ఏ దేశంలో అయితే ప్రజలందరికీ విశ్వవిద్యాలయ స్థాయి దాకా నాణ్యమైన విద్య, సార్వత్రిక ఆరోగ్య రక్షణ, నివాసయోగ్యమైన గృహవసతి, గౌరవప్రదమైన ఉపాధి కల్పించబడతాయో; ఆదేశం బాగా అభివృద్ధి చెందినదిగా పరిగణించబడుతుంది. 1950లో స్థాపించబడి, 193 సభ్య దేశాలు కలిగిన ఐక్యరాజ్య సమితి అధికారిక వైబ్సైట్లో “సామాజిక ప్రగతి, మెరుగైన జీవన ప్రమాణాలు, విస్తారమైన స్వాతంత్రం అందరికీ కల్పించడం అవసరమనే సూత్రాలకు అంకితమై ఉన్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాము” అని పేర్కొనబడింది.
ఇదే ఐక్యరాజ్య సమితి 2015లో సమావేశమై 2030 నాటికి ప్రపంచ ప్రజలందరికీ అవసరమైన సామాజిక అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలని ప్రణాళికను రచించింది. ఆ ప్రణాళికలో అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, గృహవసతి, ఉపాధి కల్పనతో పాటు ఇతర మరికొన్ని అంశాలు కూడా లక్ష్యాలలో ఉన్నాయి.
2025 సంవత్సరంలో(అంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో) నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు సాధించిందో సమీక్షించింది. ఆ సమీక్షను నివేదిక ముందుమాటలో పేర్కొన్నది.
“గడచిన పది సంవత్సరాలలో చాలా విషయాలలో కొంత పురోగతి సాధించినప్పటికీ; నిర్దేశించుకున్న లక్ష్యాలలో, కేవలం 35 శాతం మాత్రమే ఆన్‌ట్రాక్ ఆర్ మోడరేట్ ప్రోగ్రెస్‌లో ఉన్నాము. దాదాపుగా సగభాగం ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. అత్యంత సోచనీయమేమిటంటే అవి 18% రివర్స్‌లో ఉన్నాయి. ఎనిమిది వందల మిలియన్ ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయి. 120 మిలియన్ల ప్రజలు బలవంతంగా తమ ఇళ్ల నుంచి నెట్టివేయబడ్డారు. ప్రతి 12 మందిలో ఒకరు ఆకలి, సురక్షితమైన తాగునీరు, శానిటేషన్ లేక అవస్థలు పడుతున్నారు. అసమానతలు కొనసాగుతున్నాయి. ఈ కాలంలో సంపద పెరిగినప్పటికీ కార్మికుల వేతనాలు పెరగలేదు. పెరిగిన సంపదంతా కొద్దిమంది వద్ద కేంద్రీకృతమైంది. 57% మందికి పైగా ఎలాంటి భద్రత కానీ, సామాజిక భద్రత, కనీస వేతనాలు లేని అసంఘటిత రంగ(ఇన్ఫార్మల్) కార్మికులుగా ఉన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలంటే ఆహార వ్యవస్థ, విద్యుత్తు, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ఉపాధి, సామాజిక రక్షణలాంటివి ప్రపంచంలో మనం నిర్వహించే ఆర్థిక వ్యవస్థలో మౌలికమైనవి. వీటిని అధిగమించాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు, పటిష్టమైన(రోబస్ట్) విధానాలతో తక్షణం వృద్ధి వేగాన్ని పెంచాల్సిన అవసరముంది”.
దీన్నిబట్టి ప్రపంచ దేశాలు తాము నిర్దేశించుకున్న ప్రజా సంక్షేమం పట్ల ఎంతటి శ్రద్ధ వహిస్తున్నాయో అర్థమవుతున్నది.
పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలు..
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ పంథా ఆర్థిక విధానాలు(ప్రజలందరి ప్రయోజనాల కంటే కొందరి ప్రయోజనాలే లక్ష్యంగా) అమలు జరుగుతున్నాయో ఆ దేశాలన్నింటిలో; చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని దేశాలలో విద్య, వైద్యం, గృహ వసతి, ఉపాధి అనే 4 ప్రధాన సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.
