దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో, ముఖ్యంగా దేశ రాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో, మరణాలు లేదా అనారోగ్యాలను వాయు కాలుష్యంతో నేరుగా అనుసంధానించే ఖచ్చితమైన జాతీయ డేటా తమ వద్ద అందుబాటులో లేదని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే శ్వాసకోశ– సంబంధిత వ్యాధులకు వాయుకాలుష్యం ఒక ప్రధాన కారణం.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో, ముఖ్యంగా దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర ఆందోళన- అనారోగ్యానికి కారణమవుతున్నది.ఈ తరుణంలో, వాయు కాలుష్యం వల్ల సంభవించే మరణాలు- వ్యాధుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని సూచించడానికి దేశంలో ఖచ్చితమైన జాతీయ డేటా అందుబాటులో లేదని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఢిల్లీ గాలిలో కాలుష్య కారకాల స్థాయిలు పెరగడాన్ని నిరసిస్తూ జరిగిన ప్రజా నిరసనలను ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. నిరసనల సమయంలో మావోయిస్టు అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై అరెస్టయిన 10 మంది ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులకు బెయిల్ కూడా మంజూరు చేయబడింది.
తృణముల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ’బ్రియన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘శ్వాసకోశ– సంబంధిత వ్యాధులకు వాయు కాలుష్యం ప్రధాన(ప్రేరేపించే) అంశం’ అని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ అన్నారు.
తానడిగే ప్రశ్నలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి సమాధానం చెప్పడానికి కరుణిస్తారాని ఓ’బ్రియన్ అంటూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు.
(ఏ) 2022లో పీఎం2.5 కారణంగా దేశంలో 17 లక్షలకు పైగా ప్రజలు మరణించారనేది వాస్తవమేనా?
(బీ) బహిరంగ వాయు కాలుష్యం వల్ల జీడీపీలో దాదాపు 9.5 శాతం నష్టపోతున్నామనేది వాస్తవమేనా?
(సీ) గత ఐదు సంవత్సరాలలో వాయు కాలుష్యం వల్ల సంభవించిన మరణాల రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అధికారిక ప్రభుత్వ అంచనాలు ఎలా ఉన్నాయి?
(డీ) వాయు కాలుష్యం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసిందా? ఒకవేళ అంచనా వేస్తే, దాని వివరాలు ఏంటి?
(ఇ) పీఎం 2.5 ప్రభావాన్ని తగ్గించడానికి కాలపరిమితి లక్ష్యాలతో ఏదైనా ప్రణాళిక రూపొందించబడిందా? అలా అయితే వాటి వివరాలు ఏంటి?
దీనికి ప్రతిస్పందనగా, “మరణాలు, అనారోగ్యాలను వాయు కాలుష్యంతో నేరుగా కలిపే ఖచ్చితమైన డేటా అందుబాటులో లేదు. శ్వాసకోశ వ్యాధులు, సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం వాయు కాలుష్యం” అని జాదవ్ అన్నారు.
అంతేకాకుండా, మానవ శరీరంపై వాయు కాలుష్య ప్రభావానికి అనేక అంశాలను ఆయన ఆపాదించారు. “ఆరోగ్యంపై వాయు కాలుష్యం ప్రభావం ఆహారపు అలవాట్లు, పని అలవాట్లు, సామాజిక-ఆర్థిక స్థితి, వైద్య చరిత్ర, రోగనిరోధక శక్తి, జన్యుశాస్త్రం మొదలైన అనేక అంశాల కలిసి ఉంటాయి” అని అన్నారు.
వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న “అనేక చర్యల” జాబితాను జాదవ్ ప్రస్తావించారు. అందులో వాయు కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యల కోసం “ఆరోగ్య అనుసరణ ప్రణాళిక”ను అభివృద్ధి చేసిన వాతావరణ మార్పు; మానవ ఆరోగ్యంపై జాతీయ కార్యక్రమం(ఎన్పీసీసీహెచ్హెచ్)అమలును, 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు వాతావరణ మార్పు; మానవ ఆరోగ్యంపై “రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలు” అమలును ఆయన ఉదహరించారు.
“ఈ రాష్ట్ర-నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలో వాయు కాలుష్యంపై ప్రత్యేక అధ్యాయం ఉంది. దాని ప్రభావాన్ని తగ్గించడానికి జోక్యాలను సూచిస్తుంది” అని ప్రభుత్వం తెలిపింది.
వాయు కాలుష్య ప్రభావాన్ని తగ్గించే మార్గాలను సూచిస్తూ, రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రజారోగ్య సలహాలను; అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5), అంతర్జాతీయ క్లీన్ ఎయిర్ డే ఫర్ క్లియర్ బ్లూ స్కైస్(సెప్టెంబర్ 7); జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం(డిసెంబర్ 2) వంటి సందర్భాలలో జాతీయ ప్రజా అవగాహన ప్రచారాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది.
ప్రోగ్రామ్ మేనేజర్లు, వైద్య అధికారులు- నర్సులు, నోడల్ అధికారులు, మహిళలు- పిల్లల సంరక్షణ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, ఆశా వంటి ఫ్రంట్‌లైన్ కార్మికులు మొదలైన వారి కోసం ‘అంకితమైన శిక్షణా మాడ్యూల్లను’ అభివృద్ధి చేసినట్టుగా ప్రభుత్వం పేర్కొన్నది.
వాయు కాలుష్య సంబంధిత వ్యాధులపై కమ్యూనికేషన్ సామాగ్రి, రాష్ట్ర స్థాయి శిక్షకుల కోసం సామర్థ్య నిర్మాణ వర్క్‌షాప్‌లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, స్వచ్ఛ భారత్ మిషన్- ‘స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడం ద్వారా మహిళలు- పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం’ లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కూడా ఉదహరించబడ్డాయి.
దేశవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి జాతీయ స్థాయి వ్యూహమైన జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను 2019లో పర్యావరణం, అటవీ- వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని ప్రభుత్వం తన సమాధానంలో తెలిపింది.
ఇటీవల, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీబీడీ) తాజా డేటా విశ్లేషణలో ఢిల్లీ వాసులకు వాయు కాలుష్యం అతిపెద్ద ఆరోగ్య ముప్పుగా ఉందని, ఇది 2023లో జరిగే మొత్తం మరణాలలో 15% వాటా కలిగి ఉందని వెల్లడైంది.
‘లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ తొమ్మిదవ నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో భారతదేశంలో వాయు కాలుష్యానికి సంబంధించిన 17.18 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య 2010 కంటే 38 శాతం ఎక్కువ.
మరోసారి విషపూరిత గాలి గుప్పిట్లో ఢిల్లీ–ఎన్సీఆర్ చిక్కుకున్న సమయంలో ఈ నివేదిక వెలువడింది. రాజధాని గాలిని పీల్చడం రోజుకు 10 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరంగా పరిస్థితులు మారాయని డేటా తెలియజేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
