నయా నిపుణులు: మోడీ హయాంలో సాంకేతిక నైపుణ్య హామీలు, ప్రజలను ఆకర్షించే కులీనులు; దేశవ్యాప్తంగా విస్తరించిన హిందూత్వ ఉద్యమం– ప్రత్యేకించి ఇప్పటి వరకూ ఉన్న పలురంగాల నిపుణుల స్థానంలో హిందూత్వ సిద్ధాంతాలు, విధానాల పట్ల సానుభూతి, ఏకాభిప్రాయం కలిగిన కొత్త తరహా నిపుణుల బృందాలను నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలా తెరమీదకు తెచ్చిందో తన రచనలో సజ్జన్‌హార్ చర్చిస్తారు.
ఈ ప్రక్రియలో ప్రత్యామ్నాయ అభిప్రాయాలను రూపొందించటం, వాటిని వ్యక్తపరిచేందుకు ప్రత్యామ్నాయ నిపుణులకు తర్ఫీదిచ్చి సిద్ధం చేయటం; వారికి గుర్తింపు ఇవ్వటానికి వీలుగా ప్రత్యామ్నాయ వ్యవస్థలను, సంస్థలను నిర్మించటం; ఈ ప్రత్యామ్నాయ సంస్థలు, నిపుణులు హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేలా చూడటం కీలకమైన కసరత్తు.
ప్రజాభిప్రాయాన్ని నిర్మించటం, పరిపానలలో సాంకేతిక నిపుణుల పాత్ర, ప్రాధాన్యత పెంచటం, ప్రభుత్వ వ్యతిరేక చర్చను నియంత్రించటం ద్వారా ఈ మార్పుకు తెరతీసింది మోడీ ఏలుబడి.
కీలక పాత్ర పోషించాయనే భావన
పూర్వపు మేధావుల స్థానంలో కొత్త తరహా నిపుణులు, మేధావులను సిద్ధం చేయటం బీజేపీ అనుసరించిన ఈ వ్యూహంలో కీలకమైన దశ. వీళ్లంతా స్వతంత్ర సంస్థాగత అస్తిత్వం కలిగిన వాళ్లుగానే కనిపిస్తున్నా బీజేపీ రాజకీయ ఎజెండాను సమర్థించే తరగతి నుంచి ఎంచుకోబడిన వాళ్లే. ఈ మార్పును అధ్యయనం చేయటానికి రచయిత రెండు కోణాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఒకటి సాంకేతిక నిపుణులు, రెండోది ప్రజాభిప్రాయ నిర్మాణం. ప్రజాభిప్రాయ నిర్మాణం ఎలా జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించకపోయినా రచయిత తరచూ సాంకేతిక అభివృద్ధిని వ్యతిరేకించే మితవాద, కులీన వ్యతిరేక వాదన, మేధో వ్యతిరేకతనూ ప్రత్యేకించి పాలక పార్టీ మితవాద భావజాలంతో మమేకమయ్యే ధోరణులను ప్రజాభిప్రాయ నిర్మాణంలో భాగంగా పరిగణిస్తున్నారు రచయిత. ఏదిఏమైనా ఈ ప్రజాభిప్రాయ నిర్మాణక్రమం, సాంకేతిక నైపుణ్యం రెండూ హిందూత్వ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించటంలో కీలక పాత్ర పోషించాయని రచయిత నిర్ధారిస్తారు.
అయితే, ఈ పుస్తకంలో భావనకు సంబంధించిన కొన్ని లోపాలున్నాయి. ప్రజాకర్షణ అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించకుండా, వివరించకుండా రచయిత నిర్ధారణలను అర్థం చేసుకోవటం కష్టమయ్యే అవకాశం ఉంది. సజ్జన్‌హార్ దృష్టిలో ప్రజాకర్షక చర్యలు కేవలం రాజకీయ వ్యూహం మాత్రమేకాదు. దాని వెనుక ఓ సైద్ధాంతిక నేపథ్యం ఉంది. అయితే ఎక్కువ మంది పరిశోధకులు ప్రజాకర్షక విధానాలు/చర్యలను రాజకీయాచరణలో భాగంగా చూస్తున్నారు తప్ప సైద్ధాంతిక నేపథ్యంలో చూడటం లేదు. సైద్ధాంతిక నేపథ్యంలో ఈ దిశగా జరిగే పరిణామాలు లేదా చేపట్టే చర్యలు ప్రధానంగా విశాల జనసామాన్యంలో చీలికలు తేవడం లక్ష్యంగా ఉంటాయి. వారి మధ్య విబేధాలు సృష్టిస్తాయి.(వైలాండ్ 2001, లాక్లౌ 2005).
