“తెలంగాణ రైజింగ్” అనే మాటలు విస్తృతంగా వినిపిస్తున్న వేళ, రాష్ట్రంలో విద్యా రంగం బలహీనంగా ఉండటం, ఆరోగ్య రంగంలో కనిపించే ఫలితాలు, అసమానతలు పెరుగుతుండటం గమనించాల్సిన విషయం.
అభివృద్ధి ఒక్కటే ప్రజల సుఖసంతోషాలకు పూచీ ఇవ్వదు. విద్యా, ఆరోగ్య రంగాలకు బలమైన ప్రజానుకూల సంస్థాగతమైన వసతులను ఏర్పాటు చేయటం మీద, ఆర్థిక సమానత్వం మీద, మానవాభివృద్ధి మీద దృష్టి పెట్టినప్పుడే నిజమైన సంక్షేమం సాధ్యమౌతుంది.
స్థూలంగా చూస్తే, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వేగంగా ఆర్థిక వృద్ధి నమోదు చేస్తున్నది.
జీడీపీ ఒక్కటే “అభివృద్ధి”ని కొలిచే సాధనం కాదనీ, దానికి చాలా పరిమితులు ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది.
రాష్ట్రం బలమైన ఆర్థిక పనితీరు కనబరుస్తుతుండగా, విద్యా–ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండడం వల్ల అభివృద్ధి నిజంగా ఎవరికీ ప్రయోజనం చేకూర్చుతోందన్న ప్రశ్నలను లేవనెత్తింది.
విద్యపై ప్రభుత్వ పెట్టుబడి తక్కువగా కొనసాగుతున్న తెలంగాణలో జీడీపీ పెరుగుదల, విద్యా ప్రమాణాల మధ్య ఉన్న తేడా ఆందోళనకరమైన అంశంగా కనిపిస్తోంది.
తెలంగాణలో కొనసాగుతున్న అసమానతలు, వృద్ధినే అభివృద్ధిగా భావించే నూతన సరళీకరణ(నియో–లిబరల్) విధానాల పునర్మూల్యాంకనం అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి.
“అభివృద్ధి” అనే భావన కాలానుగుణంగా మారుతూ వచ్చినప్పటికీ, అధికారిక అంచనాల్లో ఇప్పటికీ స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ); వ్యక్తిగత తలసరి ఆదాయమనే భావన ఆధిక్యం ఇంకా కొనసాగుతోంది.
అయితే, వ్యక్తిగత ఆదాయం ఆధారంగా అభివృద్ధిని కొలవడంలో ఉన్న పరిమితులను చూపించే విస్తృతమైన పరిశోధనా సాహిత్యం ఇప్పటికే అందుబాటులో ఉంది.
అభివృద్ధి లక్ష్యం- కొత్త ప్రమాణాలు
వ్యక్తి ఆదాయం/వ్యక్తి గృహస్థ ఉత్పత్తి(జీఎస్డీపీ)లాంటి సగటు సంఖ్యలు ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య ఆదాయ పంపిణీ ఎలా జరుగుతుందనే విషయాన్ని తెలియజెప్పవు. ఈ పద్ధతి ఉత్పత్తి పెరుగుదలను మాత్రమే హైలైట్ చేస్తుంది.
వాతావరణ కాలుష్యం, భూసాంద్రత క్షీణత, వనరుల దోపిడీ వంటి ప్రతికూల ప్రభావాలను అసలు పట్టించుకోవు. వృద్ధి ఫలాలు ఎవరికీ అందుతున్నాయి? దాని వల్ల జరిగే సామాజిక, పర్యావరణ ఖర్చులు గురించి అసలు పట్టించుకోవు.
ఇటువంటి ప్రశ్నలకు అసలు సమాధానం దాట వేస్తాయి లేదా చాలా తక్కువ లేదా అసంబద్ధమైన సమాధానాలు ఇస్తాయి.
వ్యక్తి ఆదాయం ప్రజల చేతిలో ఉన్న ఉత్పత్తి “సాధనాల”మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మౌలికంగా చెపుతాయి.
ఆ సాధనాలతో వారు నిజంగా ఏం సాధించగలుగుతున్నారనే దాన్ని చెప్పరు(Sen 1988).
సేన్ తన పరిశోధన ద్వారా మన దృష్టిని “మనుషుల పరిస్థితి మెరుగుదల”వైపుకు మళ్లించారు.
ప్రజలు అర్థవంతమైన జీవితాలు జీవించేందుకు అవసరమైన “సామర్థ్యాలు” పెంచడమే అభివృద్ధి లక్ష్యమని ఈ పరిశోధన ద్వారా తెలుస్తోంది(2003).
అభివృద్ధి అర్థాన్ని మరింత విస్తృతం చేసిన భావనలు
ఈ సామర్థ్యాల ఆధారిత దృక్కోణం అభివృద్ధి అనే పదానికి కొత్త ప్రమాణాలకు చూపించింది.
