
తాజాగా విడుదల చేసిన ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో రెండు అంశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మొదటిది ఢిల్లీ సుల్తాను రాజ్యం, మొగలు వంశానికి సంబంధించిన మొత్తం అధ్యాయాలన్ని అక్కడక్కడా ప్రస్తావన మాత్రంగా కుదించబడ్డాయి.
రెండోది రాజపుత్ర రాజ్యాల చరిత్రను రెండు పేజీలకు తగ్గించగా మరాఠా రాజ్యానికి 22 పేజీలు కేటాయించారు.
ఇటీవలి కాలంలో ఎన్సీఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులకు రాజస్తాన్‌లో నిరసనలు చెలరేగాయి.
ఈ నిరసనలకు నాయకత్వం వహించింది విశ్వవిద్యాలయాల విద్యార్థులు, సామాజిక కార్యకర్తలే కాదు. గతకాలపు రాజరిక కుటుంబాల సభ్యులు కూడా.
ఇది భారతదేశపు చరిత్ర కథనాలను స్కూలు పాఠ్యపుస్తకాల ద్వారా పునఃరూపకల్పన చేస్తున్న తీరు ఎంత అసౌకర్య భావన ఏర్పరుస్తున్నదో ప్రతిఫలిస్తుంది.
ఈ నిరసనలు ప్రాథమికంగా రాజస్తాన్‌కే పరిమితమైనప్పటికీ, అవి లేవనెత్తిన అంశాలు ఎంతమాత్రం స్థానికమైనవి కాదు.
ఈ సవరణలతో దేశవ్యాప్తంగా విభిన్నమైన రాష్ట్రాల్లో- గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో లక్షలమంది విద్యార్థులు తాము నివసించే ప్రదేశాల చరిత్రను తెలుసుకుంటారు.
పాఠ్య పుస్తకాల్లో ఎవరి చరిత్రను అతిగా చూపించారు? ఎవరివి కత్తరించబడ్డాయి? ఏ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడటానికి ఇటువంటి సంపాదక నిర్ణయాలు జరిగాయనే విశాలమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతాయి.
తాజాగా విడుదల చేసిన ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో రెండు అంశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మొదటిది, ఢిల్లీ సుల్తానుల పాలన మొగలు వంశ సామ్రాజ్యానికి సంబంధించిన మొత్తం అధ్యాయాలన్ని కత్తిరించి, అక్కడక్కడా ప్రస్తావనలుగా కన్పించేలా కుదించడం ద్వారా శతబ్దాల కాలం పాటు జరిగిన సాంస్కృతిక, రాజకీయ, వాస్తురీతుల కృషిని తుడిచి వేయటం జరిగింది. రెండోది, ఉత్తరభారత దేశం అంతటా విస్తరించిన రాజపుత్ర రాజ్యాలు- ఉత్తర భారతదేశానికి చెందిన తోమర్లు, చౌహానులు, సోలంకీలు; మధ్య భారతంలోని ప్రతీహారులు, చందేలులు, పర్మారులు; తూర్పు భారతంలోని గహర్వార్, కల్చురీలు రెండు పేజీలకు తగ్గించబడ్డారు. దీనికి పూర్తి విరుద్ధంగా మరాఠా రాజ్యానికి 22 పేజీలు కేటాయించారు.
ఇది కేవలం హిందూ- ముస్లిం వ్యవహారం కాదు. ఎంపిక చేసుకొని వైభవంగా ప్రాచుర్యం కల్పించడం. మరాఠా చరిత్రను భాగ్యవంతం చేయటం.
అదే సమయంలో రాజపుత్రులు, ముస్లింల వారసత్వాన్ని మసక బార్చడం. ఇది ఎందుకు చేశారో అర్థం చేసుకోవాలంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మూలాలు మహారాష్ట్ర బ్రాహ్మణ ఆవరణంలోని హిందూత్వ రాజకీయాలు- వాటి స్థానిక సంకుచిత వాదాన్ని ఇపుడు జాతీయగాథగా చూపించడం అనే వాటిని మందుగా గుర్తించాలి.
ఏది మారింది?
ఎనిమిదో తరగతి చరిత్ర పాఠ్యప్రణాళికలో ప్రారంభ ఆధునిక కాలం గురించినదంతా ఎక్కువ భాగం పునర్లిఖించబడింది. అత్యంత స్పష్టంగా కనిపించే మార్పు భిన్నమైన ప్రాంతీయ చరిత్రలకు, చారిత్రక అస్తిత్వాలకు కేటాయించిన స్థలంలో వివక్షత.
