
2025 అక్టోబర్ 7నాటికి గాజా మీద ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న జాతిహననానికి రెండేళ్లు పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో అమానుషమైన ఇజ్రాయిల్ చర్యలను ఖండిస్తూ, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా కేరళలోని చింతా రవి ఫౌండేషన్ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రకటన ద్వారా పిలుపునిచ్చింది.
గాజా మారణహోమంలో ప్రాణాలను కోల్పోయిన పిల్లల జ్ఞాపకార్థం అక్టోబరు 2 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు కేరళలోని 14 జిల్లాల్లో సభలు, సమావేశాలను ఫౌండేషన్ నిర్వహించనున్నది. ఈ కార్యక్రమాలలో యుద్ధంలో మరణించిన పిల్లల పేర్లను చదవనున్నారు.
చింతా రవి ఫౌండేషన్‌తో పాటు- వివిధ రంగాలకు చెందిన 232 మంది ప్రముఖులు తమ సంతకాలతో కూడిన “ది నేమ్స్ ఆఫ్ గాజా” అనే ప్రకటనను విడుదల చేశారు.
రచయిత, చిత్ర నిర్మాత చింతా రవీంద్రన్ స్మారకార్థం కేరళలో ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.
అక్టోబరు 2- నవంబర్ 15వ వరకు వివిధ కార్యక్రమాలు..
ది నేమ్స్ ఆఫ్ గాజా ప్రకటన ప్రకారం- ఈ కార్యక్రమాలలో కేరళకు చెందిన వ్యక్తులు, సంఘాలు, సంస్థలు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. అక్టోబరు 2న కేరళలోని కొచ్చీలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, మారణహోమానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ మల్టీమీడియా ద్వారా ప్రచారాన్ని కూడా నవంబరు 15 వరకు చేపడతారు. తిరువనంతపురంలో నవంబర్ 15న ముగింపు కార్యక్రమం జరుగుతుంది.
శిథిలాల కుప్పగా గాజా..
ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వల్ల గాజా ఒక శాశ్వతమైన జాతి విధ్వంసానికి కేంద్రంగా మారింది. అమెరికా, పశ్చిమ యూరోప్ వెన్నుదన్నుతో ఇజ్రాయిల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. దీంతో ఆసుపత్రులు, పాఠశాలలు శిథిలాలుగా మారాయి. ఇండ్లు, వీధులు, నగరాలు బాంబుల వర్షంతో బూడిదై శ్మశానాలను తలపిస్తున్నాయి.
ప్రధాని నేతన్యాహూ నేతృత్వంలోని ఇజ్రాయిల్ ప్రభుత్వం వరుసగా యుద్ధనేరాలకు పాల్పడుతూ- గాజా వాసులకు ఆహారం, తాగునీరు, అత్యవసర ఔషధాలను నిలిపివేసింది. ఆకలితో అలమటిస్తూ, పోషకాహార లోపంతో పిల్లల ఆర్తనాదాలు గాజాలో ప్రతిధ్వనిస్తున్నాయి.
న్యాయాన్ని కాపాడుతామని ఒకప్పుడు బడాయికి పోయిన దేశాలే ఈరోజు అధికారం, లాభం కోసం- ఆ మాటకు దూరం జరిగి మౌనంగా ఉంటూ, ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. చాలా మట్టుకు మీడియా ఆచూకీ కూడా కనిపించడం లేదు. కొందరు గాజాలో జరుగుతోన్న హింసను చూస్తూ పైశాచికంగా ఉత్సవాలను జరుపుకుంటున్నారు. కానీ వెస్ట్‌బ్యాంక్, గాజాలోని పాలస్తీనా పౌరులు మాత్రం ప్రతీరోజు తీవ్ర అణిచివేతను ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం వల్ల చనిపోయిన తమ ప్రియమైన వారి ఫొటోలను చూసుకుంటూ ఆవేదనకు గురవుతున్నారు.
పాలస్తీనా జాతిహననానికి సుదీర్ఘ చరిత్ర..
తమ దక్షిణ ప్రాంతంపై హమాస్ దాడి చేసిందని, తమ ప్రజల మాన- ప్రాణాలను బలి తీసుకుందని 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ గాజా మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఆనాటి నుంచి కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజాలో చాలామంది చనిపోయారు, చనిపోతున్నారు. కొందరు వికలాంగులు, మరికొందరు జీవచ్ఛవాలుగా మారుతున్నారు.అయితే, పాలస్తీనా మీద అణిచివేత, యుద్ధం, జాతిహననం 2023 అక్టోబరు 7న మొదలు కాలేదు. ఈ ప్రస్తుత పరిస్థితికి అక్టోబర్ 7 కారణం కాదు. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అమెరికా, పశ్చిమ దేశాలు, ఇజ్రాయిల్- ఆ దేశాల మీడియా సంస్థలు ఈ సత్యాన్ని కావాలని విస్మరిస్తున్నాయి.
ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో గాజాలో పిల్లలు అనుభవిస్తున్న జీవితాలను ప్రతిబింబిస్తూ చింతా రవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫౌండేషన్ చేపట్టే కార్యక్రమాల ద్వారా పాలస్తీనా సంఘీభావం తెలియజేస్తూ, బాధితుల గొంతుకకు కేరళ ప్రజలు ప్రాతినిధ్యం వహించనున్నారు. యావత్ దేశానికే కాకుండా, ప్రపంచానికి కేరళ ప్రజలు గొంతు వినిపించనున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.