
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తాజా సవరణ సెప్టెంబరు 22వ తేదీ నుంచి అమలవుతుంది. ఇంత వరకున్న నాలుగు స్లాబులను రెండు స్లాబులకు తగ్గిస్తూ సెప్టెంబరు 5న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి 5, 18% రెండు స్లాబులు మాత్రమే అమలుకానున్నాయి.
తగ్గించిన రెండు స్లాబుల వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభమన్నది పరిశీలిస్తే, సామాన్య దిగువ మధ్య తరగతి ప్రజలకు ఒరిగేదేమీ కనబడడం లేదు. తాము తెచ్చిన జీఎస్టీలోనే మార్పులు చేర్పులు చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్గించామని బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. వాస్తవానికి ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తే, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది.
ఆకాశాన్ని అంటుతోన్న నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించకుండా, కొన్ని వస్తువలపై నామమాత్రంగా జీఎస్టీ పన్నులను తగ్గిస్తే ఏమి లాభం?
చివరికి చదువకునే పిల్లలపట్ల ఏ మాత్రం కనికరం చూపించలేదు. వారికి కావాల్సిన వస్తువులు, పాఠ్యపుస్తకాలు, ఫీజులపై జీఎస్టీ తగ్గించలేదు. యువకులు పోటీ పరీక్షల కోసం తీసుకునే కోచింగ్, ఆన్లైన్ క్లాసులు, ట్యూషన్ ఫీజులలో ఏ మాత్రం ఊరట కలిగించే విషయం లేదు.
బడి పిల్లలకు సంబంధించిన మ్యాథమెటికల్, జియోమెట్రీ, కలర్ బాక్సులపైన గతంలో ఉన్నటువంటి 12% జీఎస్టీ స్లాబులను 5% తగ్గించారు. మ్యాపులు, చార్ట్‌లు, గ్లోబులు, స్టేషనరీ ఉత్పత్తులపై గతంలో ఉన్న 12% స్లాబును ప్రస్తుతం పూర్తిగా తొలిగించారు. ఇవి మినహాయిస్తే, పాఠశాల నిర్వహణ ఖర్చులపై మాత్రం కనికరం చూపలేదు.
పాఠశాల నిర్వహణ, అభివృద్ధి ఇతర రకరకాల పేర్లతో ఇప్పటికే యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు దండుకకుంటున్నాయి. ఇప్పుడు సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ కిందకు వచ్చే పాఠశాలలో వినియోగించే ఐటీ సేవలు, క్లినింగ్, సెక్యూరిటీ, మెంటెనెన్స్ తదితరాలపై గతంలో ఉన్న 12% స్లాబును 18% పెంచారు. ఈ తాజా పెంపుదలతో పాఠశాల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను మరింత పీక్కుతినే అవకాశం ఉంది.
పాఠ్యపుస్తకాలు, ప్రింటెడ్ స్టేషనరీ- స్టడీ మెటీరియల్‌పై 12% స్లాబు నుంచి 18% స్లాబుకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఏదో ఊరట కలిగిస్తున్నామని చెప్పడానికి పాఠ్యపుస్తకాలు, పిల్లలకు ఉపయోగపడే టేబుల్స్, కాగిత ఉత్పత్తులు, కాటన్- జూట్ హ్యాండ్ బ్యాగ్స్, ఇతర సామాగ్రిపై ఇప్పటి వరకున్న 12% స్లాబును 5% స్లాబులోకి తీసుకువచ్చారు.
ఇక వ్యక్తిగత అవసరాలైన టూత్‌పేస్టు, టూత్ బ్రష్‌లు, టాల్కమ్ పౌడర్, తల నూనే, షాంపులు, సబ్బులు ఇతర నిత్యవసర వస్తువులపై ఇప్పటి వరకున్న 18% స్లాబులను 5% స్లాబులకు తగ్గించారు. అన్ని రకాల వ్యక్తిగత ఆరోగ్యబీమాపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. బేకరీ వస్తువులు, నెయ్యి, వెన్న, కూరగాయ ఉత్పత్తులు, కొన్ని పండ్లపై ఉన్నటువంటి 12- 18% జీఎస్టీ స్లాబులను 5% తగ్గించారు. ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మిషీన్లు, డిష్ వాషర్లపై ఇంత వరకున్న 28% జీఎస్టీ పన్నును 18% తగ్గించారు. అన్ని రకాల టీవీలపై సెప్టెంబరు 22 నుంచి 18% పన్ను కొనసాగనున్నది. గతంలో స్క్రీన్ సైజును బట్టి టీవీలపై 18%, 28%- రెండు రకాల స్లాబులను విధించేవారు.
1200 సీసీలోపున్న పెట్రోలు, ఎల్పీజీ, సీఎన్జీ కార్లు, 1500 సీసీలోపున్న డీజీలు కార్లు, 1350 సీసీలోపున్న ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, అంబులెన్సులు, సిమెంటు, ఆటో విభాగాలపై స్లాబును 28- 18% తగ్గించారు.
పాన్ మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, 3500 సీసీకి మించి ఉన్న మోటరు సైకిళ్లు, 1200 సీసీకి మించి ఉన్న పెట్రోలు కార్లు, 1500 సీసీకి మించి ఉన్న డీజీలు కార్లు, కొన్ని రకాల శీతల పానియాలు, వ్యక్తిగత విమానాలపై ప్రత్యేకంగా 40% జీఎస్టీని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని వస్తువులపై మాత్రమే, అది కూడాను నామమాత్రంగా స్లాబులను తగ్గిస్తూ ప్రజలకు ఏదో మేలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ భేషని తమ భుజాలను కేంద్రం తడుముకుంటోంది. మరీ ప్రజా నిత్యవసర వస్తువుల ధరల జోలికి ఎందుకు వెళ్లడం లేదో అర్థం కావడం లేదు.
నిరుద్యోగం, చాలీచాలని ఆదాయాల వల్ల సామాన్యులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు నిత్యవసర వస్తువుల ధరలు పెనుభారంగా మారాయి. ఇటువంటప్పుడు ధర పెరుగుదలను తగ్గించినప్పుడే, కుదించిన స్లాబుల్లో తగ్గించిన జీఎస్టీ పన్నులు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
“నిత్యవసర వస్తువుల పెరుగుదల వల్ల దాదాపు 59% ప్రజలు చితికిపోతున్నారు. తప్పనిసరిగా అవసరమైతేనే ఫలానా వస్తువు కొంటున్నామని 80% ప్రజలు చెపుతున్నట్టు” వర్ల్డ్ ప్యానల్ బై నియోమెరేటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. గడిచిన మూడేళ్లలో నిత్యవసర వస్తువుల ధరలు 33% పెరిగాయని సర్వే ప్రకటించింది.
ఇలా నిత్యవసర వస్తువుల ధరలతో పోల్చితే, కుదించిన స్లాబులలో ఉన్న జీఎస్టీ పన్నులను పరిశీలిస్తే దిగువ మధ్యతరగతి సామాన్య ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.