ఫిబ్రవరి 14 న భారతదేశం అంతటా, అనేక సంవత్సరాలుగా “వాలెంటైన్స్ డే” జరుపుకున్నారు. మొదట ఇది పట్టణాలకే పరిమితం అయింది. క్రమంగా అనేక ప్రాంతాలకు విస్తరించి సంస్కృతిలో భాగమైయ్యింది. దాంతో వ్యాపార వస్తువుగా మారింది. ఇప్పుడు “వాలెంటైన్స్ వీక్” పేరుతో — రోజ్ డే, హగ్ డే, కిస్ డే వంటి ప్రత్యేక రోజులతో జరుపుకుంటున్నారు.
ముఖ్యంగా జెన్ జీ యువతలో భారీ వాణిజ్యాన్ని, సోషల్ మీడియాలో సందడిని సృష్టిస్తున్నాయి. ప్రేమ, ఆప్యాయతలు కేవలం ఒక యువతి యువకుడికి సంబంధించిన ప్రేమగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలుగా మారాయి. ఈ తరుణంలో సంవత్సరంలో కనీసం ఒక రోజైనా అందరూ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుకోవడం సంతోషించదగినది. అయితే, ఈ ప్రేమ, సాంగత్యం పట్ల కనిపిస్తున్న ఆసక్తినీ కొందరు మతోన్మాద దుండగులు దాడులకు వేదికగా వినియోగించుకుంటున్నారు.
2026 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ వ్యక్తీకరణలు, సాంస్కృతిక- జాతీయవాద పోకడల మధ్య ఘర్షణగా మారడం అత్యంత గర్హనీయం. ఉన్నత విద్యాలయాలు, విశ్వవిద్యాలయ క్యాంపస్‌లు విధ్వంసం, బెదిరింపు పోస్టర్లతో భయానక వాతావరణన్ని తలపిస్తున్నాయి.
ఈ ప్రమాదకర పోకడల వెనుక, నేపథ్యాన్ని వాటి వెనుక దాగి ఉన్న సంస్థాగత వ్యవస్థను అర్థం చేసుకోవాలి. దీన్ని ప్రభావితం చేస్తున్న రాజకీయ సంబంధాలను, చట్టపరమైన సవాళ్లను పరిశీలించడం అవసరం.
వాలెంటైన్స్ డే 2026
2026 ఫిబ్రవరి 12న, ఇండోర్‌లోని నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(ఎన్ఎంఐఎంఎస్) హింసాత్మక దాడులకు వేదిక అయింది. వాలెంటైన్స్ డే ముసుగులో ఒక విద్యార్థి కార్యక్రమం “అశ్లీలతను” ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, బజరంగ్ దళ్- విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) సభ్యుల మూకలు క్యాంపస్‌లోకి చొరబడ్డారు.
నిజానికి ఆ కార్యక్రమం విద్యార్థులలో వాణిజ్య నైపుణ్యాలను పెంపొందించడానికి రూపొందించిన “బేక్ & సెల్” (Bake & Sell) అనే సాదాసీదా యాక్టివిటీ. ఇది విద్యాసంబంధిత కార్యక్రమం అయినప్పటికీ, సుమారు 50 మంది ఆర్ఎస్ఎస్ ప్రభావిత కార్యకర్తలు కర్రలతో క్యాంపస్‌లోకి ప్రవేశించి, ఆస్తులను ధ్వంసం చేశారు, స్టేజ్, స్పీకర్లను ఇరగ్గొట్టారు.
ఈ గందరగోళంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు.
బీహార్ రాజధాని పాట్నాలో “హిందూ శివ భవాని సేన” అనే గ్రూపు నగర వ్యాప్తంగా పోస్టర్లు వేసి, వాలెంటైన్స్ డే జరుపుకునే జంటలను తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది. ఆ పోస్టర్లలో ఒక భయంకరమైన నినాదం ఉంది: “జహాన్ మిలేంగే బాబు-షోనా, తోడ్ దేంగే కోనా-కోనా” (ప్రేమికులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని ముక్కలు ముక్కలు చేస్తాం). ఈ వేడుకలు అశ్లీలతను, మత మార్పిడిని, “లవ్ జిహాద్”ను ప్రోత్సహిస్తాయని ఆ గ్రూపు ఆరోపించింది.