రచయిత ప్రజాకర్షక చర్యలు గురించి వివరించేటప్పుడు వ్యూహం, రాజకీయ ఎజెండాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరిస్తే మరింత ప్రయోజనకరంగా ఉండేది. సాధారణంగా ప్రజాకర్షణ చర్యలు/విధానాలు పరిపాలనలో సాంకేతిక నిపుణుల జోక్యాన్ని వ్యతిరేకించవు. ఈ అవగాహన వేర్వేరు రాజకీయ సైద్ధాంతిక ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఉపకరిస్తుంది.
ప్రస్తుతం భారతదేశం కలిగి ఉన్న ప్రాపంచిక దృక్ఫథం స్థానంలో హిందూత్వ ప్రాపంచిక దృక్ఫథాన్ని ఇమడ్చటానికి, ఆధిపత్య ప్రాపంచిక దృక్ఫథంగా మల్చటానికి, ప్రజలను ఒప్పించటానికి జరుగుతున్న ప్రయత్నాలను రచయిత ఈ కోవకిందకు తెచ్చినట్లు కనిపిస్తుంది.
ఇదే అవగాహనను చెప్పదల్చుకున్నప్పుడు గ్రాంస్కీ ఉపయోగించిన ‘ఇంగితం’ కలిగించటమనే పదబంధాన్ని, భావనను ఉపయోగిస్తే మరింత స్పష్టంగా ఉండేది. ఈ పరిమితిని మినహాయిస్తే ఈ పుస్తకం పౌరసమాజంపై సంఘపరివారం ఆధిపత్యాన్ని ఎలా స్థాపించి సుస్థిరం చేసుకుందో విపులంగా ఉదాహరణలతో సహా చర్చిస్తారు.
సాంకేతిక నిపుణుల అజమాయిషీ వివరాలు
ఈ పుస్తకంలో రెండో అధ్యాయం– రచయిత చర్చించదల్చుకున్న భావనల వివరణ. ఇందులో వివిధ సలహా సంప్రదింపుల బృందాలు యావత్ పరిపాలనను సాంకేతిక నిపుణుల అజమాయిషీ కిందకు తీసుకురావడం గురించి వివరాలున్నాయి. హిందూత్వ సైద్ధాంతిక పునాదులను 19వ శతాబ్దం ఆరంభం కాలం నుంచి పరిశీలిస్తారు రచయిత. ఊహాజనితమైన భారతీయ గతాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో కొద్దిమంది బ్రాహ్మణులు ప్రారంభించిన ప్రాజెక్టు ఇది. ప్రత్యేకించి సావర్కార్, గోల్వాల్కర్, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు, ప్రతిపాదనలు సంఘపరివారంలోనే ఎలా ప్రాచుర్యం పొందాయో అనంతరం భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రాజెక్టుకు ఈ ప్రతిపాదనలు పునాదులుగా మారిన తీరును రచయిత లోతుగా చర్చించారు. ఈ ప్రాజెక్టులో కేంద్రకాంశం భారతదేశం ఆధ్యాత్మిక దేశమనే అవగాహన. ఈ ప్రతిపాదన వెలుగులో హిందూత్వ కూడా లౌకికతత్వం ముసుగు వేసుకుంటుంది. దేశపు వాస్తవిక పరిస్థితికి లోబడే వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని కలగచేస్తుంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియాను వినియోగించటం ద్వారా విజయదుంధుభి మోగించిన తీరు గురింంచి ఈ అధ్యాయంలో వివరమైన చర్చ ఉన్నది. సోషల్ మీడియా ద్వారా పరస్పర విరుద్ధ స్వభావాలున్న సందేశాలను నిర్దిష్టంగా ఎంపిక చేసిన ఓటర్లకు ఎలా చేరవేశారు, కాంగ్రెస్‌ను విమర్శించటం కోసం ఎంచుకున్న అంశాలు, సంపన్నుల చేతుల్లో బందీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధిని సాధించలేకపోయిందన్న ఆరోపణలను ఓ పథకం ప్రకారం ముందుకు తెచ్చింది. ఈ పరిస్థితులకు భిన్నంగా విధానాల రూపకల్పనలో మెరుగైన పనితీరు, పరిపాలనను శుద్ధిచేయటం వంటి నినాదాలు ప్రచారంలో పెట్టింది. సాంప్రదాయకంగానే బీజేపీ నయా ఉదారవాద విధానాలను, బడా వ్యాపారులకు అనుకూల విధానాలను అమలు చేసే పార్టీయే. అయితే యూపీఏ ప్రభుత్వం హయాంలో అమల్లోకి వచ్చిన హక్కుల ఆధారిత ప్రభుత్వ విధానాలు అన్న భావనకు బీజేపీ తిలోదకాలు ఇచ్చిందని రచయిత విశ్లేషించారు.
హిందూత్వ వాహకాలుగా మేధోబృందాలు
మూడో అధ్యాయంలో ప్రజాకర్షక నినాదాలే కాక సంఘపరివారం తన హిందూత్వ ప్రాజెక్టును పకడ్బందీగా జనంలోకి తీసుకెళ్లటానికి మేధోబృందాలను కూడా ఎలా ఉపయోగించుకున్నదో వివరించారు. సాంకేతిక బృందాలకు, క్షేత్రస్థాయి రాజకీయ ప్రయోజనాలకు మధ్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించటమే ఈ మేధోబృందాల బాధ్యత అంటారు రచయిత.
వివిధ పేర్లతో నడిచే ఈ మేధో బృందాలు అవే ఓ పౌరసమాజ వేదికలుగా మారి ప్రభుత్వం రూపొందించదల్చుకున్న విధానాలకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మల్చటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచం గుర్తించిన మేధావుల స్థానంలో హిందూత్వ అనుకూల మేధో బృందాలకు తర్ఫీదునిస్తోంది బీజేపీ, ఆరెస్సెస్.
ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయటం దీనికి ఉదాహరణగా చూపిస్తారు రచయిత.
ప్రణాళిక సంఘం రాజ్యాంగబద్ధమైన శాశ్వత వ్యవస్థ. కానీ నీతిఆయోగ్ తాత్కాలిక సంస్థ. ప్రణాళిక సంఘానికి స్వయంప్రతిపత్తి ఉండేది. నీతిఆయోగ్‌కు స్వయంప్రతిపత్తి లేదు. తరచూ ఆంగ్ల పరిజ్ఞానం కలిగిన పౌరసమాజం ఏజెండా రూపొందించే పరిస్థితి నుంచి హిందూత్వ ప్రాజెక్టును సమర్ధించే శక్తులు సమాజానికి ఏం కావాలో నిర్ణయించే స్థాయికి వచ్చారు. దీనికి కావల్సిన మేధో కరసేవకులను తయారు చేసి తర్ఫీదునిచ్చే పనిలో బీజేపీ నిమగ్నమైంది.
నాల్గో అధ్యాయం ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కన్సల్టెన్సీ సంస్థల జోక్యంపెరుగుతున్న తీరును చర్చిస్తారు రచయిత. సంఖ్యాపరమైన వివరాల సేకరణ వాటిని విశ్లేషించి ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉపయోగించేలా చేయటంలో సలహాలు సూచనలు ఇవ్వటంతో పాటు ఎన్నికల ప్రచారం, గెలుపు ఓటములను నిర్ధారించటంలో కూడా ఈ కన్సల్టెన్సీ సంస్థల పాత్ర పెరిగిందన్నది ఈ అధ్యాయంలోని సారాంశం. ఈ మొత్తాన్ని సాంకేతిక నిపుణుల చేతుల్లోకి పరిపాలన పగ్గాలు బదిలీ కావటంగా చూస్తున్నారు రచయిత.