ఈ ప్రధాన అంశాలు ఇవి కొరవడిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మడగాస్కర్ తదితర దేశాలలో ఇటీవల జరిగిన ప్రజా ఆందోళనలు, ప్రభుత్వాధినేతలు పారిపోవడాన్ని మనం చూశాము. ఈ ఉద్యమాలు తక్షణ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఆవశ్యకతను ముందుకు తోసుకువచ్చాయి.
ప్రాధాన్యత ఆవశ్యకతలు..
విద్య: విద్య కేవలం పట్టా పొందడం, ఉద్యోగం, డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. విద్య విజ్ఞానఖని. ప్రజలందరికీ నాణ్యమైన, నైపుణ్యంతో కూడిన విద్యని అందించగలిగితే అది దేశ/ప్రపంచ అభివృద్ధికి నిచ్చెనలా పలు విధాలుగా దోహదపడుతుంది.
“విద్య అవసరానికి తగిన విధంగా నిధులు కేటాయించకపోవడం ప్రపంచ స్థిరమైన అభివృద్ధి(గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్)ని చేరుకోవటం సాధ్యం కాదు. విద్య పూర్తి కాకుండానే మధ్యలో చదువు వదిలేయడం వల్ల 1.1 ట్రిలియన్ డాలర్లు నష్టపోతున్నాం. ప్రాథమికమైన నైపుణ్యం ఇవ్వలేని కారణంగా 3.3 ట్రిలియన్ డాలర్లు కోల్పోతున్నాం. పేదరికం, విద్యలో అసమానతల కారణంగా ప్రపంచ జీడీపీలో 17 శాతానికి సమానమైన 21 ట్రిలియన్ డాలర్లు నష్టపోతున్నాం. విద్య మీద 1980 నుంచి ఇప్పటివరకు చేసిన ఖర్చు వల్ల 40 శాతం పేదరికం తగ్గింది. విద్య యువతలో నైపుణ్యం పెంచడానికి ఖర్చు చేసే ప్రతి ఒక్క డాలర్ వల్ల 10 నుంచి 15 డాలర్ల ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. విద్యాధికులైన వారు అధిక వేతనాలు సంపాదించడం ద్వారా 9% వార్షిక వృద్ధి సాధ్యమవుతుంది” అని గ్లోబల్ ఎడ్యుకేషన్ కోఆపరేషన్ మెకానిజమనే సంస్థ తెలియజేసింది.
ఆరోగ్యమే మహాభాగ్యం..
ఆరోగ్యవంతమైన ప్రజల శక్తిసామర్థ్యాలు సమర్థవంతంగా వినియోగించబడతాయి. దీని వల్ల పారదర్శకత, ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. ఇది ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుంది.
కానీ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలలో భాగంగా అత్యధిక మంది ప్రజానీకం వైద్య ఖర్చులను భరించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ మహమ్మారి కాలంలో ప్రజలు ఎంత దుర్భరమైన పరిస్థితుల ఎదుర్కొన్నది చూశాము. అందుచేత అందరికీ సామాజిక ఆరోగ్య రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
గృహ వసతి: భార్య, భర్త, ఇద్దరు పిల్లలు నివసించాలంటే విలాసవంతమైన భవనాలు అవసరం లేదు. కనీస వసతులతో కూడిన రెండు గదుల గృహ వసతి సరిపోతుంది. ఇది కేవలం ప్రజల సౌలభ్యం కోసం మాత్రమే కాదు, ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన విషయం కూడా.
గృహ వసతి లేక రోడ్ల వెంబడి కాపురాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.పేరుకు గృహవసతి అంటే, 10 X 10 అడుగుల గదుల ఆవాసంలో భార్య, భర్త, పిల్లలు నివసిస్తున్న మురికివాడలను చూస్తున్నాం. అందుచేత మెరుగైన వసతులతో కూడిన నివాసయోగ్యమైన గృహ వసతి ఏర్పాటు ప్రభుత్వ బాధ్యత.
