
“Remember to look up at the stars and not down at your feet.Try to make sense of what you see and wonder about what makes the universe exist” అంటారు ప్రఖ్యాత ఖగోళ భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.
నేటి నవతరపు ఆలోచనలలో “అంతరిక్షం” ఆట వస్తువులా కనిపిస్తుంది. అంతరిక్షంలో ‘దేశాల వాటాకు’ సంబంధించిన పోటీ అగ్రదేశాల మధ్య ఓ యుద్ధంలా జరుగుతోంది. మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? అసలు ఎక్కడికి వెళ్తున్నాం? అనంత విశ్వంలో నక్షత్రాలు, గ్రహాలు,ఉపగ్రహాలు, తోకచుక్కలు, కృష్ణ బిలాలు, డార్క్ మ్యాటర్ ఇలాంటి వెన్నో అంతుచిక్కని రహస్యాల అన్వేషణలో మానవుని ప్రయాణం కొన్ని దశాబ్దాల పాటు ఆసక్తిగానో, ఆధునికంగానో, అనితర సాధ్యంగానో కొనసాగుతుంది.
2047 వికసిత భారత్‌లో భాగంగా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ప్రపంచం ముందు నిలబడాలంటే, భారత శాస్త్రవేత్తల అంతరిక్ష ప్రయోగాల విజయాలు చాలా కీలక పాత్ర పోషించనున్నాయి. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించాక వాణిజ్యం 800 కోట్ల డాలర్లకు చేరిందనీ, 2035 నాటికి దాదాపు ఈ విలువ 4,500 కోట్ల డాలర్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే 2040లో చంద్రుడుపైకి భారత వ్యోమగామి అడుగుపెట్టనున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం.
స్పేస్ ప్రయోగాల దారుల్లో సారే జహాసే అచ్ఛా..
యాక్సియం- 4 మిషన్‌లో భాగంగా 2025 జూన్ 25న శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించిన మొదటి భారతీయుడుగా చరిత్ర సృష్టించారు.
2025 జూలై13న తన డైరీలో శుక్ల రాసుకున్న అంతరంగపు అక్షర పరిమళ సొబగులను ఓసారి గమనిస్తే, “నన్ను నా దేశాన్ని అంతరిక్షంలో సమున్నతంగా నిలిపిన ఈ యాత్ర చరిత్రాత్మకమైనది. ఇది నాకు మాత్రమే కాకుండా యావత్ భారతావని సమిష్టి సాధనకు ఓ మైలురాయి లాంటిది. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ఈ మిషన్ నిరూపించింది. ఐఎస్ఎస్లో మేం చేసిన పదులకొద్దీ ప్రయోగాలు మన దేశ యువతకు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నాను. హద్దులు లేకుండా కన్న కలలను నిజం చేసుకోవడానికి ఇది ఒక మార్గదర్శిగా మిగిలిపోతుంది.” ఇలా అనుకుంటూ వీడ్కోలు ప్రసంగం చేస్తుండగా, 1984లో వ్యోమగామి రాకేష్ శర్మ రోదసి నుంచి పలికిన సారే జహాసే అచ్ఛా గుర్తుకొచ్చింది.
నేను కూడా అదే పలికానంటూ శుక్లా అంతరంగం నేటి నవ భారత యువతరానికి స్పేస్ ప్రయోగాల దారుల్లో గొప్ప ప్రేరణా శక్తిగా పనిచేస్తుంది. పెద్దపెద్ద అంతరిక్ష కలలు కనడంలో భవిష్యత్ తరాలకు భరోసానిస్తుంది.
నేడు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దేశ గుండె చప్పుడై వినిపిస్తోంది. సంస్థ చేపట్టిన చంద్రయాన్- 3 మిషన్‌లో భాగంగా, 2023 ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు యావత్ ప్రపంచం ఆసక్తితో చూస్తుండగానే, ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. ఆ క్షణాన ప్రతి భారతీయుడి గుండె వందేమాతరం నినాదంతో సగర్వంగా త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసింది.
ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటికొచ్చి చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించి, పరిశోధించి శాస్త్రీయ సమాచారాన్ని భారతీయ శాస్త్రవేత్తలకు పంపించింది. ఒక పాన్ ఇండియా సినిమా నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో భారత్ చేసిన ఈ ప్రయోగం చంద్రయాన్-3 మిషన్ సాయంతో చంద్రునిపై అడుగుపెట్టిన నాల్గవ దేశంగా, చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో సురక్షితంగా చేరిన మొదటిదేశంగా నవచరిత్ర సృష్టించింది.
ఈ సందర్భంగా భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల అసామాన్యమైన కృషిని 2023 ఆగస్టు 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, భారతీయులందరి తరఫున కొనియాడారు. ఆ సందర్భంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి “శివశక్తి” అని నామకరణం చేసి, ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.
తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024 ఆగష్టు 23ను పురస్కరించుకొని, దాదాపు నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా భారతీయ అంతరిక్ష విజయాలు, భారతదేశ శాస్త్రవేత్తల ప్రయాణం, రోదసికి నేటి సాంకేతికత అనుసంధానం, అప్లికేషన్లు వంటి ఎన్నో విషయాలకు సంబంధించిన అంశాలపై వివిధ ప్రదర్శనలు, విద్యాసంస్థల్లో క్విజ్ పోటీలు తదితర కార్యక్రమాలతో భారత ప్రభుత్వం, ఇస్రో వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వసంస్థలతో కలిసి నేటితరపు విద్యార్థుల్లో ‘స్పేస్’ స్ఫూర్తిని నింపింది. వారిలో ఆసక్తిని పెంచి భవిష్యత్‌లో ప్రముఖ స్పేస్ శాస్త్రవేత్తలుగా ఎదగడానికి కృషి చేసింది.
ఇప్పుడు రెండవ జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025 ఆగస్టు 23ను పురస్కరించుకొని భారత ప్రభుత్వం, ఇస్రోల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులే కేంద్రంగా “Aryabhata to Gaganyan: Ancient wisdom to infinite possibilities”అనే మెయిన్ థీమ్‌తో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను రెండు వారాల పాటు నిర్వహించబోతోంది.
సైన్స్ ఫెయిర్లు, ఇస్రో శాస్త్రవేత్తలతో ఇంటరాక్టివ్ సెషన్లు, ప్లానిటోరియం ప్రదర్శనలు, పాఠశాలలు, కళాశాలల్లో వివిధ ప్రతిభా పోటీలు వంటి ప్రణాళికలు ఉన్నాయి. అంతరిక్ష సాంకేతిక పౌర కేంద్రీకృత అనువర్తనాలు, జాతీయ అభివృద్ధికి అంతరిక్ష ప్రయోగాల ప్రాముఖ్యత, టెలి కమ్యూనికేషన్ సేవలు, విపత్తులు, ల్యాండ్ మ్యాపింగ్, వ్యవసాయ పర్యవేక్షణ, గ్రామీణ సాధికారత తదితర అంశాల్లో స్పేస్ ప్రయోగాల ఆవశ్యకతను దేశ ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాలన్నీ రూపుదిద్దుకోనున్నాయి.
ముఖ్యంగా భవిష్యత్ తరాల విద్యార్థులకు విశ్వాన్వేషణలోని అంతరిక్ష ప్రయోగాల దార్శనికత గురించి తెలియజేస్తూ, పిల్లలకు అంతరిక్ష ప్రయోగాలపై ఆసక్తిని- అభిలాషను పెంచుతూ, వారిని అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగేలా స్ఫూర్తిని అందివ్వడమే.
“ఇస్రో”గా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ..
1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ “స్పుత్నిక్” ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో భవిష్యత్తు అంతా అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలతోనే ముడిపడి వుందని గమనించి, మన దేశంలో వున్న పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి మహమ్మారులను ఈ దేశం నుంచి తరిమేయాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రగామిగా వుండాలనీ, మన దేశంలోని సామాన్యుల చెంతకు సాంకేతిక పరిజ్ఞానం చేరినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా వుండగలమనీ బలంగా విశ్వసించారు భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్. తన అంతరిక్షపు ఆలోచనలను అప్పటి ప్రధాని నెహ్రూతో చర్చించి వారిని ఒప్పించి, మరో విఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త, భారతీయ అణ్వాస్త్ర రంగ పితామహుడు హోమి జే బాబా పర్యవేక్షణలో, 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. అది 1969లో నేటి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ “ఇస్రో”గా ఆవిర్భవించింది.
కాలక్రమంలో ఉపగ్రహల భాగాలను దేశీయంగా తయారు చేసుకుంటూ, తద్వారా ఉపగ్రహ వాహక నౌకలను కూడా తయారుచేసే స్థాయికి ఎదిగాం. చాలా తక్కువ ఖర్చుతో ఎన్నో అసాధారణమైన ప్రయోగాలు చేసి అగ్రరాజ్యాలకు సైతం శాస్త్రీయంగా సవాళ్లు విసిరాం.
1975 ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్ నుంచి భారత మొదటి శాటిలైట్ “ఆర్యభట్ట”ను విజయవంతంగా ప్రయోగించబడింది. 2025 ఏప్రిల్ 19నాటికి ఆర్యభట్ట ప్రయోగ విజయానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఘనంగా స్వర్ణోత్సవ సంబరాలను ప్రభుత్వం నిర్వహించింది. 1980లో SLV-3 రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, రోహిణి-1 ఉపగ్రహాన్ని భారతదేశం నుంచే ప్రయోగించి సత్తా చాటాం. ఇక అప్పటి నుంచి ఎన్నో ఘన విజయాలు సాధించబడ్డాయి.
అప్పుడప్పుడు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో విమర్శలు, అవమానాలు, అవరోధాలు, వైఫల్యాలు ఎదురైనా నిరాశచెందకుండా, పట్టుదల వదలకుండా భారత అంతరిక్ష ప్రయాణం అనంత విశ్వాన్వేషణ హద్దులతో ఎన్నో లక్ష్యాలతో విజయవంతంగా కొనసాగుతూనే వుంది.