ముఖ్యంగా 1990లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం,(యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్- యూఎన్డీపీ) ప్రవేశపెట్టిన మానవ అభివృద్ధి సూచిక(హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్- హెచ్‌డీఐ)విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల సూచికలను తెలిపేది ఆదాయం ఒక్కటి మాత్రమే కాదని, సంక్షేమాన్ని మరింత విస్తృత కోణంలో చూడాలనే ఆలోచనను ముందుకు తెచ్చింది.
హెచ్‌డీఐ మూడు భాగాలపై ఆధారపడి ఉంటుంది.
విద్య(ప్రారంభంలో సాక్షరత, తర్వాత చదువుకునే సంవత్సరాలు), ఆరోగ్యం(జీవించేకాలం ), వ్యక్తిగత ఆదాయం(Per Capita GDP).
ఈ ద్రృక్కోణం ప్రకారం వృద్ధి అవసరమే, కానీ అదొక్కటే సరిపోదని తెలియజెపుతోంది.
ఇదే తరుణంలో స్థిరమైన అభివృద్ధి- సస్టెయినబుల్ డెవలప్మెంట్(Brundtland Commission 1987), అలాగే జీడీపీకి ఉన్న పరిమితులను వెల్లడించిన స్టిగ్లిట్జ్ కమిషన్ (2008) ప్రతిపాదించిన ప్రజా సంక్షేమం(“వెల్బీయింగ్”) భావనలు అభివృద్ధి అర్థాన్ని మరింత విస్తృతంగా మన ముందుకు తీసుకు వచ్చాయి.
స్టిగ్లిట్జ్ కమిషన్ ప్రజా సంక్షేమం (“వెల్బీయింగ్”)ను పలు కోణాల్లో లెక్కించాలనే ఆలోచనను ముందుకు తెచ్చింది.
జాతీయ ఉత్పత్తి గణాంకాల అభివృద్ధి మాత్రమే కాకుండా- గృహస్థ ఆదాయం, వినియోగం వైపు మన దృష్టిని మళ్లించి, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో ప్రభుత్వం కల్పించే వసతులను కూడా సంక్షేమంలో భాగంగా చూడాలని చెప్పింది.
విస్తృత అభివృద్ధి దృక్కోణంలో అంచనా వేయడం
అదే కమిషన్ ప్రజాసంక్షేమం(“వెల్బీయింగ్”)ను గుణాత్మక అంశాల వైపు మళ్లించింది.
అసమానతలు, రాజకీయ భాగస్వామ్యం, పర్యావరణ స్థిరత్వం, వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలను కూడా ప్రజా సంక్షేమంలో భాగంగా చేర్చింది. అంటే జీడీపీ పెరిగింది కాబట్టి సమాజం అభివృద్ధి చెందిందని అనుకోవడం సరికాదనే సందేశాన్ని బలంగా ఇచ్చింది.
ఈ నేపథ్యపు వెలుగులో, తెలంగాణ ఆర్థిక ప్రగతిని ఇతర నాలుగు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి, జీఎస్డీపీ/ తలసరి ఆదాయంతో కాకుండా, విస్తృత అభివృద్ధి దృక్కోణంలో అంచనా వేయడం ఈ వ్యాసం లక్ష్యం. ఇందులో గృహ సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి గుణాత్మక సామాజిక సూచికలు, రాష్ట్రం కల్పించే ప్రజా వసతుల స్థాయి కీలకం అవుతాయి.
నీతి ఆయోగ్ నిర్ణయం ప్రకారం, 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల నిధి నుంచి రాష్ట్రాల వాటాను 32%-42%కి పెంచిన తర్వాత, 2014–15, 2015–16 సామాజిక రంగంలో చేసిన ఖర్చుల ప్రభావం వల్ల పెద్దగా ఫలితాలు ఏమీ కనిపించలేదని అధ్యయనాలు చెబుతున్నాయి(కుమార్ నివేదిక 2018).
విశేషమైన తెలంగాణ పనితీరు..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన డిమాండ్ ఈ ప్రాంతం తన ఆర్థిక వనరుల (నీళ్లు, నిధులు, నియామకాలు)పై నియంత్రణ కలిగి ఉండాలన్నది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఆర్థిక స్థితి ఈ కోరిక (డిమాండ్) వాస్తవమే అని రుజువు చేసింది.
స్వంత ఆదాయ వనరుల పరంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దీని కోసమే ఈ ప్రాంతం మొదటి నుంచి పోరాడింది.
విభజిత ఆంధ్రప్రదేశ్ మాత్రం రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి వనరుల కొరతను ఎదుర్కొంటుంది. పట్టికలు చూపించని మరో విషయం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రారంభం ఆదాయ మిగులు బడ్జెట్‌తో ప్రారంభం అయింది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాన్ని మొదటి ఐదు ఆదాయ మిగులు రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని ప్రకటించింది.
అయితే ఇదే కేంద్రం నుంచి ఆదాయ లోటుకు సంబంధించిన గ్రాంట్లు తెచ్చుకోవటానికి ఒక అడ్డంకి అయింది.