పాశ్చాత్య పండుగను దేశభక్తితో ముడిపెట్టి, వేడుకలను అడ్డుకోవడం వీరికి అలవాటుగా మారింది.
నైతిక పర్యవేక్షణ (మోరల్ పోలిసింగ్) – చారిత్రక కాలక్రమం
2026 నాటి పై ఘటనలు ఏదో అనుకోకుండా జరిగినవి కావు. ఇవి గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక వ్యవస్థీకృత విధానంలో భాగం.
2009లో కర్ణాటకలోని మంగళూరులో పబ్‌లో ఉన్న యువతులు భారతీయ విలువలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ “శ్రీరామ్ సేన” పేరుతో కొందరు వారిపై దాడి చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
- 2011లో కాన్పూర్‌లో వాలెంటైన్స్ డే సరదాగా జరుపుకుంటున్న అందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులకు దిగి దౌర్జన్యంగా యువతతో గుంజీలు తీయించారు.
- 2020లో మీరట్, అహ్మదాబాద్‌లలో హిందూ స్వాభిమాన్, మూకలు పార్కుల్లో వాలెంటైన్స్ డే జరుపుకుంటున్న జంటలను కొడుతున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
- 2024లో ఆగ్రా, హైదరాబాద్‌లలో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు టెడ్డీ బేర్లను తగులబెట్టారు. జంటలకు బలవంతంగా వివాహాలు చేస్తామని బెదిరించారు.
- 2025లో పాట్నాలో హిందూ శివ భవానీ సేన కార్యకర్తలు వాలెంటైన్స్ డేను “క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనది” అని పేర్కొంటూ లాఠీలతో దాడులు చేశారు.

సంస్థాగత వ్యవస్థ-కీలక పాత్రధారులు
ఈ నైతిక పర్యవేక్షణ(మోరల్ పోలిసింగ్) వెనుక బలమైన భావజాలం కలిగిన కొన్ని సంస్థలు ఉన్నాయి:
బజరంగ్ దళ్
ఇది విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) యువజన విభాగం. 1984లో ప్రారంభమైన ఈ సంస్థ ‘సేవ, సురక్ష, సంస్కృతి’ అనే నినాదంతో పనిచేస్తుంది. వీరు వాలెంటైన్స్ డే నాడు జంటలకు బలవంతంగా రాఖీలు కట్టించడం లేదా సింధూరం పెట్టించడం వంటి పనులకు పాల్పడుతుంటారు.
శ్రీరామ్ సేన
ప్రమోద్ ముతాలిక్ నేతృత్వంలోని ఈ సంస్థ 2009 మంగళూరు పబ్ దాడితో వార్తల్లోకి వచ్చింది. ముతాలిక్ తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.
విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ)
1964లో స్థాపించబడిన ఈ సంస్థ హిందూ సమాజాన్ని ఏకం చేయడం, హిందూ ధర్మాన్ని రక్షించడం లక్ష్యంగా ప్రకటించుకుంది. 2018లో సీఐఏ(సీఐఏ) వీటిని మతపరమైన మిలిటెంట్ సంస్థలుగా వర్గీకరించింది.
రాజకీయ సంబంధాలు, రక్షణ
ఈ సంస్థలకు అధికార పార్టీలకు (ముఖ్యంగా బీజేపీ) మధ్య ఉన్న సంబంధం చాలా బలమైనది. వీరందరూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనే మాతృ సంస్థకు అనుబంధంగా పనిచేస్తారు.
