సమాజంలో ఒక వర్గం తమను తాము మేధావులుగా, సంస్కృతీ రక్షకులుగా, నైతికతకు ఏకైక ప్రతినిధులుగా ప్రకటించుకోవడం; దానికి రాజ్యం ‘పద్మశ్రీ’లాంటి బిరుదులతో చట్టబద్ధతను ఆపాదించడం బహుశా భారత దేశంలో కొత్తేమీ కాదు.
కానీ ఆధ్యాత్మిక ప్రవచనాల మాటున, దశాబ్దాలుగా గూడుకట్టుకుని ఉన్న అగ్రవర్ణ, ఆధిపత్య అహంకారం ఎంత అసహ్యంగా, ఎంత క్రూరంగా బయటపడుతుందో చెప్పడానికి గరికపాటి నరసింహారావు ముంబై తెలుగు సమితి వేదికగా చేసిన వ్యాఖ్యలు ఒక నికార్సయిన ఉదాహరణ.
ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన ‘పొరపాటు’ వ్యాఖ్య కాదు; దయలేని, మానవత్వపు ఛాయలు లేని ఒక నిర్దిష్టమైన సామాజిక-ఆర్థిక వర్గపు అచేతన నుంచి వెలువడిన యథార్థ స్వరూపం.
ఆకలి పేగులకు అక్షరాలు ఎలా అబ్బుతాయి?
గరికపాటి విసుర్లు ప్రధానంగా ప్రభుత్వ బడులలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిఫాంలు, పుస్తకాల మీద దాడి చేశాయి.
“చదువు మధ్యాహ్నమైపోయింది”(మిధ్యాహ్నమైపోయింది) అని ఆయన చేసిన శబ్దాలంకారపు విన్యాసం వెనుక ఎంతటి అమానవీయమైన క్రూరత్వం దాగి ఉందో పరిశీలించినట్లయితే, మనకు ఆశ్చర్యం కలిగించకమానదు.
అసలు ప్రభుత్వ బడులకు వెళ్లేది ఎవరు? మధ్యాహ్న భోజన పథకం కోసం, ఆ కాస్త ఉడికిన అన్నం, పప్పు, గుడ్డు కోసం పలకలు పట్టుకుని ఎదురుచూసే ఆ పిల్లలు ఏ సామాజిక వర్గాలకు చెందినవారు? భూమి, సంపద, ఉత్పత్తి సాధనాలు, అక్షరం-ఇలా సమస్తం తరతరాలుగా నిరాకరించబడిన దళిత, బహుజన, ఆదివాసీ, నిరుపేద బిడ్డలు.
ఆకలితో మాడిపోతున్న పేగులతో అక్షరాలు తలకెక్కవన్న కనీస ఇంగితజ్ఞానం కూడా ఈ ‘అవధాని’ గారికి లేకపోవడం కేవలం అజ్ఞానం కాదు. అది, ఆధిపత్య వర్గాలకు సహజంగా అబ్బే ఒక సామాజిక రోగం.
ఆహార రాజకీయాల దురహంకారం
పిల్లలకు పెట్టే కోడిగుడ్డును ‘గాడిద గుడ్డు’ అని ఆయన తీవ్రమైన ఏవగింపుతో ఎద్దేవా చేయడం వెనుక ఉన్నది కేవలం భాషా దారిద్య్రం మాత్రమే కాదు.
అదొక నిర్దిష్టమైన బ్రాహ్మణీయ ఆహార రాజకీయాల దురహంకారం.
తమకు అలవాటు లేని, తాము చారిత్రకంగా “నీచమైనదిగా” పరిగణించే ఒక ప్రొటీన్ ఆహారాన్ని, తరతరాలుగా పోషకాహార లోపంతో చనిపోతున్న పేద పిల్లలు తింటున్నారన్న అక్కసు అది.
“బడులు కోడిగుడ్ల కోసమా?” అని ఆయన ప్రశ్నించారు. అవును, ఆకలి తీరని పసివాడికి బడి ఉద్దేశం ముందు ఆకలి తీర్చడమే.
ఒక పక్క తమ వర్గపు పిల్లలు ఖరీదైన కార్పొరేట్ స్కూళ్లలో ఏసీ గదుల్లో చదువుకుంటుంటే, మరోపక్క పూట గడవని కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందించే ఒక పది రూపాయల కోడిగుడ్డు వీరికి ‘దేశం నాశనమైపోతున్న’ సంకేతంగా కనిపించడం విశేషం.
వికృతమైన పోలికలు – పితృస్వామ్య మనస్తత్వం
ఇక ఆయన వాడిన పోలిక-అన్ని ఉచితంగా ఇస్తే పిల్లలు “శోభనం గదిలో పెళ్లికొడుకులా మంచమెక్కి కూర్చుంటారు” అన్న మాట—అత్యంత జుగుప్సాకరమైనది.