మరాఠా చరిత్ర ఇపుడు విస్తారంగా 22 పేజీలు పొందింది: వివరమైన, ఎక్కువభాగం తరచుగా కీర్తిగానం చేసే గాథ ఏదయితే ఉందో అది మరాఠా సమాఖ్య సైనిక విజయాలు గురించి తెలియజేస్తుంది. ప్రత్యేకించి 18వ శతాబ్దపు పీష్వా నాయకత్వంపై కేంద్రీకరించిన చరిత్ర రచన ఇది.
వివిధ ముస్లిం వంశాల పాలన అంటే ఢిల్లీ రాజ్యపరిపాలన, మొగలు సామ్రాజ్యం వంటి వాటిని పూర్తిగా తొలగించడమో లేకుంటే వ్యంగ్య రేఖా చిత్రాలుగా దిగజార్చడమో జరిగింది.
రాజపుత్ర రాజ్యాలు- రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూల్లో రాజ్యమేలిన వారి చరిత్ర రెండు పేజీలకు సరిపెట్టారు. ఈ రెండు పేజీల్లోనూ ప్రధానంగా మొగలులు రాజపుత్రుల కలయికపై వక్కాణింపులు జరిగాయి. కానీ విభిన్నమైన రాజపుత్ర తెగలు, వంశాలు చేసిన కృషి అనేక నగరాలు, పట్టణాలు నిర్మించడం, వాస్తు కళల అభివృద్ధి, నీటీ పారుదల వ్యవస్థల నిర్మాణం, విభిన్నమైన ఆధ్యాత్మిక సాంప్రదాయాల్ని ఆదరించడం, భిన్న జాతులను భిన్న మతాలను మేళవించి సాగిన రాజపుత్ర రాజకీయరీతులు వంటి వాటికి అతితక్కువ స్థలం కేటాయించబడింది.
తిరగరాసిన ఎన్సీఆర్టీ అధ్యాయాలు కేవలం ఎంపిక చేసుకున్నవే కాదు, వాస్తవాలను వక్రీకరించేవిగా కూడా ఉన్నాయి. మరాఠా సామాజ్రపటం నిజానికి ఎప్పుడూ వాళ్లకి లొంగని ప్రాంతాలను కలుపుతూ గీయబడింది. దక్కను నవాబుల కింద, మొగలుల కింద మరాఠాలు సుదీర్ఘకాలం పాటు అందించిన సేవలను పక్కకు నెట్టేశారు.
మొగలుల సంస్థగత నిర్మాణాల్లో వారి విలీనం స్పష్టంగా చూపించే ఆధారాలున్నాయి. “ఔరంగజేబు ఆధీనంలో మొగలుకు లీనులు” అనే గ్రంథంలో చరిత్రకారుడు ఎం అత్తార్ అల్ 1647 నాటికి ఔరంగజేబు కింద 96 మంది మన్సబ్దార్లు ఉంటే, 72 మంది రాజపుత్రులున్నారని గ్రంధస్థం చేశారు. వారిలో కొందరు అత్యున్నతపదవుల్లో ఉన్నారు. 12 మంది మరాఠాలు 5 వేల మందికి నాయకులుగా ఉంటే 27 మంది 3- 4 వేల మందిని అదుపు చేశారు. 57 మంది మరాఠాలు వెయ్యిమందిని శాసించారు. శివాజీ తండ్రి షాహ్జీ భోస్లే బీజాపూర్ సైన్యంలో చాలాకాలం పనిచేశాడు. బెంగుళూరు కెంపెగౌడలకు పైన యుద్ధం చేసిన సేనను నడిపించాడు కూడా.
అయినా గాని మరాఠా సామ్రాజ్యంగా చెబుతున్నది ఎపుడూ ఐక్యరాజ్యంగా లేదు. అది ఒక వదులు సమాఖ్య- సింధియా, హాల్కల్, గైక్వాడ్, భోంస్లే తెగల ముఖ్యులు తరచుగా స్వతంత్ర్యంగా వ్యవహరించేవారు. ఒకరితో ఒకరు యుద్ధాలు చేసేవారు. పతాక స్థాయిలో ఉన్నప్పుడు పీష్వాలు వకీల్- ఉల్- ముత్లక్, అమీర్ ఉల్ ఉమ్రావంటి మొగలు బిరుదుల్ని స్వీకరించారు. ఉత్తర భారతాన్ని కొల్లగొట్టి మొగలు సామ్రాట్టు పేరిట పన్నులు వసూలు చేశారు.
