కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అంతర్జాతీయ రాజకీయాలలో మితవాద/మత/ దక్షిణ పక్ష ప్రభావం ఆధిపత్యం వహిస్తున్నది. అయినాగాని అభ్యుదయాత్మక వామపక్ష రాజకీయాల ఉత్తేజపూరిత పునరుజ్జీవం కొనసాగుతున్నదని గమనించదగిన సంఘటనల క్రమం సూచిస్తున్నది. న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ క్వామే మమ్దానీ ఎన్నిక, ఐర్లాండు అధ్యక్షురాలిగా కేథరీన్ కొన్నోలీ ఎంపిక, నెదర్లాండులో రాబ్ జెట్టెన్ ఉదారవాద మధ్యేవాద పార్టీ డీ66 విజయానికిదారి తీయడమనేవి ఈ ధోరణికి ఉదాహరణ.
అమెరికా శతకోటీశ్వరులు, అధ్యక్షుడు ట్రంప్ అండగా నిల్చిన ఆండ్రూ క్యూమోను భారీ ఓట్ల తేడాతో న్యూయార్క్ మేయర్ ఎన్నికలో మమ్దానీ ఓడించారు. అమెరికాలో అతిపెద్ద సుసంపన్న నగరంలో డెమోక్రాటిక్ పార్టీలోని సామ్యవాద బృందానికి నాయకుడైన మమ్దానీ విజయం చరిత్ర సృష్టించింది.
ఐర్లాండు అధ్యక్ష ఎన్నికల్లో కేథరీన్ కొన్నోలీ నిర్ణయాత్మక విజయం సాధించగా, నెదర్లాండు(డచ్) పార్లమెంటుకు గల 150 సీట్లలో జెట్టన్ నాయకత్వంలో డీ66 అతిమితవాద పార్టీ- పార్టీ ఫర్ ఫ్రీడమ్‌ను(పీవీవీ) అధిగమించింది.
ఇటలీ, హంగరీ, ఫిన్లాండు, సెర్బియా, స్విజ్జర్లాండు, బ్రిటన్, జర్మని, ఫ్రాన్స్, స్పెయిన్లలో యూరపు అంతటా మితవాద రాజకీయాలు ఊపందుకున్నాయి. అయినాగాని న్యూయార్క్, ఇంగ్లాండు, నెదర్లాండుల మూడు విజయాలు మినహాయింపులుగా నిలుస్తున్నాయి. ప్రజలందరినీ కలుపుకుని పోయే అభ్యుదయకరమైన రాజకీయాలు ప్రతిధ్వనిస్తున్నాయనే దాన్ని ఇవి పునరుద్ఘాటిస్తున్నాయి.
న్యూయార్క్ ప్రజల తీర్పు
ఈ ప్రజానుకూల మార్పును మమ్దానీ సంక్షిప్తంగా వ్యక్తీకరించారు. ఆశావాహమైన తన సంక్షేమ కార్యక్రమాల కోసం శత కోటీశ్వరులు, కార్పోరేట్లపై అదనంగా 2 శాతం పన్నులు విధించాలని ప్రతిపాదించారు. ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరుడిగా ఉన్న నగరంలో ఇది కొట్టొచ్చినట్టుండే ఆలోచన. ఆర్థిక న్యాయం కేంద్రంగా సంక్షేమ వ్యతిరేరకత, వలస వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత ఏదైతే ట్రంపిజం లక్షణాలుగా ఉన్నాయో వాటన్నింటి వ్యతిరేకిస్తూ; తను ప్రచారం నిర్వహించారు.
పెరుగుతోన్న అద్దెలు, ద్రవ్యోల్బణం, బిడ్డల సంక్షేమం, ఆరోగ్య భద్రతవంటి కీలక జీవితావసరాలను తను ఓటర్ల ముందు పెట్టాడు. అతను చేసిన వాగ్దానాలు:
- మూడు సంవత్సరాల అద్దె స్తంభింపచేయటం
- పెరిగిన ఇంటి అద్దెల వల్ల నగరం బయటకు నెట్టివేయబడిన కార్మికులకు ఉచిత, వేగవంతమైన బస్సు సదుపాయం.
- బడికి వెళ్లే పిల్లలకు ఉచిత సంరక్షణ
- ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ నియంత్రణలో దుకాణాలు– ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఏర్పాటు- వాటిని విస్తరించడం రోజుకి కనీసం 30 డాలర్ల చొప్పున కనీస వేతన పెంపుదల.
