తెలంగాణ విద్యా పాలసీగా(టీఈపీ) పిలువబడుతున్న తన రిపోర్ట్‌ను ఈ మధ్య ప్రభుత్వానికి ఆకునూరి మురళి నేతృత్వంలోని తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించింది.
ఈ రిపోర్ట్ నాణ్యతతో కూడిన, సమ్మిళితమైన, సంపూర్ణ విద్యను లక్ష్యంగా ప్రకటించింది.
21వ శతాబ్దంలో విద్య ఎలా ఉండాలన్న విషయం గురించి యునెస్కో నియమించిన డెలర్స్ కమిటీ రిపోర్ట్‌ను ప్రస్తావిస్తూ, ఒక ప్రగతిశీల దృక్పథాన్ని కనబరిచింది.
అయితే లోతుగా పరిశీలిస్తే ఒక ఆందోళనకరమైన వైరుధ్యం కనబడుతోంది.
విద్యను ప్రజాస్వామ్య విలువల స్థాపన స్థలంగా బలోపేతం చేయడం బదులు, దాన్ని మార్కెట్ విధానాలకు అనుగుణంగా మార్చడంపైనే దృష్టి సారించినట్టు అనిపిస్తుంది.
లోపాలను గుర్తించి, సూచనలు చేసిన పాలసీ..
ఈ పాలసీ తెలంగాణ విద్యా వ్యవస్థలోని లోపాలను సరిగానే గుర్తించింది.
అన్ని స్థాయిల విద్యకు సంబంధించి- భౌతిక, బౌద్ధిక వనరుల అభివృద్ధి గురించి చాలా విపులమైన సిఫార్సులను చేసింది. పెడగాజి, గవర్నెన్స్లకు సంబంధించి తీసుకురావలసిన మౌలిక మార్పులను సూచించింది.
ప్రీ-ప్రైమరీ విద్య ఆవశ్యకత, విద్యలో గవర్నెన్స్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన చాలా విషయాల పట్ల విలువైన సూచనలు చేసింది.
రెసిడెన్షియల్ స్కూళ్ల విస్తరణను ఆపాలని, వృత్తి విద్య ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని, నాలుగు సంవత్సరాల బీఈడీ కోర్సు సరైనది కాదని, రాజ్యాంగ నిర్దేశాలకు అనుగుణంగా లేని ఎన్ఈపీ- 2020 సిఫార్సులను తిరస్కరించాలని సాహసోపేతమైన సలహాలను ఇచ్చింది.
ప్రైవేటు విద్యలోని లోటుపాట్లను గుర్తించింది. దాని రెగ్యులేషన్ కోసం ప్రతిపాదనలు చేసింది.
ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ లోపాలతో ఉన్న అదే ప్రైవేటు విద్యను, నాణ్యతకు ప్రమాణమనే భావనకు లోనయింది.
నయా ఉదారవాద భావజాల ప్రలోభం..
తాత్వికంగా అభ్యుదయాత్మకంగా కనిపించే ఈ నివేదిక నయా ఉదారవాద భావజాల ప్రలోభంలో పడిపోయింది.
సిటిజన్ తయారీ లక్ష్యమని చెప్పుకుని కన్స్యూమర్ తయారీ విధానాలకు ప్రోత్సాహం కల్పిస్తున్నది. ఫలితంగా టెక్నోక్రాటిక్, బ్యూరోక్రటిక్ పరిష్కారాలు ముందుకొచ్చాయి.
గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యలో తక్కువ పెట్టుబడులు, పరిపాలనా నిర్లక్ష్యం వల్ల అది బలహీనపడింది.
విద్యా సాధనకు సంబంధించి సమగ్ర విషయాలకు బదులు, కొన్ని విషయాల కొలతలకు అధిక ప్రాధాన్యతనివ్వడం వలన ప్రైవేటు విద్య నాణ్యతతో ఉందనే అపోహలు పెరిగాయి.
దీంతో ప్రజా విశ్వాసం క్షీణించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేటు పాఠశాలల వైపు మళ్లాయి.
పెట్టుబడులు పెంచి, సరైన వనరులను కల్పిస్తే ఈ ధోరణి మారుతుందని ఈ రిపోర్ట్ భావిస్తున్నది. దీనికి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు నమూనాలకు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది.
అంటే విద్యా సాధనకు సంబంధించి సమగ్ర విషయాలకు బదులు, కొన్ని విషయాల కొలతలనే నాణ్యతగా పరిగణిస్తున్నది.
టీఈపీ దాన్ని “ప్రజల ఆశల పర్యవసానంగా” అర్థం చేసుకుంటున్నది. దీంతో నిర్మూలించాల్సిన శ్రేణి వ్యవస్థను సమర్థించే ప్రమాదంలోకి పడిపోయింది.
తొలగించాల్సిన అసమానతలను మరింత బలపరచే సాధనంగా మారబోతున్నది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రతిపాదన ఈ దిశలో కీలకమైన అడుగు.
అంచనాలు – ఆందోళనలు..
