రష్యన్ సైన్యంలో 27 మంది భారతీయులు సేవలందిస్తున్నట్టుగా సెప్టెంబరు చివరిలో విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: రష్యన్ సైన్యంలో సేవలందిస్తున్న భారతీయులు 27 నుంచి 44కు చేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సైన్యం నుంచి వారిని వెంటనే విడుదల చేసి, భారతీయుల భర్తీని ఆపాలని న్యూఢీల్లీ మాస్కోను కోరింది.
వారాంతపు మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. చాలా మంది భారతీయులను కొద్ది నెలలుగా రష్యన్ మిలిటరీ యూనిట్లలో భర్తీ చేస్తున్నట్టుగా నిర్ధారించబడిందని, తమకు తెలిసిన ప్రకారం ప్రస్తుతం 44 మంది భారతీయులు రష్యన్ సైన్యంలో సేవలందిస్తున్నారని చెప్పారు. “ఈ అంశాన్ని మరోమారు రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సైన్యంలోని వారిని వీలైనంత త్వరగా విదుదల చేసి ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలి”అని స్పష్టం చేసినట్టుగా జైస్వాల్ అన్నారు.
ప్రభుత్వం మాత్రం ఇటు బాధిత కుటుంబాలతో, అటు రష్యన్ అధికారులతో మాట్లాడుతూనే ఉందని ఆయన తెలియజేశారు. “మేము రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నాం. ఇటు బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడుతూ ఈ అంశంపై ఎప్పటికకప్పుడు వారికి తాజా సమాచారాన్ని అందజేస్తున్నాము” అని తెలిపారు.
రష్యన్ సైన్యంలో చేరడానికి వ్యతిరేకంగా సూచనలను ప్రభుత్వం జారీ చేస్తున్నదని పునరుద్ఘాటిస్తూ, ఇలాంటి భర్తీలతో “జీవితాలు ప్రమాదంలో పడతాయని” జైస్వాల్ హెచ్చరించారు.
“ఈ విషయాన్ని మేము చాలా సార్లు ప్రస్థావించాము. అంతేకాకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాము. అయినా కానీ ప్రతిసారి తమ పేర్లను జాబితాలో ప్రజలు చేర్చుకుంటున్నారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత భర్తీ ఏజన్సీల వలలో పడకుండా ఉండేందుకు. ఆయా ఏజన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము” అని తెలియజేశారు.
సెప్టెంబరు చివరినాటికి ఇప్పటి తాజా అంకెల్లో కొంత పెరుగుదల కనిపించిందని విలేకరులకు జైస్వాల్ చెప్పారు. సుమారు 27 మంది భారతీయులు రష్యన్ దళాల్లో సేవలందిస్తున్నారని, సురక్షితంగా వారిని విడుదల చేయించడానికి కృషి కొనసాగుతుందని అన్నారు.
రష్యన్ సైనిక యూనిట్లలో చాలా మంది భారతీయులను సహాయక సిబ్బందిగా భర్తీ చేసుకొని, ఆ తర్వాత ఉక్రెయిన్లో యుద్ధ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆయన వివరించారు.
గత సంవత్సరం రష్యాలో ప్రధాని మోడీ పర్యటించిన సందర్భంగా రష్యా ప్రభుత్వంతో ఈ అంశాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. రష్యన్ అధికారులతో ఈ అంశాన్ని ప్రధాని బలంగా ప్రస్థావించారని అప్పటి విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా అన్నారు. ఈ అంశం రష్యన్ అధికారుల పరిశీలనలో ఉందని, రష్యన్ సైనిక సేవల నుంచి భారతీయులందరిని త్వరలోనే విడుదల చేస్తామని హమీ ఇచ్చారని అన్నారు.
“అక్కడున్న సుమారు 40 మంది భారతీయులను త్వరగా విడుదల చేసే విషయంలో రష్యా హామీ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. రెండు ప్రభుత్వాలు దానిపై ప్రస్తుతం పని చేస్తున్నాయి. వారిని ఎంత ఖచ్చితత్త్వంతో, త్వరితగతిన దేశంలోకి తీసుకురాగలుగుతామో చూడాలి” అని క్వాత్రా అన్నారు.
అయితే సేవలందిస్తున్న భారతీయుల విడుదలపై మాస్కో నుంచి ఎలాంటి ఖచ్చితమైన అధికారిక ప్రకటన రాలేదు. ఈ అంశంపై చర్చించడానికి రష్యా సిద్ధంగా ఉందని భారత్లోని రష్యన్ దౌత్యవేత్త డెన్నిస్ అలిపోవ్ తెలియజేశారు. ఈ అంశంపై ఎప్పుడు చర్చించనున్నారో స్పష్టత లేదు.
భారత జాతీయులను తిరిగి వెనక్కు రప్పించే ప్రక్రియ కొంత వరకు మందగించిందని నెల రోజుల తర్వాత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ లోక్సభకు తెలియజేశారు. రష్యన్ సైన్యంలో సేవ చేసేందుకు భారతీయులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు రష్యన్ అధికారులు చెప్పారని జయశంకర్ అన్నారు. సివిలియన్ ఉద్యోగాలిప్పిస్తామని “తప్పుదోవ” పట్టించి వారిని అక్కడకు తీసుకెళ్లిన తర్వాత యుద్ధం జరిగే ప్రాంతాలకు తరలించినట్లు సాక్ష్యాలున్నాయని కూడా జయశంకర్ పేర్కొన్నారు.
“సైనిక సేవల్లో చేరమని చెప్పే మోసపూరిత పథకాల ద్వారా లేదా ప్రజలకు నేరుగా చెప్పడం, ప్రచారం చేయడం వంటి చర్యలకు ఏనాడు రష్యాలో రష్యన్ ప్రభుత్వం పాల్పడలేదు” అని ఈ అంశంపై స్పందిస్తూ రష్యన్ దౌత్యకార్యాలయం స్పష్టం చేసింది.
రష్యన్ సాయుధదళాలు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 127 మంది భారత జాతీయులను భర్తీ చేసినట్టుగా ప్రభుత్వ రికార్డులు తెలియజేస్తున్నాయి. అందులోంచి 97 మందిని విడుదల చేశారు. మరో12 మంది ఘర్షణలో మరణించినట్టుగా భావిస్తుండగా మిగితా వారి వివరాలు తెలియరాలేదు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
