మహారాష్ట్ర రాజకీయాల్లో “దాదా”గా సుపరిచితులైన అజిత్ పవార్ 2026 జనవరి 28న విమాన ప్రమాదంలో కన్నుమూశారు. రాష్ట్ర అధికార నిర్మాణంలో సహకార, సంకీర్ణ, శక్తి- వాస్తవిక రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన పవార్ అకస్మిక మరణంతో మహారాష్ట్ర ‘పవర్-రూమ్’ ఒక్కసారిగా ఖాళీ అయింది.
మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ అనంతరావు పవార్ 2026 జనవరి 28న ఉదయం జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆ ప్రమాదంలో ఆయన రాజకీయ శైలి లాగే వేగం, తీవ్రత, నిర్ణయాత్మకత కనిపిస్తాయి.
ముంబై నుంచి బయలుదేరిన ఆయన చార్టర్డ్ విమానం బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో మంటల్లో చిక్కుకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలలో, ఆ బహిరంగ మైదానమంతా దట్టమైన పొగ కమ్మేయడం కనిపిస్తుంది. ఈ దుర్ఘటన అజిత్ పవార్‌తో పాటు ఇతరుల ప్రాణాలను కూడా బలిగొంది.
ఈ అకస్మిక పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుర్చీ లేదా ఒక పదవిని మాత్రమే కాకుండా, ఒక శక్తివంతమైన గదినే ఖాళీ చేయించింది.
మహారాష్ట్ర రాజకీయాలు ఒక నాటక రంగం అనుకుంటే- వేదికపై పడే వెలుగులను స్పష్టంగా చూడగల, తెరవెనుక సూత్రాలను నియంత్రించగల అరుదైన కళాకారుడు అజిత్ పవార్.
ఏ తాడు ఎవరి చేతిలో ఉంది, ఏ ముడి అధికార తెరను పడేయగలదో, ఏ చర్యతో చప్పట్లను నిశ్శబ్దంలా మార్చగలవో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
2019 నవంబర్ ఉదయం జరిగిన నాటకీయ పరిణామాలు దీనికి నిదర్శనం. అప్పట్లో పవార్ అకస్మాత్తుగా బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఆ “రాజకీయ తొందరపాటు” క్షణికమే అయినప్పటికీ, అది ఆయన తెగింపుకు నిదర్శనంగా నిలిచింది. కేవలం 80 గంటల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయినా, ఆయన వేగం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది.
ఆధునిక మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ అధ్యాయం ఒక విచిత్రమైన చురుకుదనం, ధైర్యం- రాజకీయ అనిశ్చితికి లోతైన రూపకంగా మిగిలిపోయింది.
2024 నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలతో కలిసి పవార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది మహారాష్ట్రలో సమకాలీన సంకీర్ణ రాజకీయాలకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.
సంఖ్యలు, బడ్జెట్లు, అట్టడుగు స్థాయి నెట్‌వర్క్‌లపై ఆయనకున్న పట్టు- ఆయన్ను ఎప్పుడూ “ఇంజిన్ రూమ్ ఆఫ్ పవర్”(ఆర్థిక, ప్రణాళికా శాఖల నిర్వహణ)లోనే ఉంచింది.
గుర్తింపు ప్రస్థానం
1959 జూలై 22న అహ్మద్‌నగర్ జిల్లాలోని డియోలాలి ప్రవారాలో జన్మించిన అజిత్ పవార్, శరద్ పవార్ మేనల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.
పశ్చిమ మహారాష్ట్ర సహకార ఆర్థిక వ్యవస్థను రాజకీయ శక్తిగా మార్చిన కుటుంబంలో ఆయన రెండవ తరం నాయకుడు.
కుటుంబ బాధ్యతల కోసం కళాశాల విద్యను మధ్యలోనే వదిలేసినా, అసెంబ్లీలో ఫైళ్ల పైన, పొలాల్లో రైతులతోనూ ఆయన సంపాదించిన జ్ఞానం అపారం.
సునేత్రా పవార్ ఆయన భార్య కాగా- పార్థ్, జై పవార్ ఆయన కుమారులు.
పవార్ “మొదటి పాఠశాల” ఎన్నికలు కావు, సహకార సంస్థలు. 1982లో సహకార చక్కెర కర్మాగారం బోర్డు సభ్యునిగా ఆయన ప్రస్థానం మొదలైంది.
నీరు, రోడ్లు, గ్రామీణ పరపతివంటి అంశాలే నిజమైన అభివృద్ధని ఆయన అక్కడ నేర్చుకున్నారు.
పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆయన సుదీర్ఘ అనుభవం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఆయనకు పట్టు సాధించిపెట్టింది.
1991లో మొదటిసారి బారామతి నుంచి ఎన్నికైన ఆయన, తన మామ శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేశారు. అప్పటి నుంచి బారామతి ఆయనకు కంచుకోటగా మారింది. 1995 నుంచి 2024 వరకు వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ, మహారాష్ట్ర రాజకీయాల్లో అజేయమైన నాయకుడిగా ఎదిగారు.
రాజకీయ ఉనికి- వివాదాలు
ఆయన రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. పృథ్వీరాజ్ చవాన్ నుంచి ఏక్నాథ్ షిండే వరకు వివిధ ముఖ్యమంత్రుల హయాంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
అయితే, ఆయన ప్రస్థానం వివాదరహితమేమీ కాదు. 2013లో కరువుపై ఆయన చేసిన “ఆనకట్టలో మూత్ర విసర్జన” వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది.
దానిని తన “అతిపెద్ద తప్పు”గా ఒప్పుకుని ఆయన క్షమాపణలు చెప్పారు.
అలాగే నీటిపారుదల ప్రాజెక్టుల అవకతవకల ఆరోపణలు(నీటిపారుదల కుంభకోణం) వంటి అంశాలు ఆయన్ను చుట్టుముట్టాయి. కానీ తదుపరి దర్యాప్తుల్లో ఆయనకు క్లీన్ చిట్ లభించింది.
2023–24 కాలంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో వచ్చిన చీలిక- ఆయన రాజకీయ జీవితంలో మరో మలుపు.
ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన పార్టీగా గుర్తించి, ‘గడియారం’ గుర్తును కేటాయించడం దేశ రాజకీయాల్లోనే పెద్ద సంచలనం.
బడ్జెట్ భాషను గ్రామీణ ఆర్థిక పరిభాషలోకి అనువదించిన నేతగా, బారామతిని ఒక అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దిన శ్రామికుడిగా ఆయన మద్దతుదారులు ఆయన్ను గుర్తుంచుకుంటారు. విమర్శకులు ఆయన్ను పక్కా ‘పవర్ రియలిస్ట్’గా చూస్తారు.
ఏదేమైనా, అజిత్ పవార్ తన భార్యను, కుమారులను- అత్యంత సంక్లిష్టమైన రాజకీయ వారసత్వాన్ని విడిచిపెట్టారు. సహకార రంగ మూలాల్లో, పొత్తుల అంకగణితంలో, తనదైన వాక్చాతుర్యంలో ఆయన రాజకీయం పెనవేసుకుపోయింది. బారామతి ఆకాశంలో కమ్మిన పొగ కేవలం ఒక ప్రమాద దృశ్యం మాత్రమే కాదు; అది మహారాష్ట్ర అధికార చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయానికి పడిన కఠినమైన ముగింపు.
(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
