
స్థానిక సంస్థలలో బీసీలకు 42 స్థానాలు కేటాయిస్తూ, ఆ మేరకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వ్యతిరేకించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తుంది. రిజర్వేషన్లు వంటి ఏవైనా కీలకమైన అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే పక్షంలో, ఆయా అంశాలపై న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశం ఉంటుంది.
తాము ప్రతిపాదించిన స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ అమలు నిర్ణయాన్ని ఎవరూ న్యాయస్థానంలో సవాలు చేసి, నిలుపుదల చేయకుండా ఉండటం కోసం ఈ విధానాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.
తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ విధానాన్ని 9 షెడ్యూల్లో పొందుపర్చడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీనికంటే ముందే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు సాధ్యం కాదని తెగేసి చెప్పారు. ఆయనకు బీసీలపట్ల వున్న వ్యతిరేకతను ఆయన మాటలు తెలియజేస్తున్నాయి.
ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బీసీ బిల్లు, అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి. ఇటువంటి కీలకమైన అంశంలో, రాష్ట్ర అధ్యక్షులు ఆ పార్టీ కేంద్రనాయకులతో సంప్రదించకుండా ఆ బిల్లు ఆమోదించడం సాధ్యం కాదని ప్రకటించారు.
రామంచద్రరావు ప్రకటనను బట్టి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ విధానాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని అర్ధమవుతోంది.
రక్షణ కవచంలా 9వ షెడ్యూలు..
ఈ సందర్భంగా అసలు 9వ షెడ్యూలు అంటే ఏంటి? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. భారత రాజ్యాంగానికి 1951లో తొలిగా చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ తొమ్మిదో షెడ్యూల్ ఏర్పడింది. ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొనే కీలకమైన నిర్ణయాలను తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరిచే పక్షంలో, ఆయా నిర్ణయాలపై ఎవరు కోర్టులో సవాల్ చేయకుండా రక్షణ కల్పిస్తుంది.
దేశంలో తొలిసారిగా బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇతరులు అభ్యంతరం పెట్టకుండా ఉండాలంటే, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో కచ్చితంగా పొందుపరచాల్సి ఉంటుంది.
అయినా, కీలకమైన అంశాలను 9వ షెడ్యూల్లో పొందుపరచటం కొత్తేమీ కాదు. 9వ షెడ్యూల్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 284 అంశాలను పొందుపర్చారు. అందులో ఎక్కువ భాగం అగ్రవర్ణాలకు చెందిన వ్యవసాయ భూములకు సంబంధించిన మినహాయింపులు వంటి అంశాలు రక్షణ పొందుతున్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని న్యాయస్థానాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో తమిళనాడులో బీసీలకు సంబంధించి 69 శాతం రిజర్వేషన్లు అమలు కావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విధానాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరచటం వల్లనే సాధ్యమైంది. లేదంటే 69 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా చాలామంది న్యాయస్థానాలలో అడ్డు పుల్లలు వేసి ఉ౦డేవారు.
బీసీ రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం ద్వారా బీసీల పట్ల తనకున్న వ్యతిరేకతను బీజేపీ మరోసారి రుజువు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోది బీసీ వర్గానికి చెందినవారని, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామంటూ నిత్యం బీసీల నామజపం చేసే బీజేపీ నేతలు ఆచరణకు వచ్చే సరికి తమ అసలు బుద్ధి ప్రదర్శిస్తున్నారు.
బీజేపీ చరిత్ర గమనిస్తే అడుగడునా బీసీల పట్ల ద్వేషమే కనిపిస్తుంది. గతంలో మండల కమిషన్ సిఫార్సుల మేరకు విద్యా ఉద్యోగాలలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు నాటి ప్రధాని వీపీ సింగ్ ప్రకటించినప్పుడు కూడా, మండల సిఫార్సులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బీజేపీ తమ పార్టీ అనుబంధమైన విద్యార్థి సంస్థ అఖిల భారత విద్యార్ధి పరిషత్(ఏబీవీపీ) రూపంలో వ్యతిరేకించింది. ఎట్టకేలకు మండల్ కమిషన్ సిఫార్సులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపటం వల్ల ఆనాడు సమస్య పరిష్కారమైంది.
బీసీ కులాలను వర్గీకరణ చేయడం ద్వారా బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలకు మేలు చేస్తామంటూ ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణీ కమీషన్ దేశవ్యాప్తంగా పర్యటించి, దేశంలో మొత్తం 3000 బీసీ కులాలలో దాదాపు 90 శాతం కులాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోక ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడి వున్నాయని నివేదిక సమర్పిచింది. ఆ నివేదిక సమర్పించి రెండు సంవత్సరాలు కావస్తుంది. అయినప్నటికీ ఆ నివేదిక ఊసే బీజేపీ ఎత్తడం లేదు.
తెలంగాణలో ప్రతిపాదించిన స్థానిక సంస్థలలో 42 శాతం మండల కమిషన్ బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల మాదిరిగానే చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని కూడా సూచన చేసింది. అయితే చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎంతో శ్రద్ధ వహించిన బీజేపీ ప్రభుత్వం మహిళలకు కేటాయించిన సీట్లలో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ను బీజేపీ ఖాతరు చేయలేదు. ఈ స్థితిలో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న మండల కమిషన్ సిఫార్సులను బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ అమలు కాదని అర్థమవుతుంది.
ఇదేసమయంలో, ఆర్థికంగా కులాలకు ఇడబ్లూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఏ రాజకీయపార్టీ కోరలేదు. ఎవరూ ఉద్యమాలు చేయలేదు. కానీ, కేంద్ర ప్రభుత్వం దేశంలో కనీసం 15 శాతం కూడా లేని అగ్రకులాల వారికి పేదరికం పేరుతో పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం పెంచకూడదని సన్నాయి నొక్కులు నొక్కిన న్యాయస్థానాలు, ఈ అంశంపై అభ్యంతరం చెప్పకపోగా ఆమోదం తెలిపాయి.
సనాతన ధర్మం ప్రకారం, బీసీ కులాలకు చెందిన ప్రజలు అగ్రవర్ణాలకు సేవలు చేయటం మినహా అగ్రవర్ణాలతో సమానంగా అధికారంలో పాలుపంచుకోవడం బీజేపీకి ఇష్టం లేదనిపిస్తోంది. కావాలంటే మీకు ఉచితంగా బియ్యమో, గ్యాస్ బండో ఇస్తాం కానీ అధికారం ఎలా ఇస్తామనే ఆది పెద్ద ధోరణి బీజేపీలో కనిపిస్తోంది.
– అన్నవరపు బ్రహ్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.