వలస, కస్టమ్స్ అమలు వ్యవస్థలతో వలసలపై దాడిని ట్రంపు తీవ్రతరం చేసిన సమయంలోనే; తనను తాను “వలస వచ్చిన ముస్లిం”గా మమ్దానీ బహిరంగంగా ప్రకటించి, ఓటర్లను నేరుగా విజ్ఞప్తి చేశారు. దీంతో ఉద్దేశ్యపూర్వకంగానే విభిన్నమైన ఓటర్లతో అనుసంధానించుకోగలిగారు.(మమ్దానీ పుట్టుకతో భారతీయుడు. ఉగాండా నుంచి వలస వెళ్లాడనేది గమనార్హం) విజయం సాధించినాక మొదటి ఉపన్యాసంలో అందరిని కలుపుకునే తన దృష్టిని “ఈ నగరం వలస వచ్చిన వారిది, వలస వచ్చినవారు నిర్మించిన, వలస వచ్చిన వ్యక్తి నాయకత్వం వహించేది” అని చెప్పడం ద్వారా ప్రకటించారు.
గాజా నరమేధాన్ని ఖండించడంలోగాని; ఇజ్రాయిలు ప్రధాని బెంజిమన్ నేతన్యాహూను యుద్ధ నేరస్తుడని ప్రకటించడంలోనూ తను ఎంతమాత్రం సంశయించలేదు. డెమోక్రటిక్ పార్టీ ఇజ్రాయిలు నిర్ణయాలకు మద్దతుకొనసాగిస్తున్నప్పటికీ, మమ్దానీ పాలస్తీనా కోసం బలంగా నిలబడ్డాడు. అతని ఈ నిశ్చయం అమెరికా రాజకీయాలలో ఒక పదునైన నైతిక భిన్నత్వంగా వర్ణించవచ్చు.
మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనే కోరికను ట్రంప్ వ్యక్తపరిచిన సమయంలోనే; న్యూయార్క్ మేయరు పదవి, న్యూజెర్సీ, వర్జినియా గవర్నరు పదవులను భారీగా గెల్చుకుని, గమనార్హంగా రిపబ్లికన్ పార్టీని డెమోక్రటిక్ పార్టీ నేతలు వెనక్కు నెట్టారు.
ట్రంపిజానికి హెచ్చరికగానూ; అభ్యూదయ రాజకీయాలకు ఆశాదీపంగానూ ఈ నిమిషం నిలబడుతుంది.
యూరపులో వ్యతిరేక పవనాలు..
యూరోపు అంతటా కూడా మితవాద శక్తులు ముందుకు వస్తున్నా కొద్దీ దాని వ్యతిరేక ఉద్యమాలు ఉద్భవించసాగాయి. ప్రత్యేకించి ఐర్లాండు, నెదర్లాండు పరిణామాలు గమనించదగినవి. అక్టోబరు ఎన్నికల్లో చెక్ రిపబ్లిక్లో అతి మితవాద పార్టీ అతిపెద్ద రాజకీయశక్తిగా మారింది. ఇటలీ, హంగరీ, ఫిన్లాండు సెర్బియా, స్విజ్జర్లాండులలో అతిమితవాద పార్టీలు అప్పటికే అధికారంలో ఉన్నారు. బ్రిటనులో తీవ్రమితవాద నాయకుడు టామీ రాబిన్సన్ డ్య్రూ తీసిన ఊరేగింపులో దాదాపు లక్షాయాభై వేలమది పాల్గొన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో ఎఎఫ్‌డీ, నేషనల్ ర్యాలీ వోక్సో వంటికి బాగా చొచ్చుకుపోతున్నాయి.
ఈ ప్రతికూల నేపథ్యంలో 68 ఏళ్ల కేథరీన్ కొన్నోలీ ఐర్లాండులో, నెదర్లాండులో రాబ్ జెట్టెన్ ఇద్దరూ- వామపక్ష రాజకీయాలు ముందుకు తీసుకు వెళ్తున్నవాళ్లు సాధించిన విజయాలు ఎన్నదగినవి.
45.8శాతం పోలైన మొత్తం ఓట్లల్లో 64.6% ఓట్ల కేథరీన్ కొన్నోలీ సాధించారు. సాంప్రదాయిక ఫైన్ గేల్ అభ్యర్థి, పూర్వ మంత్రి హీథర్ హంఫ్రీస్ 27% ఓట్లు పొందారు. ఫియాన్నా ఫైల్ అభ్యర్థి జిమ్ గావిన్కి కేవలం 8.4% ఓట్లు వచ్చాయి. అంటే ఈ ఇద్దరి ఓట్ల మొత్తం కంటే రెట్టింపు ఓట్లు కేథరీన్ కొన్నోలీకి లభించాయి.
