
“నేను అధిరోహించిన పదవుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి నాకు అత్యంత ప్రియమైనది. అధ్యాపకుడిగా నేను పాఠాలు బోధించానని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తాను. నా దృష్టిలో అత్యంత ఆరాధ్యనియమైనది ఉపాధ్యాయ వృత్తి” అని భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటారు.
తమ వృత్తిని పవిత్ర కార్యంగా ఉపాధ్యాయులు భావించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజ సేవకులుగా, నవభారత ప్రగతిశీల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రూప శిల్పులుగా రూపొందిస్తున్నారు. బోధన మాత్రమే కాదు, విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసి, నిరంతరం వారిలో స్ఫూర్తి నింపుతూ విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్న సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.
ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమే, ఆ విద్యను విద్యార్థులకు పంచే క్రాంతి ప్రదాతలు ఉపాధ్యాయులే. ఏ సమాజం అభివృద్ధి చెందాలన్నా విద్యారంగం అభివృద్ధి చెందాల్సిందే. జ్ఞానంపై పెట్టుబడి ఎల్లప్పుడూ సమాజానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.
సాధారణ ఉపాధ్యాయుడు నుండి భారత రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును(1888 సెప్టెంబర్ 5) ఉపాధ్యాయ దినోత్సవంగా 1962 నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. వినూత్న బోధన పద్ధతులు అవలంభించి విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ఉపాద్యాయ దినోత్సవం రోజున అవార్డులు అందచేసి గౌరవించుకోడం జరుగుతోంది.
సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ వరకు చదివారు. భారతీయ తత్వశాస్త్రంపై ఎన్నో రచనలు, వ్యాసాలు రాశారు. అసాధారణ తెలివితేటలు, రచనలు, రాజనీతిజ్ఞత ఫలితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్నీ అనేకమైన పదవులు వరించాయి. విద్యాభివృద్ధికి విద్యార్థుల కోసం ఆయన చాలా కృషి చేశారు.
రాధాకృష్ణన్ 1931లో నైట్‌హుడ్, 1954లో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న, 1963లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ వంటి అనేక అత్యంత పురస్కారాలు అందుకున్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న మరణించారు.
మారిన పరిస్థితులు- కార్పొరేట్ శక్తుల లాభార్జన కోసమే పని..
భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. ప్రపంచ దశ దిశ మార్చిన, మార్చుతున్న అనేక మంది ప్రముఖులను ఈ సమాజానికి అందించిన వారు ఉపాధ్యాయులే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో విద్యారంగం కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో బందీ అయ్యింది. దీంతో నేడు టీచర్లలో కొంతమందిని కార్పొరేట్ శక్తులు వ్యాపార వస్తువులుగా, మర యంత్రాలుగా మార్చారు. సమాజ శ్రేయస్సును మరిచి, కార్పొరేట్ శక్తుల లాభార్జన కోసమే వారు పని చేయాల్సిన దుస్థితి దాపురించింది.
పుస్తకంలోని అక్షరాలను మాత్రమే కాదు, జీవితంలో ఎలా జీవించాలో ఒక ఉపాధ్యాయుడు నేర్పుతాడు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, బోధనా వృత్తిలో టీచర్లు అనేక సవాల్లనే ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల దృష్టి గ్యాడ్జెట్లపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యాప్‌లపై ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా అందుబాటులో బోలెడంత సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని సరియైన మార్గంలో ఉపయోగించే విధానాన్ని విద్యార్థులకు నేటి ఉపాధ్యాయులు నేర్పాల్సి ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పరీక్షతో కూడిన గొప్ప అవకాశం లాంటిది. సక్రమ మార్గాలు అనుసరిస్తూ ఏఐని ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. జ్ఞానం, సృజనాత్మకత, మానవీయ విలువలు విద్యార్థులకు అందించేది గురువులు మాత్రమే ఏఐ కాదని మనం గమనించాలి. ఏఐ ఒక సాధనం మాత్రమే.
