పెట్టుబడిదారీ దేశాల్లో ఏర్పడిన ఆర్థికసంక్షోభం, ఆదేశాల మధ్య వైరుధ్యాలను సృష్టించింది.
అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధాలకు మద్దతు ఇస్తూ వచ్చిన నాటో కూటమి దేశాలు నేడు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి.
వెనిజులాపై అమెరికాదాడిని, గ్రీన్ లాండ్‌ను ఆక్రమిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనను యూరోపియన్ యూనియన్ దేశాలు వ్యతిరేకించాయి.
అమెరికా విధానాలు నాటో విచ్ఛిన్నానికి దారితీస్తుందని పేర్కొన్నాయి.
నాటో కూటమి ఏర్పాటు
స్టాలిన్ నాయకత్వాన ఉన్న సోవియట్ యూనియన్ అన్ని రంగాల్లో దూసుకు పోవడమే కాకుండా- సైనిక శక్తిలో అమెరికాను ఢీ కొనగలిగిన సామర్ధ్యం కలిగి ఉండటం; అల్బేనియా, రుమేనియా, ఉత్తరకొరియా తదితర దేశాలు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలుగా ఉండటం; చైనాలో మావో నాయకత్వాన విప్లవం చివరి విజయానికి చేరుకోవడం; అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడి బలమైన శక్తిగా మారడంతో భయపడిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ తదితర 12 దేశాలతో- సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా 1949లో ‘నాటో’(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిగా ఏర్పడ్డాయి.
కూటమిలోని దేశాల ప్రధాన ఉద్దేశం వెనకబడిన దేశాల సహజ వనరుల దోపిడీలో భాగం కోసమే.
నాటో సభ్య దేశాల్లోని ఏ దేశంపైనైనా మరో దేశం దాడి చేస్తే- తమపై దాడిగానే భావించి మిగిలిన సభ్యదేశాలు, ఆ దేశానికి అండగా ఉండాలన్నది నాటో ఏర్పాటు ఉద్దేశం.
అంతేకాకుండా, ఒక నాటో దేశం వేరొక దేశంపై దాడి చేసినా అందుకు మద్దతుగా ఉండాలి.
ఇతర దేశాలపై దాడులు చేస్తున్నది అమెరికా తదితర పెట్టుబడిదారీ దేశాలే అన్నది గమనించాలి.
తమ దురాక్రమణ దాడులకు మద్దతుగా నాటో దేశాలు ఉండాలన్నదే అమెరికా ఉద్దేశం.
పెట్టుబడిదారీ విధానాల పునరుద్ధరణ ఫలితంగా ఏర్పడిన ఆర్ధిక, రాజకీయ సంక్షోభం ఫలితంగా 1991లో సోవియట్ యూనియన్ పతనమై అనేక దేశాలు ఏర్పడ్డాయి.
సోవియట్ పరిణామాల తర్వాత తూర్పు ఐరోపాలోని అనేక దేశాలు నాటోలో చేరాయి.
వాటిలో సోషలిజానికి తిలోదకాలు ఇచ్చి పెట్టుబడిదారీ విధానాన్ని చేపట్టిన అల్బేనియా, బల్గేరియా, రుమేనియా, చెక్ రిపబ్లిక్‌తోపాటు హంగరీ, పోలెండ్ తదితర దేశాలు నాటో పంచన చేరాయి.
తటస్తంగా ఉన్న ఫిన్లాండ్ 2023లో, స్వీడన్ 2024లో నాటోలో చేరటం జరిగింది.
ఉక్రెయిన్ నాటోలో చేరటానికి దరఖాస్తుచేసింది.
అమెరికా యుద్ధాలకు నాటో మద్దతు..
అమెరికా ప్రపంచ ఆదిత్య విధానాల్లో భాగంగా అనేక దేశాల్లోని సహజ వనరులను తరలించుకుపోవడానికి అడ్డంకిగా ఉన్న దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేసింది.
2001లో ఆప్ఘనిస్థాన్‌పై దాడి చేసింది. 1999లో యుగోస్లేవియా(యుగోస్లేవియా- కొసావో యుద్ధం)పై వైమానిక దాడులు చేసింది.
