పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సహాయపడాలనే ఉద్దేశంతో, ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వం రూ. 10,000 కోట్లను కేటాయించింది.
న్యూఢిల్లీ: మరో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం దగ్గరపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
అయినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ప్రకటించిన లక్ష కోట్ల రూపాయల నిధి ఇంకా కార్యరూపం దాల్చలేదు.
నగరాలను ‘గ్రోత్ హబ్’లుగా అభివృద్ధి చేయడంలో తోడ్పడేందుకు రూ ఒక లక్ష కోట్ల విలువైన ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’(యూసీఎఫ్) ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది 2025-26 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. నగరాల్లోని లోతట్టు ప్రాంతాలను పునరాభివృద్ధి చేయడం; 100 ప్రధాన నగరాల్లో నీటి సరఫరా, పారిశుధ్య ప్రాజెక్టులను ప్రోత్సహించడం ఈ నిధి ప్రధాన ఉద్దేశ్యమని 2024 జూలైలోనూ ఆమె పేర్కొన్నారు.
నిధుల సమీకరణ: ఒక సవాలు
మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కనీసం సగభాగం బాండ్లు, బ్యాంకు రుణాలు లేదా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా సేకరిస్తే, మిగిలిన ఖర్చులో మూడో వంతును ఈ నిధి నుంచి ఆర్థిక సహాయంగా అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
దీనికోసం 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం తొలి విడతగా రూ 10,000 కోట్లను కేటాయించింది.
ఏదిఏమైనప్పటికీ, ప్రకటన వెలువడి 11 నెలలు గడిచినా ఈ నిధి అమలులోకి రాలేదని ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం పేర్కొంది. అంతేకాకుండా, గృహ- పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ‘ప్రాజెక్టు ముసాయిదా’ను సిద్ధం చేసినప్పటికీ, ఈ నిధి మార్గదర్శకాలకు కేంద్ర మంత్రివర్గం ఇంకా ఆమోదం తెలపలేదని కథనం ప్రస్థావించింది.
సిద్ధంగా రాష్ట్రాలు
“కనీసం 15 రాష్ట్రాల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి. మంత్రిమండలి ఆమోదం లభించిన వెంటనే నిధుల కేటాయింపు ప్రక్రియను ప్రారంభిస్తాం” అని మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించినట్టుగా ఈటీ పేర్కొంది.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు ప్రధాన పట్టణాల్లో మౌలిక సదుపాయాలను పెంచడానికి, ఆధునీకరించడానికి ఈ నిధులను వెచ్చించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
నగరాలను ఆర్థికవృద్ధి కేంద్రాలుగా మార్చడమే లక్ష్యమని 2024లో సీతారామన్ అన్నారు. అప్పటి తన ప్రసంగంలో, ఈ ప్రణాళికలో భాగమైన రవాణా ప్రణాళికను మెరుగుపరచడం; పట్టణ శివారు ప్రాంతాలను క్రమబద్ధంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు.
అసంపూర్తిగా బడ్జెట్ హామీలు
ఈ నిధి అమలు, ప్రాజెక్టుల స్థితిగతులపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “యుసీఎఫ్ కోసం పథకాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి” అని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు గత నెలలో పార్లమెంటులో తెలిపారు.
“పథకాలు ఆమోదం పొందిన తర్వాత, అర్హత నిబంధనలు, ప్రమాణాలను ఖరారు చేస్తాం. ఆ తర్వాతే అధికారికంగా ప్రతిపాదనలను ఆహ్వానిస్తాం” అని స్పష్టం చేశారు.
కేవలం ఈ నిధి మాత్రమే కాకుండా, 2025-26 బడ్జెట్లో ప్రకటించిన అనేక ఇతర పథకాలు కూడా ఇంకా అమలుకు నోచుకోలేదని లేదా పాక్షికంగానే సాకారమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