ఉపాధి: కుటుంబ పోషణకు అవసరమైన, సామాజిక భద్రత కూడిన కనీస వేతనాలు పొందగలిగిన ఉపాధి నిజమైన ఉపాధి. దీనిని గ్యారెంటీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
నాణ్యమైన విద్య, సార్వజనిక ఆరోగ్య సంరక్షణ, తగిన గృహనిర్మాణం, హామీతో కూడిన ఉపాధి లక్ష్యాలు కొన్ని ప్రభుత్వ, రాజకీయ పార్టీల ప్రకటనలలో పొందుపరచబడినప్పటికీ- అవి నినాదాలుగానే ఉన్నాయి. ఆర్థికంగా అసాధ్యమని కొట్టివేయబడుతున్నాయి/నిర్లక్ష్యం చేయబడుతున్నాయి.
వాటికి అయ్యే ఖర్చు ఎంత?
ఐక్యరాజ్య సమితి ప్రకారం(అంటే చదవడం రాయడం వస్తే విద్య సమకూర్చినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కొన్ని సదుపాయాలు పొందితే వైద్యం అందించినట్లు గృహవసతి నామ మాత్రంగా ఉన్నట్టు కల్పించడం ఎలాంటి భద్రత లేని ఎంతో కొంత సంపాదన కలిగిన ఉపాధి కల్పన) సుమారు 4 ట్రిలియన్ డాలర్లు అవసరం. కానీ అదే యునైటెడ్ నేషన్స్ లక్ష్యంగా ప్రకటించుకున్న మౌలికమైన సామాజిక అవసరాలతో గౌరవప్రదంగా బ్రతకాలంటే ఈ నాలుగు లక్ష్యాలకు అయ్యే ఖర్చు 13 ట్రిలియన్ డాలర్లు. ఇది మొత్తం ప్రపంచ జీడీపీలో కేవలం ఐదు శాతం మాత్రమే.
ఇంత డబ్బు సాధ్యమా?
నాణ్యమైన విద్య, సార్వజనీన ఆరోగ్య రక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చు ఒకేసారి మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చు చాలా భాగం తగ్గుతుంది. ప్రజలందరికీ గృహవసతి కల్పించాలంటే అయ్యే ఖర్చు కూడా ఒకసారి చేసే ఖర్చు తప్ప ప్రతి సంవత్సరం ఉండదు. ప్రపంచ ప్రజలందరికీ ఉపాధి కల్పించాలంటే అయ్యే ఖర్చు ప్రధానంగా ప్రభుత్వం మౌలిక వసతుల ఏర్పాటు, వివిధ ప్రభుత్వ శాఖలు, సర్వీసులలో తగినంత మంది సిబ్బందిని నియమించడం ద్వారా ప్రధానంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పరిశ్రమల స్థాపన ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన సాధ్యమవుతుంది. ఈ ఖర్చు ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూ కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ సమకూర్చడం ద్వారా ప్రజలు సంతోషంగా, ఆరోగ్యకరంగా, శక్తివంతంగా తయారవుతారు. ఫలితంగా ఉత్పాదకత బాగా పెరుగుతుంది. ప్రపంచ జీడీపీ పెరుగుతుంది. ప్రజల ఈ సామాజిక అవసరాలకు ఒక డాలర్ ఖర్చుపెడితే తిరిగి జీడీపీ నాలుగు డాలర్లు పెరుగుతుందని ఒక అంచనా.
భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి ప్రాథమిక మానవ హక్కులు కూడా గ్యారెంటీ చేయబడతాయి.
దృఢమైన చిత్తశుద్ధి ఉంటే అసాధ్యం కాదని స్పష్టంగా అర్థమవుతున్నది. ఉదాహరణకు రక్షణ బడ్జెట్‌కు ప్రతి ఏటా నిధుల కేటాయింపును ప్రతి దేశం గణనీయంగా పెంచుతున్నాయి. 2024 సంవత్సరానికి మొత్తం ప్రపంచం మీద రక్షణ వ్యయం 2.5 ట్రిలియన్ డాలర్లని ఎస్ఐపీఆర్ఐ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇందులో కొంత భాగం తగ్గించుకోవచ్చు.