చమురు నిల్వలు తరలించుకు పోవడానికి ఇరాక్‌పై దాడిచేసి సద్దాం హుస్సేన్ని ఉరితీసింది.
జెలెనెస్కీని రెచ్చగొట్టి ఉక్రెయిన్ రష్యాతో యుద్ధానికి తలపడేలా చేసి ఆయుధాలు సప్లయ్ చేస్తూ యుద్ధం ఆరకుండా చేస్తున్నది.
ఈ దాడులన్నీ అమెరికా ఆధిపత్య దోపిడీ విధానాల్లో భాగమే. అమెరికా దాడులకు నాటో మద్దతు ఇస్తూ ఇచ్చింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సృష్టించిన అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేయరాదని నాటో దేశాలపై కూడా ఆంక్షలు పెట్టటం వల్ల అమెరికా వెడల నాటో దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.
ట్రంప్ ఆంక్షలు తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని భావించాయి.
నాటోపై అమెరికా పెత్తనం..
నాటోకి ప్రత్యేకమైన సైనిక శక్తిలేదు. నాటో కూటమిలోని మిగతా దేశాలకన్నా ఆర్థిక, సైనికశక్తితో అమెరికా కీలకంగా ఉంది.
ఫలితంగా నాటోపై దాని ఆధిపత్యం కొనసాగుతున్నది. నాటో ఎజెండాను అమెరికానే రూపొందిస్తున్నది.
ఇటీవల కాలంలో అమెరికా ఏకపక్ష నిర్ణయాలు, సైనిక జోక్యాలు కొన్ని దేశాలకు నచ్చక అమెరికా వెడల వ్యతిరేకత చోటుచేసుకుంది.
అమెరికా అనుసరిస్తున్న విధానాలు తమ ఆర్థిక ప్రయోజనాలకు నష్టంగా ఉన్నాయనే అభిప్రాయం కూటమి దేశాల్లో ఏర్పడింది. ఫలితంగా కొన్ని దేశాల్లో చైనాపై సానుకూలత పెరుగుతూ ఉంది.
వెనిజులాపై అమెరికా దాడితో కూటమి దేశాల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది. నాటోలోని ముఖ్య పెట్టుబడిదారీ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా మొదలైన దేశాలు అమెరికా దాడిని వ్యతిరేకించాయి.
స్వతంత్ర ప్రతిపత్తి కలిగి డెన్మార్క్ భూభాగంలో అంతర్భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలో కలుపుకుంటామని, తమ దేశ భద్రతకు గ్రీన్‌ల్యాండ్ అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, అందుకు అంగీకరించకపోతే దాడి చేసి ఆక్రమిస్తామని, బలపరచని దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10% దిగుమతి సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత కూడా ఒప్పందం కుదరక పోతే జూన్ నుంచి 25% సుంకం విధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను నాటో దేశాలు తీవ్రంగా ఖండించాయి.
తన దేశ ప్రయోజనాలకు విరుద్దంగా ఏ దేశం ఉన్నా సహించని ట్రంప్ చెప్పడమే కాకుండా గ్రీన్ లాండ్ విషయంలో తనకు మద్దతు ఇవ్వని నాటో కూటమి దేశాలకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారు.
దీన్ని గమనిస్తే నాటో కూటమి తన ప్రయోజనాలను మాత్రమే కాపాడాలని, అందుకు విరుద్దంగా ఏ దేశం ఉన్నా సహించనని ట్రంప్ హెచ్చరిక చేయడం అగ్రరాజ్య దురహంకారానికి, నాటో దేశాల వెడల చులకన భావానికి నిదర్శనం.
ట్రంప్ చర్యలను ఖండించిన మిత్ర దేశాలు
ట్రంప్ హెచ్చరికలను ఐరోపా సమాఖ్య దేశాలు తీవ్రంగా పరిగణించాయి. తీవ్ర పదజాలంతో ఖండించాయి.
దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాన్ని దీనిని వేదిక చేసుకున్నాయి. ట్రంప్ సమావేశానికి రాకముందే వివిధ దేశాల నేతలు ట్రంప్ విధానాలను దుయ్యబట్టారు.
అమెరికా నాయకత్వాన ఉన్న ప్రపంచ వ్యవస్థకు ముగింపు పలికి ఐక్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి.
