
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర జాతి సర్వే ఆధారంగా 14 ముస్లిం వర్గాలను బీసీ(Backward Classes) కేటగిరీలో చేర్చే ప్రతిపాదనను సీరియస్గా పరిశీలిస్తోంది.
సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రంగా వెనుకబడినట్లు ఈ సర్వేలో తేలింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో షియా ముస్లింలు ఎక్కువగా ఉండే కుటుంబాలు కూడా ఉన్నట్లు సమాచారం.
రిజర్వేషన్ల అమలులో లోపాలు..
ప్రస్తుతం, రాష్ట్రంలో ముస్లింలకు బీసీ(ఈ) కేటగిరీ కింద 4 శాతం రిజర్వేషన్ ఉంది. కానీ, న్యాయపరమైన సవాళ్లు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలో స్పష్టత లేకపోవడం వల్ల ఈ రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలవడం లేదు. దీనివల్ల చాలామంది ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, కొత్త ప్రతిపాదన ద్వారా మరింత స్పష్టత, సమర్థవంతమైన లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ సర్వే ప్రకారం, రాష్ట్ర జనాభాలో ముస్లింలు దాదాపు 12.5 శాతం ఉన్నారు. వీరిలో 10 శాతానికి పైగా ముస్లింలు బీసీ వర్గాలుగా గుర్తించబడ్డారు. రాష్ట్రంలోని మొత్తం బీసీ వర్గాల జనాభా 56.33 శాతంగా ఉంది.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పటికే బీసీ రిజర్వేషన్ను 27 శాతం నుంచి 42 శాతానికి పెంచే బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుగవర్నర్ ఆమోదం పొంది, రాష్ట్రపతికి పంపబడింది. ఆమోదం అనంతరం ఇది అమలులోకి రానుంది.
వృత్తిపరంగా వెనుకబాటుతనం..
ఈ ప్రతిపాదనలో ఉన్న 14 ముస్లిం వర్గాల్లో ఎక్కువ మంది రోజూవారీ కూలీలు, డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు, స్క్రాప్ వ్యాపారులు వంటి వృత్తులపై ఆధారపడినవారు. ప్రభుత్వ పథకాలు, ఉపాధి, విద్యా అవకాశాలు వీరికి సరిగా అందకపోవడంతో, తీవ్రమైన వెనుకబాటుకు గురైనట్లు సర్వేలో వెల్లడైంది.
ఈ వర్గాలకు ఉద్యోగాలు, విద్య, ఉపాధి, పింఛన్లు, షెడ్యూల్డ్ బ్యాంకు రుణాలు, ఆరోగ్య బీమా వంటి పథకాల్లో అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, వారి పిల్లలకు స్కాలర్షిప్లు, వృత్తిపర శిక్షణ కోర్సులు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.
మరో వైపు ఈ అంశంపై రాజకీయంగా వివాదం రేగుతోంది. అయినప్పటికీ, ఇది మతం ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని కేవలం సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ మాట్లాడుతూ, “సర్వేలో వచ్చిన డేటా ఆధారంగా ఈ వర్గాలకు నిజంగా సహాయం అవసరం. ఈ నిర్ణయం కోర్టు నమ్మదగిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ స్థితి..
ప్రస్తుతం తెలంగాణలో బీసీ(ఈ) కేటగిరీలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ఉంది. ఇది 2007లో ప్రారంభమైంది. కానీ ఈ రిజర్వేషన్ న్యాయపరమైన ఇబ్బందులు, ప్రభుత్వ స్థాయిలో అమలులో స్పష్టత లేకపోవడం వల్ల పూర్తిగా అమలవడం లేదు.
కొన్ని వర్గాలు మాత్రమే నిజంగా దీనికి ప్రయోజనం పొందుతున్నాయి. మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య సామాజిక న్యాయం పట్ల తన కట్టుబాటును చాటుతూ, వెనుకబడిన ముస్లిం వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పవచ్చు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.