హిందూ భారత రక్షకులుగా మరాఠాలను పేర్కొన్న నాయకత్వ కథనాలేవీ చరిత్రతో సరిపోలవు. కాబట్టి ఎన్సీఆర్టీ కొత్త పాఠ్యప్రణాళిక ఈ వాస్తవాలను మౌనంగా దాట వేస్తుంది.
బాలీవుడ్ నుంచి ఎన్సీఆర్టీకి..
ఎన్సీఆర్టీ 8వ తరగతి తిరగ రాతలు- ఒక ముస్లిం ప్రతినాయకుడు, తనతో చేతులు కలపిని రాజపుత్రుడు వారిని ఎదిరించే మరాఠా రక్షకుడు అనే అంశంతో ఇటీవల నిర్మించిన భారీ హిందీ సినిమాల ప్రతిధ్వని.
2015లో నిర్మించిన బాజీరావ్ మస్తానీ, 2019లోని పానిపట్ వంటి సినిమాలు మరాఠాలను జాతీయ హీరోలుగా పునరుద్ఘాటిస్తూ పరస్పర ఒప్పందాలు జరిగిన గందరగోళ రాజకీయాలను తుడిచేశాయి. తన్హాజీ(2020) ఈ దృశ్యానికి పదునెక్కించింది. తాజాగా ఛావా సిన్మా(2025) దాన్ని కొనసాగిస్తున్నది.
వీటన్నింటిలోనూ ముస్లింలు దుర్మార్గులయిన ప్రతినాయకులు, రాజపుత్రులు నామక పాత్రలకు కుంచించబడ్డారు. వారి చరిత్ర అంతా మరాఠా చిత్రానికి అణిగిపోయింది. ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలు ఈ సినిమాత్మకమైన అసమతుల్యాన్ని అనుకరించడం ప్రారంభించాయి. బాలీవుడ్ పుక్కటి పురాణాలన్ని అధికారిక చరిత్రగా మారుతున్నాయి.
హిందూత్వ సైన్యపు మరాఠా ఆధిపత్యం..
ఈ అసమతుల్యానికి కారణం అరెస్సెస్ మేధావిత్య వంశావళిలోనే ఉన్నది. 1925లో నాగపూర్‌లో ప్రారంభించబడిన ఈ సంస్థ పీష్వాయుగం పట్ల గాఢమైన వ్యామోహంగల మరాఠీ బ్రాహ్మణన వర్గం నుంచి ఉద్భవించింది.
సర్దార్‌పటేల్‌కు డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాసిన లేఖ బట్టి చూస్తే “డాక్టరు ద్వారకా ప్రసాద్ ప్రకటన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉద్యమమనే అంశాన్ని మినహాయించి దీన్నంటికినీ బయటకు తెచ్చింది” అంటారు. అదే ఉత్తరంలో భారత పూర్వరాష్ట్రపతి ఆరెస్సెస్ నిజమైన లక్ష్యాన్ని కూడా పేర్కొన్నారు.
“నిజమైన లక్ష్యం తెలియదు. అంతేకాదు, హిందూ రాజ్యం కాకుండా పీష్వారాజ్యం నిర్మించడం అనేదే ఈ ఉద్యమాల లక్ష్యమని కూడా తెలియదు. ఈ అంశం బయటపడితే, ఈ ఉద్యమాన్ని వారెంత రహస్యంగా దేనికోసం నడుపుతున్నారో బయటకు తెస్తే ఉత్తరభారత దేశీయులు దీని నిజమైన ప్రాధ్యాన్యతను అర్థం చేసుకుంటారు.”
బ్రాహ్మణ కులీనులైన అధికారులు పరిపాలకులపై మరాఠ రాజకీయం ఆధారపడటం పెరిగిందని రిచర్డ్ బార్నెట్ గమనించారు. త్రిపుర్దమాన్ సింగ్ అభిప్రాయంలో దీనివలన రాజపుత్ర బృందాలతో మరాఠా సంబంధాలు ఒత్తిడికి గురైనాయి.
బ్రాహ్మణ పూజారులు, సన్యాసులు, అధికార యంత్రాంగం మధ్య సంబంధాల అల్లికను విస్తరించడం ద్వారా, ఒక క్రమబద్ధీకరించిన సంబంధాల వ్యవస్థను సృష్టించి కులాధిపత్యాన్ని పునరుద్ధరించారని సుసాన్ బేలీ నిరూపించారు.