పట్టిక 1: రాష్ట్రాల ఆదాయ సేకరణ సామర్థ్యం, 2024–25
విద్యా రంగంలో పరిస్థితి
తెలంగాణ వృద్ధి చాలా బలమైన మార్గంలో ఉంది. 2014–15 నుంచి దాని జీఎస్డీపీ(రాష్ట్ర స్థూల ఉత్పత్తి) వృద్ధి నిరంతరం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.
తలసరి ఆదాయం జీఎస్డీపీ జాతీయ సగటు కంటే తెలంగాణ ఆధిక్యం 2014–15లో 39.3% నుంచి 2023–24లో 67.69%కి పెరిగింది.
సాధారణ ఆర్థిక సూత్రాల ప్రకారం తెలంగాణ విశేషమైన పనితీరును కనబరిచింది.
అయితే, ఈ వృద్ధి సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను ఎంతవరకు మెరుగు పరిచిందనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అందు కొరకు విద్య, ఆరోగ్యం రంగాలపై లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.
పట్టిక 2: తెలంగాణ& భారతదేశం: జీడీపీ వృద్ధి, తలసరి ఆదాయ స్థాయి- తులనాత్మక వివరాలు

నియో లిబరల్ ధోరణి ఎలా ఉందంటే..!
విద్య రంగం పనితీరు, రాష్ట్ర స్థాయి నిధులు, పాఠశాల మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల లభ్యత, వారి అర్హతలు, ప్రభుత్వ విద్యతోపాటు ప్రైవేటు విద్య మధ్య తేడాలు; గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, విద్యార్థుల పరీక్షా ఫలితాలు వంటి అంశాలపై విస్తృత సాహిత్యం అందుబాటులో ఉంది.
ఇక్కడ చర్చ ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం, ఖర్చులు దాని ప్రాధాన్యతల చుట్టూ కేంద్రీకృతమవుతోంది.
బలమైన ఆదాయ పునాది, 2023–24లో దక్షిణ రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం(జీఎస్డీపీ)ఉన్నప్పటికీ, తెలంగాణలో విద్యపై ప్రతి వ్యక్తిపై ఖర్చు చేసే సగటు బడ్జెట్ అతి తక్కువగా ఉంది.
జాతీయ సగటు కంటే తెలంగాణ రాష్ట్రం 38% తక్కువ ఖర్చు చేస్తుంది.
వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఇంతకు ముందు ప్రభుత్వాలలానే నూతన సరళీకరణ(నియో లిబరల్) ధోరణిని పెద్దగా మార్చకుండా కొనసాగించాయి.
దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలలోనూ విద్యపై ప్రభుత్వం ఖర్చు తక్కువే. కనిష్టంగా తెలంగాణ GSDPలో 2% నుంచి గరిష్టంగా కేరళలో 3.46% వరకు మాత్రమే విద్యపై ఖర్చు చేస్తున్నాయి.
అయితే కేరళ చరిత్రాత్మకంగా చూస్తే విద్యకు ప్రాధాన్యతను ఇచ్చింది. కర్ణాటక కూడా తెలంగాణలానే తక్కువ ఖర్చు వైపు దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఇటీవల తమ పూర్వపు ఆధిపత్యాన్ని కొంత కోల్పోయాయి.
ఈ వ్యత్యాసాలు తెలంగాణలో అధిక వృద్ధి, విద్యపై తక్కువ పెట్టుబడి మధ్య ఉన్న వైరుధ్యాన్ని మరింత స్పష్టంగా చూపుతున్నాయి.
పట్టిక 3: వ్యక్తి జీఎస్డీపీ, విద్యపై తలసరి బడ్జెట్ ఖర్చు(రాష్ట్రాల పోలిక)
–
పాఠశాల స్థాయి విద్యా పనితీరు అంచనాకు నీతి ఆయోగ్ పాఠశాల విద్యా నాణ్యత సూచిక(ఎస్ఈక్యూఐ), అలాగే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పనితీరు ఆధారిత సూచికలను ప్రామాణికంగా తీసుకుంటుంది.
ఇవి గతంలో ఎన్సీఈఆర్టీ నిర్వహించిన జాతీయ విజయాల సర్వేలపై ఆధారపడుతాయి.
ఎస్ఈక్యూఐ తాజా సమాచారం ఇవ్వకపోయినా రాష్ట్రాల మధ్య సమగ్రమైన పోలికను ఇచ్చింది. పీజీఐ తాజా ర్యాంకులను అందిస్తోంది.
ఈ రెండు సూచికలలోనూ తెలంగాణ అట్టడుగున ఉంది. ఎస్ఈక్యూఐలో తెలంగాణ స్కోరు కేరళ స్కోరులో సగం కన్నా కూడా తక్కువగా ఉంది.
