బీహార్‌లోని నవాడా జిల్లాలో మతమేంటో తెలుసుకోని వస్త్ర వ్యాపారిని ఓ మూక దారుణంగా కొట్టి చంపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో పెరుగుతున్న మూక హింస, శాంతిభద్రతలకు సంబంధించిన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
న్యూఢిల్లీ: బీహార్‌లోని నవాడా జిల్లాలో 40 ఏళ్ల వ్యక్తిని దారుణాతిదారుణంగా ఒక మూక కొట్టి చంపింది. దాడి చేసిన వ్యక్తులు ముందుగా మృతుడి మతపరమైన గుర్తింపును నిర్ధారించుకొని, ఆ తర్వాత తనపై దాడికి దిగారు. ఈ సంఘటన కొత్తగా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సామ్రాట్ చౌదరి నాయకత్వంలో రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలను లేవనెత్తింది.
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, మృతుడిని మొహమ్మద్ అథర్ హుస్సేన్‌గా గుర్తించారు. డిసెంబర్ 5న నవాడా జిల్లాలోని రోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మూక దాడిలో గాయపడి చికిత్స పొందుతూ హుస్సేన్ మరణించారు. తను నలంద జిల్లాలోని లాహేరి పోలీసు స్టేషన్ పరిధిలోని గగండిహ్ గ్రామ నివాసి.
తన మతపరమైన గుర్తింపు కారణంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని చనిపోయే కంటే ముందు హుస్సేన్ తెలియజేశారు. తన మీద దాడి చేసిన తర్వాత, బిహార్షరీఫ్ సదర్ ఆసుపత్రిలో తనను చేర్పించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమీపంలోని నవాడా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో హుస్సేన్ బట్టలు అమ్మేవాడని కుటుంబ సభ్యుల తెలియజేశారు.
తాను ఎదుర్కొన్న దారుణాలను హుస్సేన్ వివరిస్తూ, “కొందరు వ్యక్తుల బృందం నన్ను బలవంతంగా ఆపింది. నా జేబులను పరిశీలించింది. ఆ తర్వాత ఒక గదిలోకి లాక్కెళ్లి నా మతపరమైన గుర్తింపును వెల్లడించమని బలవంతం చేసింది” అని చెప్పారు.
“వారు నన్ను ఇనుప రాడ్‌తో కొట్టి, నా వేళ్లు విరిచారు” అని అన్నారు.
తరువాత మరికొంత మంది దాడి చేయడానికి వచ్చారని హుస్సేన్ తెలియజేశారు. “వారు నా శరీరంపై పెట్రోల్ పోసి నన్ను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు” అని తను చెప్పారు. “దీని కంటే ముందు, దాడి చేసిన వారు నా కాళ్ళు, వేళ్లు- చెవులను పారతో నలిపి, ఇటుకలతో కొట్టారు. నేను పదే పదే ప్రాధేయపడినా, నా విన్నపాన్ని అసలే పట్టించుకోలేదు” అని తీవ్ర ఆవేదనను హుస్సేన్ వ్యక్తం చేశారు.
హుస్సేన్ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రోహ్, నవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో బట్టలు అమ్మేవారు.
హుస్సేన్ భార్య మీడియాతో మాట్లాడుతూ, “తను కుటుంబానికి ఏకైక జీవనాధారం. గత 20 సంవత్సరాలుగా తను ఈ పని చేస్తున్నారు. కానీ తానెప్పుడూ ఎటువంటి సమస్యలను ఎదుర్కోలేదు. ఏం తప్పు జరిగిందో, తనను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో పోలీసులు దర్యాప్తు చేయాలి” అని డిమాండ్ చేశారు.
10 మంది నిందితులు, 15 మంది గుర్తు తెలియని వ్యక్తులకు వ్యతిరేకంగా షబ్నం పర్వీన్ కేసు నమోదు చేయించారు. నలుగురు నిందితులైన సోను కుమార్, రంజన్ కుమార్, సచిన్ కుమార్, శ్రీ కుమార్‌లను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. “మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి దాడులు కొనసాగుతున్నాయి” అని రోహ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రంజన్ కుమార్ తెలిపారు.
దాడి జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్హెచ్ఓ ధృవీకరించారు. “ఈ సంఘటనను మేము చాలా తీవ్రంగా తీసుకున్నాము, నిందితులను వదిలిపెట్టము. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని మృతుడి కుటుంబానికి ఆయన హామీ ఇచ్చారు.
ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలను సేకరించింది.
ఈ సంఘటన నవాడాలో వెలుగుచూస్తున్న ఆందోళనకరమైన నమూనాలో భాగం.
2025లో జిల్లాలో ఇప్పటికే అనేక మూక హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఫిబ్రవరిలో ఇద్దరు యువకులను కొట్టి చంపడం, ఆగస్టులో మంత్రవిద్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వృద్ధ దంపతులపై దాడి వంటివి ఉన్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
