరగనివ్వరు పెద్దోళ్ళు. నా సర్వీసులోనే నేను మొదటిసారి చూస్తా ఉన్నాను. ఒక తపన కలిగిన పేదల పక్షపాతి అయిన ఆఫీసర్ని. ముందు మేం రుణాల మంజూరు కోసం ఎంపిక చేద్దామనుకోనుండే వాళ్ల పేర్లు వివరాలు మీ అందరికీ చదివి వినిపిస్తాను. అంతా నెమ్మదిగా విని మీ అభ్యంతరాలు- సూచనలు మార్పులు, చేర్పులేవన్న ఉంటే చివర్లో చెప్పండి” అని వారిలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపోందించుతుంది.
ఎరుకల సంస్కృతిలో కుల పంచాయితీలు ఒక భాగం. ఎరుకలలో వచ్చిన గొడవలు- వివాదాలను వాళ్ళ కుల పంచాయతీలోని పరిష్కరించుకోవాలి. దీన్ని పట్టించుకొని వాళ్లను, తీర్పును అమలుపరచనివారిని కులంలోంచి వెలివేస్తారు. “కబాబ్ కపాలి” వాళ్ళ తాతల బాతుల వ్యాపారం, తండ్రి పందుల వ్యాపారం- ఆ రెండిట్లో దేనినో ఒక దాన్ని ఎంచుకోవాల్సింది పోయి ఇంట్లో గొడవపడి ఏదో చిన్న విషయానికే ఇంట్లో దొరికినంత డబ్బు తీసుకొని మద్రాస్‌కు పారిపోతాడు. కొన్నేళ్లపాటు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎవరూ లేరు. ముగ్గురు అన్నలు ఆస్తులు పంచుకునే క్రమంలో బాతుల్ని, పందుల్ని, గుడిసెల్ని భాగం పెట్టుకొని వేరు కుటుంబాలు పెట్టుకునేసారు. ఇక రాడేమో అనుకున్న కపాలి రావడం ఎవరికి నచ్చలేదు. అతని రాకను ఎవరూ ఇష్టపడలేదు. ఇంకో మార్గం లేక తప్పనిసరై కపాలి కుల పంచాయితీ పెట్టించాడు. రెండు రాత్రులు, మూడు పగళ్ళు సాగింది పంచాయతీ. ఎరుకల కులపెద్దలంటే మాటలు కాదు. నాటుసారా, పంది మాంసం పంచాయతీ పెద్దలకు ఇరుపక్షాలు పంచాయితీ జరిగినంత కాలం సమర్పించుకోవాల్సిందే. వాదించే కొద్దీ మాటలే కాదు, మాటలతో పాటు ఖర్చులూ పెరిగిపోతాయి. అప్పులు పెరిగిపోతాయి. అయినా ఒక పట్టాన తొందరగా ఏ పంచాయితీ ఎప్పుడు తేలింది లేదు. అయినా కులపోల మాట కాదని ఎవరూ బయటికి పోరు. అదొక తరతరాల కట్టుబాటు. కులం గీసిన సరిహద్దు రేఖల్ని దాటినోళ్లకి, కులం నుండి వెలివేతే పెద్ద శిక్ష. ఆ అన్నలు ముగ్గురూ అప్పులు చూపించారు. మొన్నటిదాకా బతికి రోగంతో చనిపోయిన తల్లికి ఖర్చులు, ఏవేవో అప్పులు వడ్డీలు లెక్కలు చూపించారు. కపాలికి ఆ లెక్కలు తెలియవు. ఏ లెక్కలూ తెలియవు. పంచాయితీ పెద్దలు వాళ్ల ముగ్గురికి వత్తాసు పలికారు. 3000 రూపాయలు కపాలి భాగం కిందికి వస్తుందని లెక్క తేల్చి, మూడు వాయిదాలలో ఆ మొత్తాన్ని అతడికి అన్నలు అప్పగించాలని తీర్పునిచ్చారు. ఆ మూడో వాయిదా సొమ్ము చేతికి అందిసరికి, జరిగిన ఆరు పంచాయతీలకు రెండు వేల రూపాయలు ఖర్చయిపోగా, నికరంగా అతడి చేతికొచ్చింది ఒక వెయ్యి మాత్రమే. సామాన్యంగా కుల పెద్దలు డబ్బు ఉన్న వారి వైపు లేదా వారికి ఎక్కువ మర్యాదలు చేసిన వారి వైపే మొగ్గుతారు నిజమైన బాధితుడికి న్యాయం జరుగుతుందన్న ఆశ ఉండదు. అయినా సరే కుల పంచాయితీని కాదని బయటికి పోవడానికి వీలు లేని పరిస్థితి అది.