పట్టిక 4: పాఠశాల విద్యా నాణ్యత సూచిక(ఎస్ఈక్యూఐ); పని ఆధారిత సూచిక(పీజీఐ)పాఠశాల విద్యా పనితీరు & ర్యాంకులు

ఇంకా వెనుకపడిన తెలంగాణ
వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక(ఏఎస్ఈఆర్)2023, 2024 సర్వేలు గ్రామీణ పాఠశాలలకే పరిమితమైనా, భారతదేశంలో తీవ్రమైన నాణ్యతా లోపాలు ప్రధానంగా గ్రామీణ విద్యలోనే ఉన్నందున ఇవి చాలా ప్రాధాన్యం కలిగి ఉన్నాయి.
ఏఎస్ఈఆర్- 2024 నివేదిక ప్రకారం గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు జాతీయ సగటును కర్ణాటక, తమిళనాడు అధిగమించాయి. కేరళలో కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాలు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్నాయి. వాటిలో కూడా తెలంగాణ ఇంకా వెనుకపడి ఉంది. చదవే సామర్థ్యంలో ఫలితాలు మరీ దుర్భరంగా ఉన్నాయి.
తెలంగాణలో 3వ తరగతి విద్యార్థుల్లో కేవలం 6.2% మాత్రమే 2వ తరగతి పాఠ్యాంశాలు చదవగలుగుతున్నారు. ఇది జాతీయ సగటు 27% కంటే చాలా తక్కువ.
తరగతులు పెరిగేకొద్దీ చదవడంలో కొంత మెరుగుదల కనిపించినా జాతీయ సగటు కన్నా చాలా తక్కువగానే ఉంది.
గణితంలో కొంత భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. అన్ని తరగతుల్లో కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది.
చదువులో కంటే గణితంలో తెలంగాణ మెరుగ్గా ఉంది. 5వ, 8వ తరగతులకు సంబంధించి రెండో స్థానంలో నిలిచినా, జాతీయ సగటు కన్నా ఇంకా తక్కువగానే ఉంది.
పట్టిక 5: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నమోదు & III, V, VIII తరగతుల్లో అభ్యసన స్థాయి(గ్రామీణ 2024)

ఏఎస్ఈఆర్ 2023 “బియాండ్ బేసిక్స్” సర్వే(14–18 ఏళ్ల యువత) ప్రకారం, పరిస్థితులు చాలా ఆందోళనకరమైన స్థాయిలో ఉన్నాయి.
ఈ వయసులో పిల్లలలో మార్పు కీలక దశలో ఉంటుంది. ఇక్కడ విద్యను విడిచి పెడితే జీవితాంతం అప్రధానమైన, తక్కువ వేతన పనుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.
అర్థవంతమైన విద్యకు దూరమై పోయిన 60% యువత..!
ఈ సర్వే యువత కార్యకలాపాలు మాత్రమే కాదు- చదవడం, అంకగణితం, ఇంగ్లీష్, డిజిటల్ లావాదేవీ నైపుణ్యాల వంటి సామర్థ్యాలను కూడా తెలియజేస్తుంది.
పట్టిక 6: యువత(14–18) కార్యకలాపాలు(2023- నివేదిక ప్రకారం)

తెలంగాణలో 14–18 ఏళ్ల యువతలో 30% మంది పాఠశాలలో లేదా కాలేజీలో కానీ లేరు. తమిళనాడులో ఇది 2.8% మాత్రమే పరిమితం.
సర్వే ప్రకారం మరో 26.9% మంది నెలలో కనీసం 15 రోజులు పని చేస్తున్నారు. కలిపి చూస్తే, దాదాపు 60% యువత అర్థవంతమైన విద్యకు దూరమై పోయినట్టే.
ఇందుకు రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ రూపకల్పన వల్ల పాఠశాల విద్యా నాణ్యత చాలా బలహీనంగా ఉంది.
తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలలు 12వ తరగతి వరకు ఎస్టీఈఎం పద్దతి ప్రకారం నడుస్తుంటే, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి వారికే పరిమితం అయ్యాయి.
దీంతో విద్యార్థులు ఖరీదైన ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలకు వెళ్లవలసి వస్తుంది. అందువల్ల పేద కుటుంబాల పిల్లలు పెద్ద సంఖ్యలో మధ్యలోనే చదువు మానేసే పరిస్థితి ఏర్పడుతోంది.
పట్టిక 7: 14–18 ఏళ్ల యువత వారి సామర్థ్యాలు(2023)

యువత సామర్థ్యాల్లో అగ్రస్థానంలో కేరళ
వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక- ఏఎస్ఈఆర్ 2023 ప్రకారం, ఆరు రకాల గణాంకాలలోనూ తెలంగాణ చివరి స్థానంలో ఉంది.
విద్యార్ధులలో చదవ గల సామర్థ్యం 45.8% మాత్రమే కానీ ఇతర దక్షిణ రాష్ట్రాల్లో అది 71–86% గా ఉంది.
గణితంలో ఆంధ్రప్రదేశ్ 58.2%తో ముందుండగా, తెలంగాణ 19.9%తో చివరన నిలిచింది. కేరళ చాలా సూచీల్లో, యువత సామర్థ్యాల్లో అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ గణితంలో అందరి కంటే ముందుంది.
తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్య మరింత తీవ్రమైనది. పాఠశాలల నిర్మాణం, నాణ్యత రెండింటిలోనూ వ్యవస్థా పరమైన వైఫల్యాలు ఒక తరం అవకాశాలకు గట్టి అడ్డంకిగా మారుతున్నాయి.
ఈ నిర్లక్ష్యం పాఠశాల విద్యకే కాక ఉన్నత విద్యకూ విస్తరించింది.
ప్రాముఖ్యత ఇవ్వని వైనం
2047 నాటికి విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తిని రెట్టింపు చేయాలనే నీతి ఆయోగ్ “వికసిత్ భారత్” లక్ష్యానికి అనుగుణంగా ముందడుగు వేయాల్సిన వేళ, తెలంగాణ ఈ అజెండాకు పెద్దగా ప్రాముఖ్యత ఇస్తున్నట్టు కనిపించటం లేదు.
ప్రపంచ బ్యాంక్ తాజా వాదనల ప్రకారం- బలమైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, ప్రైవేటు రంగంపై అధికంగా ఆధారపడితే సామాజికంగా అవసరమైన, లాభదాయకం కాని రంగాల్లో తక్కువ పెట్టుబడి పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి(2020).
తిలక్ (2025) వంటి పండితులు ఉన్నత విద్యను ” పెద్ద ప్రజా మేలు”గా పేర్కొంటూ, దానికి రాష్ట్రాలు దృఢమైన నాయకత్వం అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.
పట్టిక 8: ఉన్నత విద్యలో స్థూల నమోదు రేటు, ప్రభుత్వ ఖర్చు, రాష్ట్ర పబ్లిక్ విశ్వవిద్యాలయాల ర్యాంకులు(2020–21 & 2021–22)

ఉన్నత విద్యలో దయనీయ పరిస్థితి
దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలలోనూ విద్యపై ప్రభుత్వం ఖర్చు తక్కువే. తెలంగాణలో కనిష్టంగా రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి- జీఎస్డీపీలో 2% నుంచి కేరళలో గరిష్టంగా 3.46% వరకు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. ఉన్నత విద్యలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
తెలంగాణ కేవలం 0.18% GSDPనే ఖర్చు చేస్తోంది .ఇది కేరళ ఖర్చు 0.53%లో మూడో వంతు మాత్రమే. సహజంగానే ప్రభుత్వ యూనివర్సిటీల నాణ్యత ప్రభుత్వం చేసే ఖర్చు మీద ఆధారపడి ఉంటుంది. కేరళ చిన్న రాష్ట్రం అయినా టాప్ 100లో నాలుగు ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కటి మాత్రమే ఉంది.
తిలక్ ప్రకారం తెలంగాణలో ఉన్నత విద్య అసమానంగా అభివృద్ధి చెందటం, నాణ్యత బలహీనంగా ఉండటం, ప్రైవేటు రంగ ఆధిపత్యం అధికంగా ఉండటం, ఒక్క సబ్జెక్టును మాత్రమే బోధించే(mono-disciplinary) సంస్థలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
ఆరోగ్య రంగంలో అభివృద్ధిని “ప్రజా సంక్షేమం”గా చూసే మారిన దృక్కోణంలో ఆరోగ్యం పాత్రను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రజల ఆరోగ్యం మెరుగు పడితే ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది.
ఈ దృష్టి కోణంలో చూసినప్పుడు, ఆరోగ్యం రంగంలో ప్రభుత్వ పెట్టుబడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.
మంచి ఆరోగ్య సేవలు- అభివృద్ధికి కీలకం
ఆరోగ్యాన్ని , ఆర్థిక అభివృద్ధికి ఒక సాధనంగా చూడడంలో కూడా పరిమితులు ఉన్నాయి. అది ఆరోగ్య ప్రాముఖ్యతను విస్తృత అర్థంలో పూర్తిగా గుర్తించలేదు. అది ఆరోగ్యం అంతర్గతంగా సహజ అభివృద్ధికి సాధనంగా అంగీకరించడం లేదు.
ప్రత్యామ్నాయ దృక్పథం ప్రకారం, ఆరోగ్యం అంతర్గతంగా సహజ అభివృద్ధికి సాధనంగా విలువైనదని గుర్తించి, అదే లక్ష్యంతో పని చేయాలి. ఈ దృక్కోణం నుంచి చూస్తే మంచి ఆరోగ్య సేవలు లభించడం “అభివృద్ధికి కీలకం” (Ruger 2003). వాటిని కేవలం ఆదాయం లేదా ఉత్పత్తికి చేసే దోహదం ఆధారంగా మాత్రమే సమర్థించాల్సిన అవసరం లేదు.
అలాగే ప్రత్యామ్నాయ దృక్పథం ఆరోగ్యం, విద్య వంటి సామాజిక లక్ష్యాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను కూడా గుర్తిస్తుంది. అన్ని రాష్ట్రాలలోనూ మొత్తం ఆరోగ్య ఖర్చు (ప్రభుత్వ & ప్రైవేటు); ప్రభుత్వ ఆరోగ్య ఖర్చు మధ్య పెద్ద అంతరం ఉంది.
రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి వాటాతో గానీ, తలసరి ఆదాయంలో వాటాతో పోల్చి చూస్తే ఆరోగ్య వ్యయంలో ఎక్కువ భాగం నేరుగా కుటుంబాలే భరిస్తున్నాయి.
పట్టిక 9 ఆరోగ్య వ్యయాన్ని రెండు భాగాలుగా చూపుతుంది. మొదటి భాగం రాష్ట్రంలో మొత్తం ఆరోగ్య వ్యయం (ప్రభుత్వ వ్యయం, ప్రైవేటు వ్యయం). రెండో భాగం ప్రభుత్వ ఆరోగ్య వ్యయం జీఎస్డీపీకి నిష్పత్తిగా, మొత్తం బడ్జెట్ వ్యయంలో వాటాగా, తలసరి వ్యక్తి ప్రాతిపదికన ప్రభుత్వం ఆరోగ్యంపై ఎంత ఖర్చు చేస్తుందో చూపిస్తుంది.
అన్ని రాష్ట్రాలలోనూ ఆరోగ్యం రంగంలో మొత్తం వ్యయం, ప్రభుత్వ ఆరోగ్య వ్యయం మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు కన్నా కుటుంబాల స్వంత ఖర్చు చాలా అధికంగా ఉంది. ఈ కుటుంబ వ్యయ వాటా తమిళనాడులో 48.2% అయితే కేరళలో 67.5% వరకు ఉంది.
అదే సమయంలో కేరళ మొత్తం ఆరోగ్య వ్యయం జీఎస్డీపీలో(5.2%); ప్రభుత్వ ఆరోగ్య వ్యయం జీఎస్డీపీలో(1.7%) రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. మొత్తం బడ్జెట్ వ్యయంలో ఆరోగ్యానికి కేటాయింపుల్లో, జాతీయ ఆరోగ్య విధానం 2017 సూచించిన 8% ప్రమాణాన్ని ఇంకా ఏ రాష్ట్రం అందుకోలేదు; అయితే ఆంధ్రప్రదేశ్ 7%తో ఈ లక్ష్యానికి దగ్గరగా ఉంది.
దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి జీఎస్డీపీలో ముందున్న తెలంగాణ మాత్రం ప్రజా ఆరోగ్య నిధుల ఖర్చు విషయంలో అన్ని ప్రమాణాల్లో చివరగా ఉంది. తెలంగాణ జీఎస్డీపీలో 1% , బడ్జెట్లో 4.6% ఆరోగ్య రంగంలో ఖర్చు చేస్తుంది. తలసరి ప్రాతిపదికన ప్రభుత్వ ఆరోగ్య ఖర్చులో కూడా అట్టడుగున ఉంది. తక్కువ ప్రభుత్వ నిధుల ఖర్చు ఫలితాలు ప్రజల ఆరోగ్య పరిస్థితిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పట్టిక 9: ఆరోగ్య నిధుల సంబంధించిన కీలక సూచికలు, 2021–22

దక్షిణ రాష్ట్రాలు, భారతదేశంలో ఆరోగ్య స్థితిని కొన్ని ప్రమాణాలను నిర్దేశించి వివిధ సూచికలతో పట్టిక 10 చూపిస్తుంది. వీటిలో ఐదేళ్ల లోపు పిల్లలకు సంబంధించిన సూచికలు అత్యంత కీలకం. అవి ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తు శక్తి సామర్థ్యాల పైనా ప్రభావం చూపుతాయి.
తక్కువ బరువు(under weight) వలన పిల్లల్లో ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగడమే కాకుండా, శారీరక, మానసిక అభివృద్ధి ఆలస్యమై దీర్ఘకాలిక అనారోగ్యానికి గురై భవిష్యత్తు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. గిడసబారి పోవడం- ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవటం, తిరగలేని శారీరక, నాడీవ్యవస్థ అభివృద్ధి నష్టాలకు దారితీయవచ్చు.
వయస్సుకు అనుపాతంగా బరువు తగ్గడం రోగనిరోధక శక్తిని బలహీనపరచి పిల్లలు పెరుగుదలను ఆలస్యం చేస్తుంది, ఇన్ఫెక్షన్లను పెంచుతుంది.
పట్టణ పిల్లల్లో అధిక బరువు కూడా ఇప్పుడు ఆందోళనకర సమస్యగా మారింది. మహిళల్లో (గర్భిణీలు సహా) రక్తహీనత మరో తీవ్రమైన ఆరోగ్య సమస్య 15–49 ఏళ్లు ,అలాగే 6నెలల నుంచి 59 నెలల వయసు చిన్న పిల్లల్లో రక్తహీనత. గర్భధారణలో రక్తహీనత మాతృ మరణాల ప్రమాదం పెంచుతుంది, అలాగే జనన సమయంలో తక్కువ బరువు వంటి సమస్యలను పెంచుతుంది. ఈ అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలు చాలా రాష్ట్రాలతో పోల్చితే కొంత మెరుగ్గా ఉన్నా, సమస్య తీవ్రత మాత్రం అలాగే కొనసాగుతోంది.