పీష్వాలకాలంలో రాజ్యం అతిగా బ్రాహ్మణ రక్షక రాజ్యంగా మారిందని అమర్జోతిసింగ్ నొక్కివక్కాణించారు. బ్రాహ్మణ పాలనాకారులు మరాఠా రాజ్యాన్ని “ఆదర్శమైన బ్రాహ్మణ రాజ్యాంగం”గా ఊహించుకున్నారని సీఏ బేలి జోడించారు. దాని భావజాలమూ, పరిపాలనా కూడా బ్రహ్మణీయ నియమాల చుట్టూ తిరుగతాయని వారి భావన.
పీష్వాలపై జ్యోతిబాఫూలే చేసిన ఘాటయిన వివరణ హిందూత్వవాదులు వారిని పుణ్యపురుషులుగా కీర్తిగానం చేయడాన్ని తీసి పడేస్తుంది. వాళ్లు మతవాదులు ప్రాంతీయ దురహంకారులనేదాంతో మహారాష్ట్రలోని బ్రాహ్మణేతర గొంతులు ఇప్పటికీ వారిని తిరస్కరించాయి.
హల్దిఘాటి భిన్నత్వం..
విచిత్రంగా ఢిల్లీ మేధో చర్చా ప్రదేశాలు హల్దిఘాటి యుద్ధంపై కేంద్రికరిస్తాయి. అంతేకాకుండా తరుచుగా సంచలాత్మక కథనాలు తయారు చేస్తుంటాయి. విద్యారంగంలో గొప్పభారం వేసే ఈ పాఠ్యపుస్తకాల సవరణలను మాత్రం పక్కన వదిలిపోతారు.
1576 నాటి ఘర్షణ జ్ఞాపకాల్లో ముద్రపడి పోయినా కానీ అది మొగలులకు, రాజపుత్రులకు కానీ నిర్ణయాంశం కాదు. అది సారాంశంలో ఇద్దరు గొప్ప రాజపుత్ర రాజనీతుజ్ఞలయిన మేవార్ రాజు మహరానా ప్రతాప్ అంబేర్ రాజు రాజామాన్ సింగ్ కచవాహ మధ్య పోటీయే- అది ఆ ప్రాంతీయ భవిష్యత్తు రూపకల్పనే. రక్త తలై శాసనం గురించి అప్పటి రాజసమంద్ ఎంపీ దియా కుమారి వ్యాఖ్యానాలను రాజకీయ కోణంలోనే అర్థం చేసుకోవాలి. అది మాన్సింగ్ వారసురాలిగా ఆమెకు అతన్ని ప్రతిఘటించిన పూర్వీకులు గల రాజపుత్రుల ఓటు బ్యాంకు మధ్య కుదిరిన సయోధ్యగానే ఈ సవరణలను చూడాలి.
అయినా ఢిల్లీ మీడియా హల్దిఘాటి విగ్రహాలు శాసనాల వద్దకు మళ్లీమళ్లీ తిరిగి వస్తుంటుంది. అదే సమయంలో పీష్వాల కేంద్ర చరిత్ర కీర్తిగానం ఎన్సీఆర్టీ, హిందీ సిన్మారంగం ఒక క్రమపద్ధతిలో చేయటాన్ని పట్టించుకోదు. ఒక దశాబ్దం క్రిందట గిరీష్ షహానే రాజపుత్రులను ఓటమి- నిపుణులుగా పేర్కొని ఒక కుల వ్యంగ్య చిత్రం కూడా తయారు చేశాడు. హిందూత్వను విమర్శించే ముసుగులో బ్రాహ్మణ రచయితలు దీని కొండంతలు చేశారు. ఇక్కడ ముస్లిం చరిత్రపై హిందూత్వదాడిని బ్రాహ్మణ రచయితలు రాజపుత్రుల సమూహం దాని చరిత్రపూ దాడి చేయడానికి అవకాశంగా వాడుకున్నారు. అప్పుడు హిందూత్వకి కేంద్రస్థానంలో ఉన్నప్పటికీ పీష్వా మరాఠా ఆధిపత్యం దాని సినిమాపరమైనా, పాఠ్యాంశాల పరమైన సాధారీకరణ ఈ పరిశీలనలోంచి తప్పించుకుంది.
బ్రాహ్మణీయ నేపథ్యపు రచయితలు అనేకులు హిందూత్వ వ్యతిరేకులుగా కనబడుతున్నా కానీ రాజపుత్రులు- ముస్లింల రాజకీయ కలయికల్ని, ఏకీకృతమైన ఆధ్యాత్మిక సాంప్రదాయాల్ని వాటి సంక్లిష్టతల్ని గుర్తించే నేపథ్యంలో కాకుండా పరస్పరం విరుద్ధంగా వాటిని ఒక ఇబ్బందికరమైన ధ్వనితో చిత్రీకరిస్తారు. దాంతో వారు ఏ హిందూత్వ అత్యవసరమైన ఏ చట్రాలనయితే వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారో వాటినే వారు ప్రతిబింబిస్తున్నారు.