ఎరుకల కుటుంబాల్లో డబ్బు ఉన్నా లేకపోయినా, అప్పోసప్పో చేసి అయినా ఆడంబరంగా జరిపించే వేడుకల్లో “మునిదేవర” ఎంతో ముఖ్యమైనది. పిల్లలకి మూడో సంవత్సరంలోగా మునీశ్వరుడికి తలవెంట్రుకలిచ్చి మేకపోతును, కోడిపుంజును, కోడి పెట్టెను బలిచ్చే పండగ అది. బలికిగాను తెల్ల మచ్చ ఒకటి కూడా లేని నల్ల మేకపోతు కావాలి. వేడుక రోజు నేలపైన మట్టితో మునీశ్వరుడి పెద్ద విగ్రహం తీర్చిదిద్దుతారు. పసుపు కుంకుమ విభూదితో రంగురంగు పూలతో అలంకరిస్తారు. మునీశ్వరుడు పైన పసుపు కుంకుమ పూలు వర్షం లాగా కురుస్తుంటే, అదురుతూ బెదురుతూ ఉన్న మేకపోతును ఒడిసి పట్టుకుంటారు. ఒక్క వేటుతో దాని తల తెగిపోవాల. తెగిన మేకపోతు తలను మునీశ్వరుడి ముందుంచి అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటే అక్కడికి కోడిపుంజు కోడిపెట్ట విగత శరీరాలు వచ్చి చేరుతాయి. పిల్లలందరికీ అక్కడే గుండ్లు కొట్టించి, చెవులు కుట్టి చెవి పోగులు తగిలిస్తారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు వాళ్ళ ఏడుపు సముదాయించడానికి పడే యాతన వేరు. ఎవరు ఏ కులమని ఊర్లో, టౌన్లో చెప్పుకున్నా ఇట్లాంటి మునిదేవరలకు మాత్రం యాడున్న వచ్చి తీరాల్సిందే. తెలిసి తెలిసి మునిదేవరకి రాకుండా ఉండే వాళ్ళు చాలా తక్కువ. ఈ మునిదేవరకి వచ్చేదానికి పేదాగీదా అని తేడా లేదు. డబ్బు ఉండేవాడైనా లేనోడైనా ఒకటే. మునీశ్వరుడికి ఎవరూ కోపం తెప్పించాలని అనుకోరు. ఆయనకు కోపం తెప్పిస్తే ఇక ఇంతే సంగతులు. ఆర్థిక అసమానతల్ని దాటి కులం కాదు, దేవుడంటే భయం కలిపిన బంధువుల సమూహాన్ని, వాళ్ళ కోలాహలాన్నీ విస్మయంగా అబ్బురంగా చూస్తాడు మహేష్.
ఇందులో కొన్ని కథలు రచయిత ఆత్మకథనాత్మకాలు. ఎంతో నిజాయితీగా నిబద్ధతతో బతికిన తండ్రిని, ఇంటినే కాదు పరోపకారబుద్ధితో ఇతరులకు సహాయపడే తల్లి, ఊరి బాబు- ఊరి మనుషుల బాగును పట్టించుకున్న ఆదర్శ మహిళామూర్తి కాంతమ్మ గురించి, వాళ్లతో పెనవేసుకున్న తన బాల్య విశేషాలను ఈ కథలలో చక్కగా అక్షరబద్ధం చేయగలిగారు. ఎరుకల కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో కథ. అన్ని కథలు ఒకేలా ఉండవు. రచయిత తాత గాడిదల పైన ఉప్పు అమ్మే కాడి నుంచి, వాళ్ల నాయనా ఎట్లా ఉద్యోగస్తుడు అయినాడో, అటవీ శాఖలో గుర్రంపైన తిరిగి ఫారెస్టరు చిన్నయ్య పెద్ద కూతురు జయమ్మను, కాబోయే మామగారి ఇంటికి తిరిగి తిరిగి ప్రాధేయపడి, ఆ ఫారెస్టర్ చిన్నయ్యను ఒప్పించి మరి ఎట్లా పెళ్లి చేసుకున్నాడో అదంతా ఓ పెద్ద కథ. అటవీ శాఖలో ఉద్యోగి అయి ఉండి కూడా ఎప్పుడూ కట్టెలమోపు వాళ్లకు ఫైన్ వేయకుండా, మేకల వాళ్ళ దగ్గర సంవత్సరానికోసారి ఈనాంగా మేక పిల్లనో, గొర్రెపిల్లనో తీసుకోకుండా, సంవత్సరం మొత్తంలో ప్రభుత్వానికి వసూలు చేసిన అపరాధ రుసుము చెల్లించే సమయంలో, ఆ అపరాధ రుసుం అడవుల్లో పల్లెల్లో ఎవరి దగ్గర వసూలు చేయకుండా, ఆ నెల జీతం డబ్బుతో ప్రభుత్వానికి అపరాధ రుసుము చెల్లించి, ఈ నెల జీతం లేదు అని అమాయకంగా అపరాధిగా మా అమ్మ ముందు నిలుచుండిపోయిన కనికరం గుండె కలిగిన మా నాయన కథనే “11 నెలల జీతగాడి కథ”.
