2014 మే 26 నుంచి గత 12 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని బీజేపీ పాలనలో భారత వ్యవసాయ రంగం ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గి దిగుమతులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచంలో 34కోట్ల ఎకరాల సాగుతో ప్రథమ స్థానంలో ఉన్న భారతదేశ ఉత్పత్తి- 35.7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలతో 3వ స్థానంలో ఉంది. 30కోట్ల ఎకరాలు సాగుచేస్తున్న చైనా మొదటి స్థానంలో, 80కోట్ల టన్నుల ఆహార ధాన్య ఉత్పత్తితో ఉంది. 28కోట్ల ఎకరాల సాగుతో 60కోట్ల టన్నుల ఆహార ధాన్య ఉత్పత్తితో రెండవ స్థానంలో అమెరికా ఉంది.
146 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారతదేశం ఉంది. జనాభా యేటా 1.9% పెరుగుతుండగా, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావడం లేదు.
గత 5 సంవత్సరాలుగా సగటున 4.6% ఉత్పత్తి జరినట్టు 2026 జనవరి 29న ఆర్థిక సర్వేలో వివరించారు.
వ్యవసాయాభివృద్ధి గురించి తప్పుడు గణాంకాలను, అభూతకల్పనల అంకెలతో ఆర్థిక సర్వేను రూపొందించారు.
దేశీయ వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే విధానం
క్రిప్టోన్నతి(రెండో హరిత విప్లవం)పై పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో రూ 11,200ల కోట్లు కేటాయించింది.
అంతకు ముందు గత 3 సంవత్సరాలుగా రూ 6,800ల కోట్లకు బడ్జెట్ మించలేదు.
దేశీయ వ్యవసాయోత్పత్తి రంగాన్ని దెబ్బతీసే విధంగా 2000ల సంవత్సరంలో విదేశీ కార్పొరేట్ సంస్థల ద్వారా విత్తన టెక్నాలజీని దిగుమతి చేసుకుంది.
మోన్సాంటో, డూ-పాయింట్, కార్గిల్, సిన్జంటా, బేయర్ సంస్థలతో పాటు దేశీయ కార్పొరేట్లు అదానీ, అంబానీ, ఐటీసీ, ఎల్&టీ, టాటా-బిర్లాలు విత్తన రంగంలోకి ప్రవేశించి 80% విత్తన రంగాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నాయి.
విదేశీ టెక్నాలజీ మన దేశ వాతావరణ పరిస్థితులకు సరిపోకపోవడం వల్ల విదేశీ విత్తనాలలో మొలకెత్తె స్వభావం, దిగుబడులు పెరిగే స్వభావం లేదు.
మన దేశ వ్యవసాయ ఉత్పత్తిని తగ్గించే, తమ దిగుమతులకు భారతదేశాన్ని మార్కెట్‌గా జీ7 దేశాలు ఉపయోగించుకుంటున్నాయి.
ఉత్పత్తి తగ్గి, పెరిగిన దిగుమతులు
2024-25 గణాంకాలను పరిశీలిస్తే, మన దేశంలోకి వ్యవసాయ దిగుమతులు రూ 2,90,309 కోట్లు కాగా అందులో రూ 146,729 కోట్లు వంటనూనెలు దిగుమతి చేసుకుంటున్నాం.
వీటితోపాటు కూరగాయలు, పండ్లు, పంచదార, పత్తి, మాంసం, పాల ఉత్పత్తులు లక్షల కోట్లలో దిగుమతులు అవుతున్నాయి.
మన దేశం నుంచి బియ్యం ఎగుమతులు 1,05,722 కోట్లకే పరిమితమైంది. ముడిపత్తి, చెరుకు మోలసీస్ 24వేలకోట్ల మేర ఎగుమతి చేస్తున్నాం.
ఈ విధంగా దిగుమతులపై ఆహార ధాన్యాలకు, ఉప ఉత్పత్తులకు విదేశాలపై ఆధారపడే పరిస్థితి కల్పించారు.
రుణాల స్థితిని తెలియజేస్తున్న నివేదిక
వ్యవసాయ రుణ పరపతికి సంబంధించి రిజర్వుబ్యాంకు ఆదేశాల ప్రకారం పంట రుణాలు ఇవ్వడం లేదు. దేశంలోని బ్యాంకుల వ్యాపార ధనంలో 40% వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. 2025 డిసెంబర్ నాటికి బ్యాంకుల డిపాజిట్లు రూ 300ల లక్షల కోట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దీని ప్రకారం, రూ 120 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. ఇందులో 18శాతం పంట రుణాలు ఇవ్వాలి. దేశంలోని మొత్తం రైతులు 14.57 కోట్లు కాగా; అందులో 12.63 కోట్లు 5ఎకరాల లోపు ఉన్న పేదరైతులు. వీరికి బ్యాంకు రుణాలలో 8.3శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ చెప్పింది.