బెయిల్ అవుట్ ప్యాకేజీల పేరున ప్రపంచంలోని వివిధ దేశాలు భారతదేశంతో సహా బడా పారిశ్రామికవేత్తలకు భారీ ఎత్తున నిధులు సమకూరుస్తున్నాయి. దాన్ని ప్రజల సామాజిక అవసరాల కోసం మళ్ళించవచ్చు.
వివిధ పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాలకి చట్టపరంగా చెల్లించాల్సిన పన్నులు కూడా సక్రమంగా చెల్లించట్లేదు. చట్ట ప్రకారం పారిశ్రామికవేత్తలందరూ చెల్లించాల్సిన పన్నులను విధిగా వసూలు చేయగలిగితే ఆ డబ్బు ప్రజా సంక్షేమానికి ఉపయోగించవచ్చు.
ప్రభుత్వానికి చూపించే లెక్కల కంటే అధిక మొత్తంలో వారి వద్ద సంపద ఉంది. అదంతా స్విస్ బ్యాంకుల్లో దాచిపెడుతున్నారని అందరికీ తెలిసిందే. సంపన్న భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు వెనక్కి తెప్పిస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ వాగ్దానం చేశారు. ఇది భారతదేశానికి సంబంధించింది మాత్రమే. కానీ, మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాచిపెట్టిన నల్ల ధనం ఎంత భారీ మొత్తంలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా దొంగ చాటుగా స్విస్ బ్యాంకులలో దాచుకున్న డబ్బును కొంతమేరకు తీసుకు రాగలిగితే చాలు.
ప్రపంచం మొత్తంలో దాదాపు మూడువేల మంది బిలియనీర్లు ఉన్నారని, వారి వద్ద ఉన్న మొత్తం సంపద 16 నుంచి 17 ట్రిలియన్ డాలర్లని వివిధ సంస్థలు లెక్కవేశాయి. వారి వద్ద నుంచి కేవలం 10 శాతం పన్ను విధిస్తే సుమారు 1.4 ట్రిలియన్ డాలర్లు సమకూరుతుంది.
ప్రపంచంలో కొన్ని దేశాలలో సంపన్నులపై అదనపు పన్నులు వసూలు చేయడం, వారసత్వ సంపదపై పన్నులు విధించడం ఈ పాటికే అమలులో ఉంది. అన్ని దేశాలలో వాటిని కచ్చితంగా అమలు చేయడం, అవసరమైతే పన్నులు ఇంకా కొద్దిగా పెంచవచ్చు.
- ప్రపంచంలోని పలు దేశాలు, అమెరికాతో సహా ప్రజల సంక్షేమం కోసం భారీగానే ఖర్చు చేస్తున్నాయి. ఈ నాలుగు సామాజిక అవసరాలు తీరిన తర్వాత ఉచిత పథకాల ఆవశ్యకత దాదాపుగా అవసరం ఉండదు. కాబట్టి ఆ డబ్బంతా మిగులుతుంది.
- ప్రపంచ దేశాలు అన్నిటిని పట్టిపీడిస్తున్న మరొక సమస్య అవినీతి. ఈ అవినీతి డబ్బు ప్రపంచ వ్యాప్తంగా ఎంత అనేది లెక్కకు అందనంతగా ఉంది. దాదాపుగా ఈ అవినీతి అంతా ప్రభుత్వ ధనమే. దీన్ని అరికడితే ప్రజలందరి సామాజిక అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది.
- నేర ప్రవృత్తి విపరీతంగా పెరుగుతున్నది. ప్రజలకు సామాజిక అవసరాలు తీరిన తర్వాత నేర ప్రవృత్తి గణనీయంగా తగ్గిపోతుంది. డబ్బు కోసం తల్లిదండ్రులను కూడా హత్య చేసిన ఘటనలు, బ్రతికి ఉన్న తల్లిని స్మశానంలో వదిలివేసిన ఘటనలు అనేకం మనం పత్రికల్లో ప్రతినిత్యం చూస్తున్నాం. ఈ నేర ప్రవృత్తికి గాను పోలీసు, న్యాయవ్యవస్థ మీద ఖర్చు ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతున్నది. ఇందులో కూడా చాలా భాగం ఆదా అవుతుంది.