మొత్తం ఆరోగ్య ఫలితాల విషయంలో కేరళ ఉత్తమ రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు ఉంది. తలసరి ఆదాయ వృద్ధిలో అందరి కంటే ముందు ఉన్న(“చాంపియన్) తెలంగాణ రాష్ట్రం చాలా సూచికల్లో బలహీనంగా కనిపిస్తున్నది.
అయితే కర్ణాటక రాష్ట్రం కూడా కొన్ని ప్రతికూల సూచికల్లో తెలంగాణతో పోటీ పడుతుంది; Under Weight విషయంలో కర్ణాటక తెలంగాణ కన్నా కూడా తక్కువగా ఉంది. ఒక విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాలు ఏవీ తెలంగాణతో పోటీ పడలేవు. అది పురుషుల్లో మద్యం వినియోగం 42–50% వరకు ఉండటం, ఇది దేశంలో అత్యధిక స్థాయిల్లో ఒకటి. ఈ సూచికలు ప్రజారోగ్యానికే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల స్థిరత్వానికి కూడా పెద్ద ప్రమాద సంకేతాలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అధిక వృద్ధి రేటుతో సంతృప్తి చెందుతున్నట్లుగా కనిపిస్తోంది.
పట్టిక 10: దక్షిణ రాష్ట్రాల ఆరోగ్యం స్థితికి సంబంధించిన సూచికలు

అసమానతల పరిస్థితి
ఐక్యరాజ్యసమితి అసమానతలను “21వ శతాబ్దంలో వ్యూహాత్మకంతోపాటు అస్తిత్వపరమైన సవాలు”గా అభివర్ణించింది. రెండు దశాబ్దాలకు పైగా సభ్యదేశాల సమ్మతితో రూపొందిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి అజెండాను ఇది ప్రపంచం ముందు పెట్టింది.
సహస్రాబ్ది అభివృద్ది లక్ష్యాలు మొదటి దశ 2000–2015(Milinium Development Goals – MDGs), ప్రస్తుతం రెండో దశ 2015–2030 గా కొనసాగుతూ 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (Sustainable Development Goals – SDGs)(2030 అజెండా) ద్వారా పురోగతిని లెక్కిస్తుంది.
ఈ లక్ష్యాలలో “మంచి ఆరోగ్యం- ప్రజాసంక్షేమం” (SDG 3), “నాణ్యమైన విద్య” (SDG 4), “అసమానతల తగ్గింపు” (SDG 10) కీలకం.
అందుకే విచక్షణలేని ప్రైవేటీకరణే వృద్ధికి సాధనం అన్న నూతన సరళీకరణ విధానం దారిని వదిలి, వృద్ధినే అభివృద్ధిగా స్వీకరించే మోహం నుంచి బయట పడాల్సిన సమయం వచ్చింది. భారతదేశంలో ఎస్డీజీఎస్ పురోగతిని సూచికలతో ట్రాక్ చేసి, ప్రతి లక్ష్యానికి వేరు వేరు సూచికల ద్వారా లెక్కిస్తారు. ఎస్డీజీ 10లో నాలుగు లక్ష్యాలు ఉన్నాయి:
ఆదాయ అసమానతలు తగ్గించడం (10.1)
2. సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో ప్రోత్సాహం (10.2)
3. వివక్ష తగ్గించి సమాన అవకాశాలు కల్పించడం (10.3)
4. ముఖ్యంగా ద్రవ్య, వేతన, సామాజిక రక్షణ చర్యలు చేపట్టడం (10.4)
ఇవి నీతి ఆయోగ్ ఎస్డీజీ ఇండియా సూచికల్లోని 16 లక్ష్యాల మానిటరింగ్‌లో కూడా భాగంగా ఉన్నాయి.
పట్టిక 11 దక్షిణాది రాష్ట్రాలతోపాటు భారత సగటు స్థితిని 16 లక్ష్యాల సమగ్ర సూచికలోనూ, స్థిరమైన అభివృద్ధి పెరుగుదల(Sustainable Development Growth -SDG )10 సూచికలోనూ చూపిస్తుంది.
ఇక్కడ కూడా కేరళ, తమిళనాడు రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. కేరళ సమగ్ర సూచీలలో 79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఎస్డీజీ 10లో తమిళనాడు 71 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణది మాత్రం రెండింటిలోనూ అట్టడుగున స్థానమే.
పట్టిక 11: స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సూచిక 2023–24
55% వాటా కలిగి ఉన్న హైదరాబాద్
భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో అసమానతలకు సంబంధించిన అనేక సూచికలకు సంబంధించిన సరైన డేటా అందుబాటులో లేదు. అయినా అందుబాటులో ఉన్న జిల్లాల స్థూల జాతీయ ఉత్పత్తి డేటా చూపించేది ఏమిటంటే ఇప్పుడు ఐదు జిల్లాలుగా విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం ప్రాంతం తెలంగాణ రాష్ట్రం మొత్తం జాతీయ ఉత్పత్తిలో సుమారు 55% వాటా కలిగి ఉంది.
తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు ఈ కథలో ఒక భాగం మాత్రమే. రంగాల వారీగా నమూనాను పరిశీలించి చూస్తే కొంతమందికి ఆశ్చర్యం, మరికొంతమందికి షాక్ కలిగించేలా ఉంటుంది.
జనాభాలో 60%కి పైగా జీవనాధారం వ్యవసాయం అయినప్పటికీ, రాష్ట్ర జాతీయ ఉత్పత్తిలో దాని వాటా 14% మాత్రమే ఉంది. వ్యవసాయేతర ఉద్యోగాలకు ప్రధానమైన దిక్కు కావాల్సిన తయారీ రంగం వాటా కేవలం 9% మాత్రమే. కానీ “స్థిరాస్థి (Real Estate) వ్యాపారం మొదలైన ” వాటి వాటా 23.4% వరకు ఉంది. అధికారికంగా ప్రకటించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక దృశ్యం 2024’ ప్రకారం, “స్థిరాస్థి వ్యాపారం , డ్వెల్లింగ్స్ ఓనర్షిప్ & ప్రొఫెషనల్ సర్వీసెస్” అనే ఉపరంగం 2023–24లో తెలంగాణలో అతిపెద్ద ఉపరంగంగా ఉంది(Annexure 3, p 255).
వ్యక్తిగత ఆదాయం అధిక వృద్ధిని చూపిస్తూ ఉండగా కూడా, విద్య, ఆరోగ్యం రంగాలు బలహీనంగా ఉంటుందనిపై విశ్లేషణ మనకు తెలియ చేస్తుంది. అసమానతలు పెరగటంలాంటి తీవ్రమైన సామాజిక దారిద్య్రంతో కలిసి అభివృద్ధి ప్రయాణం చేస్తూ ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ సారాంశం మనకు స్థూలంగా కనిపిస్తుంది.
సామాజిక సూచికల్లో చాలా బలహీనంగా కర్ణాటక రాష్ట్రం
దీనికి సంబంధించి గోవిందరావు నేతృత్వంలోని కర్ణాటక ప్రాంతీయ అసమానతల కమిటీ నివేదికను చూడండి. ఆ నివేదిక ప్రకారం, కర్ణాటక రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి 1990–91లో జాతీయ సగటుకంటే 19% తక్కువగా ఉన్న స్థితి నుంచి దాని GSDP, 2022–23 నాటికి పెద్ద రాష్ట్రాల్లో రెండో స్థానానికి చేరింది. అది జాతీయ సగటు కంటే 80% ఎక్కువగా ఉంది.
రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో దాదాపు 50% రాజధాని నగరం; రెండు తీర జిల్లాలు దక్షిణ కన్నడ, ఉడుపి చుట్టూ కేంద్రీకృతమై ఉంది.
అదే సందర్భంలో సామాజిక సూచికల్లో కర్ణాటక రాష్ట్రం చాలా బలహీనంగా ఉంది. సగటు బరువు కన్నా తక్కువగా ఉన్న పిల్లల్లో 22వ స్థానం, గిడసబారి సరైన పెరుగుదల లేని పిల్లలలో 21వ స్థానం, సెకండరీ విద్యకు దూరం అవుతున్న డ్రాపౌట్స్లో 20వ స్థానం, హయ్యర్ సెకండరీ విద్య నమోదులో మరియు 15 ఏళ్లు పైబడిన వారిలో సాక్షరతలో 17వ స్థానంలో ఉంది.(Rao 2025).
అందువల్ల వృద్ధి అవసరమే, కానీ ప్రజల జీవన నాణ్యత లేదా సంక్షేమాన్ని మెరుగుపరచడానికి అది ఒక్కటే సరిపోదు. విచక్షణలేని ప్రైవేటీకరణనే వృద్ధికి మూలమని భావించి, వృద్ధినే అభివృద్ధిగా చూపే కొత్త సరళీకరణ మోజు నుంచి బయట పడాల్సిన సమయం వచ్చింది.
అందుకు బదులుగా నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యం, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే సేవలుగా గుర్తించి, వాటికి సంబంధించిన వసతులను ప్రభుత్వం బలోపేతం చేయాలి. అలాగే పెరుగుతున్న అసమానతలను నియంత్రించేందుకు తగిన విధానాలను రూపొందించి అమలు చెయ్యాలి.
అప్పుడే ప్రజాస్వామ్యిక, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ వైపు ముందడుగు పడుతుంది.
డీ నరసింహ రెడ్డి— ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం.
(ఇది 2025 ఆగస్టు 6న వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రొఫెసర్ కె జయశంకర్ 13వ ఎండౌమెంట్ ప్రసంగం సవరించిన సంక్షిప్త రూపం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