అంతేకాక ప్రతి ఎకరాకు “జిల్లా టెక్నికల్ అడ్వైజర్ కమిటీ” ప్రకటించినట్టు పంట రుణాలు ఇవ్వాలి.
కానీ, ఆర్థిక సర్వేలో రూ 15.93 లక్షల కోట్లు స్వల్పకాలిక రుణాలు 12.77 లక్షల కోట్లు దీర్ఘకాలిక రుణాలు మొత్తం 26.70 లక్షల కోట్లు మాత్రమే రుణ సౌక్యం కల్పించినట్టు నివేదిక చెప్పింది.
మాట తప్పిన మోదీ ప్రభుత్వం
దాదాపు 40శాతం మంది రైతులు సంస్థాగత రుణాలు అందక ప్రైవేట్ రుణాలపై ఆధారపడి వడ్డీ భారం భరించలేక 13 రాష్ట్రాలలో యేటా లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రుణమాఫీ చట్టం తేవాలని రైతాంగం డిల్లీలో 11 నెలలు చేసిన పోరాటానికి హామీ ఇచ్చిన ప్రధానీ మోడీ మాట తప్పి నేటికి అమలు జరపలేదు.
రైతులకు కనీసం మద్దతు ధరల లభ్యత అందుబాటులో లేదు. కేంద్ర ప్రభుత్వం 22 వ్యవసాయోత్పత్తులకు మాత్రమే మద్దతు ధరలు నిర్ణయిస్తున్నది.
డాక్టర్ స్వామినాథన్ సలహా ప్రకారం ఉత్పత్తి వ్యయంపై 50శాతం అదనంగా చెల్లించాలి. కానీ, ఉ త్పత్తి ధరను అశాస్త్రీయంగా నిర్ణయించి ధరలు తగ్గిస్తున్నారు.
ఆర్థికవేత్త అశోక్ గులాఠి ప్రకటన ప్రకారం, దేశ మార్కెట్లలోకి వస్తున్న రూ 18లక్షల కోట్ల వ్యవసాయోత్పత్తులలో మద్య దళారీలు కనీస మద్దతు ధరలను చెల్లించక రూ 4లక్షల కోట్లు కాజేసుకున్నట్టు తెలిపారు. అమెరికాలో వంద వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు జరుపుతున్నారు.
ఈ భారాలకు తోడు రైతులకు విద్యుత్ ఉచితంగా ఇవ్వకుండా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం “విద్యుత్ చట్టం- 2003″కు సవరణను తెచ్చింది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు మొత్తం రైతులు భరించే విధంగా చట్టంలో సవరణ చేశారు. క్రాస్సబ్సిడీని తొలగించారు. విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం “విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లను” ఏర్పాటు చేసింది. రాష్ట్రాల హక్కులను కాజేసి విద్యుత్ చట్టాన్ని మత ఆధీనంలోకి తెచ్చుకుంది.
స్థానిక రైతులకు నష్టం
హార్టికల్చర్ ఉత్పత్తుల దిగుమతులను నియంత్రించే విధంగా ప్రస్తుతం దేశంలో సాగవుతున్న విస్తీర్ణాన్ని 6.05 కోట్ల ఎకరాల నుంచి 12.56 లక్షల టన్నులకు మించడం లేదు. అనేక దేశాల నుంచి హార్టికల్చర్ దిగుమతులు పెద్ద ఎత్తున రావడంతో స్థానికంగా హార్టికల్చర్ రైతులు నష్టపోయి పంటలు తీసివేస్తున్నారు.
పెద్దయంత్రాలతో యాంత్రీకరణ తీసుకురావడంవల్ల చిన్న కమతాలు పనికిరాకుండా పోయాయి. వాటిని 5వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద కమతాలుగా మార్చాలని మోదీ ప్రభుత్వం 2020 నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. నేడు కార్పొరేట్ సంస్థలు తమ సహజ వ్యాపారాన్ని వదిలివేసి వ్యవసాయ రంగంలోకి వచ్చాయి. వాటికి అనుకూలంగా భూకేంద్రీకరణ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకనుగుణంగా భూ చట్టాలలో నీతి అయోగ్ ద్వారా మార్పులు చేస్తున్నాయి. వీటిని భారత రైతాంగం వ్యతిరేకించాలి.