మా నాన్నకు మా అమ్మ చేతుల్లో జీతం డబ్బు పెట్టేయడమే తెలుసు. ఇంకేం తెలియదు. ఆయన అట్లా నిమ్మలంగా బీడీలు టీలు తాకుంటూ ఉండిపోతే సంసారం అంతా మాయమ్మే చూసుకునేది. మేం ఇంట్లో ఉన్నప్పుడు రోజంతా నిద్ర లేచిన దగ్గరనుంచి మేము పడుకునే దాకా మా అమ్మ మాతో ఎన్నో మాటలు మాట్లాడేది. ఎప్పుడు మంచి ఏమిటో, చెడు ఏమిటో చెబుతూనే ఉండేది. మా కులం ఏమిటో బెరుకు లేకుండా చెప్పాలని మా నాయన చెప్పేవాడు. తప్పు చేయనంత వరకు ఎవరు దేనికి భయపడకూడదని మా అమ్మ చెప్పేది. ఎవరైనా ఏదైనా మాట సహాయము, చేతిసాయం అడిగితే మాయమ్మ వెనక ముందు ఆలోచించేది కాదు. పగలని లేదు, రాత్రి లేదు. ఎవరు ఎప్పుడొచ్చి జయమ్మక్కా ఏం చేసేది ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంకా నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో ఎట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా అని ఏడిస్తే చాలు. ఆయమ్మ అంతగా కరిగిపోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడు ఎవరికోసమో కుదవలోనే ఉంటాయి. “మీ అమ్మ ఇంతే. ఈ కాలనీకి ఒక మదర్ తెరెసా లే “అని నవ్వుకునే తండ్రి.
మొత్తం ఆ ప్రాంతంలోనే ఎరికిలోల కాంతమ్మ అంటేనే ఉండే గౌరవమే వేరు. ఆ అమ్మ చెయ్యి మంచిది. ఆ అమ్మ నోరు మంచిది. ఆ అమ్మ గుణం మంచిది అని జనం అనడం వెనకాల ఆమె నిలుపుకున్న పెద్దరికం అలాంటిది. 10 మందిని సంపాదించుకున్న ఆమె మంచితనం అలాంటిది. అమె ఇప్పుడు లేదు. చనిపోయి ఆరేళ్లు అవుతుంది. ఎరుకల ఇండ్లలో ఎంతో మంది పిల్లల భవిష్యత్తును, ఎంతోమంది ఆడవాళ్ళ సంసారాలను కాపాడిన ఆమె గురించి దీపం పెట్టే సమయాల్లో, ఏ ఇంట్లో అయినా తలచుకొని వాళ్లంటూ ఉండరు. మా కాంతమ్మత్త చనిపోయినా మా మాటల్లో, మనసుల్లో, జ్ఞాపకాల్లో ఆమె సజీవంగానే ఉంది ఇప్పటికీ అంటూ ఆమె గొప్పతనం గురించి వివరిస్తూ” అమరజీవి మా కాంతమ్మత్త” అని కొనియాడతాడు.