రాజ్యాంగం కల్పించిన విద్యాహక్కును అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వాలు కల్పిస్తున్న కనీస వసతులను ఆయన ‘శోభనం గది’ విలాసాలతో పోల్చడం ఆయనలోని పితృస్వామ్య, వికృత మనస్తత్వానికి అద్దం పడుతోంది.
ఇక్కడ మనం ఇంకో వాదనను కూడా నిశితంగా గమనించాలి. తరతరాలుగా వందలాది ఎకరాల భూములను, వ్యాపారాలను, ఆస్తులను ఎటువంటి “అర్హత”(మెరిట్) లేదా శ్రమతో సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబంలో పుట్టిన ఏకైక కారణంతో వారసత్వంగా అనుభవిస్తున్నప్పుడు వీరికి రాని సిగ్గు, తరతరాలుగా ఆస్తికి, అక్షరానికి దూరమైన వర్గాల పిల్లలకు ప్రభుత్వ ఖర్చుతో బట్టలు, పుస్తకాలు ఇస్తే ఎందుకు వస్తుంది?
తండ్రి సంపాదించిన ఆస్తిని ఎలాంటి శ్రమ లేకుండా అనుభవించేవాడు మంచమెక్కి కూర్చున్న పెళ్లికొడుకులా వీరికి కనిపించడు.
కానీ, ఆకలితో అల్లాడే పసివాడికి ప్రభుత్వం ఒక పూట కూడు పెడితే మాత్రం, ఆ పసివాడు వీరికి శ్రమ చేయని విలాస పురుషుడిలా కనిపిస్తాడు.
ఇది వికృతం మాత్రమే కాదు, నైతికంగా అత్యంత పతనమైన ఒక సామాజిక రుగ్మత.
‘ఉచితం’ అని పిలిచే నైతిక అర్హత ఎక్కడిది?
ముందుగా మనం ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రవచనకారుల ఆర్థిక మూలాలను ప్రశ్నించాలి. వేదికలెక్కి నీతులు చెప్పడానికి వీరు తీసుకునే పారితోషికాలు లక్షల్లో ఉంటాయి.
ప్రభుత్వం కల్పించే సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, అధికారిక సత్కారాలు-ఇవన్నీ అనుభవిస్తూ ఏ పూటకానాటి శ్రమతో బతికే పేదవాడి పిల్లల కంచంలో పడే పది రూపాయల కోడిగుడ్డు మీద వీరికి ఎందుకంత కన్నుకుట్టు?
సమాజంలో సకల భోగాలను ‘సంస్కృతి’ పేరుతో ఉచితంగా అనుభవించే ఈ వర్గానికి, శ్రమజీవుల పిల్లలకు అందే కనీస హక్కును ‘ఉచితం’ అని పిలిచే నైతిక అర్హత ఎక్కడిది?
ఈ వ్యాఖ్యలు శూన్యం నుంచి రాలేదు. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా సంక్షోభంలోకి నెట్టి, గ్రామాల్లో బతుకుదెరువును నాశనం చేసి, మనుషులను నగరాల శివార్లలో దినసరి కూలీలుగా విసిరేసిన వ్యవస్థ ఇది. అలా నిరాశ్రయులైన తల్లిదండ్రులు పనికెళ్తే, ఆ పిల్లవాడికి కనీస పోషకాహారం ఇచ్చే బాధ్యతను ఈ ‘మేధావులు’ దానధర్మాల కింద లెక్కగడుతున్నారు.
అసలు ఈ ప్రభుత్వ ఖజానా నిండుతున్నది ఎవరి చెమటతో? పరోక్ష పన్నుల రూపంలో అహర్నిశలు ఈ దేశపు సంపదను సృష్టిస్తున్నది ఆ బడుల్లో చదువుకుంటున్న పిల్లల తల్లులు, తండ్రులు – ఆ కూలీలు, రైతులు, శ్రమజీవులే కదా! తాము సృష్టించిన సంపదలో కనీసం ఒక చిన్న వంతు, తమ పిల్లల కడుపు నింపడానికి తిరిగి వస్తుంటే, దాన్ని ‘భిక్ష’ అని ముద్రవేసే వీరికి ఆర్థిక శాస్త్రపు ఓనమాలు కూడా తెలియవనుకోవాలా?
లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసిన బడా పెట్టుబడిదారుల అప్పులను ‘రైట్ ఆఫ్’ చేసినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు లేని ప్రమాదం, పేదపిల్లల గుడ్డు మీద పది రూపాయలు పెడితే వస్తుందని భయపెట్టడం బూర్జువా వర్గాల పచ్చి అవకాశవాదం.
