గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తమ క్యాంపస్‌లో వంటగ్యాస్ కొరత ఉన్న మాట వాస్తవమేనని అధికారికంగా ప్రకటించింది.
దీనివల్ల మెస్ సేవలకు అంతరాయం ఏర్పడిందని, మెనూలోనూ కోత విధించాల్సి వచ్చిందని వెల్లడించింది.
దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఈ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.
న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాస్(ఎల్పీజీ) కొరత లేనే లేదని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది.
కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని ఓ కేంద్రీయ విశ్వవిద్యాలయం జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రభుత్వ వాదనలను ప్రశ్నించేలా ఉంది.
గ్యాస్ సరఫరాలో ఏర్పడిన కొరత కారణంగా మెస్ నిర్వహణకు ఆటంకం ఏర్పడిందని విద్యార్థులకు జారీ చేసిన నోటీసులో గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్పష్టంగా అంగీకరించింది.
2026 ఏప్రిల్ 1న జారీ చేసిన ఈ నోటీసులో, ప్రస్తుత “భౌగోళిక రాజకీయ పరిస్థితుల” వల్లే గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడిందని యూనివర్సిటీ పరిపాలన విభాగం పేర్కొంది.
గ్యాస్ సిలిండర్ల సరఫరా క్రమం తప్పకుండా, తగినంతగా ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.
అప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో మెస్‌ను నడుపుతున్నామని, అందుకే మెనూను కుదించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
కొద్ది రోజుల క్రితమే పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దేశంలో గ్యాస్ కొరత లేదని తేల్చిచెప్పింది.
సరఫరా ‘పూర్తిగా భద్రంగా, నియంత్రణలో’ ఉందని బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో- యూనివర్సిటీ జారీ చేసిన ఈ తాజా నోటీసుకు ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, కొరత ఉందనే వార్తలన్నీ ‘తప్పుదోవ పట్టించేవే’నని ప్రభుత్వం కూడా కొట్టిపారేసింది.
క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్త సరఫరాలపై ప్రభావం చూపుతోందని సమాచారం.
ఎల్పీజీని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్ తీవ్రమైన గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఇటీవలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ నోటీసు ఎందుకంత కీలకం?
గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చేసిన ప్రకటన ఈ సంక్షోభానికి ఒక కొత్త కోణాన్ని ఆపాదిస్తోంది. ఒక కేంద్ర విద్యాసంస్థ గ్యాస్ కొరతను అధికారికంగా అంగీకరించి, ఆ కారణంగా తమ సేవలను తగ్గించుకుంటున్నట్టు బహిరంగంగా చెప్పడం ఇదే తొలిసారి.
ఉన్న పరిమిత వనరులతోనే మెస్ నిర్వహణను కొనసాగించేందుకు, విద్యార్థి ప్రతినిధులతో చర్చించిన తర్వాతే మెనూను తగ్గించినట్టు ఆ నోటీసులో పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారిక ప్రకటనలకు, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న స్పష్టమైన వైరుధ్యాన్ని ఈ పరిణామం ఎత్తిచూపుతోంది.
‘ది వైర్ హిందీ’కి అందిన సమాచారం ప్రకారం, విశ్వవిద్యాలయం ‘ప్రత్యామ్నాయ ఏర్పాట్ల’ కింద కట్టెల పొయ్యిలను, ఇండక్షన్ స్టవ్‌లను ఆశ్రయించింది.
తగ్గిన భోజనం- ఇబ్బందుల్లో విద్యార్థులు..
తమ పేరును గోప్యంగా ఉంచాలని కోరిన ఒక విద్యార్థి మాట్లాడుతూ “మాకు రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రొట్టెలు(చపాతీలు) పెడతారు. కానీ మార్చి 31న రెండు పూటలా వాటిని ఇవ్వలేదు. కనీసం రాత్రి పూట కూర కూడా వండలేదు, దానికి బదులుగా టమాటా పచ్చడితో సరిపెట్టారు”అని వాపోయారు.
సిలిండర్లు వచ్చే వరకు ఇలాగే సర్దుకుపోవాల్సి ఉంటుందని మెస్ సిబ్బంది ఒకరోజు ముందే తమకు చెప్పారని సదరు విద్యార్థి తెలిపారు.
యూనివర్సిటీ మెస్ వార్డెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరభ్ కుమార్ కూడా రొట్టెల తయారీ నిలిచిపోయిన మాట వాస్తవమేనని ధృవీకరించారు. అయితే, పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
‘ది వైర్ హిందీ’తో సౌరభ్ మాట్లాడుతూ, “మా ఎల్పీజీ సరఫరాకు ఒకరోజు ఆటంకం ఏర్పడింది. దానివల్ల మెస్‌లో ఒక పూట వంట చేయలేకపోయాం. కానీ, ఆ వెంటనే ఒక గ్యాస్ సిలిండర్‌ను ఏర్పాటు చేసుకున్నాం” అని తెలిపారు.
“ప్రస్తుతం మా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు జారీ చేసిన నోటీసు కేవలం ఒక సూచన(అడ్వైజరీ) మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు.
సూచన కాదు.. చేదు వాస్తవం!
కానీ, ఆ నోటీసును పూర్తిగా చదివితే అది కేవలం “సూచన” మాత్రమే కాదని అర్థమవుతుంది. ఆ నోటీసులో “గ్యాస్ సిలిండర్ల సరఫరా క్రమం తప్పకుండా, తగినంతగా ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అప్పటి వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో మెస్‌ను నడుపుతున్నాం, దీనివల్ల మెనూను తగ్గించాల్సి వచ్చింది” అని స్పష్టంగా రాసి ఉంది.
ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే- విలేకరితో సంభాషణ ప్రారంభించినప్పుడు వంటగ్యాస్ కొరత గురించి గానీ, సరఫరా నిలిచిపోయినట్టు గానీ వార్డెన్ సౌరభ్ ఎక్కడా అంగీకరించలేదు.
యూనివర్సిటీ జారీ చేసిన నోటీసు కాపీ తన దగ్గర ఉందని విలేకరి చెప్పిన తర్వాతే, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన మాటను ఆయన ఒప్పుకున్నారు.
మంత్రిత్వ శాఖ ఆరాతో వెలుగులోకి..
“గత వారం మా దగ్గర సరిపడా ఎల్పీజీ సిలిండర్లు ఉన్నాయా లేదా అని ఆరా తీస్తూ, సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి మాకు ఒక ఇమెయిల్ వచ్చింది. ఆ సమయంలో మాకు ఎలాంటి కొరత లేదు, అంతా బాగానే ఉందని మేము బదులిచ్చాము. దురదృష్టవశాత్తు, కొన్ని రోజుల క్రితమే మాకు ఈ సమస్యలు ఎదురయ్యాయి. అయితే వాటిని వెంటనే పరిష్కరించాము” అని సౌరభ్ వివరించారు.
అయితే, ఆ ఇమెయిల్ ఏ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిందని ప్రశ్నించగా- దాని గురించి తనకు వివరంగా ఏమీ తెలియదని ఆయన దాటవేశారు. గ్యాస్ ఏజెన్సీ, స్థానిక యంత్రాంగం చొరవతో సిలిండర్ ఏర్పాటైందని ఆయన చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులో ఉందని యూనివర్సిటీ యాజమాన్యం చెబుతోంది.
ఏప్రిల్ 1న మెస్‌లో సాధారణ మెనూ ప్రకారమే భోజనం పెట్టినట్టు విద్యార్థులు సైతం నిర్ధారించారు. అయితే, భవిష్యత్తులో మళ్లీ మెనూలో కోతలు విధిస్తారేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