ఎల్వీజీఎస్ఎల్వీ, భారతీయ అత్యంత బరువైన రాకెట్ వాహాక నౌక మార్క్- 3(ఎల్వీ ఎమ్-3), చంద్రుని పరిశోధనే లక్ష్యంగా చంద్రయాన్ -1, 2, 3 మిషన్లతో పాటు మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహానికి సంబంధించిన విజయవంతమైన ప్రయోగం(2014 మంగళయాన్, సూర్యుని ఉపరితలం రహాస్యాన్వేషణే లక్ష్యంగా ఆదిత్య -ఎల్ 1 మిషన్, ఆస్ట్రో శాట్ మిషన్, ఉపగ్రహాలను అనుసంధానించే డాకింగ్ ప్రయోగం వంటి ఎన్నో స్పేస్ విజయాలతో భారత జాతీయ పతాకం అంతర్జాతీయ అంతరిక్ష వేదికలపై రెపరెపలాడింది.
పాములను ఆడించే దేశమని ఒకప్పుడు అవమానించబడ్డ భారతదేశమే, అంతరిక్ష రాకెట్ ప్రయోగాలను శాసించే స్థాయికి ఎదిగింది. వేరే దేశాల సాయంతో, సైకిల్ పై ఉపగ్రహాల విడిభాగాలు మోసుకెళ్ళి ప్రయోగాలు చేసి, ఒకే రాకెట్లో 104 ఉపగ్రహాలను పంపించి నేడు అంతరిక్ష వ్యాపారంలో భారత దేశం దూసుకెళ్తుంది.
ఒకసారి చరిత్రను పరిశీలిస్తే, భారతదేశం ప్రపంచ విజ్ఞానానికి గణితం, వైద్యశాస్త్రంతో పాటు ఖగోళశాస్త్రంలో కూడా తన కృషిని అందించింది. కానీ వీటి అభివృద్ధి కొన్ని అంశాలలో కొంతకాలం పాటు మాత్రమే సాగి ఆ తర్వాత కొనసాగ లేకపోయింది.
మధ్యయుగంలోనే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల్లో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, వరాహమీర, భాస్కర అతి విశిష్ట ప్రజ్ఞావంతులు. ఆర్యభట్టీయం పుస్తకం భారతీయ ఖగోళ శాస్త్రానికి పునాదయ్యింది. సూర్యచంద్ర క్యాలెండర్ 1724లోనే “జంతర్ మంతర్” ఖగోళ పరిశీలన కేంద్రం వంటివి భారత చరిత్రకు సాక్ష్యాలు.
స్వాతంత్ర్య భారతంలో కూడా విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలామ్, మాధవన్ నాయర్ వంటి విఖ్యాత శాస్త్రవేత్తల కృషి అమోఘం. అత్తారింట్లో వంటలకే ఆడవాళ్ళు పరిమితం అనే వివక్షతను దాటి నేడు భారత అంతరిక్ష ప్రయోగాల్లో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల పాత్ర అమోఘం, ఆదర్శ దాయకం, అభినందనీయం, అనుసరణీయం.
“మిస్సైల్ మహిళ” టెస్సీ థామస్, నిగర్ షాజీ, కల్పనా కాళహస్తి, నందిని హరినాథ్ వంటి మహిళా శాస్త్రవేత్తలు భారతీయులందరికీ స్ఫూర్తి.
భారత దేశ అంతరిక్ష యాత్రల విజయాలను ప్రదర్శించడానికి, యువతను ప్రేరేపించడానికి ప్రభుత్వం తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024 సందర్భంగా “చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం: భారతదేశ అంతరిక్ష సాగా” అనే థీమ్‌తో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది.
ఈ సందర్భంగా యావత్ దేశం భారతీయ శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల, ఇంజనీర్ల తదితరుల కృషిని అభినందించింది. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకతీతంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలి.
ప్రస్తుత ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ 2027లో తొలిసారిగా మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి గగనయాన్, 2035 కల్లా మనకు సొంత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4, 5 వంటి ప్రయోగాల గురించి కూడా మీడియాలో ప్రకటించడం జరిగింది.
భవిష్యత్తులో భారత అంతరిక్ష ప్రయోగాలన్నీ విజయవంతం కావాలని ఆశిద్దాం. ఫలితాలు ఏమైనా దేశం కోసం అహార్నిశలు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలను రియల్ హీరోలుగా గౌరవిద్దాం.
“He who can listen to the music in the midst of noise can achieve great things” వంటి స్ఫూర్తి వచనాలతో భవిష్యత్తు యువతరం విక్రమ్ సారాభాయ్ స్వప్నాలుగా, మన దేశ పౌరసత్వం నుంచి నోబెల్ బహుమతులు గెలవగల సీవీ రామన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలుగా చూడాలని ముందుకు సాగుదాం.
(జాతీయ రెండవ అంతరిక్ష దినోత్సవం 2025 ఆగష్టు 23 సందర్భంగా వ్యాసం ప్రచురితం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.