ఈ స్కూళ్ల ఏర్పాటు పూర్తయ్యాక భవిష్యత్తులో విద్యా వ్యవస్థ మూడు రకాలుగా- చిన్న ప్రభుత్వ పాఠశాలలు, పెద్ద టీపీఎస్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలుగా ఉంటాయని; తల్లిదండ్రులు “సముచిత నిర్ణయాలు” తీసుకుని టీపీఎస్ వైపు మళ్లుతారని అంచనా వేస్తోంది.
దీనిని కామన్ స్కూల్ వ్యవస్థ వైపు అడుగుగా చూపుతోంది. కానీ ఇది నిజమైన కామన్ స్కూల్ వ్యవస్థ కాజాలదు.
అసలు కామన్ స్కూల్ వ్యవస్థ అంటే సమీప పాఠశాలల్లో అన్ని వర్గాల పిల్లలు కలిసి చదవడం ద్వారా సమానత్వం, సామాజిక ఐక్యత పెంపొందించడం.
కానీ టీఈపీ ప్రతిపాదనలో పాఠశాలలు ఒకదానితో ఒకటి పోటీ పడాలని సూచిస్తున్నది.
తల్లిదండ్రులు ఎంపికలు చేసుకునే ఈ విధానం(స్కూల్ చాయిస్) విద్యను మార్కెట్‌లాంటి వ్యవస్థగా మారుస్తుంది.
ఈ నేపథ్యంలో టీపీఎస్ పాఠశాలలు సమానత్వానికి వేదికగా కాకుండా, పోటీ పడే ప్రభుత్వ సంస్థలుగా మారే ప్రమాదం ఉంది.
విద్యార్థుల, ఉపాధ్యాయుల, విద్యా సంస్థల పనితీరును కొలవడానికి ప్రత్యేక ప్రమాణాల సంస్థ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఆందోళనను కలిగిస్తుంది.
టీచర్ల జవాబుదారీతనాన్ని పెంపొందించడమే దీని లక్ష్యంగా కనబడుతుంది.
ప్రపంచ అనుభవాలిస్తున్న స్పష్టమైన హెచ్చరిక..
టీచర్లు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండడం ఎవరూ తిరస్కరించలేని విషయం. కానీ ప్రపంచ అనుభవం ఒక స్పష్టమైన హెచ్చరికనిస్తోంది.
అమెరికాలో అమలైన No Child Left Behind, Race To The Top వంటి సంస్కరణలు, ఇంగ్లాండ్‌లో అమలైన OfSTED విధానాలు బోధనను పరీక్షలకే పరిమితం చేసి, పాఠ్యాంశాలను కుదించి, ఉపాధ్యాయుల స్వాతంత్య్రాన్ని దెబ్బతీశాయి.
మన దేశంలో కూడా ఇదే విషయాన్ని కొన్ని రాష్ట్రాల అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలలో మెరుగుదల సాధ్యమని నిరూపించబడింది.
అయితే అది ప్రధానంగా పరీక్ష ఫలితాల మెరుగుదలకే పరిమితమయింది.
పాఠశాలల మధ్య అసమానతలు అలాగే కొనసాగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల ఆధిపత్యం తగ్గలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ స్థాయిలో మార్పులు చేపట్టారు— పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి, ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టడం, డిజిటల్ పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకున్నారు. కానీ ఇవి ఉపాధ్యాయులపై పరిపాలనా ఒత్తిడిని పెంచాయి. దీంతో పాటు, పరీక్ష కోసమే బోధన పరిస్థితులను సృష్టించాయి.
పైకి కనిపించే మార్పులు ఉన్నప్పటికీ- విద్యలో ఉన్న అసమానతలు, పోటీ ధోరణి అలాగే కొనసాగుతున్నాయని ఈ రెండు రాష్ట్రాల అనుభవాలు చెబుతున్నాయి.
దీనికి భిన్నంగా ఫిన్లాండ్, కెనడా వంటి దేశాలు వేరే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. అక్కడ ఉపాధ్యాయులను కఠినమైన శిక్షణ ద్వారా ఎంపిక చేసి నమ్మకంతో, సహకార భావంతో, అభివృద్ధికి అవకాశాలు ఇస్తారు.
నిరంతరం పరీక్షల ద్వారా పర్యవేక్షించరు. కొలతల ఆధారిత జవాబుదారీతనం విద్యను బలహీనపరుస్తుంది; నమ్మకం, వృత్తిపరమైన బాధ్యత విద్యను బలపరుస్తాయనే స్పష్టమైన సందేశం ఈ దేశాల ద్వారా తెలుస్తున్నది.
టీఈపీ ఉపాధ్యాయుల శిక్షణ, ఎంపికల గురించి కొన్ని మార్గదర్శకాలను సూచించింది. కానీ అంతిమంగా థర్డ్ పార్టీ చేత విద్యా ప్రమాణాలను కొలిచే సూచనలను చేస్తున్నది. ఎండోజెనస్ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నది, టీచర్ల పట్ల అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నది.