బలవంతుల చట్టానికి లొంగిపోగూడదని, బెదిరింపులకు బదులు గౌరవాన్ని కోరుకుంటున్నామని, గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ వైఖరి నాటో కూటమికి చేటు చేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నారు.
అమెరికా చెప్పే గాజా శాంతి బోర్డులో చేరటానికి ఫ్రాన్స్ నిరాకరించింది.
ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యూరప్ స్వాతంత్రంపై ఏకాభిప్రాయం పెరిగిందని, ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ తెలిపారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డీ వెవర్ మాట్లాడుతూ, 27 దేశాల ఐరోపా సమాఖ్య ఒక కూడలిలో ఉందని అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా మద్దతు, తర్వాత ఎదుర్కొన్న దారుణ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో నిర్ణయించుకోవాలన్నారు.
సంతోషకరంగా ఉండటం ఒక విషయం కాగా, దుర్భరమైన బానిసగా ఉండటం మరొకటి అని ట్రంప్ సుంకాలపై బెదిరింపుల గురించి డీ వెవర్ వ్యాఖ్యానించారు.
విచ్ఛిన్నం- పరివర్తనం..!
అమెరికా నాయకత్వంలోని ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక విచ్ఛిన్నాన్ని ఎదుర్కొంటున్నదని కెనడా ప్రధాని మార్క్కార్నీ సూటిగా వ్యాఖ్యానించారు.
“మనం పరివర్తనలో కాదు విచ్చిన్నంలో ఉన్నాము. అంతర్జాతీయ నియమాల ఆధారిత క్రమం పాక్షికంగా అబద్ధమని మనకు తెలుసు. బలవంతులు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు తమను తాము మినహాయించుకుంటారు. వాణిజ్య నియమాల అమల్లో అసమానంగా వ్యవహరిస్తారు” అంటూ ట్రంప్ గురించి వ్యాఖ్యానించారు.
తమ దేశ సార్వభౌమత్వ అంశాన్ని ఇతరులతో చర్చించాల్సిన అవసరం లేదని డెన్మార్క్ మహిళా ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ చెప్పారు.
దావోస్‌లో ట్రంప్‌ను కలవకుండానే డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే నేతలు స్వదేశాలకు బయలుదేరారు.
అమెరికా సామ్రాజ్యవాదం అణ్వస్త్రాల బూచిని చూపి ప్రపంచ పెత్తనం కోసం అర్రులు చాస్తున్నది. అభివృద్ధి చెందిన పెట్టుబడి దారీ దేశాలు కూడా చెప్పు చేతుల్లో ఉండాలని, తన ప్రయోజనాలు కాపాడాలనే విధంగా వ్యవహరిస్తున్నది.
అమెరికా ఆధిపత్య విధానాల ఫలితంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మొదలైన పెట్టుబడిదారీ దేశాల దోపిడీ ప్రయోజనాలు దెబ్బతింటూ వచ్చాయి. అమెరికాపై గుర్రుగా ఉన్నాయి. ఇవి కూడా సామ్రాజ్యవాద కాంక్షగల దేశాలు కావడమే అందుకు కారణం.
తమ దేశాల్లో కూడా ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడి సమస్య వలయంలో చిక్కుకున్న ప్రజలు వీధి పోరాటాలకు దిగుతున్నారు.
అమెరికా దురాక్రమణ యుద్ధాలకు మద్ధతు ఇవ్వరాదని ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇది తమ అధికారానికే ప్రమాదమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలు భావించాయి.
వీటన్నిటి ఫలితమే అమెరికాకు వ్యతిరేకంగా ఈ దేశాలు ముందుకు రావడం. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ విధానాలను వ్యతిరేకిస్తూ, గ్రీన్ లాండ్ స్వయంప్రతిపత్తి, పూర్తి స్వాతంత్రకాంక్షను అమెరికా గౌరవించాలని, గ్రీన్లాండ్ ఆక్రమణ విధానాలను మానుకోవాలని, వెనిజులా సార్వభౌమాధికారాన్ నిగౌరవించాలని ప్రపంచ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
(వ్యాస రచయిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతుకూలీ సంఘం కార్యవర్గ సభ్యులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