అయితే ఈ రకమైన మార్పు వలన ప్రజాస్వామిక వ్యవస్థలో ఉండాల్సిన జవాబుదారీతనం ఎలా దెబ్బతింటోందోననే దానికి సంబంధించి సమగ్రమైన చర్చ లేదు. ఎన్నికల ప్రచారాన్ని బయటి వ్యక్తులు, సాంకేతిక నైపుణ్యం కలిగిన మేధావులు రూపొందిస్తున్నా అంతిమంగా ఎన్నికవుతోంది పార్టీ నియమించిన అభ్యర్ధి మాత్రమే. అటువంటి సందర్భంలో పార్టీ వ్యవస్థల స్థాయిలో అమలు జరగాల్సిన జవాబుదారీతనం ఎందుకు అమల్లో లేదనే ప్రశ్నను ఈ రచన విస్మరించినట్లు కనిపిస్తోంది.
సాంకేతిక నిపుణులు విస్తృతమైన గణాంక సమచారం ఆధారంగా ప్రచార వ్యూహాలను మరింత పకడ్బందీగా రూపొందింవచ్చు. వేగంగా ప్రచారం చేయవచ్చు. కానీ దీన్నే ప్రజాస్వామ్యంలో తలెత్తుతున్న పరిమితిగా భావించలేము. అదేవిధంగా విధాన రూపకల్పనల్లో ఇటువంటి నిపుణలు సలహా సంప్రదింపుల బృందాల పాత్ర గురించిన వివరణ ఉండాల్సినంత స్పష్టంగా లేదు.
ఈ సలహా సంప్రదింపుల బృందాలు ఐఎఎస్‌ల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయా లేక వారికి లోబడి పని చేస్తున్నాయా? సైద్ధాంతికంగా అవరోధంగా మారిన అధికారవర్గాన్ని కాదని తమ విధానాలు రూపొందించి, అమలు చేయటానికి పాలకవర్గం ఇటువంటి సాంకేతిక సలహా సంప్రదింపుల బృందాలపై ఆధారపడుతున్నదా? వంటి ప్రశ్నలకు ఈ రచన సమాధానాలు చెప్పలేదు. ఇక్కడ కేవలం ప్రైవేటు కన్సల్టెంట్ల గురించి మాత్రమే రచయిత టెక్నోక్రసీ అనే పదాన్ని ఉపయోగించి, వారిని పరిమితం చేశారు.
అధికారవర్గం రూపొందించి అమలు చేసే విధానాల విషయంలో కూడా ఇటువంటి ప్రభుత్వానికి వెలుపలున్న నిపుణుల జోక్యం కూడా ఉంటుంది. అది కూడా టెక్నోక్రసీ నిర్వచనం కిందకే వస్తుంది. ఈ పరిస్థితుల్లో కేవలం జవాబుదారీతనంతో నిమిత్తం లేని సలహా మండళ్లు జోక్యం చేసుకోవటం వలన ప్రజాస్వామ్యం వీగిపోవటం లేదా సైద్ధాంతిక చట్రాలు మారిపోవటం వంటి పరిణామాలుగా ఎలా మారుతున్నాయో సూటిగా ఈ రచన వివరించలేదు. బీజేపీ నిర్మించదల్చుకున్న రాజకీయ ప్రాజెక్టును సార్వత్రిక ఆమోదం పొందేలా చేయటంలో యాజమాన్య నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో వివరించగలిగితే ఈ రచన సారాంశం హిందూత్వ సాంస్కృతిక ఆధిపత్య నిర్మాణం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది.