ఎరుకల కులంలో పుట్టి ఊరు దాటి, జిల్లా దాటి హాస్టల్లో చదువుకొని టీచర్ ఉద్యోగంలో చేరిన ఎరుకల నరసింహులు ఎక్కడ ఎవరి ముందు తలదించినవాడు కాదు. పెద్దోళ్ల కుట్రలకి పోలీసు కేసులకి ఉద్యోగం పోయినా వెనుకడుగు వేసిన వాడు కాడు. ఒక సాదాసీదా మామూలు మనిషి పెద్దోళ్ల అన్యాయాన్ని ఒప్పుకోకుండా తిరగబడి ఎదిరించి నిలబడితే ఉడుకుడుగా మాట్లాడితే ఆ మనిషిని జైలుకు పంపిన కథ. సాటి కులమోల్ల కోసం జైలుకు వెళ్లి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఉన్నత విద్యావంతుడైన ఒక గిరిజన ఉపాధ్యాయుడి కథ. ప్రభుత్వ ఉద్యోగం పోయినా జీతం లేకుండానే కొన్ని సంవత్సరాల పాటు ఎంతోమంది పేద పిల్లలకి మంచి చెడు చెప్పి పాఠాలు నేర్పి ప్రయోజకుల్ని చేసిన ఒక సృజన కారుని కథనే “ఉడుకోడు”.
ఎరుకల విద్యార్థులు డిగ్రీలు చదువుతున్నా, ఇంకా ఆపైన చదువుతున్నా మా కులం ఇది అని ధైర్యంగా చెప్పుకునే వాళ్ళు కొంతమందే. చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లు చాలామందిని చూసినా, కులం పేరు బయటకు చెప్పుకొని ధైర్యంగా బతుకుతుండేది కొంతమందే. చాలామంది ఏందేందో కులాల పేర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళలో ఆత్మన్యూనతను పోగొట్టి వారిపై వారికి నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేయడంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలను రూపొందించి, వాళ్లను ఎడ్యుకేట్ చేయడమే తన పనిగా పెట్టుకుంటాడు రచయిత. ప్రతి ఆదివారం ఎస్టీ కాలనీకి పోవడం, ఎస్టీల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి, సమానత్వం సాధించడానికి ఏం చేయాలో చర్చించడం, నోట్ బుక్స్ ఇవ్వడం, పాలిటెక్నిక్, ఎంసెట్, గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు రాసే వాళ్ళ కోసం పుస్తకాలు ఇస్తూ ఉండటం- వార్డు కార్యదర్శిని ప్రత్యేకంగా పిలిపించి ఇంకా పెన్షన్ రాని వాళ్ళకి పింఛన్ దరఖాస్తులు ఆన్లైన్ చేయించడం, ఏండ్ల తరబడి ప్రమాదకరంగా చేతికి అందేంత తక్కువ ఎత్తులో ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ గురించి కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి చుట్టూ ఫెన్సింగ్ వేయించడం, అమ్మవారి గుడి ఆవరణలో రేకుల షెడ్ వేయించి, ప్రతి రెండో శనివారం తనకు తెలిసిన ఇంగ్లీష్ మాస్టర్లను ఒప్పించి, ఉచితంగా ఇంగ్లీష్ పాటలు చెప్పించడం, పరీక్షల కోసం పుస్తకాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అందించడం, గుడిలో ఒక బడిని, గ్రంథాలయాన్ని ప్రారంభించడం, స్థానిక అధికారులతో డాక్టర్లతో మాట్లాడి నాలుగునెలకొకమారు మెడికల్ క్యాంపు పెట్టించడం, మున్సిపాలిటీ వాళ్లతో మాట్లాడి నెలకోసారి స్పెషల్ శానిటేషన్ నిర్వహించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. గవర్నమెంట్ ఆఫీసర్‌గా నీ పని నీవు చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు అని ప్రశ్నించిన వారితో, నేను వచ్చింది ఆ ఎరుకల కులం లోంచి. అదే కాలనీ లోంచి కదా. వాళ్ళని ఎట్లా దూరంగా పెడతాను. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమూ, వాళ్లను పైకి తీసుకురావడం నా బాధ్యత అని స్పష్టం చేయడం మనలను ఆ ఆకట్టుకుంటుంది.
ఎరుకలపై కొనసాగే వివక్ష – అణచివేత, వాళ్ళ జీవన పోరాటం గురించి తెలియజేయడమే కాకుండా – రచయిత లోతుల్లోకి పోయి బ్రతుకుతెరువు కోసం వారు అవలంబించిన రకరకాల పనులను, వారి ఇబ్బందులను, సంస్కృతి పరమైన విశేషాలతో ఒక జాతి చరిత్రను ఈ కథల రూపాన వెలుగులోకి తేవడం అభినందనీయం. ఇన్‌సైడర్‌గా రచయిత నిజాయితీ, నిబద్ధతను పాఠకులు కథల ద్వారా తప్పకుండా గుర్తించగలుగుతారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