రాజకీయ రక్షణ
అనేక సందర్భాల్లో ఈ కార్యకర్తలపై ఉన్న కేసులను ప్రభుత్వం ఉపసంహరించు కుంటున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
సోషల్ మీడియా
ఫేస్బుక్ వంటి సంస్థలు బజరంగ్ దళ్‌ను ప్రమాదకరమైన సంస్థగా గుర్తించినప్పటికీ, రాజకీయ కారణాల వల్ల వాటిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
చట్టపరమైన సవాళ్లు, న్యాయస్థానాల పర్యవేక్షణ
కుల, మతాంతర వివాహాలను అడ్డుకోవడానికి కొన్ని రాష్ట్రాలు తెచ్చిన ‘లవ్ జిహాద్’ చట్టాలను సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్(సీజేపీ) వంటి సంస్థలు సుప్రీం కోర్టులో సవాలు చేశాయి.
ముఖ్యమైన వాదనలు
ఈ చట్టాలు వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను, మత స్వేచ్ఛను హరిస్తున్నాయని సీనియర్ అడ్వకేట్ సీయూ సింగ్ వాదించారు.
2025 సెప్టెంబరులో జరిగిన విచారణలో, “ఒక వివాహం మోసపూరితమైనదా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు?” అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఇది చట్టాల దుర్వినియోగంపై న్యాయ స్థానానికి ఉన్న అనుమానాలను తెలియజేస్తుంది.
విమర్శలు, నిషేధాల డిమాండ్
అంతర్జాతీయ విమర్శలు: హ్యూమన్ రైట్స్ వాచ్, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఈ సంస్థల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండించాయి.
అంతర్గత విమర్శలు: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి నాయకులు కూడా బజరంగ్ దళ్ చర్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయని విమర్శించారు.
నిషేధం: వామ పక్షాలతో పాటు కాంగ్రెస్, ఇతర కొన్ని ప్రతిపక్షాలు ఈ సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేసినప్పటికీ, ఆచరణలో అది సాధ్యం కాలేదు.
మారుతున్న సాంస్కృతిక ముఖచిత్రం
ఇన్ని దాడులు జరుగుతున్నా, భారతదేశంలో వాలెంటైన్స్ డే వేడుకలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మెట్రో నగరాల్లో ఇది ఒక భారీ వాణిజ్య ఈవెంట్‌గా మారింది.
స్వీయ ప్రేమ(Self-Love): జెన్ జీ యువత ప్రేమను కేవలం మరొక వ్యక్తితోనే కాకుండా, తమను తాము ప్రేమించుకోవడంగా నిర్వచిస్తున్నారు. 2026 అధ్యయనం ప్రకారం 40% మంది ప్రజలు ఈ రోజును స్వీయ సంరక్షణ కోసం కేటాయిస్తున్నారు. జొమాటోలో “టేబుల్ ఫర్ వన్” ఫీచర్ దీనికి నిదర్శనం.
వాలెంటైన్స్ డే భారత దేశంలోని వైరుధ్యాలను ఎత్తి చూపుతోంది. ఒకవైపు ఆధునిక తరం స్వేచ్ఛగా జరుపుకుంటున్న వేడుకలు, మరోవైపు కర్రలతో ఆ స్వేచ్ఛను అడ్డుకోవాలనుకునే ఛాందసవాద శక్తులు. ఇండోర్, పాట్నా ఘటనలు సాధారణ ఘటనలు కావు. అవి భారతీయ గుర్తింపు పేర వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమించే హక్కు పై జరుగుతున్న దాడులు.
ఆధునిక,సాంస్కృతిక అలవాట్లు, పద్ధతితో జరుపుకే వేడుకలు సంప్రదాయం ముసుగులో ఘర్షణలకు వేదికలవుతున్నాయి. ఎవరు ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనే విషయంపై జరుగుతున్న ఈ దాడులు భవిష్యత్తులో కూడా కొనసాగేలా కనిపిస్తోంది.
ఆధారం: వికీపీడియా, బజరంగ్ దళ్, శ్రీరామ్ సేన, సుప్రీం కోర్ట్ అబ్జర్వర్, ది వైర్, టెలిగ్రాఫ్ ఇండియా.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