ఐదో అధ్యాయంలో హిందూత్వ రాజకీయ ఎజెండాను అమలు చేయటంతో పాటు విద్యావ్యవస్థ, మీడియా ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయటానికి కావల్సిన దీర్ఘకాల పునాదులను ఎలా సమకూర్చుకుంటుందో చర్చిస్తారు రచయిత. ఈ విషయంలో ఢిల్లీ కేంద్రంగా పని చేసే చాణక్య ఇనిస్టిట్యూట్, ఇండియా ఫౌండేషన్ వంటి సంస్థల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించి విశ్లేషిస్తారు. ప్రజలకు సమాజం గురించి ఉన్న సాధారణ అభిప్రాయాల రూపంలోనే హిందూత్వ ప్రాజెక్టును కూడా చూసేలా చేసేందుకు కావల్సిన పదప్రయోగాలు మొదలు ప్రచారాస్త్రాల వరకూ తయారు చేయటంలో ఈ సంస్థలు సాగిస్తున్న కృషి గురించిన వివరాలున్నాయి.
గ్రాంస్కీ ప్రతిపాదించిన కామన్ సెన్స్, సాంస్కృతిక ఆధిపత్యం భావనల కోణంలో వర్తమాన పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయం బాగా ఉపకరిస్తుంది. హిందూత్వ అనుకూల మేధో బృందాలు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాయి? తమ గురించి తాము లోకానికి ఎలా పరిచయం చేసుకుంటాయి? ఈ ప్రపంచాన్ని మార్చటానికి వీలుగా ఎటువంటి కార్యాచరణలను ప్రతిపాదిస్తాయి? వంటి విషయాలు, వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ప్రత్యేకంగా చర్చించిన అంశాలు
ఆయా సంస్థలు నిర్వహించే గ్రంధాలయాల్లో ఉండే సాహిత్యం, వాటి సౌందర్యారాధన వంటి వాటిని కూడా ఈ అధ్యాయం చర్చిస్తుంది. వేల సంవత్సరాల ముస్లిం, బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తి చెందిన హిందూ జాతి; నేడు ఎలా జూలు విదిలిస్తుందో రసవత్తరంగా వివరించిన అనేక రచనలు– ఈ గ్రంధాలయాల ద్వారా అందుబాటులోకి తేవడానికి జరుగుతున్న కృషిని రచయిత ప్రత్యేకంగా చర్చిస్తారు.
చాణక్య ఇనిస్టిట్యూట్ ప్రజలను ప్రభావితం చేయటానికి తెరమీదకు తీసుకురావల్సిన అంశాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పని చేస్తూ ఉంటే; ఇండియా ఫౌండేషన్ మాత్రం బీజేపీ రాజకీయ సమీకరణల విషయంలో ప్రత్యేకించి ఎన్నికలు, నిధుల సమీకరణవంటి విషయాల్లో ప్రత్యక్ష భాగస్వామి.
స్థూలంగా చూసినప్పుడు వర్తమాన భారతదేశంలో హిందూత్వరాజకీయ కార్యాచరణ గురించి, సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిర్మించటంలో సంఘపరివారం అమలు చేస్తున్న వ్యూహాల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. కానీ పైన ప్రస్తావించిన పరిమితులు, లోపాల వల్ల రచయిత చెప్పదల్చుకున్న అంశాన్ని సూటిగా పాఠకులకు అందించటం కష్టంగానే ఉంది. పైగా హిందూత్వ సాంస్కృతిక ఆధిపత్యం, ప్రజాకర్షణ చర్యలు, సాంకేతిక నిపుణుల పాత్ర అనే మూడు వేర్వేరు అంశాలను కలగాపులగం చేయటంతో పుస్తకం పాఠకులను గందరగోళానికి గురిచేస్తుంది.
ఈ పుస్తకం చెప్పదల్చుకున్న విషయాన్ని బూరోక్రసీ గురించి, సాంకేతిక నిపుణుల బృందాల గురించి చర్చించి గందరగోళపరిచారు రచయిత. ఈ విషయాన్ని రెండు భిన్నమైన పరిశోధనాంశాలుగా పరిగణించి ఉంటే మరింత లోతైన చర్చకు అవకాశం ఉండేది. ఇలా చేయటం ద్వారా హిందూత్వ అనుకూల, లేదా హిందూత్వ సంస్థల ప్రేరేపిత మేధో బృందాలు వర్తమానంలో ప్రజాభిప్రాయాన్ని దారి మళ్లించటంలో పోషిస్తున్న పాత్ర గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయటం అవసరం ఉండేది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