తీవ్ర మితవాద పార్టీ అభ్యర్థిని నిలపలేదు. దాని మద్దతుదార్లు నిరసన ప్రకటించడానికిగాను వారు ఓట్లు పాడు చేశారు. ఏ పెద్ద రాజకీయ పార్టీకి అనుబంధంగాలేని కేథరీన్ కొన్నోలీ ఈ మితవాద వ్యతిరేక ఓట్లన్నీ ఒకే జెండా కిందికి తేగలిగింది.
లేబరు, గ్రీన్స్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఐర్లాండు, పీపుల్ బిఫోర్ ప్రాఫిట్, 100% రెడ్(డెనిగల్ ఆధారిత ఉద్యమం) సోషలిస్టు డెమోక్రాటిక్ పార్టీ, వర్కర్స్ పార్టీ, సిన్ ఫెయిన్, ట్రేడ్ యూనియన్లు, సాంస్కృతిక సంఘాలు, భాషా కార్యకర్తలు యుద్ధ వ్యతిరేక బృందాలవంటివన్ని కలసిన విశాల కూటమి ఆమె విజయంలో కారణంగా ఉంది. బ్రిటిష్ వలస పాలనలో విభజించబడిన ఐర్లాండు ఐక్యం కావాలనే పిలుపు సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న సిన్ఫియన్ మద్దతు తెల్పడం ప్రత్యేకంగా పేర్కొనవలసిన విషయం.
ఉత్తర ఐర్లాండు బ్రిటను ఆధీనంలో ఉంది. అక్కడి జనాభాలో సగం మంది ప్రజలకు ఐరిష్ పౌరసత్వం ఉంది. గాజాపై ఇజ్రాయిలుదాడులకు వ్యతిరేకంగా యూరపులో వినిపించే ఒక బలమైన గొంతుక ఐర్లాండు. యూరోపియన్ యూనియన్, అమెరికా, ఇజ్రాయిల్‌తో పాటు నిలబడ్డప్పుడు ఐర్లాండు అత్యంత భావోద్వేగభరితమైన ప్రదర్శనలను చవి చూసింది. కేథరీన్ కొన్నోలీ ఈ ప్రదర్శనల్లో పాల్గొనడమే కాదు. ఇజ్రాయిలును ఉగ్రరాజ్యంగా ప్రకటించింది కూడా. చరిత్ర అక్బోబరు 7తో మొదలు కాలేదని ఆమె బలంగా ప్రపంచానికి గుర్తుచేసింది. చివరి ఊపిరి వరకూ కూడా పాలస్తీనా ప్రజలతో పాటే ఉంటానని ఆమె ప్రతిజ్ఞ చేసింది.
ఐర్లాండు నాటోలో మిలటరీ ఒప్పందాలు పెంచుకోవడాన్ని ఆమె వ్యతిరేకించింది. నాటోకు, ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా ఆమె ఖచ్చితంగా నిలబడడం ఆమెకు ఓటర్ల విశ్వసనీయత మరింత పెరిగింది.
డచ్ పురోగతి..
నెదర్లాండులో గీర్ట్ వైల్డర్స్ నేతృత్వంలో తీవ్ర మితవాద పీవీవీ ప్రభుత్వం ఒక ఏడాది పాటు అధికారంలో ఉంది. దాని కఠోరమైన వలస వ్యతిరేక విధానాల వలన పెరుగుతోన్న ఒత్తిడి కారణంగా జూన్‌లో పతనమయ్యింది. 2023 కంటే తక్కవగా ఈసారి పీవీవీ కేవలం 26 సీట్లు గెలిచింది. 1966 ఏర్పడిన లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ డీ66 తొమ్మిది స్థానాల నుంచి 27 సీట్లు గెలిచి నాటకీయంగా పునఃప్రవేశం చేసింది. 38 సంవత్సరాల నాయకుడు రాబ్ జెట్టిన్ పీవీవీ మినహాయించి మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నారు. ఆ కూటమిలో అతను ప్రధాని అవుతారు.
నెదర్లాండులో కూటమి ఏర్పాటుకు అనేక నెలలు పడుతుంది. అది ఫలవంతమైతే జెట్టిన్ డచ్ చరిత్రలోఅతి పిన్న వయస్కుడు, తొలి స్వలింగ సంపర్కుడైన ప్రధాని అవుతారు. ఇది తీవ్రమిత వాదానికి ఎదురుదెబ్బ. యూరపులో అభ్యుదయ కలుపుకు పోయే రాజకీయాలకు ఆమోదానికి నిర్థారణకూడా.
అనువాదం: దేవి
ఈ వ్యాసం ముందుగా The AIDEM వైబ్సైట్లో ప్రచురితమైంది. వారి సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


