నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)సభ్యులకు క్రమశిక్షణ, దేశభక్తి అంతలా ఉంటుంది. క్రమశిక్షణకు- దేశభక్తికి తాము మాత్రమే కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ చీకటికోణాన్ని ఒక ఇన్స్టాగ్రాం పోస్ట్ బట్టబయలు చేసింది. ఏ విధంగా శిబిరాలలో/శాఖలలో లైంగికదాడులు, మానసిక- శారీరక హింస జరుగుతుందో ఆ పోస్ట్ వివరిస్తోంది.
కేరళకు చెందిన 26 ఏళ్ల యువకుడి ఇన్స్టాగ్రామ్ సూసైడ్ నోట్ పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన మరణవాంగ్మూలంలో ‘చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ శాఖలలో తనను లైంగికంగా వేధించారని, మానసికంగా హింసించారని’ తెలియజేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మీద పలువురు స్పందించారు. యువకుడి మృతి మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సభ్యులు తనను నిరంతరం లైంగికంగా వేధించారని తెలియజేస్తూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు సూసైడ్ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షెడ్యూల్డ్ పోస్ట్ చేశాడు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత షెడ్యూల్డ్ ప్రకారం పోస్ట్ లైవ్‌లోకి వచ్చింది.
ఆర్ఎస్ఎస్ సభ్యుల లైంగికవేధింపుల వల్ల ఏర్పడ్డ మానసికక్షోభ చాలా సంవత్సరాలుగా తనను వెంటాడిందని, అది మానసిక సంఘర్షణకు దారి తీసిందని బాధితుడు తెలియజేశాడు.
సంఘీల వల్ల అత్యాచారానికి గురైన వ్యక్తి కేరళలోని కొట్టాయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బంధువుల ఇంటి వద్ద తప్పిపోయాడని అక్టోబర్ 9న ఫిర్యాదు నమోదైన ఒక రోజు తర్వాత, తిరువనంతపురంలోని తంపనూర్ లాడ్జ్‌లో మృతదేహమై కనపడ్డాడు. మృతుడి సూసైడ్ నోట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన తర్వాత, పోలీసులు ఆచూకీని కనుగొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు.
ప్రేమ సంబంధం వల్ల కాకుండా, ఏళ్లతరబడి ఏర్పడ్డ తీవ్ర మానసిక క్షోభ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని తాను నిర్ణయించుకున్నట్టుగా సూసైడ్ నోట్ పోస్టులో మృతుడు స్పష్టం చేశాడు.
కొన్ని సంవత్సరాల క్రితం తనకు అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్(ఓసీడీ) ఉన్నట్టుగా నిర్థారితమైందని తెలియజేశాడు. ఆర్ఎస్ఎస్ శాఖలో కొనసాగిన సమయం నుంచి “అణిచివేయబడ్డ మానసికవేదన”వల్ల ఏర్పడిందని తర్వాత తనకు తెలిసొచ్చిందన్నాడు. తన సోషల్ మీడియా పోస్ట్‌ను మరణవాంగ్మూలంగా పరిగణించాలని తెలియజేశాడు.
బాల్యం నుంచే లైంగికవేధింపులు ఎదుర్కొన్న బాధితుడు..
మృతుడి పోస్ట్ ప్రకారం, అతను చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరాడు. “ఒక వ్యక్తి, ఒక సంస్థను(ఆర్ఎస్ఎస్) మినహాయించి నాకు ఎవరి మీద కోపం లేదు. ఎక్కడైతే నేను జీవితాంతం మానసికవేదనకు గురైయ్యానో, ఆ ఆర్ఎస్ఎస్ సంస్థలో మా నాన్న నన్ను చేర్పించారు”అని తీవ్రమైన ఆవేదనను బాధితుడు వ్యక్తం చేశాడు.
గతంలో తన ఇంటి పక్కకున్న వ్యక్తిని పోస్ట్‌లో బాధితుడు ప్రస్థావించాడు. తన మీద అత్యాచారం చేసిన వ్యక్తిని ఎన్ఎంగా తెలియజేశాడు. ఎన్ఎం మీద పలు ఆరోపణలు చేస్తూ, ఆర్ఎస్ఎస్ సభ్యుడైన ఎన్ఎం తనకు మూడేళ్ల వయసున్నప్పటి నుంచి నిరంతరం లైంగికంగా వేధించాడన్నాడు.
అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ మేళలో కూడా పలువురు ఆర్ఎస్ఎస్ వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని చెప్పుకొచ్చాడు.