ఈ ద్వంద్వప్రమాణాలు కొనసాగుతున్నాయి. ఎక్కువమంది బ్రాహ్మణ రచయితలు హిందుత్వ వ్యతిరేక భంగిమలు చేస్తూ రాజపుత్రులపై వివక్షతాపూరిత అంశాలను పునరావృతం చేస్తుంటారు. కానీ, హిందుత్వకు ఇరుసుగా ఉన్న పీష్వా మరాఠా సిద్ధాంతాన్ని మాత్రం విచ్ఛేదనం చేయరు. ఏదిఏమైనా హిందూత్వ చరిత్ర రచనలో రాజపుత్రుల స్థానం ఏమిటో ఎంఎస్ గోల్వాల్కర్ రచనల నుంచి అయితే బాగా అర్ధం చేసుకోవచ్చు. అరెస్సెస్ మరాఠా బ్రాహ్మణ అధిపతి అయిన గోల్వాల్కర్ రాజపుత్ర సాంప్రదాయాలను దుర్బలత్వంగా తీసి పడేశాడు. రాజపుత్రుల ప్రతాపాన్ని “ఒక తప్పుడు, ఆత్మహత్య సదృశ్యమైన ఆకాంక్షల ప్రతీక” కంటే ఎక్కువేం కాదని తన విచార్ నవనీత్(పేజీ 286)లో తేల్చేశాడు.
రాజుపుత్రుల లేదా మొగలుల చరిత్రను కాకుండా ఈ తుస్కారపూరిత దృష్టికోణాన్ని ఇప్పుడు ఎన్సీఆర్టీ సాధారణీకరిస్తుంది. కాబట్టి ఒక ప్రాంతీయ యజ్ఞం వదలకుండా పట్టుకోవడం అదే సమయంలో విస్తారమైన హిందూత్వ సవరణలను పట్టించుకోకపోవడం ఒక అమాయకమైన పొరపాటు కాదు. ప్రాంతీయంగా ముఖ్యమైన ఒకే యుద్ధానికి సంబంధించిన ప్రతీకాత్మక రాజకీయాలు విభిన్నరాజ్యాలలోని భిన్న ప్రజాసమూహాలను లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసే పాఠ్య పుస్తకాల చరిత్ర పరిణామాత్మక రాజకీయాలు కప్పిపుచ్చుతున్నాయనే దానికి సూచన.
హిందూత్వ సంకుచిత గుర్తింపు..
8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎన్సీఆర్టీ చేసిన సవరణలు గతానికి సంబంధించి హిందూత్వ రూపాంతరణనకు అధికారిక స్థానం కల్పించే పెద్ద ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. ఏది ఏమైనా ఈ సవరణల వల్ల తరుచుగా బహిరంగం చర్యల్లో కనిపించని అంశం అయినది. హిందూత్వ రూపాంతరణ ప్రాంతీయమైన మహారాష్ట్ర బ్రాహ్మణీయ కులరాజకీయ చట్రంలో వెళ్లూనుకుందని ఇప్పుడు తేటతెల్లం అవుతుంది.
మరాఠాలకు 22 పేజీలు ఇవ్వడం, రాజపుత్రులని రెండు పేజీలకు కుదించడం, ముస్లిం సామ్రాజ్యాలకు దాదాపు మొత్తంగానే తుడిచేయటం ద్వారా పాఠ్యపుస్తకాలు వక్రీకరించిన భారత చరిత్రను ప్రతిష్టించాయి.
హిందూత్వ చరిత్ర కార్యప్రణాళికను సవాలు చేయాలంటే, కలుపుకుని పోయే చరిత్ర కోరితే సరిపోదు. ఈ వక్రీకరణలను నడిపించే ఉపప్రాంతీయ ఆధిపత్యాన్ని మనం వెల్లడించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర బ్రాహ్మణీయ గతాన్ని భారతీయ గతంగా చూపేట్టడం అనే కార్య ప్రణాళికను వెల్లడించాలి.
పిల్లలకు భారతదేశాన్ని ఎట్లా ఊహించుకోవాలో నేర్పడానికి సంబంధించిన విషయం ఇది. వాళ్లకు ఎవర్ని బయట ఉంచాలో నేర్పడానికి సంబంధించిన విషయం ఇది.
అనువాదం: దేవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.