సమాజంలో విశిష్ట స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు నాటితో పోల్చితే నేడు సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గాయి.దీనికి కారణం కార్పొరేట్ శక్తులు, ప్రభుత్వాల విధానపర నిర్ణయాలు, ఉపాధ్యాయుల స్వాలాభేక్ష. వ్యాపార దృక్పథం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం. సాంకేతికతను గురువుకు ప్రత్యామ్నాయంగా వినియోగించడం.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని మనం గమనించాలి. బోధన పద్ధతులు మూస విధానంలో కాక ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతవరకు వాడాలో అంతే వాడితే సత్ఫలితాలు ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు బోధన- అభ్యసన కార్యక్రమంలో భాగంగా అతిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆధారపడడం వల్ల వారి సృజనాత్మకత అభివృద్ధి చెందకుండా పోతుంది.
అనేక మంది గురువులు సమాజం కోసం వారి జీవితాలను, జీతాలను త్యాగం చేస్తూ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నారు.
ఆరోగ్యకర సమాజాన్ని సృష్టించేది ఉపాధ్యాయులే..
ఒకప్పుడు పనిచేసే ప్రాంతంలో ఉపాధ్యాయులు నివసిస్తూ ప్రజలతో మమేకం అయ్యేవారు. వారి కష్ట సుఖాల్లో భాగస్వాములై, అనేక సామాజిక ఉద్యమాలకు రూపకర్తలుగా మారారు. సామాజిక సమస్యలపై ప్రజలతో పాటు ఉపాధ్యాయులు కూడా ముందు వరుసలో ఉండి ప్రజల కోసం పోరాడేవారు. అందుకే ప్రజల్లో ఉపాధ్యాయులను గొప్ప వ్యక్తులుగా చూసేవారు. రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయిలో నాటి తరం ఉపాధ్యాయులు ఉండేవారు అనడంలో అతిశయోక్తి లేదు.
ప్రతి మనిషికి రెండు రకాలైన విద్య అవసరం ఒకటి ఎలా జీవించాలో నేర్పేది, మరొకటి జీవనోపాధి కల్పించేది. నాటి తరంలో పై రెండు లక్షణాలు కనిపించేవి. నేటి తరంలో ఎక్కువగా జీవనోపాధి కల్పించడమే విద్య లక్ష్యంగా కనిపిస్తుంది. నేటి యువత ప్యాకేజీల(అత్యధిక వేతనాలు) మాయలో పడి నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్న సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం.
నైతిక విలువలు, మానవీయత నేటి సమాజంలో తగ్గుతున్నాయి. దీర్ఘకాలికంగా ఇది సమాజానికి చేటు చేస్తుంది. ఆరోగ్యవంతమైన, ప్రగతిశీల సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం.
భవిష్యత్ తరాలకు అవసరమయ్యే నూతన ఆవిష్కరణలు చేయడంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం చాలా ముఖ్యమైంది.
అభివృద్ధి, ఆధునికీకరణలో భాగంగా మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణలో సూత్రధారులు ఉపాధ్యాయులు. పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారిని పర్యావరణ రక్షకులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. నేటి సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండే వాటిపై అవగాహన కల్పించాలి.
నేటి బాలలే రేపటి పౌరులు. వారికి నైతిక విలువలు, మానవీయత, శాస్త్రీయ పరిజ్ఞానం పర్యావరణ పరిరక్షణ, ప్రగతిశీల భావనలు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు బోధించి రాబోయే తరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఉపాధ్యాయుల మార్గదర్శనంలో నవభారత నిర్మాణం జరుగుతుందని, ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశిద్దాం.
భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రతీ ఉపాధ్యాయుడు ప్రతిన పూనాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజల్లో లౌకిక తత్వం,స్వేచ్ఛా- సమానత్వం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా చేయడంలో గురువులే కీలకం. ప్రజాస్వామ్య పరిరక్షణ మనందరి బాధ్యత. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శం కావాలి. రాబోయే నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.