ఆర్ఎస్ఎస్లో రెండు ప్రధాన శిక్షణా రకాలైన; ప్రారంభ శిక్షణా కేంద్రం, అధికార శిక్షణా కేంద్రాలలో తను ఉన్నప్పుడు ఈ సంఘటనలన్నీ జరిగాయని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
“దీనిని(ఆర్ఎస్ఎస్) ద్వేషించేంత వేరే ఏ సంస్థను నేను ద్వేషించను. ఈ సంస్థతో చాలా కాలం నాకు సంబంధముంది. కాబట్టి ఇందులో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయకండి. వారిని కేవలం స్నేహితులుగా కూడా భావించకండి. ఒకవేళ మీ తండ్రి, అన్న, కొడుకు ఎవరైనా సరే, ఆ సంస్థలో భాగస్వాములైతే వారిని దూరం పెట్టండి” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
“ఆర్ఎస్ఎస్ శిక్షణాకేంద్రాలలో కేవలం లైంగికంగానే కాదు, శరీరకంగా కూడా దాడికి గురైయ్యాన”ని బాధితుడు పేర్కొన్నాడు. ఆర్ఎస్ఎస్ శిక్షణా కేంద్రాలలో ఉపయోగించే దండతో(వెదురు కర్ర) తనను విచక్షణారహితంగా చితకబాదారని పోస్ట్‌లో తెలియజేశాడు.
“వాళ్లు(ఆర్ఎస్ఎస్ సభ్యులు) నాతో ఎలా ప్రవర్తించారో అదే నేను రాశాను. కానీ వాళ్ల శిక్షణా కేంద్రాలలో చాలా లైంగిక, శారీరక హింస జరిగింది. ఆ సంస్థలో నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. నాకు తెలుసు నేను చెప్పేది ఎవరూ నమ్మరని, ఎందుకంటే నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు. నేను నా జీవితాన్నే సాక్ష్యంగా పెడుతున్నాను. నేను తీవ్ర వేదనలో ఉన్నానని, నేను ఒప్పుకుంటాను. నాతో ఏదైతే జరిగిందో, నేను ఏదైతే అనుభవించానో ఏ పిలగాడు అనుభవించకూడదు” అని పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
తాను మాత్రమే ఎన్ఎం బాధితుడిని కాదని తాను నమ్ముతున్నట్టుగా రాసుకొచ్చాడు. “చాలా మంది పిల్లలు ఆర్ఎస్ఎస్ శిబిరాలలో, శాఖలలో ఇటువంటి హింసను ఎదుర్కొంటున్నారు. వాళ్లను రక్షించడం ఎంతో ముఖ్యం, అంతేకాకుండా వాళ్లకు సరైన కౌన్సిల్ ఇవ్వాలి.”
పోలీసులు తెలియజేసిన ప్రకారం, తిరువనంతపురంలోని బంధువుల ఇంటి నుంచి తప్పిపోయాడని ఫిర్యాదు నమోదైన ఒకరోజు తర్వాత లాడ్జ్‌లో బాధితుడి మృతదేహం లభ్యమైంది. తాను తన మరణవాంగ్మూలమని అభివర్ణించిన సూసైడ్ నోట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో కనబడింది. ఆ పోస్ట్ కనబడిన గంటల తర్వాత పోలీసులు తనను గుర్తించి, మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు.
పోలీసులు సీఆర్పీసీ- 174(అసహజ మరణం) కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. “మేము ఇన్స్టాగ్రామ్ పోస్టును చూశాము. ఆత్మహత్య కేసు మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మేము ముందుకు వెళ్తాము. మా ప్రాథమిక దర్యాప్తులో వేధింపులకు సంబంధించిన విషయాలు సరిగా తెలియలేదు” అని తంపనూర్ స్టేషన్ అధికారి తెలియజేశాడు.
ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలియజేసిన ఏ విషయం తమకు తెలియదని మృతుడి బంధువులు తెలియజేశారు. “తన మానసిక ఆరోగ్యం గురించి కేవలం ఈమధ్యే మాకు తెలిసింది. పోస్ట్‌లో తెలియజేసిన సంఘటనల గురించి తాము దర్యాప్తు చేస్తామని పోలీసులు మాకు చెప్పారు. ప్రత్యేక ఫిర్యాదు నమోదు చేయాలని మేము ఎటువంటి నిర్ణయానికి రాలేదు.”
ఏదిఏమైనప్పటికీ, తమ కుటుంటం కట్టర్ ఆర్ఎస్ఎస్ మద్దతుదారలని పోస్ట్‌లో మృతుడు తెలియజేశాడు. తాను చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ శిబిరాల/శాఖలకు హాజరవుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు. చనిపోకముందు తల్లి, సోదరితో తను కలిసి ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ సభ్యుడైన తన తండ్రి ఆరేళ్ల క్రితం చనిపోయాడు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
