
విముక్తి లేదా స్వాతంత్య్రం ఏదైనప్పటికీ, హైదరాబాద్ సంస్థానం భారతయూనియన్‌లో విలీనం కాకముందు ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలు- కొన్ని వాస్తవిక చరిత్రగా, మరికొన్ని కృత్రిమ చరిత్రగా మిగిలిపోయాయి చలామణి అవుతున్నాయి. ఆనాటి ఘటనలకు సంబంధించి, ప్రత్యక్ష సాక్షులు అనేక మంది ప్రస్తుతం లేరు. ఈ పరిస్థితుల్లో కొందరు స్వార్థంతో ఎలానైనా అధికారాన్ని చేపట్టాలనే అధికారదాహంతో వాస్తవ చరిత్రను వక్రీకరిస్తూ, కాల్పనిక చరిత్రను ప్రస్తుత తరానికి అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన రజాకార్ సినిమా ఓ మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ పోలోకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేసే ప్రయత్నం ఇది.
భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనాన్ని వ్యతిరేకిస్తూ చివరి నిజాం నవాబు ప్రతిఘటించారు. దీంతో పోలీసు యాక్షన్‌గా పిలువబడే ఆపరేషన్ పోలోను ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని భారతప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ పోలోకు హోంమినిస్టర్ సర్దార్వల్లబాయి పటేల్ నేతృత్వం వహించారు. అందరికి తెలియని విషయమేంటంటే, ఆపరేషన్ పోలో ముగసిన తర్వాత– ఈ సైనిక చర్యకైన ఖర్చులను కేంద్ర ప్రభుత్వం నిజాం నవాబు నుంచి వసూలు చేసింది.
నిజాం నవాబు 1948 సెప్టెంబరు 18న లొంగిపోయారు. నిజాం స్టేట్ సైనిక మేజర్ జనరల్ ఇఎల్ ఇద్రూస్ సంస్థాన ఆయుధాలను యుద్ధం ముగిసిన ఐదు రోజులకు భారత సైన్యానకి అప్పగించారు. పరిస్థితులు కొంత సర్దుకోవడంతో ఆపరేషన్ పోలో ఖర్చుల లెక్కలను నెహ్రూ ప్రభుత్వం జాగ్రత్తగా అంచనా వేసింది. ఆ లెక్కల ప్రకారం, ఆపరేషన్ పోలోకు సుమారు రూ 6 కోట్లు ఖర్చు అయ్యింది. ఆ తర్వాత ఈ రూ 6 కోట్లకు సంబంధించిన బిల్లును నిజాం నవాబుకు అందజేసి, ఆయన దగ్గర నుంచి వసూలు చేసింది.
భారత ప్రభుత్వానికి 6 కోట్లను చెల్లించిన నిజాం ప్రభువు..
1948 మే 21 నుంచి సెప్టెంబరు 18 వరకు జరిగిన యుద్ధంలో పోలీసు యాక్షన్‌కు రూ 598.76 లక్షలు ఖర్చయినట్లు అంచనావేశారు. ఇందులో వైమానికదళానికి 23 లక్షలు, నేపాల్ సైనికులతో పాటు స్ధానిక బెటాలియిన్లకు రూ 34 లక్షలు వెచ్చించారు. అంతేకాకుండా రవాణా, బస, భోజనాలు ఇతర ఖర్చులన్నింటిని కలుపుకొని సుమారు 6 కోట్లను నిజాం చెల్లించారు.
హోరాహోరిగా సాగిన ఆఖరి ఐదు రోజుల పోరాటంలో భారతదేశానికి చెందిన 42 మంది సైనికులు, ఒక అధికారి మరణించారు.
ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత ఢిల్లీలో అధికారుల మధ్యన ఖర్చులపై తర్జనభర్జనలు జరిగాయి. ఆపరేషన్ పోలో ఖర్చును నిజాం భరించాల్సిందేనని రక్షణ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ ఖర్చు భరించే విషయంపై సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ అదే సమయంలో హైదరాబాద్ ప్రభుత్వం కేంద్రానికి రూ 3 కోట్లు కట్టినట్టు 1949 డిసెంబరు 13న ఒక రహస్య లేఖ ద్వారా బయటపడింది.
అయితే, హైదరాబాద్‌లో భారతీయ కరెన్సీ కొరత కారణంగా ఖర్చును భరించడానికి ఇంకా కొంత సమయం ఇవ్వాలని కేంద్రానికి హైదరాబాద్ మిలటరీ గవర్నర్ కోరారు.
ఖర్చును వసూలు చేయడానికి వెనుక ఆర్ధికంతోపాటు రాజకీయ అంశం కూడా ముడిపడి ఉంది.
ఒక వేళ ఆపరేషన్ పోలో ఖర్చును కేంద్రం భరిస్తే మిగిలిన సంస్థానాలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తాయన్న అభిప్రాయం కూడా కేంద్రమంత్రివర్గంలో వ్యక్తమైంది.
అప్పుడే దేశం స్వాతంత్రం పొంది రెండు దేశాలుగా చీలిపోయింది. ఇటువంటి సమయంలో దేశ ఆర్ధిక పరిస్థితి అస్థవ్యస్తంగా ఉన్నందున సంస్ధానాల విలీన ఖర్చులను భరించేంత బడ్జెట్ యూనియన్ ప్రభుత్వం వద్దలేదు.
విలీనాన్ని నిజాం నవాబు వ్యతిరేకించడంతో చేపట్టాల్సి వచ్చిన సైనిక చర్యలకైనా ఖర్చులతో యూనియన్ ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది. దీంతో ఈ చర్యలకైన ఖర్చులను ఆయా సంస్థానాలే భరించాలని యూనియన్ ప్రభుత్వం సీనియర్ అధికారులు స్పష్టం చేశారు.
పోలీసు యాక్షన్ ముగిసిన తర్వాత యూనియన్ ప్రభుత్వం ఆదేశాలతో దశలవారిగా ఖర్చులను భరించడానికి రాజ్‌ప్రముఖ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా, ఆపరేషన్ పోలోకైన సుమారు ఆరుకోట్ల రూపాయలను చెల్లించాలని రాజ్ప్రముఖ్కు బిల్లు పెట్టింది. ఇందులో భాగంగా 1948- 49లో కోటి రూపాయలను చెల్లించారు. మరో కోటి 1949- 50లో చెల్లించడం జరిగింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.