ఇంగ్లీష్ మాధ్యమంతో భాషా సమస్య..
ప్రారంభ దశ నుంచే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయం కూడా మరో సమస్యను తీసుకువస్తుంది. ఇది తల్లిదండ్రుల ఆకాంక్షలను ప్రతిబింబించినప్పటికీ, చిన్నపిల్లలు తమ ఇంటి భాషలో నేర్చుకుంటేనే బాగా అర్థం చేసుకుంటారనే విద్యా సత్యాన్ని విస్మరిస్తోంది.
ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్‌ను నేర్చుకోవడం అనివార్యమైంది. అయితే కాగ్నిటివ్ సైన్స్‌ను, ఒత్తిడి లేకుండా నేర్చుకునే పిల్లల హక్కులను కూడా కాదనలేము. కాబట్టి వాడుక భాష భూమికగా క్రమంగా ఇంగ్లీషు నేర్పడం సముచితమనే విషయాన్ని వలస పాలనకు గురైన దేశాల అనుభవాలు చెబుతున్నాయి. వీటిని విస్మరిస్తే భాష, సామాజిక అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉంది.
టీఈపీ స్వయంగా రెసిడెన్షియల్ పాఠశాలల విస్తరణను నిరోధించాలని ప్రభుత్వానికి సూచించింది. అయినప్పటికీ, ప్రభుత్వం మాత్రం “యంగ్ ఇండియా” పేరుతో 100కు పైగా కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపిస్తూ- విదేశీ ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇస్తోంది.
టీఈపీ సిఫార్సులు ఒక దిశలో, ప్రభుత్వ విధానాలు మరో దిశలో సాగుతుండటం సమగ్రత కంటే విభజననే పెంచుతున్నదనే స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నది.
ప్రజా విద్య సమీప పాఠశాలల ఆధారంగా అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ ఇంకా వేర్వేరు వర్గాలకు వేర్వేరు విధాలుగా విభజింపబడిన వ్యవస్థ బలపడుతున్నది. టీఈపీ సిఫార్సులను లక్ష్యపెట్టని ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది.
విద్యలో సమూల సంస్కరణలకు కంకణబద్ధులమయ్యామని చెప్పుకుంటూ టీఈపీ ప్రతిపాదనలను విస్మరించడం- ఎక్కడా లేని, జరగని విధంగా ఎడ్యుకేషన్ కమిషన్‌కు సమాంతరంగా మరో ఎడ్యుకేషన్ కమిటీని నియమించడం ఇవన్నీ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించే విషయాలు.
మౌలిక లక్ష్యాన్ని మార్చే ప్రక్రియ..
ఈ విషయాలన్నింటినీ కలిపి చూస్తే, సమాన ప్రజా విద్యను అందించే బాధ్యత నుంచి పోటీ ఆధారిత విద్యా మార్కెట్‌ను పెంపొందించే దిశగా ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు, విద్య మౌలిక లక్ష్యాన్ని మార్చే ప్రక్రియ. ఈ మార్పు గత నాలుగైదు దశాబ్దాలుగా అంతటా కనబడుతోంది.
అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దీనికి భిన్నమైన పాత్రను ప్రభుత్వాలు పోషించాలని భావించింది. కానీ మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీకి గానీ, ప్రస్తుత ప్రభుత్వానికి గానీ చిత్తశుద్ధి లేదన్న విషయం తెలుస్తున్నది.
నిజంగా సమగ్ర ప్రతిభను తెలంగాణ సాధించాలంటే, వేరే దిశలో కదలాలి. సమీప ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా నిజమైన కామన్ స్కూల్ వ్యవస్థ స్థాపనకు దారులు వేయాలి.
సమాన వనరుల పంపిణీ, భాషా వైవిధ్యానికి గౌరవం, ఉపాధ్యాయులను నిరంతరం కొలిచే వ్యక్తులుగా కాకుండా వృత్తిపరులుగా గౌరవించడం వంటి చర్యలు అత్యవసరం.
వృత్తి బాధ్యత, జవాబుదారీతనం, కొలతలు, ర్యాంకింగ్స్‌పై కాకుండా, నమ్మకం, సహకారం, సంస్థాగత ప్రతిష్టపై ఆధారపడాలి.
విద్యను సంఖ్యలుగా, వినియోగదారుల ఎంపికలుగా కుదించలేము. అది సకల ప్రజా ప్రయోజనానికి సంబంధించినది, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే స్థలం, సామాజిక విభేదాలను తొలగించే వేదిక. ఈ నిజాన్ని మరిచే ఏ సంస్కరణ అయినా, తగ్గించాల్సిన అసమానతలను మరింతగా పెంచే ప్రమాదం ఉంది.
(హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల(అటానమస్)లో వ్యాస రచయిత ఎడమ శ్రీనివాస రెడ్డి అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యూకేషన్, తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. విద్యా విషయాలపై Economic & Political Weekly, Mainstream Weeklyలో పలు వ్యాసాలు ప్రచురితమయ్యాయి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