- దాదాపు ప్రపంచ దేశాలన్నీ అప్పుల్లోనే ఉన్నాయి. ఐఎంఎఫ్, ఐఐఎఫ్ వివరాల ప్రకారం 2025 మొదటి త్రైమాసికానికి మొత్తం ప్రపంచ అప్పు 324 ట్రిలియన్ డాలర్లు. కాబట్టి ప్రజా ప్రాథమిక అవసరాలకు కేవలం మరొక 13 ట్రిలియన్ డాలర్లు అప్పు చేయవచ్చు.
- బ్యాంకులు, ఇన్సూరెన్స్ తదితర సంస్థలలో పొదుపు, పెట్టుబడుల రూపంలో పెట్టిన ప్రజల డబ్బును ఆయా సంస్థలు ప్రభుత్వాలకు అప్పులిస్తాయి.
- ప్రజలు తమ ఆదాయాలపై చెల్లించే ప్రత్యక్ష పన్నులు, వివిధ సరుకులు/సేవలపై చెల్లించే పరోక్ష పన్నులే ప్రభుత్వాల ఆదాయం. అంటే ప్రజల మౌలిక/ప్రాథమిక అవసరాలు ప్రజల డబ్బుతోనే తీరుతాయి తప్ప మరొకటి కాదు.
- మనసుంటే మార్గం ఉంది: ప్రజల సంక్షేమం ధ్యేయంగా ఉన్నప్పుడు ఆర్థిక అంశం ప్రస్తావనకు కూడా రాదు. ప్రజల సామాజిక అవసరాలు తీర్చడం ప్రపంచ ఆర్థిక సామర్థ్యం పరిధికి మించినవి కావు. ఈ ప్రతిష్టాత్మకమైన సామాజిక పునాదిని అందించడానికి అయ్యే నిరంతర వార్షిక వ్యయం ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన ప్రతి డాలర్లో కేవలం 5 సెంట్లకు సమానం. అంటే ఒక రూపాయిలు ఐదు పైసలు మాత్రమే.
మనం దీన్ని భరించగలమా?
1917లో ప్రపంచంలో మొట్టమొదటిసారి లెనిన్ నాయకత్వంలో కార్మిక వర్గ పార్టీతో ప్రజలే అధికారంలోకి వచ్చారు. ఆ విధంగా సోవియట్ యూనియన్, ఆ తర్వాత ఏర్పడిన సోషలిస్టు దేశాలు ప్రజల సామాజిక అవసరాలను ప్రజల హక్కుగా గుర్తించి ఆచరణలో అమలు చేశారు. “ప్రజల సంపదపై ప్రజలకే అధికారం” అన్న సూత్రమే కీలకం.
1930 సంవత్సరంలో చిట్ట చివరి నిరుద్యోగికి సన్మానం చేసి ప్రపంచంలో నిరుద్యోగిత లేని ఏకైక దేశంగా సోవియట్ యూనియన్ నిలిచింది.
1917 నవంబర్ 7న ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అది. సోవియట్ యూనియన్ కే కాదు, మొత్తం ప్రపంచ మానవాళికి సోవిట్ యూనియన్, సోషలిస్టు వ్యవస్థలు అందించిన సహకారం, ప్రోత్సాహం, మార్గదర్శకం. భారతదేశంలో భిలాయి, రూర్కెలా ఉక్కు కర్మాగారాలు, బరౌని రిఫైనరీ, భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలలాంటి అనేక పరిశ్రమలు సోవియెట్ యూనియన్ సహకారంతో నిర్మించినవే.
“ప్రజలే చరిత్ర నిర్మాతలు” అన్నది మనందరికీ తెలిసిందే. “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు”. “ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగి ఉందో” అర్థం చేసుకోనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. ప్రజలు చైతన్యవంతులై పాలకులను నిలదీయ గలగాలి. తమకు ఎలాంటి వ్యవస్థ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఆ వ్యవస్థ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలి. ఇదే నవ ప్రపంచానికి నాంది.
ఆర్ లక్ష్మయ్య
(వ్యాస రచయిత ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