చప్పట్ల రూపంలో సామూహిక శాడిజం
ఇక్కడ గరికపాటి వ్యాఖ్యల కంటే తీవ్రంగా కలచివేసే అంశం మరొకటి ఉంది– ఆ ముంబై సభలో ఆయన ఆ మాటలు అంటున్నప్పుడు కింద కూర్చున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం. వారెవరు? నగరాలకు వలస వెళ్లి, తమ పిల్లలను లక్షలు వెచ్చించి అంతర్జాతీయ పాఠశాలల్లో చదివించుకునే ఎగువ మధ్యతరగతి వ్యక్తులు.
తమ మూలాల్లో ఉన్న పల్లెల్లో పిల్లలు చదువుకు దూరమైపోయినా పర్వాలేదు అన్న ఒక సామూహిక శాడిజాన్ని ఆ చప్పట్లు సూచిస్తున్నాయి.
“సొంతంగా భోజనం తెచ్చుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి. లేదంటే బడి మానేయమనండి” అని ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత బహిరంగంగా అనగలిగాడంటే, అదొక సామాజిక బహిష్కరణాస్త్రం. ఇక్కడ వీరి అసలు స్వరూపం పూర్తిగా బయటపడింది. ఇది ముమ్మాటికీ నయా ఉదారవాద ప్రైవేటీకరణ యుగానికి అనుగుణంగా ఆధునిక రూపుదిద్దుకున్న ద్రోణాచార్య-ఏకలవ్య నమూనా. ఆధ్యాత్మిక ప్రవచనాల ముసుగులో చేస్తున్న వర్గ ఆధిపత్యపు నగ్న ప్రదర్శన ఇది.
ఆధునిక పదజాలంతో పాతకాలపు బహిష్కరణ
మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మొదలుకొని, అంబేడ్కర్ దాకా- దళిత, బహుజన బిడ్డలు బడి గడప తొక్కడానికి ఎన్ని దశాబ్దాల రక్తపాతం జరిగింది? ఈరోజు పలకా బలపం పట్టుకుని ఆ వర్గాల పిల్లలు బడుల్లోకి వస్తుంటే పాత ఆధిపత్య వర్గాలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. “బడి మానేయమనండి” అంటే, “మీకు స్తోమత లేకపోతే మళ్లీ వెళ్లి పశువులు కాసుకోండి, మా పొలాల్లో కూలీలుగా పనులు చేయండి” అనే కదా దాని అసలు అర్థం! ఆధునిక పదజాలంతో పాతకాలపు బహిష్కరణను వీరు సమర్థిస్తున్నారు.
విద్యా వ్యవస్థలో లోపాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమి ఉంది, ఉపాధ్యాయులపై బోధనేతర భారాలు మోపుతున్నారన్నది అక్షర సత్యం.
ఈ వ్యవస్థాగత లోపాలను విమర్శించడానికి అంతులేని ప్రజాస్వామిక ఆవరణ ఉంది. కానీ గరికపాటి విమర్శ ప్రభుత్వ వైఫల్యాల మీద కాదు, పేద పిల్లల ఉనికి మీద. వాళ్ల ఆకలి మీద.
నిలదీయకపోతే మిగిలేది చీకటే
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అపహాస్యం చేస్తూ, అత్యంత బలహీన వర్గాల పిల్లల ఆకలిని ఎగతాళి చేస్తున్న ఇలాంటి వ్యక్తులను కేవలం ఖండించి వదిలేస్తే లాభం లేదు.
బడికి వచ్చే పేద పిల్లలను తూలనాడటం వెనుక ఉన్నది హాస్యం కాదు, అదొక పచ్చి ఫాసిస్ట్ ఆలోచనా ధోరణి.
నిజానికి ఇక్కడ అసలైన ‘గాడిద గుడ్డు’ ఎవరంటే సమాజపు కింది పొరల్లోని మనుషుల బాధను, ఆకలిని, వారి చారిత్రక అణచివేతను ఏమాత్రం అర్థం చేసుకోకుండా, మైకులు దొరికాయి కదా అని వేదికలెక్కి నీతులు వల్లించే ఇటువంటి ఆధిపత్య వర్గాల మేధావితనం.
ఎక్కడికక్కడ ఈ దుర్మార్గమైన ఆలోచనా విధానాన్ని నిర్మొహమాటంగా నిలదీయాలి.
లేకపోతే, భవిష్యత్తులో బడి మానేయాల్సింది పేద పిల్లలు కాదు, ఈ దేశంలో మిగిలి ఉన్న ఆ కాస్త ప్రజాస్వామ్యమే అవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
