
కీర్తి, కాంత, కనకం ఈ మూడింటికి లొంగని వారు దాదాపుగా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే వారు సర్వసంగ పరిత్యాగులో, ముక్కు మూసుకుని హిమాలయాల్లో తపస్సు చేసుకునే రుషులో అయి ఉంటారు. వీరెవరూ కాకుండా మనం జీవిస్తున్న ఈ సమాజంలోనే అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే, జనతా గ్యారేజి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు అటువంటి వారిని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి.
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలలాంటి ఘోరాలన్నీ కాంత కోసమో, కనకం కోసమో జరుగుతున్నవే(కనకం అంటే బంగారం అనే కాకుండా డబ్బని అన్వయించుకుందాం). అయితే ఈ రెండింటికంటే కీర్తి కాంక్ష ప్రమాదకరమైనది. ఈ కీర్తి కాంక్ష వ్యక్తులకు ఉంటే అది వ్యక్తిగతమైతే పర్వాలేదు. అదే ప్రజలను పాలించే పాలకులకు ఉంటే చాలా ప్రమాదకరం.
30 ఏళ్ల ముఖ్యమంత్రి కల..
నేతల కీర్తి కాంక్ష ఒక దశ వరకు మంచిదే, ఆ కీర్తి కాంక్షతో వారు కొన్ని మంచి పనులు చేస్తారు. ప్రజలందరూ తమను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో మంచి పథకాలను ప్రవేశపెడతారు. ఈ రకంగా ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే కీర్తి కాంక్ష తారాస్థాయికి(ఒక రకంగా పిచ్చి అనుకోవచ్చు)చేరినప్పుడు, అది వెర్రి తలలు వేస్తుంది. అప్పుడది బూమరాంగ్ అవుతుంది.
రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని తెగ తాపత్రయపడ్డారు. ప్రతి ఇంట్లో తన తండ్రి ఫొటో పక్కన తన ఫొటో కూడా పెట్టుకోవాలని తలచారు. ఆ ఉద్దేశంతో, గతంలో ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ప్రగాఢ నమ్మకంతో కూడా ఉన్నారు.
అయితే, ఆయన కీర్తి కాంక్షతో పథకాలు అన్నింటికి తన పేరు తగిలించడమే కాకుండా, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి తన తండ్రి పేరు పెట్టడం, పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపైన తన ఫొటో ముద్రించడంలాంటివి ఆయనకు చేటు చేశాయి. ఇక ప్రజలకు ఏం చేటు జరిగిందంటే, ఆయన ఫోకస్ అంతా సంక్షేమంపై పెట్టడం. రాజధాని అమరావతిలో కొనసాగిస్తే అది చంద్రబాబుకు పేరు వస్తుంది కానీ తనకు రాదని, తనకు పేరు రావాలంటే మూడు రాజధానులు అంటూ, మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకోవడం. ఇలా రాజధాని అంశాన్ని రాజకీయం చేయడం రాష్ట్ర ప్రజలకు చేటు చేసింది. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలన్న జగన్ కీర్తికాంక్ష నెరవేరలేదు. ఐదేళ్లకే ప్రజలు ఆయన్ను ఇంటికి సాగనంపారు.
పతాక స్థాయికి చేరిన చంద్రబాబు కీర్తి కాంక్ష..
ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, ఈయనకు కూడా కీర్తి కాంక్ష తారాస్థాయిలో ఉంది. అదే, పిచ్చి దశకకు చేరింది. గతంలో సైబరాబాద్ నేనే నిర్మించాను. ఇప్పడు అమరావతి నగరాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మహా నగరంగా నిర్మిస్తానంటూ ఆయన చేస్తున్న పనులు రాష్ట్రానికి చేటు చేస్తున్నాయి. ఇటలీలోని వెనిస్ నగరంలా నదీ తీరంలో రాజధాని నిర్మించాలనే ఆయన కాంక్ష మూడు పంటలు పండే భూములను స్వాధీనం చేసుకుంది. రైతులకు లేని పోని భ్రమలు, ఆశలను కల్పించింది. ఇప్పడు 15 వేల ఎకరాల్లో విమానాశ్రయం ఇంకా ఏదేదో కడతానంటూ మరో 40 వేల ఎకరాలు కావాలంటున్నారు. మొత్తం మీద లక్ష ఎకరాల్లో రాజధాని అంటున్నారు. ఎందుకో కానీ చంద్రబాబుకు లక్ష అనే సంఖ్య మీద మహా మోజు ఉన్నట్టుంది. ఎవరెన్ని అనుకున్నా ఆయన లక్ష ఎకరాలు తీసుకుని తీరతారు.
మబ్బులను నీళ్లు పారబోసుకున్న రైతులు..
మబ్బులను చూసి రైతులు కుండలోని నీళ్లు పారబోసుకున్నారు. 11 ఏళ్లయినా ఆ మబ్బులు కాసుల వాన కురిపించలేదు. ఇప్పుడిప్పడే కొందరి రైతుల కళ్లు తెరుచుకుంటున్నాయి. అయితే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు కదా, ఈ ఐదేళ్లలో రాజధానిని ఒక స్వరూపానికి తెచ్చేస్తారు. తమ ఫ్లాట్ల రేట్లు పెరుగుతాయని ఇంకా చాలా మంది రైతులు ఆశతోనే ఉన్నారు. కానీ, రాజధాని కోసం బాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుస్తున్నారు. సంపద సృష్టిస్తానని ఇప్పుడు మనల్ని సలహా చెప్పమంటున్నారు. పీ-4 అంటూ పేద జనాలను మీరే దత్తత తీసుకుని అభివృద్ధి చేయమంటున్నారు. ఇక ప్రభుత్వం చేసేదేమిటో అర్థం కావడం లేదు(వేల ఎకరాలను కార్పొరేట్లకు నామమాత్రపు ధరకు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చి కమీషన్లు బొక్కడం తప్ప).
ఈయనకేం ఇంకో ఐదేళ్లో, పదేళ్లో ఉంటాడు. ఆ తర్వాత ఆయన పుత్రరత్నం మన నెత్తి మీదకెక్కి కూర్చుంటారు. లేదా మరింకెవరో మనల్ని తాకట్టు పెట్టి లక్షల కోట్ల అప్పులు చేస్తారు. మనకు ఒక్కొక్క వ్యక్తి తల మీద లక్షల అప్పు ఉంటుంది. చివరకు రాష్ట్రం నిజంగానే శ్రీలంక అవుతుంది. ఇంతకూ నేను చెప్పొచ్చేదేమిటంటే, మన పాలకుల కీర్తి కాంక్ష రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. బీ వేర్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్..
• మానవేంద్ర బసు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.