ప్రకటించింది కానీ నిధులు కేటాయించలేదు
యాంత్రీకరణ ప్రచారానికి ఇంత వరకు దేశంలో 25,689 క్లస్టర్ హైరింగ్ సెంటర్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఆత్మనిర్బర్ భారత్(స్వయపోషకత్వం) వంటనూనెలు, పప్పులలో తెస్తామని 2025 అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగిన నిధులు 2026-27ట్లో కేటాయించలేదు.
నేటికీ సాగునీటి వనరులు 41.7% సాగు భూమికి మాత్రమే ఉన్నాయి. రైతులు తమ స్వంత ఖర్చులతో బోర్లువేసి పంటలు పండిస్తున్నారు. ప్రతి ఎకరాకు రైతు అదనంగా 5-6వేల రూపాయలు అదనంగా భరిస్తున్నారు. ఇన్ని ఆటంకాలను తట్టుకోని భారత రైతులు పంటలు పండిస్తున్న ప్రకృతి వైపరిత్యాల వల్ల యేటా 8కోట్ల ఎకరాలలో పంటలకు నష్టం వాటిళ్లుతున్నది.
ప్రధాని ఫసల్ బీమా రాష్ట్ర రైతాంగంలో 8% మందికి మాత్రమే అమలు చేస్తున్నారు. జరుగుతున్న నష్టంలో 10% సహకరిస్తున్నారు. అదే సందర్భంలో బీమా సంస్థలకు యేటా 4వేలకోట్ల రూపాయలు కట్టబెడుతున్నారు. ఎఫ్పీఓల ద్వారా సహాకార వ్యవస్థను అభివృద్ధి చెస్తున్నామని చెబుతూనే హోంమినిస్టర్ అమిత్‌షా నాయకత్వాన సహకార చట్టాలను పూర్తిగా మార్చివేశారు. గుజరాత్ తరహా సహకార వ్యవస్థను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో సహకార సొసైటీలు(970) ఉన్నప్పటికీ కనీసం 5వేల మంది రైతులకు రుణాలివ్వలేకపోతున్నాయి.
ముడి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడంవల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి అదనపు విలువ వచ్చే విధంగా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నూనె, ధాన్యం, పప్పులు, కూరగాయలు, ఆహార ధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ఇంతవరకు 20.4% మాత్రమే ప్రాసెసింగ్ చేస్తున్నారు.
గతంలో ఉన్న మార్కెఫెడ్ను రద్దు చేయడం ద్వారా రైతులు ప్రాసెసింగ్ చేయడం లేదు. తన కార్పొరేట్ విధానాల అమలు ద్వారా వ్యవసాయ రంగం నుంచి రైతులను వెళ్లగొట్టే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. దీనిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సంఘటిత ఉద్యమాన్ని రైతులు కొనసాగించాలి.
కేంద్రం ముందు పలు డిమాండ్లు
1. అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు శాస్త్రీయంగా ప్రకటించి అమలు చేయాలి
2. రైతుల రుణ విమోచన పథకాన్ని అమలు చేసి రైతులందరికీ సంస్థాగత రుణాలు ఇవ్వాలి
3. 2003 విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ఉపసంహరించుకోవాలి
4. సహకార వ్యవస్థలను, ఎఫ్పీఓలకు నాబార్డ్ ద్వారా తగినన్ని రుణాలు ఇవ్వాలి. రిజర్వుబ్యాంకు ఆదేశాల ప్రకారం, రైతుల ప్రైవేట్ రుణాలను సంస్థాగత రుణాలుగా మార్చాలి.
5. ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలి. మరణించిన కుటుంబాలకు రూ 6లక్షల పరిహారం చెల్లించాలి.
6. రైతులపై పెట్టిన అన్ని రకాల కేసులను ఉపసంహరించాలి.
పై కోరికల అమలుకు “ఫిబ్రవరి 12న” నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయడానికి అందులో రైతులందరూ పాల్గొనాలి. ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు సభలు, ర్యాలీలు నిర్వహించాలి. సమస్యలు పరిష్కారమయ్యేవరకు ఐక్య ఉద్యమాలు కొనసాగించాలి. ట్రేడ్ యూనియన్, వ్యవసాయ కార్థిక సంఘం తదితర సోదర సంఘాలతో కలిసి ఆందోళనలు కొనసాగించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
